Friday, October 29, 2010

ఆడవారు జుట్టు విరబోసుకుని వుండకూడదా?

Friday, October 29, 2010



ఇదేం ప్రశ్న?  ఇప్పుడు ఎక్కడ చూసినా కనబడుతున్నదే అదికదా అంటారా?  నిజమే మరి.  జడవేసుకొమ్మంటే అమ్మాయిలకి పెద్ద అవమానం.  పల్లెటూరి గబ్బిలాయిలాగా ఏమిటంటారు.  శాస్త్రాలు, ఆధ్యాత్మిక గ్రంధాలు జుట్టు విరబోసుకోకూడదంటున్నాయి.  మనకి కనిపించని ఎన్నో భూత ప్రేత పిశాచాలు, దుష్టశక్తులు జుట్టుని ఆవహించే అవకాశంవుంది.  దానితో అలా విరబోసుకుని తిరిగేవారిలో, వారికే తెలియని అనేక మార్పులు సంభవిస్తాయి.   ముఖ్యంగా సాయంసమయంలో ఎన్నో దుష్ట శక్తులు ఆవహించే అవకాశం వుంది కనుక అసలు విరబోసుకుని వుండకూడదు.

 పురాణాలలో కూడా శపధం చేసినవారు, భర్త చనిపోయిన వారు, దుఃఖసాగరంలో మునిగినవారుఅలా విరబోసుకున్నట్లు చెప్పబడింది.  ఉదాహరణకి ద్రౌపది, కైక వగైరా. 

సైన్సు ప్రకారంకూడా అన్ని సమయాలలో జుట్టు విరబోసుకోకూడదు.  డాక్టర్లు ఆపరేషన్ చేసే సమయంలో జుట్టు ముడి వేసుకుని దాన్ని దేనితోనన్నా బంధించాలి.  ఆపరేషన్ ధియేటర్ లో జుట్టు పూర్తిగా కవర్ చేసుకుని వుండాలి.  జుట్టుకి రాలే గుణం వుంది.  ఆపరేషన్ ధియేటర్ లో జుట్టు రాలితే ఒక్కోసారి రోగికి ప్రాణాపాయంకూడా జరగవచ్చు. 

వంటచేసేటప్పుడు, భోజనం చేసేటప్పుడు తినే పదార్ధాలలో పడితే చాలా ప్రమాదం.   అలాగే దేవాలయాలలో పడితే వాటిని అపవిత్రం చేసినవాళ్ళమవుతాము.  మహా దోషం. 

పూర్వకాలంలో మనషుల స్ధాయినిబట్టి, ఎన్నోరకాల కేశాలంకరణలు చేసేవాళ్ళు.  మరి ఇప్పటి మన హైర్ స్టైలిస్ట్స్ కి అలాంటి విద్యలేమీ తెలియవా, పాపం మనవాళ్ళు ఏ సందర్భానికైనా విరబోసుకోవటమే ఫ్యాషన్ అనుకుంటున్నారు

(జీ తెలుగు ప్రసారం చేసిన గోపురం ఆధారంగా)



0 comments

Sunday, October 17, 2010

బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో

Sunday, October 17, 2010


దసరా నవరాత్రి  ఉత్సవాలలో బతుకమ్మని ఆటపాటలతో కొలవటం  తెలంగాణావారి సంప్రదాయం.  కేవలం తెలంగాణావాసులేకాదు, ఇతర ప్రాంతాలలో  కూడా కొందరు ఈ ఉత్సవం చేస్తారు. 

భాద్రపద బహుళ అమావాస్య రోజున బతుకమ్మనిపెట్టి నవరాత్రులు తొమ్మిది రోజులూ అమ్మవారిని కొలుస్తారు.  మన పూర్వీకులు పాటించిన ఆచార వ్యవహారాలకు, మన పండగలకు, వాతావరణ మార్పులకు అవినాభావ సంబంధం వుంది.  ఆశ్వీయుజ మాసంలో వాతావరణ మార్పులవల్ల ఎవరైనా తొందరగా అనారోగ్య ప్రభావానికి గురి అయ్యే అవకాశం వున్నది.  అలా అనారోగ్య ప్రభావానికి లోనుకాకుండా, ముఖ్యంగా సుకుమారులైన స్త్రీల ఆరోగ్య పరిరక్షణకు ఏర్పరచిన ఉత్సవమిది.  ఔషధ గుణాలుకల తంగేడు, మోదుగ, మొదలగు అనేక రకాల పువ్వులను పేర్చి, పైన గౌరీ దేవిని పెట్టి పూజిస్తారు.  ఈ పూవులనుంచి వచ్చే ఔషధ గుణాలుకల  సువాసనలవలన అనేక రోగాలు నివారింపబడతాయి.

ఇప్పుడైతే ఈ పువ్వులను చాలా చోట్ల మార్కెట్ లో కొనుక్కుంటున్నారు కానీ పూర్వం చుట్టపక్కలవున్న చెట్లనుంచి ఈ పువ్వులను సేకరించేవారు.  తోటల్లో, చెట్లమధ్య, తోటివారితో కలిసి పువ్వులు సేకరిస్తుంటే అతివల మనసులు ఆనంద భరితమై మనసుకి ప్రశాంతత చేకూరేది. 

