Monday, February 8, 2010

అనంతగిరిలో అభిషేకం




అనంతగిరి ఏమిటి?  అక్కడ అభిషేకం ఏమిటి అని అంటున్నారా?  అనంతగిరి రంగారెడ్డి జిల్లా వికారాబాద్ కి 5 కి.మీ. ల దూరంలో వున్న హిల్ స్టేషన్.  ఇక్కడ అనంత పద్మనాభస్వామి ఆలయమేకాక  చిన్న అడవి కూడా వుంది.  దానితో చుట్టుప్రక్కలవారికి సెలవు రోజుల్లో ఆట విడుపుగా సేద తీరే అవకాశమేకాక బుల్లి తెర, పెద్ద తెర నిర్మాతలకీ, దర్శకులకీ తమ  ధారావాహికాలు, సినిమాలు చిత్రీకరించటానికి కూడా అనువుగా వుంది.

మేము 7-2-2010 న అనంతగిరి వెళ్ళినప్పుడు అక్కడ ఈటీవి లో రోజూ ప్రసారమయ్యే సీరియల్ అభిషేకం షూటింగ్ జరుగుతోంది.  ముఖ్య నటీనటులతో సహా దర్శకుడు శ్రీ రాజేంద్ర అక్కడ వున్నారు.    భోజనాల సమయంలో మేము కూర్చున్న ప్రదేశానికే వచ్చి భోజనాలు చేశారు.  ఆ సమయంలో వారితో కొంచెం సేపు సరదాగా ముచ్చటించటం జరిగింది. 

దర్శకుడు శ్రీ రాజేంద్రతో మేము చాలామంది టీవీ అభిమానులు/బాధితుల తరఫున చెప్పిన సంగతేమిటంటే సీరియల్స్ కి కూడా ముగింపు వుండాలనీ,  ఏదో చూస్తున్నారుకదాని తర తరాల వరకూ కధ పొడిగిస్తూ జీడిపాకం కూడా ఉపమానానికి సరిపోని రీతిలో ప్రేక్షకుల సహనాన్ని పరీక్షించవద్దు అని.  వారి ఇబ్బందులు వారికి వున్నా, సంక్షిప్తంలో వున్ని సొగసులు చూపిస్తే ప్రేక్షకులేకాక పెట్టుబడిదారులూ  ఆదరిస్తారు అని మా అభిప్రాయం మేము చెప్పాము.

అభిషేకం టీమ్ తో తీసుకున్న ఫోటోలు మీరూ చూడండి.  
 

Friday, February 5, 2010

సప్త వ్యసనాలు అంటే ఏమిటి?



ఏ మనిషయినా దుర్వ్యసనాలకి లోనయితే జీవితంలో బాగుపడలేడు.  ఈ వ్యసనాలకి లోనయి నాశనమయ్యేవాళ్ళు ఈ కాలంలోనే కాదు, పూర్వమూ వున్నారు.   ముఖ్యంగా  దుర్వ్యసనాలు ఏడు అంటారు.  అవేమిటంటే

  1. పరస్త్రీ వ్యామోహం ఏ కాలంలోనైనా మనిషిని అధఃపాతాళానికి తొక్కేసే వ్యసనం ఇది.  ఈ వ్యసనంతో సర్వనాశనం తెచ్చుకున్నవాళ్ళల్లో పూర్వ కాలంలో రావణాసురుడు ముఖ్య ఉదాహరణ.  సీతాదేవిని అపహరించి, ఎన్నో కష్టాలను కొని తెచ్చుకోవటమేగాక తన కుటుంబాన్నీ, వంశాన్నీ, అయినవారినీ, చివరికి రాజ్యాన్నికూడా కోల్పోయాడు.

