Sunday, November 7, 2010

హైదరాబాదులో ఆడ బ్లాగర్ల సమావేశం

Sunday, November 7, 2010


ఆడ బ్లాగర్లేమిటి సంధి సరిగ్గాలేదు, కూసింత వ్యాకరణం నేర్చుకోరాదా? అని కూకలేస్తున్నారా  వుండండి బాబూ.  అసలే నిన్నటినుంచీ నాకంతా అయోమయంగా వుంది.  ఆడాళ్ళంతా ఎక్కడోక్కడ ఒకరోజు కలుద్దామని ప్రమదావనంలో ముచ్చట మొదలయింది.   6 వ తారీకు జ్ఞాన ప్రసూన గారింట్లో కలుద్దామన్నారు.  ఏదో ఆడోళ్ళ మీటింగు కదా,  నాలుగు  సినిమాలగురించీ, చీరెలు, నగలగురించి కొత్త కొత్త ముచ్చట్లు విని ఓ నాలుగు మెతుకులు నంజి వద్దామని బయల్దేరుదామనుకున్నానో లేదో, మాలా కుమార్ గారి ఆహ్వానం, ఇద్దరం కలిసి వెళ్దాం రండి అని.

ఇద్దరం కలిసి ఉదయం 11-30కల్లా జ్ఞాన ప్రసూనగారింటికి చేరుకున్నాము.  ఆత్మీయమైన ఆహ్వానాన్ని అందుకుని కూర్చున్నామో లేదో.  శ్రీ లలితగారొచ్చారు.  మరి అందరొస్తుంటే కొంచెం సందడి చెయ్యాలికదా..అందుకే అందరి చేతా గుమ్మంలోనే పేరు చెప్పించి లోపలకి తీసుకొచ్చాను.  తర్వాత జ్యోతి, స్వాతి, సి. ఉమాదేవి, భవాని, లక్ష్మి వచ్చేశారు.  దీపావళి పండగ మర్నాడవ్వటంతో వూళ్ళకి వెళ్ళిన వాళ్లు కొందరు, వేరే కార్యక్రమాలవల్ల కొందరు శారీరకంగా రాలేకపోయినా, మానసికంగా మా దగ్గరే వున్నారు, వీళ్ళేం చేస్తున్నారో, ఏం కబుర్లు చెప్పుకుంటున్నారో మిస్ అయిపోతున్నామే అనుకుంటూ. 

ఉదయం 11-30 నుంచీ సాయంత్రం 5-30 దాకా జరిగిన ఈ మీటింగులో ఒక సినిమా గురించిగానీ, ఒక చీరె గురించిగాని, ఒక నగ గురించిగానీ ఒక్క ముచ్చటకూడారాలేదు.  ఇదెక్కడి ఆడోళ్ళ మీటింగో మరి.  ఆ ముచ్చట్లు ఆశించికూడా ఎవరూ రాలేదులెండి.  వాటి కధా కమామీషూ లేకుండా ఇంతసేపు నోరు ముయ్యకుండా మాట్లాడుకోగలరు నారీమణులు అని నిరూపించేశాము.  మరి మహిళా బ్లాగర్లా మజాకానా.

మాటల మధ్యలో భోజనాలు.  ఏం తిన్నామో, తాగామో చెప్పమంటారా స్ప్రైట్. నాన్, రుమాలీ రోటీ, చనా మసాలా, బగారా బైంగన్, కాకర కాయ చిప్స్, కొత్త వెరైటీ గోంగూర పులిహోర, అన్నం, పెసర పప్పు వామన చింతకాయలు కలిపి పచ్చడి, అద్భుతమైన సాంబారు, చింతకాయ పచ్చడి,  ఆవకాయ, ఇంకా మేము వేసుకోని పచ్చళ్ళు, పూర్ణంబూరెలు, రవ్వ లడ్డూలు, జంతికలు, గులాబ్ జామూన్, ఐస్ క్రీం, చివరాఖరికి టీ.. ఇవి ప్రస్తుతానికి గుర్తున్నవి.   భుక్తాయాసంలో పడి ఇంకేమైనా మర్చిపోయానేమో గుర్తుచెయ్యండర్ర్రా.  అన్నట్లు కార్తీకమాస శుభారంభానికి గుర్తుగా జ్ఞాన ప్రసూన గారు స్వయంగా పూర్ణం బూరెలు చెయ్యటమే కాక తాను తయారు చేసిన ఉసిరికాయ మురబ్బా కూడా తినిపించారు.  కార్తీక మాసంలో ఉసిరి తినాలంటారు.  మేము తినేశామోచ్.

జ్ఞాన ప్రసూన తను వేసిన రకరకాల పైంటింగ్స్, చేసిన పలురకాల చేతి పనులు చూపించారు. ఆసక్తి వుంటే వయసు, ఓపిక అడ్డురావని నిరూపించారు. 

ఇంతలో మలక్ పేట రౌడీగారి అమ్మగారొస్తున్నారన్నారు.  రౌడీగారి తల్లిగారు కదా తెలంగాణా శకుంతల టైపులో వస్తారేమోనని కాస్త సర్దుకు కూర్చున్నా ఎందుకైనా మంచిదని.  ప్రశాంతమైన సరస్వతీదేవిలా వచ్చేశారు ఆవిడ.  నాకేం రాయటం రాదండీ అన్న ఆవిడ శ్రీ భమిడిపాటి రామగోపాలంగారి పుస్తకంలో పొరపాట్లని ఆయనకే చెప్పి, ఆ పుస్తకం పునర్ముద్రణలో  ఆయనకే సహకరించిన రచయిత్రి.  డాక్టరేటు పొందిన విదుషీమణి.   అన్నీ వున్న విస్తరి సామెత  ఆవిడకి సరిగ్గా సరిపోతుందనుకున్నాను.

