Thursday, November 27, 2008

కార్తీక దీపాలు

Thursday, November 27, 2008
అమరావతిలో శివలింగం ఆకారంలో దీపాలు (మా కోటా కాదండోయ్)
శ్రీ భీమేశ్వర స్వామి దేవాలయం, సామర్లకోట, తూ.గో.జిల్లా

శక్తీశ్వరస్వామి దేవాలయం లో కార్తీక దీపాల కళకళ (యనమదుర్రు, ప.గో.జిల్లా)

పంచముఖ అమృతలింగేశ్వరస్వామి, కోటిలింగ మహా శివ క్షేత్రం -- అభిషేకము
కోటిలింగక్షేత్రం, ముక్త్యాలలో శివలింగ ప్రతిష్ట
కోటిలింగ క్షేత్రంలో కార్తీక దీపాలు -- క్రింద రెండు ఫోటోలు కూడా

కార్తీక దీపాలు

చిన్నప్పుడెప్పుడో అమ్మమ్మతో కార్తీకమాసం తెల్లవారుఝామున చలిలో తెనాలిలో కాలువలో స్నానంచేసి దీపాలు పెట్టటం నేను ఇప్పటికీ మరచిపోలేని ఒక అందమైన అనుభూతి. అరటిదొప్పలో పెట్టిన దీపాలు కాలువలో అలా అలా కదలివెళ్తుంటే ఎంత అందంగా వుంటుందో సినిమాల్లో కాకుండా నిఝంగా మీరెప్పుడన్నా చూశారా? తర్వాత కాలంలో అనేక భవసాగరాలవల్ల కార్తీకమాసంలో ఎప్పుడైనా ఆ అందమైన స్మృతులు గుర్తుచేసుకోవటంతప్ప కార్తీకమాస అనుభూతులు ఇంకేమీ పొందలేకపోయాను. ఈ ఏడాది పదవీ విరమణ చేయటంవల్ల ఉత్సాహం ఉరకలువేసి కార్తీక మాసం మొదట్లోనే కూర్చున్నదానికి కూర్చున్నట్లు ఈ కార్తీకమాసంలో 108 శివ లింగాల దగ్గర 108 దీపాలు పెట్టాలనే ఆలోచన వచ్చేసింది. నాచేత ఇలాంటి పనులు చేయించే ఉద్దేశ్యంతోనే అనుకుంటా ఆ భగవంతుడు మా ఆయన్ని మంచివాడుగా పుట్టించాడు. నేనీమాట చెప్పగానే ఊళ్లో గుళ్ల జాబితా తయారుచెయ్యటం మొదలుపెట్టారు. మరి 108 లింగాలు కావాలి కదా. మర్నాడు పొద్దున్నే ఆయన ఆఫీసుకెళ్ళేలోపల దగ్గరలో వున్న మూడు గుళ్ళకి తీసుకెళ్ళారు. ఎక్కడెక్కడున్న గుళ్ళనూ గుర్తు తెచ్చుకుంటుంటే జనవరిలో చూసి వచ్చిన జగ్గయ్యపేట మండలంలోని ముక్త్యాల లో నిర్మంపబడుతున్న కోటిలింగ క్షేత్రం గుర్తొచ్చింది మా వారికి. అక్కడ పంచముఖ శివునితోబాటు కోటి శివ లింగాలను ప్రతిష్టించటానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. (దీని గురించి వేరే చెప్తాను). వెంటనే వాళ్ళకి ఫోన్ చేసి గుళ్ళో ప్రతిష్ట జరిగిందా అని అడిగారు. జరిగింది, లింగ ప్రతిష్టలు కూడా చాలా జరిగాయి, ఇంకా రోజూ జరుగుతున్నాయి అన్నారు. 108 లింగాల కోసం 108 చోట్లకి వెళ్ళటం కష్టం అందుకని ముక్త్యాల వెళ్దాం, నీ ఇష్టం వచ్చినన్ని దీపాలు పెట్టుకోవచ్చు అన్నారు. ఇంక ఆలస్యం దేనికని 1-11-2008 న మేమిద్దరమూ, స్నేహితురాళ్ళు సుజాత, సక్కు, పద్మిని బయల్దేరాము. జగ్గయ్యపేట లో హోటల్ లో గది తీసుకుని కొంచెం సేద తీరిన తర్వాత బయల్దేరాము.

