కొన్ని శాపాలు వంశపారంపర్యంగా అనుభవిస్తారంటారు. అలాంటివున్నాయా అంటే వున్నాయనే శాస్త్రాలు చెబుతున్నాయి. ఏడు తరాలవరకూ ఆ శాపాలననుభవిస్తారుట. అవేమిటంటే దేవ శాపం, సర్ప శాపం, ఋషి శాపం, మాతృ శాపం, పితృ శాపం. వీటిని వంశానుక్రమంగా కొన్ని తరాలవారు అనుభవించాలి.
సర్ప శాపం ఎలా వస్తుందంటే కొందరు నాగుపాములను చంపుతుంటారు. నాగు పాములను చంపకూడదు. కొందరు పుట్టలు తొలిగించి ఇళ్ళుకట్టటం వగైరా చేస్తారు. తెలిసీ, తెలియక పుట్టల సమీపంలో మూత్ర విసర్జన చేసినా, ఋతు సమయంలోని మైల బట్టలు పాములు దాటినా ఈ శాపాలు ప్రాప్తిస్తాయి.
ఋషి ఋణం ..ఋషులు, సిధ్ధులు లోక క్షేమంకోసం తపస్సు చేసే మహా పురుషులు అనేకులుంటారు. వారికి ఎటువంటి హాని తెలిసిగానీ తెలియకగానీ కలిగించినా ఋషిశాపగ్రస్తులవుతారు.
దేవశాపం .. గుడికి ఏ విధమైన హాని తలపెట్టినా, ఆలయంలోని వస్తువులనుగానీ ధనాన్నిగానీ అపహరించినా దైవశాపం తప్పదు.
మాతృ శాపం చిన్న విషయంకాదు. తల్లి ఎల్లప్పుడూ శిశువు క్షేమంకోసం తపిస్తూంటుంది. అలాంటి తల్లి తన బిడ్డలు తనపట్ల ఏ ద్రోహం చేసినా శపించదు. ఏ వయసులోనైనా తలిలిదండ్రులను గౌరవించాలి. కొందరు తల్లిదండ్రులను సరిగ్గ చూడరు. తమ సర్వస్వాన్నీ త్యాగంచేసి పిల్లలని వృధ్ధిలోకి తీసుకు వస్తే వారి వృధ్ధాప్యంలో వారి ఆస్తులను తీసుకుని వారిని బయటకు వెళ్ళగొట్టే బిడ్డలూ వున్నారు. ఏ సందర్భంలోనూ తల్లిదండ్రులు పిల్లలని తిట్టరు. వారికి అవసరమైనప్పుడు చేయూతనివ్వకపోతే వారి ఆవేదన వీరికి శాపమవుతుంది. బాధాతప్త హృదయంతో వాళ్ళు పెట్టుకునే కన్నీళ్ళు, పిల్లలను తిట్టకపోయినా, పిల్లలపాలిటి శాపాలవుతాయి. పితృ శాపం కూడా ఇంతే. పిల్లలు తల్లిదండ్రులను ఏ సమయంలోనూ కష్టపెట్టకూడదు. తల్లిదండ్రులు కూడా తాము సత్ఫ్రవర్తనాపరులై, పిల్లలకుకూడా చిన్నప్పటినుంచే సత్ప్రవర్తన నేర్పాలి.
పై దోషాలవల్ల వచ్చే శాపాలు ఏడుతరాలవారు అనుభవిస్తారంటారు.
(జీ తెలుగు ప్రసారం చేసిన గోపురం ఆధారంగా)