  1. జూదం ..  ధర్మరాజు అంతటి వాడు జూదం వల్ల ఎన్ని అగచాట్లు పడ్డాడో అందరికీ తెలుసు.  (ఆంతటి గొప్పవాడే ఆ రోజుల్లో అన్ని అవస్తలు తాను పడటమే కాకుండా, తన తమ్ములూ, భార్యా కూడా అవస్తలు పడటానికి కారకుడయ్యాడే,  మరి ఈ రోజుల్లో ఈ పేకాట వగైరా వ్యసనాలబారినపడి ఎన్ని కుటుంబాలు ఎన్ని అవస్తలు పడుతున్నాయో)

  1. మద్యపానం పురాతన కాలంలో దీనికి ఉదాహరణ శుక్రాచార్యుడు.  ఈయన రాక్షసులకు గురువు.   ఆయనకి మృత సంజీవినీ విద్య తెలుసు.  ఆ విద్యతో చనిపోయిన రాక్షసులను వెంటనే బ్రతికించేవాడు.  అలాంటివాడు మద్యపాన మత్తులో ఏమి చేస్తున్నాడో తెలుసుకోకుండా తాను తాగే పానీయంలో కచుడి చితాభస్మం కలిపి సేవిస్తాడు.  (పురాతన కధలు అందరికీ వివరంగా తెలియక పోయినా కచుడి చితాభస్మం తాగటం వివరాలు నేనూ ఇప్పుడు తెలుసుకోవాలి) నేటి సమాజంలో మద్యపాన మహిమ అందరికీ తెలిసినదే.

4.        వేట --  పూర్వం దశరధ మహారాజు వేటకోసం వెళ్ళి, నీటి శబ్దాన్నిబట్టి బాణం వేసి  శ్రవణకుమారుడిని చంపుతాడు.  ఆయనకి తెలియక చేసిన పాపమయినా శ్రవణుడి వృధ్ధ తల్లిదండ్రుల శాపానికి గురయి తన కుమారుడు శ్రీ రామచంద్రుడికి దూరమయి రాముణ్ణే కలవరిస్తూ మరణిస్తాడు.  (ఇదివరకంటే కృర మృగాల (kroora -  inscript లో  ఎలా టైప్ చెయ్యాలో రాలేదు నాకు) బారినుండి  ప్రజలను కాపాడటానికి రాజులు వేటాడేవారు.  ఈ రోజుల్లో మాత్రం ఇది ,  స్ధితి పరులకు వ్యసనమే.  దానితో  పట్టుబడ్డవారెన్ని కేసులెదుర్కుంటున్నారో పేపర్లల్లో చూస్తున్నాంగా).



5.  కఠినంగా, పరుషంగా మాట్లాడటం   --  దుర్యోధనుడు దీనికి మంచి ఉదాహరణ.  పాండవులను దుర్భాషలాడి ఏ స్దితి తెచ్చుకున్నారో అందరికీ తెలిసిందే.  (పూర్వకాలంలో కఠినంగా మాట్లాడేవాళ్ళని వేళ్ళమీద లెక్కబెట్టేవాళ్ళు...ఇప్పుడు అలా మాట్లాడనివాళ్ళని....)

  1. కఠినంగా దండించటం --  దీనికికూడా దుర్యోధనుడే ఉదాహరణ.  ఒకసారి దుర్యోధనుడు తన తాతగారిని, మేనమామలని కూడా బందిఖానాలో పెడతాడు.  వారికి ఆహారం కూడా అతి తక్కువ ఇచ్చి నానా ఇబ్బందులూ పెడతాడు.  వాళ్ళందరికీ ఇచ్చిన అతి కొద్ది మెతుకులను శకుని ఒక్కడే తిని ప్రాణాలు నిలుపుకుని దుర్యోధనుడి చెంత చేరతాడు.   కౌరవులమీద పగ తీర్చుకోవటానికి వారితో వున్నట్లు నటించి వారు నాశనమయ్యేటట్లు చేస్తాడు.

ఈ రోజుల్లోకూడా ఏ కారణంవల్లనైతేనేమి తల్లిదండ్రులు పిల్లల్ని దండించటం, టీచర్లు పిల్లల్ని కఠినంగా దండించటం ఎక్కువైంది.  (ఎవరిమీదైనా ఏమైనా కక్షవుంటే  దాన్ని తీర్చుకోవటానికి అనేక మార్గాలు ఎన్నుకుంటున్నారు.  ఇది ఎవరికీ మంచిది కాదు).