సమయంకూడా తెలియకుండా, ఒక్క నిముషంకూడా వృధా చెయ్యకుండా అంతసేపు గడిపి, 5-30 అయిందని ఇంటికి బయల్దేరాము.  జ్ఞాన ప్రసూనగారు అందరికీ పసుపు, కుంకుమ, పండు, బ్లౌజ్ పీస్ లే కాక అందమైన బహుమతులుకూడా ఇచ్చారు.  అంతేకాదు, మంచి పుస్తకాలు కూడా ఇచ్చారు వారు, వారి తండ్రిగారు రాసినవి.

అవ్వే కాకుండా ఇంకా కొన్ని  తినుబండారాలుకూడా మూటగట్టుకుని ఇంటికి చేరాము.  ఆహా ప్రమదావనం సభ్యుల అదృష్టమేమని చెప్పవచ్చు! జ్యోతి ప్రమదావనం పెట్టటంవలన కదా మనమంతా ఒకచోట చేరి ఊసులాడుకోవటం మొదలయింది,  హైదరాబాదులో వారందరం ఒకసారి కలుద్దామని ముందు మొదలు పెట్టింది అన్నపూర్ణ అనుకుంటా, వారివల్లకదా ఈ కార్యక్రమం మొదలయింది, మాలా కుమార్ ఎప్పుడోదాకా ఎందుకు 6వ తారీకు కలుద్దామనటంవల్లకదా ఇవాళ కలిసి ఇంత సంతోషంగా గడిపింది, అని వరలక్ష్మి వ్రత కధ టైప్ లో కబుర్లు చెప్పుకుంటూ, మాలా కుమార్, స్వాతి, నేను ఇంటికి తిరిగి వచ్చాము.

సో, హైదరాబాదు సోదరీమణులారా, ఇలాంటి మీటింగులకి రాకపోవటంవల్ల మీరేం  మిస్ అయ్యారో తెలిసిందా?  హమ్మయ్య.  ఈ మాటు మీటింగు పెడితే బుధ్ధిగా వచ్చెయ్యండి.




11 comments:

భావన said...

ఎందుకండి మమ్ములను అలా కుళ్ళు పడేట్లు చేస్తారు వివరాలు చెప్పి మరి. ఏమి చేస్తాము కానీయండీ ఈ సారికిలా. వెరీ నైస్ లక్ష్మి గారు.

రుక్మిణిదేవి said...

very nice lakshmi garu.... saradagaa anpinchindi.. names vraaste baagundedi evarevaro telisedi...successful ainanduku andariki congrats....

సి.ఉమాదేవి said...

అనుభూతులను అక్షరబద్ధంచేసి ఫోటోలతోపాటు కనులముందు నిలిపారు.చాలా బాగుంది లక్ష్మిగారు.

Unknown said...

భలే రాసారండి. మిస్ అయిన మా అందరికీ కూడా మీతో ఉన్నట్టుగా అనిపించింది మీరు రాసినది చదివితే. వంటలైతే.. అబ్బో నూరు ఊరిపోయింది.

మాలా కుమార్ said...

లక్ష్మి గారు ,
బాగా రాశారండి .
భావనా ,
పార్టీ విశేషాలు చూడగానే పరిగెత్తుకుంటూ వచ్చేసారా ? ఇన్నాళ్ళు ఎటోబోతిరి ?

psm.lakshmi said...

భావన, రుక్మిణీ దేవి, ఉమా దేవి, ప్రసీద, మాలా కుమార్
ధన్యవాదాలు. ఈ మారు అవకాశం వున్నవాళ్ళంతా మిస్ కాకుండా రావాలని అందరి కోరిక.
psmlakshmi

S said...

ఆ పుస్తకాలేమిటో - వాటి గురించి చెబుదురూ?
చక్రపాణి సినిమా చూశాక రావూరి గారి ఫ్యాన్ ఐపోయాను.

tejaswi manepalli said...

S garu,
Smt Jnana Prasuna is daughter of late Sri Ravuru Venkata Satyanarayana. She has given us ASHAMASHI written by late Sri Ravuru and published by Bhasha Kuteeram in 2000. In her foreword she has stated that previously it was published twice.
The other books are MAATALA PANDIRI written by Smt Jnana Prasuna and Unguturi Sri Laxmi and Sree Satyanarayana Vratak Kadha Gaanam by Smt. Jnana Prasuna.
psmlakshmi

Admin said...

Super Lakshmi garu

జయ said...

లక్ష్మి గారు, బాగున్నాయండి విశేషాలు. ఫొటోలు కూడా బాగున్నాయి. ఇంకా కొన్ని ఫొటోలు చూడాలని, విషయాలు వినాలని ఉంది.

psm.lakshmi said...

thank you P. Lakshmi garu

జయగారూ
ఆశ దోశ అప్పడం వడ అన్నీ మేము చెప్పెయ్యటమేనా ఈ మారు మీరూ వచ్చి సందడి చెయ్యండి.
psmlakshmi