Saturday, April 25, 2009

ఈ టీ వీ - 2 సఖి కార్యక్రమం

Saturday, April 25, 2009
ఈ టీవీ 2 – సఖి కార్యక్రమం

ఇవాళ (25-04-2009) మధ్యాహ్నం 2-35 ని. లకు ఈ టీవీ – 2 సఖి కార్యక్రమంలో శ్రీమతి జ్యోతి వల్లబోజు గారి అభిరుచులు, వారి బ్లాగు గురించి, వారు చేపట్టిన సహాయ కార్యక్రమాల గురించి చెప్పారు. నేను నా కెమేరా తో టీ వీ నుంచే ఆ కార్యక్రమాన్ని వీడియో తీశాను. చూడండి. అనుకోకుండా అప్పటికప్పడు తీసింది కనుక క్వాలిటీ బాగా లేదు. పైన ఫాన్, గాలికెగిరే పరదాలు క్వాలిటీ దెబ్బతీశాయి.





0 comments

Friday, April 24, 2009

కొంటె కోణాలు - 5

Friday, April 24, 2009
కొంటె కోణాలు – 5

దురద


ఇప్పుడు సమయం మధ్యాహ్నం 1-35. 24-04-2009. జీ తెలుగు టీవీలో యానాం ఉత్సవాలు టెలి కేస్ట్ చేస్తున్నారు. అందులో చిన్న పిల్లలు చెప్పిన ఒక జోక్ బాగుందనిపించి చూడని వాళ్ళ కోసం వ్రాద్దామనిపించింది. ఇందులో యానాంనుంచి హైదరాబాదు వచ్చిన వ్యక్తి, ఒక హైదరాబాదు రౌడీ వుంటారు.
యానాం నుంచి వచ్చిన వ్యక్తి హైదరాబాదు లో భవనాలను మెచ్చుకుంటూ బాగా దురద పుడితే గోక్కుంటున్నాడు. హైదరాబాదు రౌడీ వచ్చి అతన్ని బెదిరించి డబ్బు గుంజాలనుకుంటాడు.

హై.రౌ. ఏంటి బయ్ ఏం చూస్తన్నవ్

యా.వ్య. ఆయ. ఈ బిల్డింగు చాలా బాగుందండీ. (గోక్కుంటున్నాడు)

హై.రౌ. సరే ఆ గోకుడేంది. నీదేవూరు

యా.వ్య. యానామండి. దురద పుడుతోంది.

హై.రౌ. దురద పుడితే. అట్ట గోక్కొనుడేనా లైసెన్సుందా

యా.వ్య. లైసెన్సు దేనికండీ

హై.రౌ. గోక్కోడానికి. హైదరాబాదు లో గోక్కోవాలంటే లైసెన్సు వుండాల. (గోక్కుంటాడు)

యా.వ్య. మరి మీ దగ్గరుందాండీ లైసెన్సు.

హై.రౌ. వుందిదుగో. (జేబులోంచి ఏదో కాయితం తీసి చూపిస్తాడు)

యా.వ్య. మీ దగ్గర లైసెన్సు వుంది కదండీ. నా కీడ దురద పుడుతోంది. కొంచెం గోకండయ్య.

కొంటె కోణం

రోజులు మారుతున్నాయా!!??

1 comments

Monday, April 20, 2009

కొంటె కోణాలు - 4

Monday, April 20, 2009
కొంటె కోణాలు – 4

ఈనాడు సోమవారం, ఏప్రిల్ 20, 2009 లో ప్రచురించబడిన వార్త


చెన్నైలో ఏటీఎం యంత్రం మాయం


ఏటీఎం లో నగదు చోరీ గురించే విన్నాం. కానీ చెన్నైలో ఏకంగా ఏటీఎం యంత్రాన్నే ఎత్తుకెళ్లారు. చెన్నై కీళ్పాక్కంలోని హామ్స్ రోడ్డులో ఇండియన్ ఓవర్ సీస్ బ్యాంకుకి చెందిన ఇన్ స్టా క్యాష్ ఏటీఎం కేంద్రం వుంది. ఆదివారం లోపల ఏటీఎం యంత్రం కనిపించకపోవడంతో పలువురు వచ్చి తిరిగి వెళ్లిపోయారు. చివరికి ఒకరు అసహనంతో బ్యాంకు కీళ్పాక్కం శాఖని సంప్రదించి వివరణ కోరారు. విషయం విని బ్యాంకు అధికారులు హుటాహుటిన అక్కడికొచ్చారు. ఆదివారం వేకువజామున ఓ వాహనంలో హుందాగా వచ్చిన కొందరు నేరుగా ఏటీఎం కేంద్రం లోపలికెళ్లి షట్టరు మూసేశారు. నగదు నింపడానికో లేక యంత్రం సరిచేయడానికో వచ్చిన సిబ్బందీగా భావించి స్ధానికులు పట్టించుకోలేదు. యంత్రాన్ని బయటకు తీసుకొచ్చిన దుండగులు అక్కడి నుంచి ఉడాయించారని తెలిసింది. ఆ యంత్రంలో రూ. 80 వేల వరకు నగదు ఉండొచ్చని భావిస్తున్నారు.

