ఆలయానికి వెళ్ళినప్పుడు సాధారణంగా అందరం కాళ్ళు కడుక్కుని ఆలయం లోపలకి వెళ్తాము. ఇది మంచి పధ్ధతే. మనం బయటనుంచి వచ్చాం కనుక దుమ్ము ధూళి కాళ్ళతో వచ్చే అవకాశం వున్నదిగనుక, కాళ్ళు, చేతులు కడుక్కుని పరిశుభ్రంగా ఆలయంలోకి వెళ్ళటం ఆలయ పరిశుభ్రానికీ, అక్కడికి వచ్చేవారి ఆరోగ్యానికీ మంచిది.
అయితే కొందరు శనీశ్వరుడికీ, నవగ్రహాలకీ ప్రదక్షిణ చేసినప్పుడు వెంటనే హడావిడిగా కాళ్ళు కడుక్కుంటారు. ప్రదక్షిణలు చేసి శని పీడ వదిలించుకొచ్చాము…ఒక్క క్షణం కాళ్ళు కడుక్కోవటం ఆలస్యం చేస్తే శని మళ్ళీ ఎక్కడ పట్టుకుంటాడోనని హడావిడిగా కాళ్ళు కడుక్కొస్తారు. కొందరయితే శనీశ్వరుణ్ణి సరిగ్గా చూడనుకూడా చూడరు. ఎక్కడ పట్టుకుంటాడోనని భయం. ప్రదక్షిణ చేసినందుకే శని పట్టుకుంటే పాపం ఆలయంలో వుండే పూజారి నిత్యం స్వామి విగ్రహాన్ని కడిగి, శుభ్రం చేసి, పూజలుచేసే పూజారికి మాట ఏమిటి శనీశ్వరుడిని పీడగా భావించకూడదు. శని ఈశ్వర స్వరూపం. మన పూర్వ జన్మ కర్మ బాగుండనప్పుడు, మనం చేసే తప్పులకు శిక్ష, శని దశ వచ్చినప్పుడు అనుభవించక తప్పదు. అంటే మనం చేసే తప్పులకు శిక్ష విధించేవాడు శని.
శనిని వదుల్చుకోవాలని చూసేవాళ్ళకి మన శరీరంలోనే శని వుంటాడని తెలుసా? మన తల వెంట్రుకలలో శని వుంటాడు. కనుబొమలకి శని కారకుడు. ఇవి లేకుండా మనిషికి అందం వుండదు. అంటే మనిషికి అందాన్నిచేవాడు శని. కంటిలో కార్నియాకు శని కారకుడు. శని వుంటాడు కార్నియా వద్దంటే మన కంటి చూపు శరీరంలో సన్నటి నరాలకు, ఇంతెందుకు మన ఆయుష్కారకుడు శని. అలాంటి శనీశ్వరుణ్ణి దర్శించిన తర్వాత ఏదో పీడని వదిలించుకోవాలన్నట్లు కాళ్ళు కడుక్కోవటం, దేవుణ్ణి చూడకుండా గబగబా ప్రదక్షిణలు చెయ్యటం సరైన పనేనా?
మనం ముడుచుకుని ఇంట్లో కూర్చున్నా మన కర్మ శేషాన్ని అనుభవించక తప్పదు. శనీశ్వరుడు నమస్కరించదగినవాడు. పూజించ దగిన వాడు. ఆయనకి భయపడటం, కాళ్ళు కడుక్కోవటం మూఢనమ్మకమే.