Thursday, December 23, 2010

లక్ష్మీదేవి తలపై వుండకూడదంటారు. నిజమేనా?

Thursday, December 23, 2010


నిజమే.  అయితే  పెద్దలు చెప్పిన ప్రతిమాటకీ  మనం మాటల అర్ధమేకాక ఆ మాటలకంతర్లీనంగా వున్న అసలు అర్ధం కూడా తెలుసుకుంటే బాగుంటుంది కదా.

లక్ష్మీదేవి అంటే ఒక్క ధనమే కాదు.  మనిషికి వున్న ప్రతి నైవుణ్యమూ లక్ష్మీదేవే.  ఆవిడ తలపై వుండకూడదు అంటే మనిషికున్న ధనంవల్లగానీ, నైపుణ్యం వల్లగానీ వచ్చే అహంకారం తలకెక్కకూడదు.  దీనికి ఒక పురాణ కధ చెప్తారు.

పూర్వం జంభాసురుడు అనే రాక్షసుడు త్రిలోకాధిపత్యం కోసం శివుడి గురించి ఘోర తపస్సు చేస్తాడు.   అతని తపస్సుకి మెచ్చిన శివుడు ప్రత్యక్షమై అతను కోరుకున్న వరం ఇచ్చాడు.  ఇంకేముంది.  జంభాసురుడు దేవతల మీద దండయాత్ర చేసి ఇంద్ర పదవి చేజిక్కించుకుని ఇంద్రుణ్ణి తరిమి కొట్టాడు.  పాపం ఇంద్రుడు ఇతర దేవతలను తీసుకుని బ్రహ్మ దేవుడూ, దేవతల గురువైన బృహస్పతి దగ్గరకెళ్ళి  సమాలోచన చేశాడు.  వారు దగ్గరలో సహ్యాది పర్వతంపైన వున్న దత్తాత్రేయుని శరణువేడమని, ఆయన తప్ప ఇంద్రుని ఆపద తీర్చేవరెవరూ లేరని సలహా ఇస్తారు. 

ఇంద్రుడు వారి సలహాపై దత్తాత్రేయుని శరణువేడుతాడు.  దత్తాత్రేయుడు చిత్ర విచిత్రంగా ప్రవర్తిస్తాడు.  అసలు ఇంద్రుణ్ణి గుర్తుపట్టనట్లు వుంటాడు.  ఇంద్రుడు అతణ్ణి పరి పరివిధాల ప్రార్ధించి నువ్వు తప్ప వేరే గతి లేదంటే, చివరికి కరుణించి తన నిజస్వరూపం చూపిస్తాడు.  ఇంద్రుని ప్రార్ధనలాలకించి, ఉపాయం చెబుతాడు.  నువ్వు  దేవతలతో సహా వెళ్ళి జంభాసురుడిని నా ఆశ్రమం దగ్గరకు తీసుకు రమ్మంటాడు.  దత్తాత్రేయుని ఆజ్ఞ ప్రకారం ఇంద్రుడు తన సైన్యంతో సహా వెళ్ళి జంభాసురునితో యుధ్ధం చేస్తున్నట్లు నటిస్తూ వెనక్కి వెనక్కి నడుస్తూ దత్తాత్రేయుని ఆశ్రమం దగ్గరకు తీసుకొస్తారు.  యుధ్ధం చేస్తూ ముందుకు వస్తున్న జంభాసురుడు  దత్తాత్రేయుని ప్రక్కన వున్న ఆయన భార్య అనఘా దేవిని చూస్తాడు.  ఆమె అమోఘ సౌందర్యం చూసి మోహిస్తాడు.  ఆమెను తనతో తీసుకు వెళ్ళాలని ప్రయత్నిస్తాడు.  అనఘా దేవి భర్త వంక చూస్తుంది.  దత్తాత్రేయుడు వెళ్ళమని సైగ చేస్తాడు.  అప్పుడు అనఘాదేవి జంభాసురుడికి ఒక షరతు విధిస్తుంది.  నాకు నీ శిరస్సుపై నాట్యం చెయ్యాలని వుంది, అలా నాట్యం చెయ్యనిస్తే వస్తాను అని చెబుతుంది.  జంభాసురుడు అంత అద్భుత సౌందర్యరాశి తన శిరస్సుపై నాట్యం చెయ్యటానికి సంతోషంగా అంగీకరిస్తాడు.  అనఘాదేవి జంభాసురుని శిరస్సుపై నాట్యం చేస్తుండగా ఆ తన్మయత్వంలో, ఆ మత్తులో జంభాసురుడి సైన్యాన్ని సురసేనలు దునుమాడుతాయి.  నాట్యమయినా ఆ పరాకులోనే వున్న జంభాసురుణ్ణి ఇంద్రుడు సంహరిస్తాడు.

