Thursday, February 24, 2011

గుడికి వెళ్ళగానే, గుడినుంచి బయటకొచ్చాక కాళ్ళు కడుక్కోవాలా?

Thursday, February 24, 2011


ఆలయానికి వెళ్ళినప్పుడు సాధారణంగా అందరం కాళ్ళు కడుక్కుని ఆలయం లోపలకి వెళ్తాము. ఇది మంచి పధ్ధతే. మనం బయటనుంచి వచ్చాం కనుక దుమ్ము ధూళి కాళ్ళతో వచ్చే అవకాశం వున్నదిగనుక, కాళ్ళు, చేతులు కడుక్కుని పరిశుభ్రంగా ఆలయంలోకి వెళ్ళటం ఆలయ పరిశుభ్రానికీ, అక్కడికి వచ్చేవారి ఆరోగ్యానికీ మంచిది.

అయితే కొందరు శనీశ్వరుడికీ, నవగ్రహాలకీ ప్రదక్షిణ చేసినప్పుడు వెంటనే హడావిడిగా కాళ్ళు కడుక్కుంటారు. ప్రదక్షిణలు చేసి శని పీడ వదిలించుకొచ్చాము…ఒక్క క్షణం కాళ్ళు కడుక్కోవటం ఆలస్యం చేస్తే శని మళ్ళీ ఎక్కడ పట్టుకుంటాడోనని హడావిడిగా కాళ్ళు కడుక్కొస్తారు. కొందరయితే శనీశ్వరుణ్ణి సరిగ్గా చూడనుకూడా చూడరు. ఎక్కడ పట్టుకుంటాడోనని భయం. ప్రదక్షిణ చేసినందుకే శని పట్టుకుంటే పాపం ఆలయంలో వుండే పూజారి నిత్యం స్వామి విగ్రహాన్ని కడిగి, శుభ్రం చేసి, పూజలుచేసే పూజారికి మాట ఏమిటి శనీశ్వరుడిని పీడగా భావించకూడదు. శని ఈశ్వర స్వరూపం. మన పూర్వ జన్మ కర్మ బాగుండనప్పుడు, మనం చేసే తప్పులకు శిక్ష, శని దశ వచ్చినప్పుడు అనుభవించక తప్పదు. అంటే మనం చేసే తప్పులకు శిక్ష విధించేవాడు శని.

శనిని వదుల్చుకోవాలని చూసేవాళ్ళకి మన శరీరంలోనే శని వుంటాడని తెలుసా? మన తల వెంట్రుకలలో శని వుంటాడు. కనుబొమలకి శని కారకుడు. ఇవి లేకుండా మనిషికి అందం వుండదు. అంటే మనిషికి అందాన్నిచేవాడు శని. కంటిలో కార్నియాకు శని కారకుడు. శని వుంటాడు కార్నియా వద్దంటే మన కంటి చూపు శరీరంలో సన్నటి నరాలకు, ఇంతెందుకు మన ఆయుష్కారకుడు శని. అలాంటి శనీశ్వరుణ్ణి దర్శించిన తర్వాత ఏదో పీడని వదిలించుకోవాలన్నట్లు కాళ్ళు కడుక్కోవటం, దేవుణ్ణి చూడకుండా గబగబా ప్రదక్షిణలు చెయ్యటం సరైన పనేనా?

మనం ముడుచుకుని ఇంట్లో కూర్చున్నా మన కర్మ శేషాన్ని అనుభవించక తప్పదు. శనీశ్వరుడు నమస్కరించదగినవాడు. పూజించ దగిన వాడు. ఆయనకి భయపడటం, కాళ్ళు కడుక్కోవటం మూఢనమ్మకమే.


4 comments

Tuesday, February 22, 2011

లలితా సహస్రనామం చేసిన తర్వాత అమ్మవారికి ఏమి నైవేద్యం పెట్టాలి?