కొంటె కోణం

గుడిని మింగేదొకళ్లయితే గుళ్లో లింగాన్ని మింగేదింకొకళ్లు అనే సామెత ఇలాంటి వాళ్లని చూసే వచ్చిందా???

0 comments

Saturday, April 18, 2009

కొంటె కోణాలు - 3

Saturday, April 18, 2009
కొంటె కోణాలు – 3
ఆశ నిరాశేనా??
అదొక అద్భుతమైన పరిమళం ద్రవ్యం. మగవారికి ప్రత్యేకం. మార్కెట్ లో విడుదల అయిన వెంటనే ప్రజల అభిమానాన్ని పొందింది. అమ్మకాలు పెరిగాయి. కంపెనీ ఆ పెర్ ఫ్యూమ్ ని ప్రపంచంలోనే అత్యధిక ప్రజాదరణ పొందిన ఏకైక పెర్ ఫ్యూమ్ గా చేయాలనుకున్నారు. ఆ బాధ్యత ఒక ఎడ్ వర్టయిజ్ మెంటు కంపెనీ మీద పెట్టారు. వాళ్ళ కంపెనీలోని అత్యంత మేధవులంతా కలిసి కొన్ని ప్రకటనలు రూపొందించారు. అందరూ వాటిని పరిశీలించి, ఉబ్బి తబ్బిబ్బయ్యారు. ఈ ప్రకటనలు రిలీజ్ అయిన వెంటనే తమ పెర్ ఫ్యూమ్ ప్రపంచంలోనే అత్యధికంగా అమ్ముడుబోయే ఏకైక పరిమళమవుతుందని సంతోష పడిపోయారు. అత్యంత ఆడంబరంగా ప్రకటనలు విడుదల చేశారు. అందరూ ఫలితాల కోసం ఎదురు చూడసాగారు. కానీ వారు ఆశించినట్లు జరగలేదు. అమ్మకాలు పెరగకపోగా రోజు రోజుకీ తగ్గసాగాయి. చివరికి పూర్తిగా పడిపోయాయి. కారణాలు???

కొంటె కోణం

ఆ ప్రకటనలు చూసిన ఆడవారు తమ కొడుకులు, సోదరులు, ప్రియులు, భర్తలు ఆ పరిమళం వాడకుండా జాగ్రత్త పడ్డారు.....ప్రకటనలలోలాగా పొరపాటున ప్రపంచంలోని ఆడవారంతా ఆ పరిమళం వాడిన వ్యక్తుల వెనక పడితే!!!


1 comments

Monday, April 13, 2009

కొత్త జీవితం

Monday, April 13, 2009
కొత్త జీవితం


8-4-2009 నవ్య సచిత్ర వార పత్రికలో ప్రచురించబడిన నేను వ్రాసిన కధ ఇది.....

నాట్య కళాకారులు కొంతకాలం తర్వాత నాట్యం చెయ్యటం ఆపేస్తే అవయవాలన్నీ సరిగా పనిచెయ్యటం మానేసి లావెక్కుతారంటారు. అలాగే క్రీడాకారులు, ఒక విధంగా చెప్పాలంటె నేను కూడా ఆ బాపతే. అయితే వాళ్ళవి శారీరిక సమస్యలయితే నాది మానసికం. ఎందుకంటారా నిన్న మొన్నటిదాకా సంసారం, పిల్లలు, ఉద్యోగ బాధ్యతలు వీటితో...ఇవి కాకుండా వేరే ప్రపంచం కూడా వుంటుందన్న విషయమే మర్చిపోయాను. పిల్లలు పెద్దవాళ్ళయి దూర దేశాలు వెళ్ళటం, నేను రిటైర్ కావటం అన్నీ ఒక్కసారవటంతో హడావిడి ప్రపంచాల గేట్లన్నీ మూసేసి నేనో మహా శూన్యంలో వున్నట్లనిపించింది.

అప్పటిదాకా ఉరుకులు పరుగులతో ఒక్క క్షణం తీరిక అంటే అపురూపమయిన, ఆడంబరమయిన విలాసమనుకునే నాకు ఒక్కసారిగా అంత ఖాళీ సమయాన్ని ఏం చెయ్యాలో తెలియటం లేదు. జీవితంలో ఎన్నో విషయాలని చక్కని ప్రణాళిక ప్రకారం సాధించిన నాకు ఈ విశ్రాంతి జీవితాన్ని ఎలా గడపాలో ప్లాన్ చేసుకోవటం కష్టంగా వుంది. అందుకే మా ఆయన్ని సలహా అడిగాను.

“ నీ ఇష్టం. నువ్వెలా చేద్దామంటే అలాగే చేద్దాం” అన్నారు.

చిన్న చిన్న విషయాలకి ఆలోచించి ఆయన బుర్రకి శ్రమ కలిగించటం గానీ, నాతో గోలలు తెచ్చుకోవటంగానీ ఆయనకస్సలు ఇష్టం వుండదు.

