Monday, July 4, 2011

వంశపారంపర్యంగా అనుభవించే శాపాలుంటాయా

Monday, July 4, 2011


కొన్ని శాపాలు వంశపారంపర్యంగా అనుభవిస్తారంటారు. అలాంటివున్నాయా అంటే వున్నాయనే శాస్త్రాలు చెబుతున్నాయి. ఏడు తరాలవరకూ ఆ శాపాలననుభవిస్తారుట. అవేమిటంటే దేవ శాపం, సర్ప శాపం, ఋషి శాపం, మాతృ శాపం, పితృ శాపం. వీటిని వంశానుక్రమంగా కొన్ని తరాలవారు అనుభవించాలి.

సర్ప శాపం ఎలా వస్తుందంటే కొందరు నాగుపాములను చంపుతుంటారు. నాగు పాములను చంపకూడదు. కొందరు పుట్టలు తొలిగించి ఇళ్ళుకట్టటం వగైరా చేస్తారు. తెలిసీ, తెలియక పుట్టల సమీపంలో మూత్ర విసర్జన చేసినా, ఋతు సమయంలోని మైల బట్టలు పాములు దాటినా ఈ శాపాలు ప్రాప్తిస్తాయి.

ఋషి ఋణం ..ఋషులు, సిధ్ధులు లోక క్షేమంకోసం తపస్సు చేసే మహా పురుషులు అనేకులుంటారు. వారికి ఎటువంటి హాని తెలిసిగానీ తెలియకగానీ కలిగించినా ఋషిశాపగ్రస్తులవుతారు.

దేవశాపం .. గుడికి ఏ విధమైన హాని తలపెట్టినా, ఆలయంలోని వస్తువులనుగానీ ధనాన్నిగానీ అపహరించినా దైవశాపం తప్పదు.

మాతృ శాపం చిన్న విషయంకాదు. తల్లి ఎల్లప్పుడూ శిశువు క్షేమంకోసం తపిస్తూంటుంది. అలాంటి తల్లి తన బిడ్డలు తనపట్ల ఏ ద్రోహం చేసినా శపించదు. ఏ వయసులోనైనా తలిలిదండ్రులను గౌరవించాలి. కొందరు తల్లిదండ్రులను సరిగ్గ చూడరు. తమ సర్వస్వాన్నీ త్యాగంచేసి పిల్లలని వృధ్ధిలోకి తీసుకు వస్తే వారి వృధ్ధాప్యంలో వారి ఆస్తులను తీసుకుని వారిని బయటకు వెళ్ళగొట్టే బిడ్డలూ వున్నారు. ఏ సందర్భంలోనూ తల్లిదండ్రులు పిల్లలని తిట్టరు. వారికి అవసరమైనప్పుడు చేయూతనివ్వకపోతే వారి ఆవేదన వీరికి శాపమవుతుంది. బాధాతప్త హృదయంతో వాళ్ళు పెట్టుకునే కన్నీళ్ళు, పిల్లలను తిట్టకపోయినా, పిల్లలపాలిటి శాపాలవుతాయి. పితృ శాపం కూడా ఇంతే. పిల్లలు తల్లిదండ్రులను ఏ సమయంలోనూ కష్టపెట్టకూడదు. తల్లిదండ్రులు కూడా తాము సత్ఫ్రవర్తనాపరులై, పిల్లలకుకూడా చిన్నప్పటినుంచే సత్ప్రవర్తన నేర్పాలి.

పై దోషాలవల్ల వచ్చే శాపాలు ఏడుతరాలవారు అనుభవిస్తారంటారు.

(జీ తెలుగు ప్రసారం చేసిన గోపురం ఆధారంగా)



7 comments

Friday, July 1, 2011

కొంటె కోణాలు - 14

Friday, July 1, 2011

హమ్మయ్య! శాపం పెట్టేశాను!!


ఈ పోటీ ప్రపంచంలో ప్రకటనలకున్న ప్రాముఖ్యం తెలియనివాళ్ళుండరుకదా. రోడ్లమీద, టీవీలలో, ఫోన్లల్లో ఎక్కడబడితేఅక్కడే ఈ ప్రకటనల హోరు తప్పించుకోవటానికి సామాన్య మానవుడు పడే ఇబ్బంది కూడా సామాన్యులమయినమనందరికీ తెలిసిందే.


