Friday, April 10, 2009

పాటల సందడి

Friday, April 10, 2009
పాటల సందడి

తేనెజల్లు

తెలుగు టీ.వీ. ఛానళ్ళన్నీ సినిమాల గోలతో విసుగెత్తిస్తున్న ఈ తరుణంలో ప్రమదావనం కూడా ఈ సినిమా పాటల సొద ఎందుకుపెట్టారా అనుకున్నానో లేదో నా కిష్టమైన పాటలన్నీ నా మదిలో మారు మ్రోగి ఒక్కసారి మమ్మల్ని గుర్తు చేసుకో అని తియ్యగా పాడాయి. అంతే. నేను ముందంటే, నేను ముందంటూ సినీ సాహితీ ప్రపంచాన్ని ఉర్రూతలూగించిన అందమైన పాటలెన్నో నా మనస్సులో తుమ్మెద రాగాల్ని పాడటం మొదలు పెట్టాయి. అందమైన అవకాశాన్ని వదులుకోగూడదు అనుకుని ఒక్కసారి ఆ తేనెజల్లులో తడిసిపోయాను.

ఎన్ని కోయిలల కుహూ కుహూలు ఒక్కసారే వినిపించినా, అన్నిటిలోంచి నా కత్యంత ప్రీతి పాత్రమైన ఆ గండు కోయిల హృదయగానాన్ని నా మనసెప్పుడూ ఆస్వాదిస్తూనే వుంటుంది. ఆ మధు గీతామృతపానానికి మత్తెక్కి నా మనసు ఎన్ని శిశిర సమయాలలో తుషారు శీతల పవనాలను ఆస్వాదించిందో. వీటిలో వేటికీ పరిచయాలు అక్కరలేదు....పూర్తి రచనలు ఇక్కడ వ్రాయనక్కరలేదు...ఎందుకంటే ఒక్కమాట వినిపించిన వెంటనే పాత తరాల వారంతా రింగులు తిప్పకుండానే ఊహాలోకాలకెళ్ళి పోతారు....కొత్త తరం వారు చెవి ఒగ్గి, మనసు పెట్టి వింటారు. అవునో కాదో మీరే చూడండి....

మనసున మనసై బ్రతుకున బ్రతుకై...


చూశారా చూశారా ఒక్క లైనయినా పూర్తిగా పాడక ముందే మీరు పాడేసుకుంటున్నారు. సాయం సమయం, పూల తోట, అందులో విశ్రాంతిగా కూర్చుని డా. చక్రవర్తి మీ కళ్ళ ముందున్నారు కదూ. పాత తరంవారి ప్రతి గుండెలోనూ నిండివున్న ఈ పాట కొత్త తరం వారికీ ప్రీతిపాత్రమైనదే.

అలాగే


నీలి మేఘాలలో గాలి కెరటాలలో నీవు పాడేపాటా వినిపించునేవేళా...

బావా మరదళ్ళ కోసం జానకమ్మ గొంతులోంచి కమ్మగా జాలువారిన ఈ పాటను మించిన ప్రేమ గీతమింకొకటుంటుందా వుండదంటున్నారా కోప్పడకండి మీమాట కాదన్నందుకు మరి ఈ పాట చూడండి...

ఏ దివిలో విరిసిన పారిజాతమో...


పాట సాహిత్యం, యస్.పీ. బాల సబ్రహ్మణ్యం పాడిన విధానం ప్రతి ఒక్కరినీ ఈ రోజుకీ తన్మయుల్ని చేసే ఈ పాట కన్నెవయసు సినిమాలోది.

నిరీక్షణలో నాయిక పాడిన పాటలలో తలమానికం శాంతి నివాసం లోని ఈ పాట....ఈ మధ్య కొంచెం కనుమరుగవుతోందా అనిపిస్తున్న ఈ పాటనొక్కసారి గుర్తుచేసుకోండి...

తుషారు శీతల సరోవరాన అనంత నీరవ నిశీధిలోన
ఈ కలువ నిరీక్షణా నీ కొరకే రాజా వెన్నెల రాజా
కలనైనా నీ వలపే కలవరమందయినా నీ తలపే
కలనైనా నీ వలపే




అమ్మ పాడే పాటలు ఎన్ని వచ్చినా, అమ్మ మనసు అర్ధం చేసుకున్న పాట ఇది ఒక్కటే అనుకుంటా. చిత్రం, పాట పల్లవి గుర్తులేదు కానీ ఈ పాట ప్రభ మీద చిత్రీకరించబడింది.... చరణంలో....

ఏడాదికే నాలుగేళ్ళు రావాలీ
మా బాబు ఎప్పటికి ముఫ్ఫయిలో వుండి పోవాలీ


పాటలు విని ఆనందించటం, అదీ చాలా తక్కువ సమయమే తెలిసినదానిని పాటల గురించి ఇంతకన్నా ఏమి వ్రాయను. సంగీతంలో అ ఆ లు రాని నేనే ఈ తేనె జల్లులో ఇంత ముద్దయిపోతే ఇంక సంగీత జ్ఞానుల సంగతి ఏమని వర్ణించనూ

5 comments:

పరిమళం said...

లక్ష్మి గారు , ఈ ఆలోచన నాకెందుకు రాలేదో ..నచ్చినవి ఎన్నో పాటలు సెలక్ట్ చేసుకోవడం ఎంతో కష్టమనిపించింది .మీరు భలే పరిచయం చేశారు కొన్నైనా ...

జ్యోతి said...

అమ్మో! అమ్మో ! ఎన్నిపాటలో ! మీ ఐడియా సూపర్ అండి. మీరు చెప్పినట్టే మనసున మనసై చదువుతుండగానే సితార్ వాయిస్తున్న నాగేశ్వర్రావు కనిపించారు. అద్భుతమైన ఆనాటి ఆణిముత్యాలు గుర్తుచేసారు . థాంక్స్..

krishna rao jallipalli said...

భలే మంచి రోజు ఈ రోజు... ఎందఱో మహిళా బ్లాగర్లు ఎన్నో పాటలని పరిచయం చేసారు కొందరైతే వినిపించారు. కొంతమంది అయినా ఆ పాటలని వారి వారి గొంతులతో పాడి ఆడియో ని పెట్టి ఉంటె... బాగుండేదే మరి?? ఈ సారి ఆ ప్రయత్నం చేయండి మరి.

psmlakshmiblogspotcom said...

పరిమళగారూ, జ్యోతిగారూ, ధ్యాంక్సండీ. కృష్ణారావుగారూ, మీ ఐడియా చాలా బాగుందండీ. మరి పాడువారు...అదేనండీ చక్కగా పాటలు పాడే మన సభ్యులు అమలు చేసేస్తే ఫస్టు క్లాస్ గా వుంటుంది.
psmlakshmi

Sail: said...

Wow..! that's really good!