రాంబాబు – కధాన్వేషణ
రాంబాబు పదోసారి నొక్కుల్లేని క్రాఫ్ ని కష్టపడి వేజలైన్ రాసి నొక్కుల జుట్టుగా కనిపించేట్లు
దువ్వుకున్నాడు. అందమైన ఆడపిల్లలకి నొక్కుల జుట్టంటే అభిమానమని రాంబాబు నమ్మకం. అద్దంలో దూరంనుంచి, దగ్గరనుంచి వివిధ భంగిమల్లో చూసుకుని, రైఠో రాంబాబూ, నీ ముందు వందమంది సినిమా హీరోలయినా దిగదుడుపే అని తనని తను మెచ్చుకుని, తల కదిపితే నొక్కుల జుత్తు ఎక్కడ పాడవుతుందోనని మెడ బిగ పట్టుకుని రూమ్ లాక్ చేసి రోడ్డుమీదకొచ్చాడు, ‘మనిషి రోడ్డున పడ్డాడు’ అనుకుంటూ సినిమా పిచ్చి రాంబాబు.
అయితే ఇప్పుడు రాంబాబు వెళ్ళేది ఏ కొత్త తెలుగుసినిమాకి కాదండోయ్, అతను వెళ్ళేది అమ్మాయిల వేటకీ కాదు. అందమైన అమ్మాయిలు కనబడితే కొంచెం పోజిస్తాడంతేగానీ రాంబాబు చాలా బుధ్ధిమంతుడే. అమ్మాయిలంతా తను చాలా అందగాడనుకోవాలనీ, తనంత గొప్ప రచయిత ప్రపంచంలో లేడని అనుకోవాలనే సదుద్దేశ్యం తప్ప వేరే దురుద్దేశ్యం లేని మంచి బాలుడు.
రాంబాబు ఒక చిన్న సైజు రచయిత. చిన్న సైజంటే మనిషి కాదండీ బాబూ. రాంబాబుకేం ఇంచక్కా యద్దనవాడి సలోచనారాణి నవలల్లో నాయకుడిలా వుంటాడు. అతని కధలేవో ఒకటి రెండు, రెండు మూడు నెలలు బ్రతికిన పత్రికల్లో పడ్డాయి. అప్పటినుంచీ రాంబాబుకి తానో గొప్ప కధకుడననే విశ్వాసం. ఆ విశ్వాసంతోటే ఏదో ఒక నాటికి ఆఖిలాంధ్ర ప్రజానీకానికీ తానే అభిమాన రచయిత నవుతానని కలలుగంటున్నాడు – అదేదో సినిమాలోలా ‘ఆశ, అశ, అశ’ అని గొణిగే మనసును లెక్కచేయకుండా.
ప్రస్తుతం ఒక ప్రముఖ మాస పత్రిక నిర్వహిస్తున్న కధల పోటీకి ఒక మాంచి కధరాసి పంపాలని, మొదటి బహుమతి తనకే రావాలని ఆశించి, అంత మంచి కధ ప్లాటుకోసం వెతుక్కుంటూ రోడ్డున పడ్డాడు రాంబాబు. మనిషన్న తర్వాత ఆశ వుండకుండా వుండదు కదండీ. అయ్యో, మనం కబుర్లల్లో పడి రాంబాబు సంగతి మరచిపోయాం.
ఆ, అదిగో అక్కడ చౌరస్తాలో నుంచుని వచ్చే పోయే వాళ్ళని గమనిస్తున్నాడు శ్రధ్ధగా మన కధానాయకుడు. ఎందుకైనా మంచిదని విఘ్నేశ్వరుణ్ణి మనసులోనే ప్రార్ధించాడు మంచి ప్లాటు దొరికేట్లు చెయ్యమని.
ఇంతలో ఓ నలుగురు కాలేజీ అమ్మాయిలు రాంబాబుకి కొంచెం దూరంలో వచ్చి నుంచున్నారు. కాలేజీ అమ్మాయిల కధయితే పసందుగా వుంటుందని వాళ్ళవంక దొంగ చూపులు చూస్తూ వాళ్ళ సంభాషణ వినసాగాడు. అయితే పాపం ఎంత శ్రధ్ధగా విన్నా వాళ్ళే భాషలో మాట్లాడుకుంటున్నారో రాంబాబుకర్ధంకాలేదు. కాలేజీ అమ్మాయిలకంటూ ప్రత్యేకమైన భాష ఒహటుందా అనే డైలమాలో పడిపోయాడు కాసేపు అంతా అబ్బాయిలే వున్న కాలేజీలో చదివిన రాంబాబు. వాళ్ళందరి నోటినుంచి కామన్ గా వస్తున్న శబ్దాన్ని మాత్రం రీసెర్చి చేసి కనిపెట్టాడు మన బ్రిలియంట్ బాయ్. అదేమిటో మీకు తెలుసా తెలియదా అయితే రాంబాబునే అడుగుదాం. ‘యా’ జగదేకవీరుని కధ సినిమా వచ్చిన కొత్తల్లో ‘ హలా’ అని పలకరించుకున్నట్లు, ఇప్పడు ప్రతిదానికి ‘యా’ అనటం ఫేషన్ కాబోలు అనుకున్నాడు. క్షణక్షణానికీ మారుతున్న ఫాషన్లతో పరిగెట్టలేని మన హీరో మొత్తానికి అక్కడక్కడా అర్ధమయిన కాలేజీ అమ్మాయిల సంభాషణ సినిమాలమీద, ఫేషన్లమీద, మొగవాళ్ళని తిట్టటంమీద (మహిళా దశాబ్దం కాబోలు) తప్పితే వేరే లేదనీ, అందులో తన కధకు పనికివచ్చే బ్రహ్మాండమైన ప్లాటేమీలేదని గ్రహించేసరికి రాంబాబుకి నీరసం వచ్చి ఎదురుకుండా కన్పడ్డ హోటల్లోకెళ్ళాడు కాఫీ తాగుదామని.