అయితే ఈటీవీ అంతఃపురం సీరియల్ లో ప్రముఖ ఆడ దుష్టపాత్ర మృణాళినికి కూడా ఈ ప్రకటనల హోరు తప్పలేదు. పైగా ఇలాంటి దుష్టులనెదుర్కోవటానికి మామూలువాళ్ళు పనికిరారని ఈటీవీవారు ప్రముఖ సినీ గాయకుడుయస్.పీ.బాల సుబ్రహ్మణ్యం గారినే తీసుకొచ్చేశారు ఆవిడని ప్రకటనలతో హోరెత్తించటానికి… యస్.పీ.బాలసుబ్రహ్మణ్యంగారు ఈ అవతారం కూడా ఎత్తారా? ఎలగెలగెలాగంటారా?? చెబుతున్నానుగా……

1-7-2011 ఈటీవీ లో పగలు 3-00 గం. లనుంచీ 3-30 దాకా వచ్చే అంతఃపురం సీరియల్ చూసినవాళ్ళు గమనించేవుంటారు. మృణాళిని కాబోయే కోడలు రూపతో కలిసి జమీందారుని మాటలతో చిత్రవధ చేస్తున్న సమయంలో ఫోన్మోగుతుంది. ఆవిడ ఫోన్ ఎత్తగానే మాట్లాడిందెవరో తెలుసా!!??


టీవీవాళ్ళు యాదృఛ్ఛకంగా ఆవిడ ఫోన్ ఎత్తగానే వాణిజ్య ప్రకటనలకోసం సీరియల్ ఆపి నాకీ కొంటెకోణానికి అవకాశంఇచ్చారు. ఆవిడ ఫోన్ ఎత్తగానే తెరమీద శ్రీ యస్.పీ. బాలసుబ్రహ్మణ్యంగారు ప్రత్యక్షమయి .. “ పాడుతా తీయగా కొత్తస్వరాలకు స్వాగతం .. మీ వయసు 16 నుంచీ 24 మధ్యనా అయితే ఈటీవీ కల్పిస్తోంది మీకు సువర్ణావకాశం” .. అంటూమొదలెట్టారండీ.


ఇప్పుడు నవ్వక పోయినా ఈమారు అలాంటివి చూస్తే ఈ కొంటెకోణమే గుర్తొస్తుందిలెండి మీకు. ఇది నా శాపం.


0 comments

Friday, June 10, 2011

గోపురంలో పొరబాటా?

Friday, June 10, 2011

9-6-2011 ఉదయం జీ తెలుగు ప్రసారం చేసిన గోపురం కార్యక్రమంలో చిన్న పొరబాటు దొర్లింది. పొరబాట్లు ఎవరికైనా సహజం..దానినంత ఎత్తి చూపించాలా అనంటారా? వాళ్ళకన్నా నాకేదో బ్రహ్మాండంగా తెలుసనో, లేక వాళ్ళ తప్పుని ఎత్తి చూపించే అత్యుత్సాహంతోనో నేనిది రాయటంలేదు.

ఈ మధ్య టీవీలోవచ్చే ఇలాంటి కార్యక్రమాలపట్ల యువత చాలా ఉత్సాహం చూపిస్తోంది. చదువుకునే సమయంలో ఇలాంటివి నేర్చుకునే సమయం దొరకక మన సంస్కృతికి దూరమైనవారు, ఉద్యోగాలలో స్ధిరపడి దూరప్రాంతాలలో వుండి స్వదేశం, మన సంస్కృతివైపు మొగ్గుచూపుతూ ఈ మాధ్యమాలద్వారా అనేక విషయాలు తెలుసుకుంటున్నారు. దానికి ఉదాహరణ నా ఈ బ్లాగే. గోపురంలో నేను విని, నాకు నచ్చిన విశేషాలను పోస్టు చేస్తే దానికి స్పందన చాలా బాగుంటున్నది. అలాంటివారికోసమే ఈ తప్పు సవరించి నాకు తెలిసిన విషయం చెబుతున్నాను. వారు సరైన విషయం తెలుసుకోవాలనే అభిలాషతో మాత్రమే.

నిన్న కార్యక్రమంలో భగవంతునికి వస్త్రాలు సమర్పించే విషయంగురించి చెబుతూ, పూజలో భగవంతునికి నూతన వస్త్రాలు సమర్పించటానికి అవకాశం లేనప్పుడు పత్తితో చేసిన వస్త్రయుగ్మం సమర్పిస్తారని చెబుతూ, దానిని పత్తితో పొడుగుగా చేస్తూ మధ్య మధ్యలో గంధం, పసుపులతో పత్తిని నలిపి సన్నగా చేస్తారని చెప్పారు. నాకు తెలిసి దానిని యజ్ఞోపవీతమనీ, కొందరు, కంఠాభరణమనీ అంటారు. వస్త్రాలంటే పత్తితో గుండ్రంగా చేసి గంధం, కుంకుమ అద్దుతారు. వీటిని భగవంతునికి రెండు సమర్పిస్తారు. వస్త్రం ఒక్కటి ఇవ్వకూడదు. వస్త్రయుగ్మం సమర్పించాలి.

ఈ విషయంలో నాది పొరబాటయితే విజ్ఞులు సవరించాలని కోరుతున్నాను.