మొదటి మజిలీ ముక్త్యాల లో ముక్తేశ్వర స్వామి గుడి. అక్కడ సాయంకాలం 365 వత్తులతో దీపం పెట్టాను. అక్కడనుంచి ముక్త్యాలలోనే వున్న శ్రీ కోటిలింగ మహా శివ క్షేత్రం లో కొలువైన శ్రీ పంచముఖ అమృత లింగేశ్వర స్వామి ఆలయం మా తర్వాత మజిలీ. ఈ క్షేత్రం ఇంకా నిర్మాణ దశలో వున్నది. మధ్యలో ప్రధాన ఆలయంలో శ్రీ పంచ ముఖ అమృత లింగేశ్వర స్వామి, చుట్టూ 108 దేవతా మూర్తులకు చిన్న దేవాలయాలేకాక కోటి శివ లింగాలను ప్రతిష్టించాలని సంకల్పం. ప్రధాన దేవాలయం, కొన్ని దేవతా మూర్తుల గుళ్ళు, వేలల్లో శివలింగాల ప్రతిష్ఠ జరిగింది. మిగతా పని సాగుతోంది. ఇక్కడ 108 శివ లింగాల దగ్గర 108 దీపాలు స్నేహితురాళ్ళ సహాయంతో నేను వెలిగించాను. మా వాళ్ళు కూడా కొన్ని దీపాలు వెలిగించారు. ఎంత బాగున్నాయో ఫోటోలో చూడండి.

మర్నాడు నాగుల చవితి. వేదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి గుళ్ళో కృష్ణా నదీ స్నానం, స్వామి దర్శనం, దీపారాధన, ముక్త్యాల ముక్తేశ్వరస్వామి గుళ్ళో వున్న పురాతన పుట్టలో పాలు పోద్దామనే ఉత్సాహంతో పూజ చేశాముగానీ పాలు పోయటానికి సైన్సు అడ్డు వచ్చింది. ఈ కార్యక్రమం మానేసి కూడా చాలా ఏళ్ళయింది. ఓపిక, తీరిక వుంటే ఇంట్లోనే చెయ్యటం, లేకపోతే ఒక దణ్ణం. అందుకని ఇంతా వెళ్ళానుకదాని శాస్త్రానికి ఒక చుక్క పోసి అక్కడనుండి కోటిలింగ క్షేత్రానికి వచ్చాము. అక్కడ లింగ ప్రతిష్ట చేసి అభిషేకము చేయించాము. (693 రూ. లు కడితే మనచేత లింగ ప్రతిష్ట చేయిస్తారు) ఫోటోలో ఆ దేవుణ్ణి మీరు కూడా చూడండి.


ఓహో, కార్తీక మాస ప్రారంభం చాలా బాగుంది, కష్టమనుకున్న పని వెంటనే సునాయాసంగా చేసేశామని రెట్టించిన ఉత్సాహంతో పంచారామాలతోపాటు ఈ నెలలోనే ఇంకో 40 (శివ, కేశవ, అమ్మవారి) గుళ్ళల్లో వీలైనన్ని పూజలూ, దీపాలూ. కొన్ని ఫోటోలు మీరూ చూడండి.






































































































































































































































