Tuesday, February 22, 2011

చాలామందికి ఈ సందేహం వుంది. కొందరు లలితా సహస్రనామ పారాయణ ప్రతి నిత్యం చేస్తుంటారు. కొందరు రెండు పూటలా చేస్తారు. కొందరు ప్రత్యేక దినాలలో…ఇలా రకరకాలుగా…ఈ మధ్య లలితా సహస్రనామ పారాయణ చేసేవారి సంఖ్య ఎక్కువైందనే చెప్పొచ్చు. వీరిలో కొందరికి మామూలుగా నిత్యం మహా నైవేద్యం పెట్టే అలవాటు వుంటుంది. ఇలాంటివారికి ఏ సమస్యాలేదు. కొందరికి ఇంట్లో మడిగాగానీ, నిష్టగాగానీ చెయ్యటం కుదరదు. ఒక్కొక్కళ్లకి ఒక్కో రకం ఇబ్బంది. ఇలాంటివారికి లలితా సహస్రనామం పారాయణ చేసినప్పుడు అనేక అనుమానాలు..మహా నైవేద్యం పెట్టలేక పోయామే..అసలు అమ్మవారికి ఏం నైవేద్యం పెట్టాలి..ఏదో ఇవాళ ఒక పండు పెట్టేశాను..సరిగ్గా చేశానో లేదో…ఇలా గుంజాటన పడతారు. అందరికీ మహా నైవేద్యం పెట్టటం అన్నివేళలా కుదరకపోవచ్చు. నిత్యం పారాయణ చేసేవారు తొందరగా అయ్యేది ఏదైనా చేసి పెట్టవచ్చు. అమ్మవారిని హరిద్రాన్నైక రసికా అని కీర్తిస్తాం. పెసర పప్పు వేసిన పులగం నైవేద్యం పెట్టవచ్చు. అదీ కుదరకపోతే కర్జూర పండు నైవేద్యం పెడితే మహా నైవేద్యం పెట్టినట్లేట. ఒక్కొక్కసారి అవి కూడా వీలు పడకపోవచ్చు..సమయానికి దొరకక, తెచ్చినవి అయిపోయి వగైరా ఏ కారణ వల్లనైనా. అప్పుడు వీలయితే ఆవుపాలలో, లేదా ఇంట్లో వుండే పాలల్లో తేనె కలిపి నైవేద్యం పెట్టవచ్చు. అందుబాటులో వున్న ఏ పండయినా నైవేద్యం పెట్టవచ్చు. అమ్మవారికి కావలసినది భక్తికానీ ఏమి పెట్టాము అన్నది కాదు. మనం నిండు మనసుతో భక్తిగా ఏదైనా సమర్పించవచ్చు.

కొన్ని ప్రత్యేక కార్యక్రమాలు వుంటాయి. చంద్ర దోష పరిహారార్ధం కొందరు పౌర్ణమినాడు చంద్రుని లలితా పరమేశ్వరి రూపంలో పూజించి, ఆరుబయట చంద్ర కిరణాలు పడే చోట పూజ చేసి పాలు, బెల్లంతో చేసిన పరవాణ్ణం నైవేద్యం పెట్టి అందరికీ పెట్టి వారు తింటారు. అలాగే నవరాత్రులలో అమ్మవారిని పూజించేవారు మినప గారెలు తప్పనిసరిగా నైవేద్యం పెడతారు. శుక్రవారం నియమంగా పారాయణ చేసేవారు అమ్మ గుడాన్నప్రీత మానస కనుక బెల్లం వేసిన పరనాణ్ణం నైవేద్యం పెడతారు.

నిత్యపారాయణకి వీలయితే ఏమైనా చెయ్యవచ్చు..వీలు కానప్పుడు భక్తిగా ఏది సమర్పించినా పరవాలేదు.

(జీ తెలుగు ప్రసారం చేసిన గోపురం ఆధారంగా)

మనలో మాట

ఈ సందర్భంలో మా నాన్నగారికీ నాకూమధ్య జరిగిన సంఘటన ఒకటిగుర్తొస్తోంది. మా నాన్నగారొకటేఅనేవారు. నువ్వు తినేది ఏదైనాదేవుడికి పెట్టవచ్చు. అయితే దేవుడికిపెట్టింది ఏదీ పారవెయ్యద్దు అనేవారు. అంటే కొబ్బరిగాయ కొడితే లోపలకొబ్బరి తీసి పెట్టాలి..మరి మనమాపెంకులు తినలేముకదా. ఒకసారి నేనుదానిమ్మ పండు పెట్టటం చూశారు. వలిచి పెట్టకపోయినావా అందులో అన్నిగింజలూ బాగా వుండకపోవచ్చుకదాఅన్నారు. మనమేం తక్కువతిన్నామా..నేను దేవుడికి ముందేచెప్పేశాను..నా హడావిడి సంగతి నీకుతెలుసుకదా..ఈ పండులో మంచిగింజలే తిను బాగాలేనివి వదిలెయ్యిస్వామీ అని..అదే అంటే మా నాన్నగారుఫక్కున నవ్వి మీ దేవుడేం దానిమ్మపండే పెట్టమని అడగలేదుకదా..ఏఅరటి పండో, పాలో పెట్టు, నీకువలవటానికి తక్కువ టైముపడుతుంది, ఒక్క నిముషంలో దాన్నితినేసికూడా వెళ్ళచ్చు అన్నారు. నిజమేగా!


6 comments