2 comments

Tuesday, May 10, 2011

పిల్లల పేరుమీద పూజ చెయ్యకూడదా?

Tuesday, May 10, 2011

12 సంవత్సరములలోపు పిల్లలకి తల్లి దోషాలే వారికీ వర్తిస్తాయి. కనుక భగవదనుగ్రహం కోసం పూజలు చేసేటప్పుడు సంకల్పంలో వారి యజమాని అయిన తండ్రి పేరు, గోత్రం వగైరా చెప్పి, సకుటుంబస్య అంటే సరిపోతుంది, అందరి పేర్లూ ప్రత్యేకించి చెప్పక్కరలేదు అంటారు కొందరు.

కానీ ప్రత్యేక సందర్భాలలో, పిల్లల పేర్లమీద కూడా పూజలు చెయ్యవలసి వస్తుంది. 12 సంవత్సరముల వరకూ తల్లిదండ్రుల దోషాలే వాళ్ళకీ వర్తిస్తాయనటం సరైనది కాదు. కొందరు పిల్లలు తరచూ అనారాగ్యంపాలుకావచ్చు, కొందరు సరిగ్గా చదవలేకపోవచ్చు, కొందరికి చదివింది జ్ఞాపకం వుండకపోవచ్చు, కొందరికి మాటలు సరిగ్గా రాకపోవచ్చు, కొందరికి బాలారిష్టాలు, రకరకాల సమస్యలు, మరణంతో సమానమైన అవస్తలు, గండాలు, అపమృత్యు దోషాలు వుండచ్చు. ఇలాంటి ప్రత్యేక సందర్భాల దోష నివారణార్ధం జరిగే ప్రత్యేక పూజలు ఎవరికోసం జరుగుతూంటే వారి పేరుమీదే చెయ్యాలి.. వారు పసి పిల్లలయినా సరే.

పిల్లలకి ప్రతి నిత్యం దైవ ప్రార్ధన అలవాటు చెయ్యాలి. నిద్ర లేవగానే, స్నానం చెయ్యగానే, బయటకు వెళ్ళేటప్పుడు, దైవ ప్రార్ధన అలవాటు చేస్తే, వయసుతోబాటు దైవ భక్తి, నిశ్చల తత్వం అలవడి పెద్దవారవుతున్నకొద్దీ ఏమైనా సమస్యలు ఎదురైనా భయపడక ధైర్యంగా ఎదుర్కోవటం నేర్చుకుంటారు.

ప్రత్యేక సమస్యల నివారణకోసం చేసే పూజలు ఎవరికోసం చేస్తుంటే వారి పేరుమీదే చెయ్యాలి. కొంచెం పెద్ద పిల్లలు స్వయంగా చేసుకోగలిగినవి వారిచేత చేయించవచ్చు, లేకపోతే వారి తరఫున పెద్దలు వారి పేరుమీద చెయ్యవచ్చు.

(జీ తెలుగు ప్రసారం చేసిన గోపురం ఆధారంగా)



1 comments

Monday, May 2, 2011

కొంటె కోణాలు – 13

Monday, May 2, 2011

కడపా? కపడా!??


ఇవాళ కడప పేరును మార్చారు మీకు తెలుసా? అధికారికంగా కాదులెండి..యన్టీవీ వారు మాత్రమే ఈ పని చేసినట్లు కనబడుతోంది. 2-5-11 ఉదయం లైవ్ షో విత్ కేయస్ఆర్ కార్యక్రమంలో కింద స్క్రోలింగ్ లో కడపని కపడ గా మార్చారు.

ఇలాంటివి ఈ మధ్య టీవీ స్క్రోలింగ్స్ లో సామాన్యమయిపోయినయి. తెలుగు సరిగ్గా రానివాళ్ళివి చూసి, .. చూసీ, చూసీ, తెలుగు బాగా వచ్చినవాళ్ళుకూడా ఈ తెలుగే సరియైనదని అనుకునే అవకాశం వుంది. సామెత వూరికే రాలేదుకదండీ .. తినగ తినగ వేము తియ్యగనుండు అని… అందుకే తెలుగు భాషాభిమానులు ఎవరైనా పూనుకుని టీవీ ఛానల్స్ వాళ్ళకి సరైన తెలుగు నేర్పేస్తే పోలా!!

అయినా బడాయికాకపోతే స్క్రోలింగ్ ఎంత హడావిడిలో రాసినా వెంటనే ఒకసారి చూసుకుంటే రాసినవారికి సమయం లేకపోతే .. పోనీ, ఇంకొకరెవరైనా వెంటనే చదివితే వారికీ సమయం ఆదా అవుతుంది, సదరు తెలుగు ఛానల్స్ సరైన తెలుగు ప్రసారం చేయగలుగుతారు.. కదా!? ..


0 comments