సాయంకాలం అందరూ ఒకచోట చేరికలిసి పాడుతూ బతుకమ్మలచుట్టూ చేరి ఆడుతుంటే ఆ స్త్రీలలో ఎనలేని ఉత్సాహం సమకూరుతుంది.  ఆరోగ్యపరంగానే కాదు సామాజికంగా అందరూ ఒకచోట చేరి, కలిసి మెలిసి వుండటానికి అవకాశమున్న ఈ బతుకమ్మ పండుగ పాటల సాహిత్యం ఏ రచయితో రాసినది కాదు.  జీవితంలో ఎదుర్కొనే ఆటుపోట్లనుంచి, అనుభవాలనుంచి ఉద్భవించినదే.  జీవితంలో ఎదుర్కొనే ఎన్నో ఒడుదుడుకులు, వాటినధిగమించి తమ జీవితాలని ఎలా చక్కదిద్దుకోవాలనే జీవిత సత్యాలే  ఈ బతుకమ్మ పాటలుగా రూపొందాయి.  

స్త్రీలని పువ్వులతో పోలుస్తారు.  సున్నిత మనస్కులైన వారి జీవితాలు  పూవులలాగే  సుగంధాలు వెదజల్లుతూ వారు సంతోషంగా  వుండి వారి కుటుంబంలో వారి జీవితాలు కూడా సంతోషమయం చెయ్యాలని వారిని చల్లగా బతుకమ్మా అని అశీర్వదిస్తూ చేసే ఈ వేడుకలు నవరాత్రుల సమయంలోనే చెయ్యటంలో ఇంకో అర్ధంకూడా వున్నది.  స్త్రీ పువ్వులా సుకుమారంగా వుండటమేకాదు, అవసరమైతే ఆదిశక్తిలా దుష్టులను దునుమాడాలి... ఆపద సమయంలో  శక్తి, యుక్తులు ప్రదర్శించి విజయం సాధించాలి.

ఆరోగ్యపరంగా, సామాజికంగానేకాక, జీవిత సత్యాలను నేర్పే  ఈ బతుకమ్మ వేడుకలు మా శ్రీ కృష్ణా నగర్ లో కూడా మైత్రీ మహిళా మండలి అధ్యక్షురాలు శ్రీమతి మల్లీశ్వరిగారి ఆధ్వర్యంలో చాలా సందడిగా జరిగాయి.  ఆ ఫోటోలు మీరూ చూడండి.




0 comments

Thursday, October 7, 2010

దేవీ నవరాత్రులలో అమ్మవారి నైవేద్యాలు

Thursday, October 7, 2010


మొదటి రోజు      --    పాడ్యమి       --   కట్టు పొంగలి, లేదా పులగం

రెండవ రోజు        --    విదియ        --   పులిహోర

మూడవ రోజు      --     తదియ       --  కొబ్బరి పాయసం లేదా కొబ్బరి అన్నం

నాల్గవ రోజు         --     చవితి         --    చిల్లులేని గారెలు లేదా మినప సున్ని వుండలు

ఐదవ రోజు          --    పంచమి     --     దద్దోజనం లేదా పెరుగు గారెలు

ఆరవ రోజు           --      షష్టి          --     కేసరి బాత్ లేదా పెసరపప్పు పునుగులు

ఏడవ రోజు           --      సప్తమి      --      శాకాన్నం లేదా కలగూర పులుసు అన్నం

ఎనిమిదవ రోజు      --       అష్టమి     --      చక్కెర పొంగలి లేదా బెల్లంతో పాయసం

తొమ్మిదవ రోజు      --       నవమి      --      క్షీరాన్నం లేదా పాల హల్వా

పదవ రోజు            --       దశమి      --      పులిహోర మరియు లడ్లు     


ఈనైవేద్యాలుగానీ, అమ్మవారి అవతారాలుగానీ కొన్ని వర్గాలవారి మధ్య కొంచెం తేడాలుంటాయి.  అందుకని కొత్తగా చేసేవారు ఏది చెయ్యాలి అని కంగారు పడకుండా వారి ఇంట్లో పధ్ధతి ప్రకారం చేసుకోవటం ఉత్తమం.  అది తెలియదనుకోండి, మీకు ఇబ్బంది లేకుండా, వున్న సమయమంతా ప్రసాదాలు తయారుచెయ్యటంతో గడపకుండా, మీరు ఏది చెయ్యగలిగితే అదే చెయ్యండి.  అమ్మవారు ఏదైనా స్వీకరిస్తుంది.  పూజలో భక్తే ముఖ్యం.