సరే. ఓ నాలుగు రోజులు ఎటన్నా తిరిగి వద్దామన్నాను. మా బంగారం కాదనరుగా. పైగా ఏ కళనున్నారో ఆలోచన కూడా చెప్పారు. “ శ్రీశైలం వెళ్ళి వద్దాం. కారులో వెడదాం. హడావిడి లేకుండా అన్నీ చూసుకుంటూ వెళ్ళచ్చు” అన్నారు.

ఇంతకాలం దేముణ్ణి కూడా పెద్దగా గుర్తుపెట్టుకోలేదు మేము. ఇంత ఖాళీ సమయం వుంది కదా...కొంత ఆయనకి కేటాయిస్తే పోలా అనుకుని ఎప్పుడో కొన్న స్తోత్ర రత్నావళి పుస్తకాన్ని తీసి ఒక బేగ్ లో సర్దాను.

“అవ్వన్నీ ఎందుకు?” అడిగారాయన. పెళ్ళికి పోతూ....అన్నట్లనిపించింది సుమండీ నాకు.

“గుళ్ళో కూర్చుని కాసేపీ స్తోత్రాలు చదువుకుంటానండీ.....కాస్త మనశ్శాంతి..” నా సమాధానం.

“ మనశ్శాంతి మన మనస్సులో వుంటుంది. మనలోనూ, మన ఆలోచనల్లోనూ వుంటుంది. ఎక్కడో కూర్చుని ఏదో చేస్తే రాదు”. ఈ మనశ్శాంతి విషయంలో మాత్రం మా ఆయనకూ నాకూ ఎప్పుడూ పడదు.

పిల్లలు దూరంగా వున్నారు. వండుకుంటున్నరో లేదో...తిన్నారో లేదో అని నేనాలోచిస్తుంటే… నువ్వన్నీ అనవసరంగా ఆలోచిస్తావు. ఆకలేస్తే తినాలని తెలియనంత వెర్రి వాళ్ళు కాదులే మన పిల్లలు అంటారు.

అప్పుడే నాకూ కోపం వస్తుంది. అసలు ఆయన మనిషేనా మనిషయితే మనసనేది వున్నదా అని ఓ పెద్ద అనుమానం.

“నేను మనిషినే. నాకు మనసున్నది. అందుకేగా వాళ్ళ భవిష్యత్ కోసం వాళ్ళు విదేశాలకు వెళ్తామంటే ఆ మనసుతో ఆలోచించే మనిషిగా సరేనన్నాను. ఇక్కడేముంది కుతంత్రాలు, కక్షలు, కార్పణ్యాలూ తప్పితే, ఎదుటి వాళ్ళ గురించి ఆలోచించే వాళ్ళెవరయినా వున్నారా?” ఆ విషయంలో ఇంకో మాటలేదన్నట్లు మాట్లాడతారెప్పుడూ ఆయన.

“మన దేశం, మన మనుషులు, తల్లిదండ్రులు అందరినీ వదిలిపోతే వాళ్ళెట్లా వున్నారో, వాళ్ళ బతుకులేమోగానీ ఇదిగో మన బతుకులిలాగే వుంటాయి. అన్నీ వుండి ఏం లాభం ఓ సరదానా సందడా, పెద్ద శూన్యం తప్పితే” నా అక్కసు వెళ్ళబోశాను.

“మై డియర్ శ్రీమతీ, నువ్వు వున్న ఊరు, అమ్మా నాన్నా అని మీ ఊళ్ళో కూర్చోకుండా ఈ ఊరెందుకొచ్చావోయ్” పాయింట్ లాగారు.

“ ఇక్కడ ఉద్యోగం వచ్చింది కనక ఇక్కడికొచ్చాను. ఇక్కడ కాకపోతే..” నా మాట సగంలోనే ఆపేశారు.

“ఆ...ఆ...నాకు తెలుసు. ఇక్కడ కాకపోతే ఉద్యోగం ఎక్కడ వస్తే అక్కడికెళ్ళే దాన్నంటావు. అవునూ. వెనకటి తరానికి చెందిన ఆడపిల్లవి. నువ్వే వుద్యోగం కోసం ఇంత దూరం వస్తే మరి ఈ తరం వాళ్ళు నీ పిల్లలు...వాళ్ళేం తక్కువ తిన్నారు సర్లే...అన్నీ సర్దేశావా....పెందరాళే బయల్దేరుదాం” పిల్లల మీద నుంచి ఆలోచనలు మార్చటానికి నన్ను హడావిడి పెట్టారు.

నిజమే ఆ మాట. అప్పుడు నేను వుద్యోగమని ఇంత దూరం వచ్చినప్పుడు అమ్మ చాలా బాధ పడ్డది. ఇప్పుడంటే మనిషికో ఫోన్ వుంటోందిగానీ అప్పుడో.. పేటకో ఫోన్ కూడా వుండేది కాదు. అందుకే అమ్మ రోజుకో వుత్తరం రాసేది. నన్ను రాయమంటే నేను విసుక్కునేదాన్ని రోజూ రాయటానికి విశేషాలేముంటాయని. ఇప్పుడు మా పిల్లలు అంతే. రోజుకోసారి ఫోన్ చెయ్యండంటే రోజూ విశేషాలేముంటాయంటారు. వాళ్లదాకా వస్తేగానీ తెలియదు వాళ్లకీ బాధ. అయినా వాళ్ళక్కూడా ఈ అవస్తలెందుకు. హాయిగా అంతా కలిసి ఒక చోటే వుంటారు. ఆలోచనల్లో కూడా పిల్లలకి కష్టం వూహించలేదు తల్లి మనసు.