0 comments

Friday, November 21, 2008

దిక్కుతోచని యముడు

Friday, November 21, 2008
దిక్కు తోచని యముడు

స్వర్గం మూసేశారు. ఒక్క కేసు కూడా రావటంలేదని. నరకంలో మాత్రం జనం కిటకిటలాడుతున్నారు. అప్పటికే గవర్నమెంటువారి సిటీ బస్ లో లాగా కెపాసిటీకన్నా ఎక్కువమందినే కూరారు. అక్కడికీ యమధర్మరాజు అర్జంటుకేసులు తప్పితే తీసుకోవద్దని భటులకు గట్టి వార్నింగ్ ఇచ్చాడు. అలా తీసుకువచ్చిన వాళ్ళని భూలోకానికి పంపిస్తాననేసరికి యమభటులు హడలిపోయి భూలోకంలో ఎంత పెద్ద ప్రమాదాలు జరిగినా, ఎన్ని లక్షల ఆస్తి నష్టమయినా మనుషుల ప్రాణాలు మాత్రం దగ్గరుండి జాగ్రత్తగా కాపాడుతున్నారు. అర్జంటు కేసులకి కూడా స్ధలం చూపించలేక యముడు తికమక పడుతూ, ఆకేసులకు కారణభూతులయిన కల్తీదారులనీ, అతివృష్టి అనావృష్టులనూ ఛడామడా తిడుతున్నాడు. అక్కడికీ వరుణుడికి ఇంటర్ ఆఫీసు మెమో ఒకటిచ్చాడు. అతివృష్టినీ, అనావృష్టినీ తగ్గించమని. ఎంతకాలం చూసినా రిప్లయి రాకపోయేసరికి బ్రహ్మదేవుడికి ఒక అప్లికేషన్ వెట్టాడు. సృష్టిని కొంతకాలం ఆపమనీ లేకపోతే చాలా ఘోరాలు జరుగుతాయనీ.

బ్రహ్మదేవుడు అసలే భూలోకంలో గవర్నమెంటువారు కుటుంబనియంత్రణపట్ల చూపే శ్రధ్ధచూసి విసుక్కుంటున్నాడు. వున్నవాళ్ళకి కూడు పెట్టటం చేతకాక నేనిచ్చిన అనేక వనరులను సరిగా వుపయోగించుకోలేక వాళ్ళ చచ్చు మేధస్సును వుపయోగించి వున్న వాటిని కలుషితం చేసుకుంటున్నారని అక్కడికీ ప్రముఖులందరికీ కలలో స్వయంగా కనబడి చెప్పారుట ఈ ప్రయత్నాలు మానమని. కానీ అంతా అయ్యో బ్రహ్మగారు స్వయంగా వచ్చారే అని కనీసం నమస్కారమైనా చేయకపోగా పై వాళ్ళ ఆర్డర్స్ మేమీ విషయంలో మీకేమీ సహాయం చేయలేమని నిర్మొహమాటంగాచెప్పి వెంటనే ముసుగుతన్ని పడుకున్నారుట. పోనీ ఆపై వాళ్ళకే చెప్దామనుకుంటే వాళ్ళు కలలు కనే తీరిక కూడా లేనంత బిజీగా వున్నారుట. అయినా వీళ్ళే యింత మర్యాద చేశారు, వాళ్ళింకెంత చేస్తారోనని, ప్రజలలో తమయందు భయభక్తులు బొత్తిగా తగ్గిపోయాయని దిగులుపడుతున్న సమయంలో చేరిందట మన యమధర్మరాజుగారి పిటిషన్. ఇపుడేమీ చూడను పొమ్మని విసుక్కున్నాడుట చేసేదిలేక.