ఇది ఎలా సాధ్యమయింది.  అనఘాదేవి సాక్షాత్తూ మహాలక్ష్మి స్వరూపం.  మహలక్ష్మి తమదగ్గరవుందని ఎవరికైతే గర్వం వస్తుందో  లక్ష్మి వాళ్ళ నెత్తికెక్కుతుందంటారు.  మనిషి దగ్గర లక్ష్మి ఏ రూపంలోనైనా వుండచ్చు, అందం, ఐశ్వర్యం, విద్య, ఏదైనా కళలో నైపుణ్యం, ఇలా.  లక్ష్మి తమ దగ్గర వున్నదని సంతోషించి, దానిని సద్వినియోగపరచినంతమటుకూ పర్వాలేదు.  కానీ, ఎవరికైనా తనకున్న నైపుణ్యాన్ని చూసుకుని  గర్వం బాగా తలకెక్కినప్పుడు, కన్నూ మిన్నూ గానక ప్రవర్తించినప్పుడు, మనిషి పతనానికి అది మొదలు.  తమంత వారు లేరన్న గర్వం ఎవరికి వస్తుందో, వారి తలమీద లక్ష్మీదేవి నాట్యమాడుతూ వారి పతనానికి కారణమవుతుంది. విపరీతమైన అహంకారం వున్నవారికి లక్ష్మి తలమీద నాట్యంచేసి అణచి వేస్తుందని ఈ కధ తెలియజేస్తుంది.

(జీ తెలుగు ప్రసారం చేసిన గోపురం ఆధారంగా)













1 comments

Wednesday, December 22, 2010

ప్రమదావన జ్యోతికి పుట్టిన రోజు జేజేలు

Wednesday, December 22, 2010

 ప్రమదావన జ్యోతికి పుట్టినరోజు జేజేలు

ఈరోజు మన జ్యోతి పుట్టిన రోజు.  రెండేళ్ళ క్రితం ఈ జ్యోతి ఎవరో తెలియదు.  ఎక్కడ వుంటుందో తెలియదు.  అసలు ఏం చేస్తుందో తెలియదు.  కానీ ఇప్పుడు బ్లాగర్లల్లో చాలామందికి మిత్రురాలు.  ప్రమదావనంలో అందరికీ ఆప్త మిత్రురాలు,  వెరసి మన జ్యోతి.  అంతేకాదు.  మొన్న మొన్నటిదాకా ఏమీ తెలియని ఈ గృహిణి కంప్యూటర్ కీ బోర్డుమీద చెయ్యి పెట్టినదగ్గరనుంచీ  ఆ కంప్యూటర్ విద్యల లోతుపాతులు, ముఖ్యంగా బ్లాగులకు సంబంధించి, ఇట్టే అవుపోసనపట్టి నాలాంటి ఎందరో బ్లాగర్ల బ్లాగుల డిజైనర్ అయింది, ఎందరో కొత్త బ్లాగర్లకు బ్లాగ్ గురు అయింది.  అందుకే మా బ్లాగ్ డిజైనర్ కి, బ్లాగ్ గురుకి పుట్టిన రోజున  శుభాకాంక్షలు ఈ చిరుకానుకతో. 


తొలి పూజలందుకునే ఆ విఘ్ననాయకుడు తన తల్లి దండ్రులతో సహా సదా మీపై తమ కరుణా  కటాక్ష వీక్షణాలు ప్రసరింప చెయ్యాలని ఆకాంక్షిస్తున్నాను.


రోజంతా హాయిగా గడిపి సాయంత్రం కుటుంబ సభ్యులతో సంతోషంగా షికారుకెళ్ళిరండి.  మరొక్కసారి పుట్టినరోజు  శుభాకాంక్షలు.




2 comments

Monday, December 13, 2010

ఎలాంటి పాపాలు చేస్తే ఎలాంటి దోషాలు వస్తాయి

Monday, December 13, 2010



తల్లిదండ్రులను నిర్లక్ష్యం చెయ్యటం, దూరంగా వుంచటం, నమ్మినవారిని, భార్యా పిల్లలని నట్టేట ముంచటం, వారిని వదిలేసి మనదారి మనం చూసుకోవటం పాపం.  పురుషుడుగానీ, స్త్రీగానీ సంతానాన్ని వదిలేసి దూర దేశాలకు వెళ్ళినా, రెండవ పెళ్ళి చేసుకున్నా పాపం.  మనం తింటూ ఎదుటివారికి పెట్టకపోవటం, ఇంటిముందున్న కుక్కకి, పక్షికి ఆహారం పెట్టకపోవటం, ఎండలో వచ్చినవారికి మంచినీరివ్వకపోవటం కూడా దోషమే.  అతిధులకు ఏ వేళకి వచ్చినవారికి ఆ విధంగా తగు మర్యాద చెయ్యాలి.  అలాగే మన సహాయం కోరి వచ్చినవారికి సహాయం చేయగలిగి చేయకపోవటం మంచిదికాదు.  తప్పు తెలిసీ సరిచెయ్యకపోవటంకూడా దోషమే.