సరే...ఓ నాలుగు రోజులు తిరిగొస్తే కొంచెం కాలక్షేపమవుతుందని బయల్దేరాం. హైద్రాబాద్ సిటీ ట్రాఫిక్ లో ఆయన డ్రైవ్ చేస్తుంటే ఎప్పటిలాగే గుండె అరచేతిలో పెట్టుకుని కూర్చున్నా. కారులో మావారి పక్కన కూర్చుని వెళ్తున్న సరదాగానీ, కొత్త ప్రదేశాలకెళ్తున్న సంతోషం గానీ మచ్చుకు కూడాలేదు.

ఎడమవైపునుంచీ, కుడివైపునుంచీ ఇష్టం వచ్చినట్లు బైకు కింద పడిపోతుందోమోననిపించేటట్లు సర్కస్ ఫీట్ లాగా రయ్యిమని ఓవర్ టేక్ చేసి వెంటనే కారు ముందునుంచే అడ్డం తిరిగి ఇంకో వెహికల్ ని ఓవర్ టేక్ చెయ్యటానికి ప్రయత్నంచే బైకు బాబులకు డ్రైవింగ్ ఎవరు నేర్పుతున్నారో, లైసెన్సు ఎలా ఇస్తున్నారో నాకస్సలు అర్ధంకాదు. ఆటో వాళ్ళు సరేసరి. రోడ్లన్నీ వాళ్ళవే.

అసలు ఈ లైసెన్సులిచ్చే వాళ్ళకి డ్రైవింగు వచ్చా? రూల్సన్నీ తెలుసా? అని నాకో పేద్ద డౌట్. నన్నడిగితే ఎవరెవరికి లైసెన్సు ఇవ్వచ్చో, ఎవరికి ఇవ్వకూడదోనని వాళ్ళకి వారానికో రోజయినా ట్రైనింగు ఇస్తూ వుండాలి.

ఎలాగో సిటీ దాటాం. కొంచెం స్ధిమితంగా కూర్చుని కొత్త ప్రదేశాలన్నీ కుతూహలంగా చూడసాగాను. కొంచెం హుషారు కూడా వచ్చింది. ఇన్నాళ్టికి ఇలా తీరిగ్గా, మా కోసం మేము కొంత సమయం, అదీ ఏ బాదర బందీ లేకుండా గడపగలుగుతున్నామని సంతోషం.

నా సంతోషం ఎంతోసేపు నిలవలేదు. దోవలో వస్తున్న వైన్ షాపులని చూస్తే మతి పోయింది. ఇన్ని షాపులున్నాయంటే...వాళ్ళకి వ్యాపారం జరిగితేనే కదా అన్ని వుండేది. అంటే దోవన వెళ్ళే వాళ్ళల్లో కొందరయినా అవి తాగి డ్రైవ్ చేస్తున్నారన్న మాట. అందుకే యాక్సిడెంట్లు. నాకప్పుడే జ్ఞానోదయం అయింది. మా కాలనీలో బట్టల షాపులు, కిరాణా షాపులూ పెట్టినవన్నీ వ్యాపారం లేదని చాలామటుకు తీసేశారు. వైన్ షాపులు మాత్రం ఒకటికి మూడయినాయి. మా కాలనీలో కూడా అంతమంది తాగే వాళ్ళున్నారా!!?

కనిపించే షాపులే ఇన్నివుంటే ఇంక బెల్టు షాపులని, నాటు సారాలని డబ్బు పెట్టలేని వాళ్ళ అందుబాటులో ఎన్ని షాపులున్నాయో!? అందుకే పేపరు తెరిస్తే ఇవే వార్తలు. ఎప్పుడివ్వే వార్తలని మనం కొట్టి పడేస్తాం గానీ వీటి మూలంగా ఎన్ని కుటుంబాలు ఎన్ని కష్టాలు పడుతున్నాయో. నాకింకో డౌటు. ఈ బిజినెస్ చేసేవాళ్ళు తాగుతారా?

పెసర చెట్లు కోసి రోడ్డు మీద పరిచారు చాలా చోట్ల. వాటి మీదనుంచే అన్ని వెహికల్స్ వెళ్తున్నాయి. అవన్నీ పాడయిపోవా అని అడిగాను ఆయన్ని చిన్నపిల్లలాగా. ఇవి నేనెప్పుడు చూడలేదు మరి. మన చుట్టుపక్కల మనకి తెలియని విషయాలెన్ని వున్నాయో.

“బళ్ళు వెళ్తున్నప్పుడు ఆ కాయలు పగిలి గింజలు విడిగా వస్తాయి. తరువాత గడ్డి వేరు చేసి ఆ గింజల్ని తీసుకుంటారు.”