  1. ఆఖరిది డబ్బు.  కొందరికి డబ్బు వృధాగా ఖర్చుచెయ్యటం అలవాటు.  బాగా డబ్బున్నా, క్రమ శిక్షణా, సరైన ఆలోచన లేకపోవటంవల్ల అవసరముందా లేదా అని కూడా ఆలోచించకుండా డబ్బు దుర్వినియోగం చేస్తారు.  మహాలక్ష్మిని ప్రయోజనకరమైనవాటికి కాకుండా దుర్వ్యసనాలకు వినియోగిస్తే దుర్గతే లభిస్తుంది  అపజయమే తప్ప జయం వుండదు.  అందుకే ధనాన్ని సద్వినియోగం చెయ్యాలి.  

  మంచీ చెడూ తెలుసుకుని మనుగడ సాగించటమే మనిషి జన్మకి సార్ధకత.

(జీ తెలుగు ప్రసారం చేసిన గోపురం ఆధారంగా)

Thursday, February 4, 2010

పిల్లలు తుమ్మితే చిరంజీవ అంటారు. ఎందుకు?



ఏ శాస్త్రం ప్రకారం చూసినా, పిల్లలకి వ్యాధి నిరోధక శక్తి తక్కువగా వుంటుందనే విషయం అందరికీ తెలుసు.  ఆయుర్వేదం శాస్త్రం అందుకే  పిల్లలకి బాలారిష్టాలు ఎక్కువ అంటుంది.. ఈ కారణంగానే కొన్ని ఆసుపత్రులలో  రోగులను చూడటానికి వెళ్ళటానికి  12 సంవత్సరాలలోపు పిల్లలకి ప్రవేశం వుండదు. 

పిల్లలకు వచ్చే దగ్గు, తుమ్ము, వాళ్ళల్లో మొదలయిన ఇన్ఫెక్షన్ కి సంకేతం అంటారు.  మన సాంప్రదాయంలో ఆశీర్వాదానికి చాలా విలువ వుంది.  సకల దోషాలనూ ఈ ఆశీర్వాదం వుపశమింప చేస్తుందనే నమ్మకం వుంది.

పురాణ కధనానుసారం  అల్పాయుష్కుడయిన మార్కండేయుడిని సప్తఋషులు చిరంజీవ అని ఆశీర్వదిస్తారు.  ఆ ఆశీర్వాద బలంతో మార్కండేయుడు శివునికోసం తపస్సుచేసి,  దీర్ఘాయుష్షుని పొందుతాడు.

పెద్దల ఆశీర్వచనాలకి ఎంతో బలం వుంది అని నమ్మే సంస్కృతి మనది.  అందుకే ఇంట్లో ఏ శుభ కార్యం ప్రారంభించినా పెద్దలని గౌరవించి వారి ఆశీర్వాదం తీసుకనే సంప్రదాయం వుంది.

మరి పిల్లలు తుమ్మటం, దగ్గటం, వారి లోపల మొదలయిన అనారోగ్యానికి సంకేతం అని చెప్పుకున్నాం కదా.  సాంప్రదాయాన్నీ, ఆశీర్వచన బలాన్నీ నమ్మే పెద్దలు పిల్లలు తుమ్మగానే చిరంజీవ అని దీవిస్తారు.  పిల్లల అనారోగ్యాలూ, దోషాలూ పోయి కలకాలం హాయిగా, ఆరోగ్యంగా వుండాలని అలా ఆశీర్వదిస్తారు.  అలాగని అవసరాన్నిబట్టి డాక్టరు దగ్గరకు తీసుకెళ్ళటం మానకూడదండోయ్.

