Wednesday, August 11, 2010

నరకం చూసొచ్చాను

Wednesday, August 11, 2010


 నిఝంగా నిజమండీ.  3 నెలలు నరకంలో వుండి ఇప్పుడిప్పుడే బయటకొస్తున్నా.  పాపం అక్కడ నా గోల భరించలేక యమధర్మరాజుగారు త్వరగా పంపించారనీ, లేకపోతే ఈతరహాలో నరకానికి వెళ్ళేవాళ్ళు ఏళ్ళ తరబడి అక్కడే వుంటారనీ కొందరి ఉవాచ.  ఏమిటీ అర్ధంకాని గోల సరిగ్గా అఘోరించు అంటారా 

3 నెలలుగా కాళ్ళు నేలమీద పెట్టాలంటే నిప్పులమీద పెట్టినట్లు భరించలేని మంటలు,  కన్ను మూసి తెరిచేలోగా అరికాళ్ళల్లో,  పక్కలనా అంగుళం పైన పగుళ్లు, చాలా లోతుగా, కొన్ని రక్తం కారుతూ, ఎలా వస్తున్నాయో తెలియదు, ఎందుకు వస్తున్నాయో తెలియదు.  పాదాలలో కాలిన బొబ్బల్లా రావటం, అవి పగలటం.  ఎంత భయంకరమో అనుభవిస్తేనే తెలుస్తుంది.  అడుగు తీసి అడుగు వెయ్యలేను.  ఇదే సమయంలో శ్రీవారికి మీటిగుల హడావిడి.  పగలంతా ఇంట్లో ఒక్కదాన్ని.  ఎవరొచ్చినా తలుపు తియ్యాలన్నా నా నరక బాధలు నాకన్నా ముందు రెడీ. 

పాదాలు చాలవన్నట్లు ఆ పగుళ్ళు అరి చేతుల్లోనూ రావటం మొదలయ్యాయి.  ఏమీ పట్టుకోలేను, తిన లేను, ఏ పనీ చెయ్యలేను.   పదేళ్ళనుంచీ ఇంగ్లీషు మందు వాడటంలేదు.  హెర్బల్ మెడిసన్ శ్రీ యోగానంద్ గారి దగ్గరే.  ముందు మామూలు పగుళ్ళే అని అశ్రధ్ధ చేసి దాదాపు నెల తర్వాత ఆయన దగ్గరే మందు వాడటం మొదలు పెట్టాను. 

మందు మరగ కాచి, దానిలో వేరే పదార్ధాలు కలిపి రోజుకు నాలుగు సార్లు తీసుకోవాలి.  పై పూతకి వేరే మందు నువ్వుల  నూనె లో కలిపి రాయాలి.  ఆ నూనె, మందు, బాధ చికాకుతో కాళ్ళు ఇంకో కుర్చీలో జాపి అలాగే కూర్చునేదాన్ని.  ఏక్టివ్ గా తిరిగే దానికి రోజుల తరబడి అలా ఒకే చోట కదలకుండా వుండటంకన్నా నరకం వుంటుందా.  అందరి దిష్టికొట్టి ఇలా మూలనబడ్డానా అనే ఒక నమ్మలేని అనుమానం.

పగుళ్ళు తగ్గితే పాత అట్టముక్కల్లా చర్మం పెచ్చులూడి వచ్చేసేది.  ఇంతలో ఇంకో చోట పగుళ్ళు.  అరికాళ్ళల్లో పొట్టు లేచి పోవటం, ఎన్ని పొరల చర్మం వూడి పోయిందో.... ఇవీ సరిపోవని ఒళ్ళంతా రేష్, దురద.  అసలు మామూలు మనిషినవుతానా అని అనుమానం.  ఓహ్.  చెప్పటం చేత కావటంలేదు.  చాలా తక్కువ చెప్పాను.

పుండుమీద కారం జల్లినట్లు నెట్ లో చూస్తే ఇవి ఎందుకు వస్తున్నాయో తెలియదనీ, వస్తే తొందరగా తగ్గవనీ, మళ్ళీ మళ్ళీ వస్తాయనీ  తెలిసింది.  ఇంకో వార్త మా బంధువులలో ఒకరు 4 ఏళ్ళనించీ, ఇంకొకరు ఏడాది పైనుంచీ  ఈ బాధ పడుతున్నారనీ,  ఇంకా తగ్గలేదనీ, వాళ్ళు ఇంగ్లీషు మెడిసన్ వాడుతున్నారనీ తెలిసింది.  అందుకే ఒకసారి ఈ నరకంలోకి వెళ్ళినవాళ్ళు తొందరగా బయటకి రారని అన్నది.

నాకు శ్రీ యోగానంద్ గారి మీద వున్న నమ్మకం వల్ల నా అంతటనేను ఇంకొక డాక్టరు దగ్గరకు వెళ్ళలేదు.  నా బాధ తట్టుకోలేక నా శాయ శక్తులా ఆయన్ని హింసించాను.  నాలాంటివాళ్ళని ఎంతమందినో చూసుంటారాయన.  చలించలేదు.  తగ్గుతుంది అనే భరోసా మానలేదు.  అలాగే ఒక వారం రోజుల నుంచి మంటలు తగ్గటం మొదలయ్యాయి.  పగుళ్ళు కూడా తక్కువ లోతులో రావటం, తొందరగా తగ్గటం జరగుతోంది.  ఒంటినిండా వచ్చిన రేష్ పూర్తిగా తగ్గింది.  దాని మచ్చలు తగ్గాలి ఇంకా.

ఇవి ఒకసారి వస్తే మళ్ళీ మళ్ళీ వస్తూనే వుంటాయిట.  చూద్దాం మరి.  అసలు తగ్గటడం మొదలయింది కదా,  సాంతం తగ్గుతాయనే భరోసా శ్రీ యోగనంద్ గారిచ్చారయ్యే.   ఇంట్లో నడుస్తుంటే కొంచెం ధైర్యం వచ్చింది.  శ్రీమతి మాలా కుమార్ ఫోన్ చేసి మరీ ప్రమదావనం సందడి వినిపించి  స్ధైర్యాన్నిచ్చారు.  ఇంతకాలం కంప్యూటర్ తెరవాలన్నా విసుగనిపించింది.  కానీ ఇవాళ నా అవస్ధ అందరితో పంచుకోవాలనిపించింది.  అంటే నా బాధ చెప్పాలని కాదు.  ఎవరికైనా ఇలాంటి బాధ ఎదురయితే (ఇప్పుడు భగవంతుడు నాకు ప్రత్యక్షమై వరం కోరుకోమంటే, ఈ బాధని ప్రపంచంలోంచే తీసెయ్యమని కోరుకుంటాను....కనుక ఎవరికీ ఇది రాకూడదు) అశ్రధ్ధ చెయ్యకుండా వెంటనే తగు జాగ్రత్తలు తీసుకోండి. 

ముందు నాకు అర్జంటుగా తగ్గి, అంతకన్నా అర్జంటుగా నా యాత్రలు మొదలెట్టాలని  కోరుకోండి.

15 comments