ఆక్కడ దృశ్యాన్నిచూసి రాంబాబు హృదయం ద్రవీభవించింది. సర్వర్ చెయ్యిజారి కాఫీకప్పు ఒక సూట్ వాలా సూట్ మీద పడినట్లుంది పాపం. ఆ సూట్ వాలా మాత్రం ఏం చేస్తాడు. సూటంత నీట్ గా మనసట్టిపెట్టుకోవాలని తెలియక రెచ్చిపోయి ఇష్టమొచ్చినట్లు అరుస్తున్నాడు. మర్యాదస్తులకి అమర్యాద జరిగితే హోటల్ పేరెక్కడ పాడవుతుందోనని హోటల్ ప్రొప్రయిటర్ సూట్ వాలాకి నచ్చచెప్ప ప్రయత్నించి విఫలుడై, ఈ సర్వర్ కాకపోతే ఇంకొకడు దొరుకుతాడని సర్వర్ ని మెడపట్టి బయటగ్గెంటుతున్నాడు వుద్యోగం మానుకుని పొమ్మని.
రాంబాబు అర్జంటుగా ఆలోచనల్లోకి వెళ్ళిపోయాడు ఒక మూలగా టేబుల్ దగ్గర కూర్చుని. ఈ సంఘటన కధ రాస్తే ఎలా వుంటుంది? ‘ సంస్కారం లేని సంఘం’ అని పేరు పెట్టవచ్చు. అబ్బో పేరు మోతెక్కిపోతోంది. ఇంతకీ కధ ఎక్కడ మొదలు పెట్టాలి? కప్పు జారిన దగ్గరనుంచా? లేక సూట్ వాలా తిట్లతో మొదలు పెట్టి కప్పు జారి పడటం ఫ్లాష్ బాక్ లో చెప్తేనో – అమ్మో తనకి సినిమా రచయితల ఆలోచనలొచ్చేస్తున్నాయి. ఏమో ఎవరు చెప్పగలరు. ఏదో ఒక నాటికి రాంబాబు ది గ్రేట్ సినీ రైటర్ అయిపోతాడేమో. అప్పడు తనకెంత పేరు – టైటిల్స్ లో తనపేరు చూసుకోవచ్చు. తను రోడ్డుమీద వెళ్తుంటే ఈయనే ఫలానా సినిమాల రచయిత అని అంతా తనగురించే చెప్పుకుంటారు. ఒకవేళ కధకి మొదటి బహుమతి వస్తే ఇదే సినిమాగా తీస్తారేమో ఎవరు చెప్పగలరు. తన ఆలోచనలు ఎక్కడనుంచి ఎక్కడికి వెళ్ళాయో గమనించిన రాంబాబు ఒక్క క్షణం సిగ్గుపడిపోయాడు. మళ్ళీ కధ గురించి ఆలోచించడం మొదలుపెట్టాడు. తను హోటల్ లో ప్రవేశించడం దగ్గరనుంచి మొదలుపెడితేనో - తనకీ ఒక పాత్ర కల్పించుకోవచ్చు. అప్పుడు తనపేరు రాంబాబు అని రాసుకోవాలా లేకపోతే పేరు లేకుండా నేను అంటూ రాయాలా
అసలు ఆ సర్వర్ చెయ్యిజారి కప్పు కిందపడటానికి కారణం సర్వారాయుడి అశ్రధ్ధా? అతనా రోజు భోజనంచేసి వుండడా? ఇంటి దగ్గరున్న ఏ జబ్బు తల్లి గురించో తండ్రి గురించో ఆలోచిస్తున్నాడా ? అదీ ఇదీగాక పిల్లాడి పాలడబ్బా గురించి వర్రీ అవుతున్నాడా? అదయ్యుండదు. ఎందుకంటే అతనికి పట్టుమని పధ్ధెనిమిదేళ్ళుకూడా వున్నట్టులేవు. అర్ధగంట ఆలోచించినా ఏదీ తేల్చుకోలేకపోయాడు రాంబాబు. పోనీ ఇందులో ఏ కారణమయితే చదువరులకి ఆ సర్వర్ మీద జాలి కలుగుతుంది? అతన్నే అడగితే పోలా అసలు సంగతి. ఆలోచనల్లోంచి తేరుకుని చుట్టూ చూశాడు. సూట్ వాలా వెళ్ళిపోయాడు. సర్వారాయుడికీ ప్రొప్రయిటర్ కీ సంధి ఎలా జరిగిందోగానీ పక్క టేబుల్ దగ్గర వాళ్ళకి దోశ ఇస్తున్నాడు. అయ్యో, దొరికిన ప్లాట్ చేజారిపోయిందే అనుకుంటూ కాఫీతాగి బయటకొచ్చాడు రాంబాబు.
