ఈ మారు మదర్స్ డే న నాకో అద్భుతమైన బహుమానం
వచ్చింది. అదేమిటో ఎవరైనా ఊహించగలరా ఆద్భుతమైన రంగుల కలయికతో, అపురూపమైన
డిజైన్లతో కూడిన చీనీ చీనాంబరాలు కాదండీ.
నక్షత్రాలకన్నా అందంగా మెరిసే వజ్రాల వడ్డాణం కానే కాదు. దేశదేశాలనుంచీ తెప్పించిన పసందైన
పిండివంటలంతకన్నాకాదు. నాకు ప్రధాన మంత్రి
పదవి అస్సలే కాదు. సరే. మీరెవరూ గెస్ చెయ్యలేదు కదా. నేనే చెప్పేస్తాను.
మదర్స్ డే తోబాటు అమెరికాలో వుంటున్న మా అమ్మాయి
చి. దీప్తి మాకు తెలియనివ్వకుండా వచ్చి మమ్మల్ని అద్భుతమైన సంభ్రమాశ్చర్యాలలో
ముంచెత్తింది. ఇంకో వారం తర్వాత
వస్తుందనుకున్న తను అనుకోకుండా మదర్స్ డేన రావటంకన్నా అద్భుతమైన మదర్స్ డే గిఫ్ట్ నాకు
ఇంకేముంటుంది. అర్ధరాత్రి 1-30 కి ఫ్రెండ్ బర్త్డే పార్టీ అని
వెళ్ళిన మా అబ్బాయి వస్తే నిద్ర మెలకువ వచ్చింది.
వెనకే వాడి ఫ్రండ్ క్రాంతి.
నిద్రమత్తులో కళ్ళు మూసుకోబోతుండగా మావారి అనుమానం అక్కడెవరూ అని. మా వాడి ఫ్రెండే అయ్యుంటారు, ఎవరా అని మూతలు
పడుతున్న కళ్ళు చించుకుంటూ....ఎవరూ? బాగా
పరిచయమయినవాళ్ళే! అరే!! తను...తను...నా పాపాయే!!!. అరె...పాపాయ్!!!! ఒక్కసారి లేచి నుంచున్నాను. పాపాయ్...కలా...నిజమా...హేపీ మదర్స్ డే అంటున్న
పాపాయిని ఒక్క వుదుటున అమ్మ ప్రేమతో ముంచెత్తాను.
ముందునుంచీ మాకు ఈ నెల 16 వ తారీకున వస్తానని
చెబుతోంది. మా అబ్బాయికూడా దానికి వంత పాడుతున్నాడు. వాళ్ళకి తెలుసు. కానీ మాకు సర్ ప్రైజ్ ఇవ్వాలని వేరే రోజు
వస్తున్నట్లు చెప్పారు. ఆ రోజు ఎప్పుడొస్తుందా అని ప్రతి రోజూ
ఎదురుచూస్తూ, ఆ రోజు తను ఈ టైముకు ఇక్కడ
వుంటుంది అని ముందునుంచీ తన రాకని
వూహిస్తూ, తనకోసం ఏం చెయ్యాలో ఆలోచిస్తూ, ఓహ్...ఇంకో వారం రోజులు మాకా ఎదురు
చూపులు తప్పించింది.
నిద్ర మత్తులో మదర్స్ డే తొలి ఘడియలలో కళ్ళు
తెరిచిన తల్లికి ఎన్నో వేలమైళ్ళ దూరాన వున్న కూతురు అనుకోకుండా కళ్ళ ఎదురుగా
కనబడితే అంతకన్నా విలువైనా, అపురూపమైన, అద్భుతమైన బహుమానం ఎక్కడ వుంటుంది. ఏ వజ్రాల రాసులు ఈ అద్భుతమైన బహుమతికి సరి
తూగుతాయి. మీరే చెప్పండి.
అప్పుడే రాసిన ఈ పోస్టును మీతో పంచుకోవటానికి
ఇంతకాలం పట్టింది మా పిల్లల సందడివల్లే.