బ్రహ్మదేవుడికి పంపిన అప్లికేషన్కి కూడా సమాధానం రాకపోవటంతో యముడికి చిర్రెత్తుకొచ్చింది. నాకింకోళ్ళు సహాయం చేసేదేమిటి? చతుర్విధోపాయాలలో ఏదో ఒక ఉపాయంతో నా సమస్య నేనే పరిష్కరించుకుంటానని హూంకరించాడు. నరకంలో వున్న వాళ్ళలో కొందరికి ప్రమోషన్ ఇచ్చి భూలోకం పంపాలనుకున్నాడు. ఏ ఒక్కరూ ముందుకు రాలేదు. పోనీ కొందరినైనా ఏ చిన్న కారణం దొరికినా గట్టి రికమెండేషన్ తో స్వర్గానికి తోసేసి స్వర్గం తెరిపిస్తే కొంతరద్దీ తగ్గుతుందనుకున్నాడు. ఆలోచన వచ్చిందే తడువుగా ఒక పదిరోజులు చిత్రగుప్తుడితో సహా రాత్రింబగళ్ళు శ్రమపడి అన్ని కేసులూ వివరంగా చదివాడు. లాభంలేకపోయింది. ఒకటీ అరా దొరికినాయిగానీ, ఈ ఒకళ్ళిద్దరి కోసం రికమండ్ చేస్తే తమ ప్రపోజల్ వీగి పోతుందనుకున్నాడు. అందులోనూ పెట్టిన అప్లకేషన్ కే దిక్కూ దివాణం లేదయ్యే.

ఇంక ఇదికాదు పని అని చిత్రగుప్తునితో బాగా ఆలోచించినమీదట, నరకంలోని పాపులందరితో ఒక సమావేశం ఏర్పాటు చేశాడు. భూలోకానికి వెళ్ళేవాళ్ళని లక్షాధికారుల ఇళ్ళల్లో పుట్టిస్తానన్నాడు. మంత్రి పదవులిప్పిస్తానన్నాడు. కానీ జీవులంతాఏకమై కన్నుమూసి తెరిచేసరికి పదిమంది మంత్రులు మారుతున్నారు. లక్షాధికారులు భిక్షాధికారులవుతున్నారు. మేం వెళ్ళం పొమ్మన్నారు. అతిలోక సుందరుల రూపమిస్తానని ఆశపెట్టాడు. మామూలు ఆడవాళ్ళనే పదిమందిముందు రోడ్డుమీద నానాగోలా చేస్తుంటే పట్టించుకునే దిక్కులేదు .ఆ సంఘంలో ఇంక ఈ సౌందర్యంతో మేమవస్తలు పడలేము స్వామీ అన్నారు. అయినా భూలోకంలో పెద్దపెద్దవాళ్ళంతా ప్రపంచాన్ని స్వర్గంగామారుస్తామని కడుపునిండా తిండి, ఒంటినిండా బట్ట దొరుకుతుందనీ, ఇలా ఎన్నెన్నో ఆశలు పెడితే నమ్మి నమ్మి విసుగొచ్చింది. స్వర్గం కాదుకదా కనీసం నరకంలో వున్న ప్రశాంతత కూడా లేదక్కడ. ఇంక ఏ ఆశలకూ లొంగం పొమ్మన్నారు.

వీళ్ళు చాలా ఆరితేరిన ఘటాలు, ఇలా లొంగరనుకుని ఎవరూ లేకుండాచూసి ఒక్కొక్కళ్ళనీ పిలిచి బాబ్బాబు అని కాళ్ళూ గడ్డాలూ పట్టుకున్నంత పనిచేశాడు. లాభంలేకపోయింది. యముడుకి చిర్రెత్తుకొచ్చింది. నా అంతటివాణ్ణి ఇలా బతిమాలుతుంటే ఇంత విర్రవీగుతారా అని ఇంక భయపెట్టటం ప్రారంభించాడు. సలసల కాగే నూనెలో వేయిస్తాాననీ, అగ్ని స్తంభాలకు అంటగడతాననీ బెదిరించాడు. ఊహు, లాభంలేకపోయింది. పైగా నమ్రతగా యమధర్మరాజుకు యిలా విన్నవించారు.