కొందరు ఇవన్నీ పట్టించుకోకుండా ఒక స్వీటు, ఒక హాటు అని చేసుకుంటారు.  కొందరు అమ్మవారు ఉగ్ర రూపిణి, అందుకని ఆవిడని శాంతపరిచే పదార్ధాలే చెయ్యాలని స్వీట్సే చేస్తారు. కొందరు ఉదయంనుంచి ఉపవాసం వుండి రాత్రికి పూజ అయ్యాక భోజనం చేస్తారు.  అలా వుండలేనివారు ఉదయం భోజనం చేస్తారు.   

భగవంతుడు భక్తితో చేసిన ఏ పూజ అయినా, మనస్పూర్తిగా పెట్టిన ఏ నైవేద్యమైనా స్వీకరిస్తాడు.  అందుకని ఎవరికి వీలైన పధ్ధతిలో వారు అమ్మవారిని సేవించి తరించండి.

అందరికీ దసరా శుభాకాంక్షలు.



0 comments

మహాలయ అమావాస్య విశేషమేమిటి? ఆ రోజు నిర్వహించాల్సిన కార్యక్రమాలు ఏమిటి?



భాద్రపద బహుళ అమావాస్యని మహాలయ అమావాస్య అంటారు.  చనిపోయినవారందరి స్మృతికోసం చేసే ఈ అమావాస్యను సర్వ పితృ అమావాస్య అని కూడా అంటారు.  చనిపోయిన తమ పెద్దల జ్ఞాపకార్ధం ఏ కులం వారైనా, ఏ మతం వారైనా, ఏ వర్గం వారైనా పాటించే  కార్యక్రమం ఇది.   ప్రపంచ వ్యాప్తంగా అందరికీ ఈ పితృ స్మరణ రోజు ప్రత్యేకంగావున్నది.  క్రిస్టియన్స్ ఆల్ ఫాదర్స్ డే రోజున ఈ కార్యక్రమం చేస్తారు..   ఒక్కో సంవత్సరంలో ఒక్కో నెలలో, ఒక్కో రోజు వస్తుంది ఈ ఆల్ ఫాదర్స్ డే.  అలాగే ముస్లిమ్స్ మొహరం పాటిస్తారు.  హిందువులు తర్పణలు వదులుతారు.  కొందరు పెద్దలకి బియ్యమిస్తారు.

ఏ జాతి వారైనా, ఏ కులం వారైనా, వాళ్ళెక్కడవున్నా, వారి వారి సంప్రదాయాన్నిబట్టి, ఇంటి ఆచారాల్నిబట్టి,    వాళ్ల వాళ్ల అనుకూలతనుబట్టి పితృ దేవతలను సంస్మరించుకునే రోజు ఇది.  లేకపోతే రౌరవాది నరకాలకి పోతారంటారు.  ఈ కార్యక్రమంలో కేవలం చనిపోయిన తండ్రి, తల్లులనే కాదు వారి ముందు ఇంకో రెండు తరాల వారిని కూడా సంస్మరిస్తారు అంటే తండ్రి, తాత (తండ్రి తండ్రి), ముత్తాత (తాత తండ్రి), అలాగే తల్లి, నానమ్మ (తల్లి అత్తగారు), ఆవిడ అత్తగారు. 


ఇంక ఆరోజు నిర్వహించవలసిన కార్యక్రమాల గురించి శాస్త్రాల్లో వివరించారు ప్రత్యామ్నాయాలతోసహా.  వారి వారి ఆచారాలూ, పధ్ధతుల ప్రకారం విధి విధానంగా వాటిని పాటించటం ఉత్కృష్టం.  ఆ రోజు  పెద్దలకు తర్పణలు వదలాలి.  వారిని తలచుకుని బ్రాహ్మణులకు భోజనం పెట్టాలి.  అలాగే పేదలకు అన్నదానం చేయాలి.  వీలుకానివారు ఇద్దరు వ్యక్తులకు భోజనం తయారు చేసుకోవటానికి సరిపడే అన్ని వస్తువులూ, బియ్యం, ఉప్పు, పప్పు, కూరలు,  నూనెతో సహా అన్నీ పెద్దల పేరు తలచుకుంటూ ఉచితమైన వ్యక్తులకి ఇవ్వాలి.    వారి పేరున శక్తి కొలదీ దాన ధర్మాలు చెయ్యాలి.

ఈ రోజుల్లో బ్రతికివున్న తల్లిదండ్రులనే పట్టించుకోని సంతానం, వారిని పలకరించటానికి కూడా తీరికలేని సంతానం చాలామందే వున్నారు.  వారంతా తమని తమ తల్లిదండ్రులు ఎంత ప్రేమతో పెంచారో అంతకన్నా ఎక్కువ ప్రేమ, ఆప్యాయతలు వారి వృధ్ధాప్యంలో వారిపట్ల చూపించాలి.  అలాగే వారి తదనంతరం వారు పోయిన రోజేకాక ఈ మహాలయ అమావాస్యనాడుకూడా, వారి వారి ఆచారాల ప్రకారం, వారి ఇంటి పధ్ధతుల ప్రకారం తల్లి దండ్రులను స్మరించుకోవాలి.

(జీ తెలుగు ప్రసారం చేసిన గోపురం ఆధారంగా)

0 comments