‘బాబూ, పసిగుడ్డుకి పాల్లేవండీ. ఒక్క పదిపైసలెయ్యండి బాబూ, దరమ పెబువులు’ ఒక నడి వయసు స్త్రీ చేటలో రోజుల పసిపిల్లని పెట్టుకుని రాంబాబు ముందు చెయ్యిజాపింది. పోనీ ఈ స్త్రీ గురించి కధ రాస్తే అనుకున్నాడు. అయినా ఆ పిల్లలు వాళ్ళ సొంత పిల్లలు కారుట. వాళ్ళను అద్దెకు తెస్తారుట. అంత జగజ్జంత్రీల కధ తనేం రాయగలడు. తన కధ అందంగా, సాఫీగా, చదువరులను సమ్మోహపరిచేదిగా, ఇంతకు ముందు ఎవ్వరూ రాయనిదిగా వుండాలి. బిచ్చగాళ్ళమీద ఇదివరకు చాలా కధలొచ్చాయి అనుకుంటూ ముందుకు సాగాడు. ఆలోచనల్లోపడ్డ రాంబాబు పైసలిచ్చే రకంగాదని గ్రహించిన ఆ బిచ్చగత్తె ఎప్పుడో ఇంకొకళ్ళ దగ్గరకెళ్ళింది.
కధ రసవత్తరంగా సాగాలంటే ప్రేమికుల కధ రాస్తేనో – ప్రేమికులు కలుసుకుంటే ఏం మాట్లాడుకుంటారో సినిమాల్లోలాగా ‘రాధా అందించు నీ లేత పెదవీ అని పాడుకుంటారా’ .....ఛీ పాడు మరీ అంత పబ్లిగ్గా పాడుకునే ప్రేమికులుకూడా వుంటారా ఒకవేళ వున్నా తనలాంటి కధల జోలికి పోకూడదు. మనసులోనే తీర్మానించుకున్నాడు.
పోనీ...కొత్తగా పెళ్ళయిన జంట కధ రాయాలంటే....హిహిహి....తనకేం తెలుస్తుంది ఏం రాయాలో.....ఆ....అయిడియా....ఇప్పుడు ఆడవాళ్ళంతా సమాన హక్కులు వగైరా నినాదాలేవో చాలా చేసేస్తున్నారుగా – వాళ్ళ గురించి ఏమైనా రాస్తే.....ఇంతకీ వాళ్ళక్కావాల్సిన సమాన హక్కులేమిటో ఉద్యోగాల్లోనా.. - ఆడవాళ్ళు ఇంటర్వ్యూకొస్తే మాకుద్యోగాలు దొరకటం లేదో అని గోల పెడుతున్నారు మెగవాళ్ళు. ఇంటి పెత్తనంలోనా.. అదెటూ వాళ్ళ రాజ్యమే – సినిమాలూ షికార్లల్లోనా .... ఈ మధ్య ఎక్కడ చూసినా ఆడవాళ్ళే. పెళ్ళిళ్ళల్లోనా ... ఈ మధ్య ప్రేమ పెళ్ళిళ్ళెక్కువయి పోయాయి. మరి వీళ్ళకున్న సమస్యలేమిటబ్బా.... వాళ్ళ సమస్యలేవో కనుక్కోవటానికి నేను ఆడపిల్లగా పుట్టాల్సి వచ్చేట్లుంది అనుకున్న రాంబాబుకి మనసు ధైర్యం చెప్పి ఓదార్చింది. రేపెటూ సెలవు పెట్టి వూరెళ్తున్నావు గదా చెల్లాయినడుగు వాళ్ళ సమస్యలేమిటో అని. దానికసలు తెలుసా నాకు చెప్పటానికి అనిపించినా వేరే మార్గంలేక కధ రాయటం తప్పనిసరిగా పోస్ట్ పోన్ చేసుకున్నాడు పాపం రాంబాబు.. .. తన చుట్టూ జరుగుతున్న సంఘటనల్లోనే అనేక ప్లాట్స్ వెతుక్కోవచ్చని తెలియని ది గ్రేట్ రైటర్.
(రంజని లో 1975---82 మధ్య ప్రచురించబడింది)