తెలియని విషయాలు తెలుసుకుంటుంటే మనసు ఆహ్లాదంతో నిండి పోయింది. బహుశా అంతకు ముందు అలా చేసిన చోట మిగిలిపోయిన గింజలనుకుంటా రకరకాల పిట్టలు ఏరుకు తింటున్నాయి. కొన్ని పిట్టలు కారు శబ్దం విని తుర్రున ఎగిరి పోతూంటే కొన్ని పిట్టలు నింపాదిగా అడుగు తీసి అడుగువేస్తూ కదులుతున్నాయి. భుక్తాయాసంతో కదలలేకుండా వున్నా, నువ్వే తప్పుకుపో అంటున్నట్లు.

సాయంకాలానికి శ్రీశైలం చేరాం. స్నానాలు, దైవ దర్శనం, విశ్రాంతి, ఆ రోజు నా పుస్తకం బయటికి తియ్యలేదు.

మర్నాడు ఆయన్ని ముందే అడిగాను. “ నేను గుళ్ళో కూర్చుని కాసేపు అవ్వన్నీ చదువుకోవాలి. మీరు చదువుతారా?”

“నా వల్ల కాదుగానీ, క్రికెట్ వుంది. దర్శనమయ్యాక నేను రూమ్ కొచ్చి క్రికెట్ చూస్తాను. నువ్వు ఏ డిస్టర్బెన్స్ లేకుండా హాయిగా నీ యిష్టం వచ్చినంతసేపు చదువుకునిరా” అన్నారు. ఆదీ బాగానే వుందనిపించింది.

దైవ దర్శనం అయ్యాక భ్రమరాంబ అమ్మవారి గుడి ముందరవున్న గట్టు మీద కూర్టుని పుస్తకం తీశాను. కొన్ని ఏళ్ళకి ఆ పుస్తకాలు తీసి చదువుదామనుకున్నా కదా, ఎందుకైనా మంచిదని విఘ్నేశ్వరుని ప్రార్ధనతో మొదలు పెడదామని తీశాను.

పక్కనే ఓ దంపతులు వచ్చి కూర్చున్నారు. ఆయన కొబ్బరి చిప్పకు వున్న పీచు పట్టుకుని చిప్పని నేలకేసి కొడుతున్నాడు. ఆ అదురుకే చెయ్యి నొప్పేట్టినట్టు వుంది. కొట్టినవెంటనే చిప్పని వదిలేస్తున్నాడు. అది నా దగ్గరకొచ్చి పడుతోంది.
అసలే నాది కొత్త పట్టుచీర, కొబ్బరి మరకలు పడితే తొందరగా వదలవు. మనకెందుకులే అని వూరుకోకుండా చిప్ప పట్టుకుని ఇలా కొట్టండని చూపించా. లేదు. ఇట్లా వస్తుందని చెప్పి ఆయన తన ప్రయత్నం కొనసాగించాడు.

విఘ్నేశ్వరా, నీ ప్రార్ధనతోనే కదయ్యా మొదలెట్టాను. మొదట్లోనే విఘ్నమా!!? అనుకుంటూ అక్కడినుంచి లేచి బాగా ఎత్తుగా వున్న అరుగుమీదకి వెళ్ళి కూర్చున్నాను. గోడమీద ఋగ్వేదము అని రాసి వుంది. బహుశ అక్కడ ఋగ్వేద పారాయణ చేస్తారేమో. బలే మంచి స్ధలంలో కూర్చున్నాను, పుణ్యమంతా నాదే అనుకుని మళ్ళీ విఘ్నేశ్వర ప్రార్ధన మొదలు పెట్టాను.

“ఏయ్, ఈడ కూసుందా రండి” ఇంకో కుటుంబం పిల్లలతో సహా వచ్చి కూర్చున్నారు.

“అమ్మా, తమ్ముడు సూడవే. నా లడ్డూ కూడా లాక్కుని తింటున్నాడు” అందులో ఎనిమిదేళ్ళ కూతురు ఫిర్యాదు.

“ పోనీలే, తమ్ముడు మగపిల్లాడు కదా. తిననియ్యి, అన్నిటికీ గోల పెట్టమాకు” తల్లి కూతుర్ని కసరటంతో ఒక నిముషం తమ్ముడు తింటున్న లడ్డూకేసి ఆశగా చూసి ఇది మామూలే అనుకుందేమో దృష్టి మరల్చి జనాన్ని చూడసాగింది.

నాకాశ్చర్యం వేసింది. ఈ రోజుల్లో కూడా ఆడా మగా మధ్య ఇంకా తేడా వుందా. మగపిల్లాడని ఆ అబ్బాయికే పెట్టేస్తే ఆ అమ్మాయి ఆకలెలా తీరుతుంది అర్జెంటుగా ఆ తల్లికో క్లాసు పీకుదామనుకున్నాను. కానీ నా చిరకాల వాంఛ నాలుగు లైన్లన్నా నడవలేదు. అందుకే మళ్ళీ వినాయక ప్రార్ధన మొదలెట్టాను.

