స్పెషల్ ఉండ్రాళ్ళు
అప్పుడు నాకు 16 ఏళ్ళు. అప్పటికే మా అమ్మ పోవటం, మా అక్క పెళ్ళయ్యి హైదరాబాదు వచ్చెయ్యటం, నేను మళ్ళీ హైదరాబాదులో ఉద్యోగంలో చేరటం జరిగింది. ఉద్యోగం హైదరాబాదులో అయినా మనసంతా విజయవాడలో వున్న నాన్న, చెల్లెళ్ళ మీదే వుండేది. ఏ పండగలు వచ్చినా ఒక రోజుకైనా విజయవాడ వెళ్ళి ఏదో ఒక హడావిడి చేసొచ్చేదాన్ని వాళ్ళు బెంగ పెట్టుకోకూడదని. అలాగే వినాయక చవితికి కూడా వెళ్ళాను.
నాకప్పటికి వంట రాదు. అమ్మమ్మ లేనప్పుడు మా నాన్నగారు వంట చేసే వారు. మరి వినాయక చవితి అంటే ఉండ్రాళ్లు చెయ్యాలి కదా. నాన్నగారికీ అవి చెయ్యటం రాక కొబ్బరి కాయతో సంతృప్తి చెందుతాడులే దేవుడు అన్నారు. కానీ నేనుండగా నా చెల్లెళ్ళు ఉండ్రాళ్లు లేకుండా వినాయకుడికి పూజ చెయ్యటమా. నాకు పౌరుషం వచ్చేసింది. పైగా అమ్మమ్మ ఊరెళ్తూ బియ్యం రవ్వ తయారుచేసి పెట్టింది. ఆ మాత్రం ఉండ్రాళ్ళు చెయ్యలేనా. వెంటనే వెనకింటి కాళికాంబ పిన్నిగారి దగ్గరకెళ్ళి ఉండ్రాళ్ళ ప్రాసెస్ అంతా కనుక్కొచ్చాను. పిన్నిగారు చెప్పిన విషయాలన్నీ అతి శ్రధ్ధగా గుర్తు పెట్టుకుని ఉండ్రాళ్ళు తయారు చేశాను. చూడటానికి చాలా బాగా వచ్చాయి. పూజ, నైవేద్యం అయ్యాయి. భోజనాలలో ఉండ్రాళ్ళు ముందు నాన్నగారే తిన్నారు. ఎలా వున్నాయి అని ఆత్రంగా అడిగాను. మా నాన్నగారు మహానుభావులు. ఏది చేసినా బాగుందనేవారు. బాగున్నాయి..కొంచెం ఉప్పు తక్కువయిందేమో అన్నారు. అదేంటి వీటిలో ఉప్పు వేస్తారా పిన్నిగారు నాకు చెప్పలేదే అన్నాను చటుక్కున. మరి ఆవిడ చెప్పింది అంతా అంత శ్రధ్ధగా గుర్తు పెట్టుకుని చేసిన నాకు ఆవిడ ఉప్పు వెయ్యమని చెప్తే వెయ్యనా.
కాళికాంబ పిన్నిగారు తర్వాత అడిగారు ఉండ్రాళ్ళు చేశావా ఎలా వచ్చాయి అని. జరిగిన విషయం చెప్పాను. అరే నేనూ తర్వాత అనుకున్నాను..ఉప్పు వెయ్యమని చెప్పలేదేఅని, తర్వాత పూజ హడావిడిలోపడి మర్చిపోయాను అన్నారు. ఆరోజు నేను చేసిన ఉండ్రాళ్ళ గురించి చెప్పుకుని చాలా సేపు నవ్వుకున్నాం. దానితోబాటు తల్లిలేని పిల్లలతో ఆయన ఎన్ని అవస్తలు పడుతున్నారో సానుభూతులు కూడా.
అప్పటినుంచీ వినాయక చవితి వస్తే చాలు ఆ రోజంతా కళ్ళముందు తిరుగుతుంది. మా మరిది గోపీ కూడా ప్రతి వినాయకచవితికీ తప్పనిసరిగా అడుగుతారు ఉండ్రాళ్ళల్లో ఉప్పువేశారా అని. కాళికాంబగారు వాళ్ళ చుట్టాలు మరి.
చాలా ఏళ్ళ తర్వాత మొన్నీమధ్య కాళికాంబగారు కలిసినప్పుడు కూడా అడిగారు..ఇంతకీ ఉండ్రాళ్ళల్లో ఉప్పు వేస్తున్నావా లేదా అని.
మరి ఇన్నేళ్ళ తర్వాత కూడా ఇంతమందికి గుర్తున్న నేను చేసిన ఉప్పలేని ఉండ్రాళ్ళు సూపర్ అంటారా...అనక పోతే చెప్పండి మీకు కూడా ఉప్పులేని ఉండ్రాళ్ళు చేసి పెట్టేస్తా.