మన పూర్వీకులు క్రమశిక్షణకోసం, సక్రమమైన జీవన విధానానికి ఏ వేళకి ఏమి చెయ్యాలో నియమాలు, ఎన్నో పరుధులు ఏర్పాటుచేసి, ఎక్కడెక్కడ ఎలా నడుచుకోవాలో కొన్ని విధులు ఏర్పరచారు.  వాటిని నెరవేరిస్తే మనిషి సంతోషకరమైన జీవనం గడపగలడుచ

ప్రపంచంలో ప్రతి ప్రాణీ దైవ స్వరూపమే. మనిషి  ఆ సద్భావంతో సత్ఫ్రవర్తన కలిగి వుండాలి.  లేకపోతే మనం ఇప్పుడు ఏ అవయవంతో ఏ దోషం చేస్తామో మరు జన్మలో ఆ అవయవాలకి అలాంటి దోషాలుకలిగి బాధపడాల్సివస్తుంది.  పాపం అంటే ఎక్కడో మనకు కనబడకుండా వుండేదికాదు.  మన నిత్యజీవితంలో మన ఎదురుగా కనబడే అడ్డంకులు, రోగాలు, చికాకులే.  మనం ప్రశాంతమైన జీవితం గడపాలంటే మనమీద ఆధారపడినవారికి, ప్రకృతికి మనం ఎలాంటి హానీ చెయ్యకుండా జీవించాలి.

(జీ తెలుగు ప్రసారం చేసిన గోపురం ఆధారంగా)



0 comments

Sunday, December 12, 2010

ఆవునెయ్యి ఉపయోగాలేమిటి? ఆవునెయ్యి వాతావరణ కాలుష్యాన్ని తగ్గిస్తుందా?

Sunday, December 12, 2010



ఆవునెయ్యి ఆరోగ్యానికి ఉపయోగకరమనీ, వాతావరణ కాలుష్యాన్ని తగ్గిస్తుందనీ ప్రయోగపూర్వకంగా నిరూపితమైంది.  దీపారాధన చెయ్యటానికీ, యజ్ఞయాగాలకూ ఆవునెయ్యిని వినియోగిస్తారు.  ఆవునెయ్యితో వెలిగించిన దీపం వున్న గదిలో వున్నవారిలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది.  యజ్ఞయాగాదులలో ఆహుతి చేసిన ఆవునెయ్యి నుంచి వచ్చిన ఆవిరి ఆకాశంలో 7, 8 కి.మీ. ఎత్తుకి వెళ్ళి వర్షాలు పడతాయని రష్యా శాస్త్రవేత్తలు పరిశోధన చేసి కనిపెట్టారు.  మనవాళ్ళు కృత్రిమ వర్షాలు కురిపించటానికి మేఘమధనానికి వాడే కెమికల్స్ వల్ల కురిసే వర్షాలలో నీరుకూడా కాలుష్యమయమై వుంటుంది.

పురాణాలలో కధ ప్రకారంకూడా గాంధారి గర్భపాతం చేసుకున్నప్పుడు ఆ అండాన్ని కుండలలో ఆవునెయ్యిలో భద్రపరిచారుట.  ఆయుర్వేదంలో ఎన్నో మందులలో ఆవునెయ్యి కలుపుతారు.  ఘృతం అంటారు ఆవునెయ్యిని.  ఆవునెయ్యికి కొన్ని ఏళ్ళవరకు భద్రపరిచే గుణం వుంది.


ఆరోగ్యానికి కూడా ఆవునెయ్యి మంచిది.  ఈ మధ్య ఆరోగ్యంకోసమని చాలామంది నెయ్యి, నూనె తినటం మానేస్తున్నారు.  కానీ ఆవునెయ్యి తినటంవల్ల కొలెస్ట్రాల్  నియంత్రణలో వుంటుంది.  రోగ నిరోధక శక్తి పెరుగుతుంది.  అల్సర్స్ నయమవుతాయి.  జీర్ణక్రియని ఉత్తేజపరిచి జీర్ణకోశాన్ని కాపాడుతుంది.   శరీరంలో దోషాల్ని కొట్టేసి  కురుపులు రాకుండాఆరోగ్యాన్ని కాపాడుతుంది.  అందుకే రోజూ ఆహారంలో నియమిత రూపంలో ఆవునెయ్యి వాడాలి.

ఆవునెయ్యి మేధస్సును పదునుపరుస్తుంది.  కళ్ళకి మంచి చేస్తుంది.  మనసును ప్రశాంతంగా వుంచుతుంది.  జీర్ణక్రియను బాగుపరుస్తుంది.  అందుకే మిగతా నూనెలు మానేసినా రోజూ రెండు చెంచాలు ఆవునెయ్యిని ఆహారంతో తీసుకుంటే ఎన్నో రోగాలనుంచి దూరంగా వుండవచ్చు.

(జీ తెలుగు ప్రసారం చేసిన గోపురం ఆధారంగా)




0 comments