కళ్ళు అక్షరాల వెంట పరిగెత్తుతున్నా మనసెప్పుడో గతంలోకి పారిపోయింది. మేమెంత అదృష్టవంతులం. మా ఇళ్ళల్లో ఎప్పుడూ ఈ ఆడా మగ తేడా చూపించలేదు. మేము కూడా ఎప్పుడూ మా పిల్లల్లో ఈ తేడాలు చూపించలేదు. అందుకే వాళ్ళకసలు అలాంటివి వుంటాయని కూడా తెలియదు. బహుశా వాళ్ళు వాళ్ళ పిల్లల్లో కూడా అలాంటి తేడాలు చూపించరు. చదువు సంస్కారం మూలంగా వచ్చిన మార్పు ఇది.
అసలు కాస్తో కూస్తో చదువుకుని ఆర్ధికంగా కూడా కొంత స్ధోమతు కలిగిన వాళ్ళు ఇలాంటి తేడాల జోలికి పోరేమో.

ఆర్ధిక స్ధోమతులేని వాళ్ళే కుటుంబ సభ్యులందరికీ అన్నీ సమకూర్చలేక ఇలాంటి తేడాలు చూపిస్తారు. ప్రజలందరికీ విద్య, ఉద్యోగం వుండేటట్లు ఏ ప్రభుత్వమూ ప్రయత్నిచదెందుకు? ఎంతసేపూ పదవిలో వున్నవాళ్ళని తిట్టి పొయ్యటమో, వాళ్ళని గద్దె దింపటానికి ప్రయత్నించటమో తప్పితే, ప్రజలందరూ ఏ లోటూ లేకుండా సుఖంగా వుంటే....ఎటో వెళ్లపోతున్న మనసును పట్టి లాక్కొచ్చి పుస్తకమప్ప చెప్పాను.

“ అయితే వదినా, చందూ కార్తీక్ కలిశారా? తర్వాత ఏమయింది? అయినా యశోధర లాంటి ఆడ రాక్షసులు ఎక్కడన్నా వుంటారా? మరీ విడ్డూరం కాకపోతేనూ” ఇంకో పక్కనున్న గ్రూప్ లోంచి ఒక అమ్మలక్క నిట్టూర్చింది.

“టీవీల్లోనూ సినిమాల్లోనూ ఆడవాళ్ళనిలా వికృతంగా చూపించి వాళ్ళ పరువు తీస్తున్నారు. లేని బుధ్ధులు నేర్పంచటం కదూ. వీటన్నింటినీ బేన్ చేసి పడెయ్యాలి ముందు”. ఓ వనితామణి వాపోయింది. ఈవిడ తప్పకుండా ఏ మహిళా మండలి సభ్యురాలే అయి వుంటుందనుకున్నాను.

“వాళ్లుమాత్రం ఏం చేస్తారు. వున్న వాటినే కాస్త అటూ ఇటూ చేసి చూపిస్తారు. మా అత్త ముందు ఎంతమంది యశోధరలైనా దిగదుడుపే. అమ్మో వస్తోందదిగో...” బహుశా స్వతంత్రం లేని ఓ మహిళ. ఎన్ని వేల మహిళా దినోత్సవాలు జరుపుకుంటే ఇలాంటి వాళ్ళకి స్వాతంత్ర్యం వస్తుందో, అన్నట్టు...అసలు వీళ్ళకి మహిళా దినోత్సవాల గురించి తెలుసా?

ఇంక ఇంత జనంలో కూర్చుని ఈ స్తోత్రాలు చదవటం నా వల్ల కాదని నిశ్చయించుకుని పుస్తకం మూసేశాను. హమ్మయ్య. కొంచెంసేపు చుట్టూ జనాన్ని చూసి రూమ్ కొచ్చాను. నేను తలుపు కొట్టింది కూడా విననంత శ్రధ్ధగా క్రికెట్ చూస్తున్నారాయన.

కొంచెంసేపు తలుపు బాదిన తర్వాత తీశారు. పైగా “నువ్వేదో చాలా పెద్ద పుస్తకం తీసుకు వెళ్లావుగా. అప్పుడే వస్తావనుకోలేదు”. అన్నారు.

“తలుపు కొట్టింది కూడా వినపడనంత మునిగిపోయారా ఆ క్రికెట్ లో. నాకేమో అక్కడ వచ్చి పోయే వాళ్ళ మాటలతో అసలు కాన్ సెన్ ట్రేషన్ కుదురలేదు. అయినా గుళ్ళో అన్ని విషయాల గురించి అంత పెద్దగా ఎలా మాట్లాడుతారో” చికాకు బయట పెట్టకుండా వుండలేక పోయాను.

“చూడమ్మాయ్. గుడన్న తర్వాత నీలాంటి సాధుపుంగవులూ సన్యాసులే కాదు...మామూలు మనుష్యులు కూడా వస్తారు. వాళ్ళకి వాళ్ళ రొటీన్ లైఫ్ నుంచి అదొక రిలీఫ్. మీలాంటి వాళ్ళని డిస్టర్బ్ చేస్తున్నామనే ఆలోచనే వాళ్ళకుండదు. పోనీ నన్నొచ్చి కాసేపు ఎవరూ మాట్లాడకుండా కాపలా కాయమంటావా” ఎంత సీరియస్ గా అడిగినా ఆయన సెటైర్ నాకు తెలియదా.