ఆయ్యా, యముడుగారూ, తమరు మమ్మల్ని నూనెలో వేయిస్తారో, అగ్ని స్తంభాలకే కడతారో లేకపోతే నీరుగడ్డకట్టుకునే చల్లగాలిలో వదులుతారో అంతా మీ ఇష్టం, మేమేమీ అభ్యంతర పెట్టం కానీ మమ్మల్మి మాత్రం తిరిగి భూమి మీద పుట్టమనద్దు. అక్కడివాతావరణం ఏ క్షణంలో ఎలా వుంటుందో మీ బ్రహ్మగారికే అంతు పట్టటంలేదు. ఆ వాతావరణం తట్టుకోవటం ముందు మీరు చెప్పే బాధలు ఒక లెక్కలోవికావు. ఇంకా మామీద కోపం తీరకపోతే విషవాయువులు వదలండి. కావాలంటే కాలనాగులతో కాటు వేయించండి. ఒకసారి ఎటూ చచ్చాంకనుక చావంటే భయం లేదు. బాధంటారా? భూలోకంలో కల్తీ మందులూ, కల్తీ వస్తువులు తిని క్రమ క్రమంగా క్షీణిస్తూ, ఏ క్షణంలో చస్తామో తెలియక చస్తామనే భయంతో క్షణమొక యుగంగా గడపటంముందు ఇదో లెక్కా. అదీగాక మాకింకో భరోసా వుందండోయ్. ఇక్కడ పెరిగిపోయే జీవులను అదుపులో పెట్టటానికి మీ భృత్యులెటూ సరిపోరు. మీ కొలీగ్సందరూ ఎవరిగోలల్లోవాళ్ళుండటంవల్ల వాళ్ళవల్ల మీకే సహాయమూరాదు. అందుకని ఇవాళకాకపోతే రేపయినా మాలో కొందరిని మీ భృత్యులుగా తీసుకోకతప్పదు. అంటే కొంతకాలానికైనా మాకు నమ్మకంగా ఉద్యోగాలు దొరుకుతాయి. భూ లోకంలో ఏముందండీ ఎన్ని గవర్నమెంటులు మారినా ఎన్ని సంస్ధలు పెరిగినా నిరుద్యోగులకుమాత్రం దిక్కులేదు. అదీగాక మీరేమీ అనుకోకపోతే ఒక చిన్న సలహా. భూలోకంలో వస్తువుల ధరలు నక్షత్రాలంటుతున్నాయంటున్నారుకదా రేపో మాపో నరకం దాకా రావచ్చు. ఎటూ ధరలు మనదాకా వస్తాయి గనక, వచ్చిన తర్వాత మనల్మి దాటిపోలేవు కనుక మనకి వస్తువులన్నీ చౌకగా దొరుకుతాయి.

ఆయ్యా, ఒక సలహా ఎటూ విన్నారుకదా, రెండోదికూడా వినండి. అంతగా అయితే మాకో దోవ చూపించేదాకా వచ్చిన అభ్యర్ధులని క్యూలో నుంచోపెట్టండి. మా అందరికీ పొద్దున్నేలేచి కాఫీకి పాలకోసం దగ్గరనుంచీ, చివరకి వినోదంకోసంచూసే సినిమాదాకా క్యూలో నుంచోవటంఅలవాటే. అందుకని ఏమీ అనుకోము. పైగా అక్కడలాగాఇక్కడ ఉత్తచెయ్యి చూపించరుకనుక ఓపిగ్గా వైట్ చేస్తాము. ఇంకా కావాలంటే ఆ క్యూల్ని కంట్రోల్ చెయ్యటానికి మాలో కొందరిని నియమించండి. అంటూ సలహాలిచ్చారు.

మేము భూలోకానికి పోమని మూకుమ్మడిగా నినాదాలిచ్చారు. వీలుంటే సమ్మెకూడా చెయ్యటానికి సిధ్ధమయ్యారు.

ఈగోలతో పాపం యముడికి దిక్కు తోచటంలేదు.
(రంజని, ఎ.జి. ఆపీసు సాహితీ సమితి సంచికలో 1980 ల్లో ప్రచురించబడ్డ రచన ఇది.)

0 comments

Thursday, November 20, 2008

vyra yaatra - published in Andhra Bhoomi 20/11/2008

Thursday, November 20, 2008




0 comments