Tuesday, May 10, 2011

పిల్లల పేరుమీద పూజ చెయ్యకూడదా?

Tuesday, May 10, 2011

12 సంవత్సరములలోపు పిల్లలకి తల్లి దోషాలే వారికీ వర్తిస్తాయి. కనుక భగవదనుగ్రహం కోసం పూజలు చేసేటప్పుడు సంకల్పంలో వారి యజమాని అయిన తండ్రి పేరు, గోత్రం వగైరా చెప్పి, సకుటుంబస్య అంటే సరిపోతుంది, అందరి పేర్లూ ప్రత్యేకించి చెప్పక్కరలేదు అంటారు కొందరు.

కానీ ప్రత్యేక సందర్భాలలో, పిల్లల పేర్లమీద కూడా పూజలు చెయ్యవలసి వస్తుంది. 12 సంవత్సరముల వరకూ తల్లిదండ్రుల దోషాలే వాళ్ళకీ వర్తిస్తాయనటం సరైనది కాదు. కొందరు పిల్లలు తరచూ అనారాగ్యంపాలుకావచ్చు, కొందరు సరిగ్గా చదవలేకపోవచ్చు, కొందరికి చదివింది జ్ఞాపకం వుండకపోవచ్చు, కొందరికి మాటలు సరిగ్గా రాకపోవచ్చు, కొందరికి బాలారిష్టాలు, రకరకాల సమస్యలు, మరణంతో సమానమైన అవస్తలు, గండాలు, అపమృత్యు దోషాలు వుండచ్చు. ఇలాంటి ప్రత్యేక సందర్భాల దోష నివారణార్ధం జరిగే ప్రత్యేక పూజలు ఎవరికోసం జరుగుతూంటే వారి పేరుమీదే చెయ్యాలి.. వారు పసి పిల్లలయినా సరే.

పిల్లలకి ప్రతి నిత్యం దైవ ప్రార్ధన అలవాటు చెయ్యాలి. నిద్ర లేవగానే, స్నానం చెయ్యగానే, బయటకు వెళ్ళేటప్పుడు, దైవ ప్రార్ధన అలవాటు చేస్తే, వయసుతోబాటు దైవ భక్తి, నిశ్చల తత్వం అలవడి పెద్దవారవుతున్నకొద్దీ ఏమైనా సమస్యలు ఎదురైనా భయపడక ధైర్యంగా ఎదుర్కోవటం నేర్చుకుంటారు.

ప్రత్యేక సమస్యల నివారణకోసం చేసే పూజలు ఎవరికోసం చేస్తుంటే వారి పేరుమీదే చెయ్యాలి. కొంచెం పెద్ద పిల్లలు స్వయంగా చేసుకోగలిగినవి వారిచేత చేయించవచ్చు, లేకపోతే వారి తరఫున పెద్దలు వారి పేరుమీద చెయ్యవచ్చు.

(జీ తెలుగు ప్రసారం చేసిన గోపురం ఆధారంగా)



1 comments:

said...

మొదటి నాలుగేళ్ళు తల్లి చేసిన పాపాల వలన, తరువాత నాలుగు తండ్రి వలన, తరువాత నాలుగు తను చేసిన పాపాల వలన పిల్లలకు ఇబ్బందులు వస్తాయని ఎక్కడో చదివాను.