“ఏమఖ్ఖర్లా...మీరా టీవీ కట్టెయ్యండి. నేనిక్కడ ప్రశాంతంగా కూర్చుని చదువుకుంటా”.

బుధ్ధిగా టీవీ కట్టేశారు. పుస్తకం తీసి మళ్లీ మొదలు పెట్టాను.

“శుక్లాబరధరం విష్ణుం......”

పాపం నా మూలంగా ఆయన క్రికెట్ చూడకుండా కూర్చున్నారు. నా పుస్తకం తర్వాతయినా చదువుకోవచ్చు. ఈ మేచ్ మళ్లీ రేపు రాదుగా.

“పోన్లే మీరు క్రికెట్ చూడండి. నేను తర్వాత చదువుకుంటాను. కొంచెం ఉదారత ప్రదర్ళించాను..

“ అమ్మా, త్యాగశీలీ, నీక్కావాల్సింది నువ్వు చేస్తున్న పని మీద కాన్సెన్ట్రేషన్. అదే నువ్వాఫీసు పని చేసేటప్పుడు పక్కన ఎంత గందరగోళంగా వున్నా చలిస్తావా లేదు. ఎందుకు అక్కడ నీకలా అలవాటయింది. ఈ జీవితం నీకు కొత్త. అందుకే అంతగా కుదరటం లేదు. కొత్త పధ్ధతులకు అలవాటు పడటానికి ఎవరికయినా కొంత సమయం పడుతుంది. ఏకాగ్రత కుదరటం కూడా కష్టమపుతుంది. కొంచెం ధృఢ నిశ్చయంతో కాన్సెన్ట్రేట్ చెయ్యి. నెమ్మది నెమ్మదిగా అలవాటు పడతావు. అప్పుడు ఎంతమందిలో వున్నా నీకేమీ ఇబ్బంది వుండదు”.

ఆయన లెక్చరిచ్చే అవకాశాన్ని వదులుకోలేదనుకున్నా చెప్పింది సరిగ్గానే చెప్పారనిపించింది. కృషితో మనసు నిలకడగా వుంచితే ఏదయినా సాధించవచ్చనిపించింది.

“సరే. మీరు టీవీ పెట్టుకోండి. నేను చదువుకుంటా....”
మంచి విషయాలు ప్రారంభించటానికి ఆలస్యం ఎందుకు నా కొత్త జీవితానికి వీలయినంత తొందరగా అలవాటు పడాలని నిర్ణయించుకున్నా.

0 comments

Friday, April 10, 2009

పాటల సందడి

Friday, April 10, 2009
పాటల సందడి

తేనెజల్లు

తెలుగు టీ.వీ. ఛానళ్ళన్నీ సినిమాల గోలతో విసుగెత్తిస్తున్న ఈ తరుణంలో ప్రమదావనం కూడా ఈ సినిమా పాటల సొద ఎందుకుపెట్టారా అనుకున్నానో లేదో నా కిష్టమైన పాటలన్నీ నా మదిలో మారు మ్రోగి ఒక్కసారి మమ్మల్ని గుర్తు చేసుకో అని తియ్యగా పాడాయి. అంతే. నేను ముందంటే, నేను ముందంటూ సినీ సాహితీ ప్రపంచాన్ని ఉర్రూతలూగించిన అందమైన పాటలెన్నో నా మనస్సులో తుమ్మెద రాగాల్ని పాడటం మొదలు పెట్టాయి. అందమైన అవకాశాన్ని వదులుకోగూడదు అనుకుని ఒక్కసారి ఆ తేనెజల్లులో తడిసిపోయాను.

ఎన్ని కోయిలల కుహూ కుహూలు ఒక్కసారే వినిపించినా, అన్నిటిలోంచి నా కత్యంత ప్రీతి పాత్రమైన ఆ గండు కోయిల హృదయగానాన్ని నా మనసెప్పుడూ ఆస్వాదిస్తూనే వుంటుంది. ఆ మధు గీతామృతపానానికి మత్తెక్కి నా మనసు ఎన్ని శిశిర సమయాలలో తుషారు శీతల పవనాలను ఆస్వాదించిందో. వీటిలో వేటికీ పరిచయాలు అక్కరలేదు....పూర్తి రచనలు ఇక్కడ వ్రాయనక్కరలేదు...ఎందుకంటే ఒక్కమాట వినిపించిన వెంటనే పాత తరాల వారంతా రింగులు తిప్పకుండానే ఊహాలోకాలకెళ్ళి పోతారు....కొత్త తరం వారు చెవి ఒగ్గి, మనసు పెట్టి వింటారు. అవునో కాదో మీరే చూడండి....

మనసున మనసై బ్రతుకున బ్రతుకై...


చూశారా చూశారా ఒక్క లైనయినా పూర్తిగా పాడక ముందే మీరు పాడేసుకుంటున్నారు. సాయం సమయం, పూల తోట, అందులో విశ్రాంతిగా కూర్చుని డా. చక్రవర్తి మీ కళ్ళ ముందున్నారు కదూ. పాత తరంవారి ప్రతి గుండెలోనూ నిండివున్న ఈ పాట కొత్త తరం వారికీ ప్రీతిపాత్రమైనదే.