(జీ తెలుగు ప్రసారం చేసిన గోపురం ఆధారంగా)


Monday, February 1, 2010

కొన్ని దేవాలయాలలో భక్తులు భిక్షాటన ఎందుకు చేస్తారు?




కొన్ని ప్రాంతాలలోని దేవాలయాలలో ఈ భిక్షాటని ఇప్పటికీ కనబడుతుంది.  ఈ అలవాటు, ఆచారం ఎందుకు వచ్చి వుంటుంది?  పూర్వం సాధువులు, గురుకులంలో విద్యాభ్యాసం చేసేవాళ్ళు, కొంతమంది బ్రాహ్మణులు మాత్రమే భిక్షాటన చేసేవారు.  ఇప్పుడూ ఆ ఆచారం కొన్నిచోట్ల కనబడుతోంది.   ముఖ్యంగా దత్త సాంప్రదాయంలోనూ, బాసరలో దీక్ష తీసుకున్నవారు ఈ పధ్ధతి పాటిస్తున్నారు.  ఆపద మొక్కులవాడు ఆ తిరుపతి వేంకటేశ్వరునికి కూడా జోగెత్తి తిరుపతి వస్తామని మొక్కుకుంటారు కొందరు.  (ఇదివరకు  అలా జోగెత్తేవారు విరివిగానే కనిపించేవారు.  మేళ తాళాలతో, బంధుజనంతో దీక్షా వస్త్రాలు ధరించి రోడ్డుమీద గోవింద నామస్మరణ చేస్తూ వెళ్తుంటే ఎవరికి తోచింది వారు వాళ్ళ పళ్ళెంలో వేసేవారు. కొన్నాళ్ళ తర్వాత ఆ ఆచారం తగ్గి ఎవరో తెలిసినవారిని కొందరిని అడిగి వెళ్ళేవాళ్ళు.  వాళ్ళిచ్చిన దానితో వీళ్ళ ఖర్చు వచ్చేస్తుందని కాదు,  ఆ డబ్బు వారు పెట్టుకోలేక కాదు..తమ అహంకారాన్ని విడిచి పెట్టి స్వామి శరణు వేడుకోవటమే దానర్ధం.  ఇప్పుడు అది కూడా తగ్గినట్లుంది). 

కొన్ని ఊళ్ళల్లోకూడా నియమాలుంటాయి.  అక్కడివాళ్ళు ప్రతిరోజూ ఎవరికైనా భిక్ష పెడితేగానీ వారు తినరు.  ఎంత శ్రీమంతుడైనా, ఎంత పెద్ద అధికారి అయినా, ఎంత పెద్ద పొజిషన్ లో వున్నా ఆ క్షేత్రానికి వెళ్ళినప్పుడు చెప్పులుకూడా లేకుండా ఎవరింటిముందుకన్నా వెళ్ళి భిక్ష అడిగి తినాలి.  అంటే మన అహంకారాన్ని ఎంత చంపుకోవాలో చూడండి.  అలా అహంకారాన్ని చంపుకుని, సంస్కారంతో, భగవంతుడిముందు అంతా తక్కువే అనీ, మనుషులందరూ భగవత్స్వరూపులనీ మానవత్వపు విలువలు తెలుసుకోవటానికే ఈ భిక్షాటన. 

ఆ క్షేత్రాలకొచ్చే భక్తులు విద్య, వివాహం, ఆరోగ్యం వగైరా ఎన్నో కోర్కెలతో వస్తారు.  ఆ కోరిక తీరాక భగవంతుని క్షేత్రంలో వారి అహంకారాన్ని పూర్తిగా త్యజించి, అత్యంత వినమ్రతతో భిక్ష అడుగుతారు.  ఇప్పటికీ ఎంత గొప్పవారయినా ఆ క్షేత్రాలకి వస్తే అలా భిక్షమెత్తుతారంటే అర్ధం భగవంతుని దగ్గర సర్వసంగ పరిత్యాగం చేస్తే  వారి కోరికలు నెరవేరుతాయనే నమ్మకమే.

