Sunday, April 3, 2011

బర్త్ డే గిఫ్ట్ - వరల్డ్ కప్

Sunday, April 3, 2011

బర్త్ డే గిఫ్ట్ - వరల్డ్ కప్

ఏప్రిల్ 2 మాకూ, మా అబ్బాయి తేజస్వికీ ఒక విశేషమైన రోజు. రోజు వాడి పుట్టిన రోజు మరి. సరే పుట్టిన రోజంటే కుటుంబ సభ్యులతో, స్నేహితులతో సరదాలూ, సందళ్ళూ మామూలే. మారు పుట్టిన రోజుమాత్రం ఎన్నడూ మరచిపోలేని రోజు. భారత క్రికెట్ జట్టు వరల్డ్ కప్ సాధించిన రోజు.

అసలింతకీ మాకందరీకీ కూడా మరచిపోలేని రోజెలాగయిందో చెప్పద్దూ.


మా అమ్మాయి దీప్తి వెకేషన్ కి వచ్చింది ఏప్రిల్ 1 వ తారీకున (ఈ విషయంలో మిమ్మల్ని ఏప్రిల్ ఫూల్ చెయ్యనుగా..నిజంగానే). వచ్చిన రోజే అక్కగారినీ(మమ్మల్నికూడాననుకోండి) వెంట పెట్టుకునెళ్ళి మా అబ్బాయి బైక్ కొనుక్కున్నాడు…బజాజ్ ఎవెంజర్. పుట్టిన రోజున వాడికి వాడు ఇచ్చుకున్న కానుక అది.

అర్ధరాత్రి 12 గం. లనుంచీ బర్త్ డే సెలబ్రేషన్స్ మొదలు. ఈ యూత్ కి మిడ్ నైట్ సెలబ్రేషన్సూ, బిర్యానీలు ఫ్యాషనయిపోయాయికదండీ. అందుకే అర్ధరాత్రి 12 గం.లకు కేక్ కటింగూ, ముఖానికి పూయింగూ. మంచి కేక్ నలా ముఖానికి పూసి వేస్ట్ చేస్తుంటే నాలాంటి వాళ్లకి బాధ. మళ్ళీ యూత్. ఏమీ అనకూడదు.

సరే ఆ బర్త్ డే సెలబ్రేషన్స్ మర్నాటికీ కంటిన్యూ అయ్యాయి. ఫ్రెండ్సూ, పార్టీలు ఇవ్వి మామూలే. ఇక్కడ మళ్ళీ యూత్ క్రేజీ సెలబ్రేషన్ ఎవరు కనిపెట్టారోగానీ..బర్త్ డే బాయ్ ని మోస్తూ తన్నుతారు. ఇదేం సరదానమ్మా విడ్డూరం కాకపోతే.


ఈ హడావిళ్ళమధ్య మొదలయింది అసలు హడావిడి. క్రికెట్ వరల్డ్ కప్ టోర్నమెంట్ లో ఫైనల్ మ్యాచ్ .. ఇండియా-శ్రీలంక మధ్య. ఇండియా ఫైనల్ కొచ్చేసరికి ఇండియాలో అందరికీ తెగ ఉత్సాహం వచ్చేసి వాళ్ళని తెగ సపోర్టు చెయ్యటం మొదలెట్టారు. స్పోర్టివ్ స్పిరిట్ తో దేశం తరఫున ఆడే ఒక టీమ్ కి ఇలా సపోర్టు చెయ్యటం బాగుంది..అందరూ ఉత్సాహం పుంజుకునేలా వుంది. వీళ్ళందరూ కలిసి జెండాలు తీసుకుని రోడ్లన్నీ తిరిగారు..ఇండియా..ఇండియా అని అరుచుకుంటూ.


మేచ్ మొదలయింది. కమాన్ ఇండియా యూ కెన్ డూ ఇట్ అరుపులతో ఇల్లు దద్దరిల్లింది.

ఇది కూడా బాగానే వుంది. ఇలాగన్నా యూత్ కి పాజిటివ్ సజెషన్స్ అలవాటవుతాయి అనుకున్నా. మధ్యలో ఆట శ్రీలంక వైపెళ్తోందా అనే అనుమానం..కొంత నిరుత్సాహం..ఆందోళనా.. ఆందోళన మరచిపోదామని మా అమ్మాయి ఎటన్నా వెళదామనటం..పాపం..అది చాలా నిరుత్సాహ పడింది. ఆటకోసమే అంత దూరంనుంచి రాకపోయినా, అవకాశాన్ని సద్వినియోగం చేసుకుందామని..అందరితో ఉత్సాహంగా ఆట చూద్దామని ఆశ పడ్డది. ఇంతలో మళ్ళీ మార్పులు..క్షణ క్షణం ఉద్వేగ భరితం..అరుపులు, కేరింతలతో మారు మా కాలనీనే మారు మోగించారు మా వాళ్ళు.

మొత్తానికి ఇండియా గెలిచింది.

అప్పుడెప్పుడో మావాడు పుట్టకముందు ఇండియా ఒకసారి వరల్డ్ కప్ గెలిచింది. మళ్ళీ ఇన్నాళ్ళకి..అదీ వాడి బర్త్ డే న. వాడి ఫ్రెండ్సంతా నీ బర్త్ డే గిఫ్ట్ వరల్డ్ కప్ రా అంటూహుషారు చేశారు. అంతా కలిసి అర్జంటుగా టాంక్ బండ్ కి పరిగెత్తారు.

అందుకని రోజు మరచిపోలేము..పదిహేనుమందిమి కలసి హోరెక్కిస్తూ గేమ్ చూడటంకూడా మేమిదే మొదటిసారి..అందుకని మాకు మరచిపోలేని రోజు. మావాడి ఫ్రెండ్స్..ప్రీతి, శరత్ లు అమెరికాలో వుంటారు. మొన్న మార్చి 20 తారీకున వాళ్ళ పెళ్ళయింది. వాళ్ళు కూడా మాతో కలిశారు. వాళ్ళుకూడా అంత దూరంనుంచి వచ్చిందెందుకు ఇండియాని గెలిపించటానికే..ఇండియా..ఇండియా అంటూ చాలా సరదాగా గడిపి వెళ్ళేటప్పుడు ప్రీతి చెప్పింది..ఇండియాని ఇంత సపోర్టు చేసి గెలిపించాం ఆంటీ..ఇవాళ మరచిపోలేము అని.

నాకొకటిమాత్రం బాగా నచ్చింది..ఈ యూనిటీ అన్ని విషయాల్లో చూపిస్తే..ఈ ఆట మీద చూపించిన శ్రధ్ధ మనమీద, మన చుట్టుపక్కలవారిమీద, మన దేశం మీద చూపిస్తే ఇండియాని మించిన దేశం వుంటుందా!!??



0 comments