అలాగే


నీలి మేఘాలలో గాలి కెరటాలలో నీవు పాడేపాటా వినిపించునేవేళా...

బావా మరదళ్ళ కోసం జానకమ్మ గొంతులోంచి కమ్మగా జాలువారిన ఈ పాటను మించిన ప్రేమ గీతమింకొకటుంటుందా వుండదంటున్నారా కోప్పడకండి మీమాట కాదన్నందుకు మరి ఈ పాట చూడండి...

ఏ దివిలో విరిసిన పారిజాతమో...


పాట సాహిత్యం, యస్.పీ. బాల సబ్రహ్మణ్యం పాడిన విధానం ప్రతి ఒక్కరినీ ఈ రోజుకీ తన్మయుల్ని చేసే ఈ పాట కన్నెవయసు సినిమాలోది.

నిరీక్షణలో నాయిక పాడిన పాటలలో తలమానికం శాంతి నివాసం లోని ఈ పాట....ఈ మధ్య కొంచెం కనుమరుగవుతోందా అనిపిస్తున్న ఈ పాటనొక్కసారి గుర్తుచేసుకోండి...

తుషారు శీతల సరోవరాన అనంత నీరవ నిశీధిలోన
ఈ కలువ నిరీక్షణా నీ కొరకే రాజా వెన్నెల రాజా
కలనైనా నీ వలపే కలవరమందయినా నీ తలపే
కలనైనా నీ వలపే




అమ్మ పాడే పాటలు ఎన్ని వచ్చినా, అమ్మ మనసు అర్ధం చేసుకున్న పాట ఇది ఒక్కటే అనుకుంటా. చిత్రం, పాట పల్లవి గుర్తులేదు కానీ ఈ పాట ప్రభ మీద చిత్రీకరించబడింది.... చరణంలో....

ఏడాదికే నాలుగేళ్ళు రావాలీ
మా బాబు ఎప్పటికి ముఫ్ఫయిలో వుండి పోవాలీ


పాటలు విని ఆనందించటం, అదీ చాలా తక్కువ సమయమే తెలిసినదానిని పాటల గురించి ఇంతకన్నా ఏమి వ్రాయను. సంగీతంలో అ ఆ లు రాని నేనే ఈ తేనె జల్లులో ఇంత ముద్దయిపోతే ఇంక సంగీత జ్ఞానుల సంగతి ఏమని వర్ణించనూ

5 comments

Sunday, April 5, 2009

కొంటె కోణాలు - 2 దానం - ధర్మం

Sunday, April 5, 2009
కొంటె కోణాలు - 2

దానం – ధర్మం

మా వారికీమధ్య కొంచెం దాన ధర్మాల యావ ఎక్కువైందిలెండి. ఎక్కడికి వెళ్ళినా జేబు నిండా చిల్లర వేసుకుని అడుక్కోవటానికి వచ్చేవాళ్ళందరికీ ఇవ్వటం మొదలు పెడ్తారు. మనుషుల్లో రకరకాల మనుషులున్నట్లే అడుక్కునే వాళ్ళల్లో అనేక రకాలు. ఇచ్చింది తీసుకునే వాళ్ళు కొందరయితే పెట్టిందానికి పేర్లు పెట్టేవాళ్ళింకొందరు.

మొన్న మేము బెంగుళూరునుంచి వచ్చేటప్పుడు జరిగిందిది. మా వారి జేబులో చిల్లర అయిపోయి ఆఖరి నాణెం మిగిలింది అప్పుడే ఒక గుడ్డతను అడుక్కోవటానికి వచ్చాడు. మా వారు జేబు తడుముకుని ఆ నాణెం తీసేసరికి ఆ గుడ్డతను ఆయన ముందునుంచీ కదలటంతో ఆయన “ఇదిగో బాబూ” అని అతి మర్యాదగా పిలిచి ఆ నాణెం చేతిలో పెట్టారు.

అతను దాన్ని తడిమి చూసి “దీనికేనా ఏదో ఐదు రూపాయలిచ్చినట్లు....” అని గొణుక్కోవటం పక్కనే వున్న నా చెవిన పడింది.

ఇంతకీ ఆయన ఇచ్చింది అంతకు ముందు మాకు బస్ కండక్టరు ఇచ్చిన 50 పైసల నాణెం. కర్ణాటకలో ఇంకా అవి చెల్లుబాటు అవుతున్నాయి.

కొంటె కోణం

ఎంతయినా కర్ణాటకా వాళ్ళు మంచివాళ్ళేననిపించింది సుమా నాకు. అదే ఆంధ్రాలో ఈ నాణేలు కనుమరుగవుతున్న రోజుల్లో బిచ్చగాళ్ళు ఆ నాణెం ఇచ్చిన వాళ్ళ మొహాన్నే విసిరి కొట్టినంత పనిచేసి తిరిగివ్వటం గుర్తొచ్చింది.

0 comments