(జీ తెలుగు ప్రసారం చేసిన గోపురం ఆధారంగా)


సంకటహర చతుర్ధి విశేషమేమిటి? ఎందుకు చేస్తారు?




సాధారణంగా మనం వినాయక చవితి రోజు వినాయకుడికి పూజ చేస్తాం, ఆ రోజు సాయంత్రం చంద్రుణ్ణి చూడకూడదనుకుంటాం.    మహారాష్ట్ర, కర్ణాటక, ఉత్తర తెలంగాణావారూ, ఇప్పుడు వారిని చూసో, ఈ పూజా విశేషం వినో ఇంకా కొందరూ, ఈ పూజ చేస్తున్నారు.  ఈ పూజను పౌర్ణమి తర్వాత వచ్చే చతుర్ధినాడు చేస్తారు.  ఆ రోజు చంద్ర దర్శనంకూడా చేస్తారు.  అందుకని పౌర్ణమి తర్వాత చంద్రోదయ సమయానికి ఏ రోజు చతుర్ధి తిధి వుంటే ఆ రోజు ఈ వ్రతం చేస్తారు.  అష్టాదశ పురాణాలకి ఉప పురాణాలలో ఒకటయిన గణపతి పురాణంలో ఈ పూజ గురించి వివరించారు. 

ఆ రోజు పొద్దున్నేలేచి తలారా స్నానం చేసి, రోజంతా ఉపవాసముండి, సాయంత్రం సూర్యాస్తమయ సమయాన  గణపతికి అధర్వ శీర్షంతో అభిషేకించి, తుమ్మిపూలు, ఎఱ్ఱని పూలు, జిల్లేడు పూలు, గరికతో పూజచేయాలి.  ఈ పూజ స్తోత్రాలతో కానీ, సహస్రనామంతో కానీ చెయ్యవచ్చు.  కానీ ఆ రోజు అధర్వ శీర్షంతో చేసిన పూజ విశేష ఫలితాలనిస్తుందంటారు.  ఎందకంటే మహా దోషాలను, పాపాలను, అడ్డంకులను తీసేటటువంటి శక్తి ఈ అధర్వ శీర్షానికుంది.  ఏది కోరితే అది లభిస్తుంది.

తర్వాత వినాయకుడికి ఇష్టమయిన అరటి పళ్ళు, టెంకాయ, బెల్లంతో చేసిన పదార్ధాలు నైవేద్యం పెట్టాలి.  పూజంతా అయ్యాక చంద్ర దర్శనం చేయాలి.  తర్వాత ఎవరికైనా బ్రాహ్మణునికి దానం ఇవ్వటంగానీ, భోజనం పెట్టటంగానీ చేశాక, మనం భోజనం చెయ్యాలి.

చాలామంది ఈ ప్రతాన్ని అంగారక చతుర్ధినాడు మొదలు పెట్టి వారి వారి ఇష్టానుసారం ఒక ఏడాది, 40 నెలలు, కొందరయితే జీవితమంతా చేస్తారు.  అంగారక చతుర్ధి అంటే పౌర్ణమి తర్వాత వచ్చే చతుర్ధినాడు మంగళవారం కూడా కలిసి వస్తే ఆ రోజు అంగారక చతుర్ధి అంటారు.  ఈ నెలలో 2వ తారీకు  అంగారక చతుర్ధి వచ్చింది.


కుజ దోషాలు వున్నా, జాతకంలో ఏవైనా గ్రహ దోషాలు వున్నా, తలపెట్టిన పనులు సక్రమంగా కానివారూ, సంతానం లేనివారు ఈ వ్రతం చేస్తే మంచి ఫలితాలు వుంటాయి.  నరక బాధలు అనుభవిస్తున్న పితృదేవతల బాధల తొలుగుతాయి.  అందుకే అనాదినుంచీ చాలామంది ఈ సంకష్ట చతుర్ధి రోజు వినాయకుని పూజిస్తారు.

(జీ తెలుగు ప్రసారం చేసిన గోపురం ఆధారంగా)