Thursday, January 28, 2010

చీమలకి ఆహారం వేయాలంటారు. ఎందుకు?

Thursday, January 28, 2010





మన సాంప్రదాయం ప్రకారం ప్రతి రోజూ, ప్రతి వ్యక్తీ దానం చెయ్యాలి అని చెప్తారు.  రోగ పీడితులు, గ్రహ పీడితులు, ఇంకా అందరూ.  పేదవాళ్ళకి, అవసరమైన వాళ్ళకీ దానం చేస్తే ఎంతో పుణ్యం రావటమేకాక మనం తెలిసీ తెలియక చేసిన పాపాలన్నీ కరిగి పోతాయి.  దానాలు షోడష  రకాలంటారు.  వీటిలో ముఖ్యంగా అన్నదానం చాలా గొప్పది.

అయితే అందరూ అన్నదానం చెయ్యగలరా?  ఎంత కష్ట పడ్డా వారి కుటుంబ అవసరాలు గడవటానికే ఇబ్బంది పడేవాళ్ళు చాలామంది వున్నారు మన దేశంలో.  అలాంటివారు రోజూ అన్నదానమో ఇంకేదో దానమో చెయ్యాలంటే సాధ్యంకాదుకదా.  అయితే వీళ్ళకి కూడా సూక్ష్మంలో మోక్షం చెప్పింది శాస్త్రం.  బియ్యం పిండిలో చక్కెర లేదా బెల్లం కలిపి చీమలకు పెట్టాలి.  లేదా వుట్టి చక్కెర అయినా పెట్టవచ్చు.  ఇలా చేస్తే పదివేలమందికి అన్నదానం చేసిన పుణ్యం వస్తుంది.  ఇది ఇళ్ళల్లో, మనుషులు ఎక్కువగా తిరిగే ప్రదేశాల్లో కాకుండా దూరంగా, చీమలుండే చోట పెట్టాలి.  కొందరు చెట్ల మొదట్లో చక్కెర జల్లుతారు...చీమలకోసమే.

తేనెను తమలపాకులోగానీ రావి ఆకులోగానీ పెట్టి సూర్యుడికి, తులసికి పూజ చేసి నైవేద్యం పెట్టి అక్కడే వదిలెయ్యవచ్చు.  దీనికీ విశేష ఫలితముంటుంది.  ఎందుకంటే తేనె ఎన్నో పువ్వులనుండి సేకరించబడుతుంది.  అమృత తుల్యమైంది.  దాన్ని చీమలకి పెడితే చాలా దోషాలు పరిహారమవుతాయి.

అయితే దానం చెయ్యగలిగిన వాళ్ళుకూడా ఒకసారి చీమలకి చక్కెర వేస్తే పదివేలమందికి అన్నం పెట్టిన పుణ్యం వస్తుందికదా, పదివేలమందికి అన్నం పెట్టి అంత ఖర్చు పెట్టటం ఎందుకు, సూక్ష్మంలో మోక్షంగా చీమలకి చక్కెర పెట్టేద్దామనుకోకూడదు.

ఈ విషయంలో పురాణ కధ కూడా ఒకటి వుంది.  పూర్వం చాలా పేద వ్యక్తి ఒకతను వుండేవాడు.  అతని దగ్గరకు ఒకసారి ఒకతను వచ్చి చెప్తాడు.   నువ్వేదయినా దానం చెయ్యి, అప్పుడు నీకూ సిరిసంపదలు వస్తాయి.  మనం దానం చెయ్యకుండా ఏమీ పొందలేము.  ఇప్పుడు మనమనుభవిస్తున్న ప్రతి ఒక్కటీ ఇదివరకు మనం దానం చేసినవే.  ఇదివరకు నువ్వేం దానం చెయ్యలేదేమో, అందుకే ఇలా వున్నావు.  ఇప్పుడేదైనా దానం చేసి ఈ దారిద్ర్యంనుంచి బయటపడమని సలహా ఇస్తాడు.

అప్పుడా నిరుపేద దానం చెయ్యటానికి నా దగ్గర ఏముంది?  ఏందానం చెయ్యను? అని బాధ పడతాడు.  అప్పుడా వచ్చిన వ్యక్తి ఎందుకు లేదు?  నీ పెరట్లో తోటకూర వుందికదా దానిని దానం చెయ్యి అంటాడు.  మిత్రుని మాట విని అతను అలాగే చేస్తాడు.  ఆ దానంతో సిరి సంపదలు కలిగి తరువాత జీవితమంతా హాయిగా వుంటాడు.  మరు జన్మలో అతను  ఒక దేశానికి రాజుగా జన్మిస్తాడు.  అంతేకాదు.  అతనికి పూర్వ జన్మ జ్ఞానం కూడా వుంటుంది.  పూర్వ జన్మలో తను చేసిన దానం వల్లకదా తనకింత సిరి సంపదలు వచ్చాయి అని ఈ జన్మలో కూడా అలాంటి దానం చేసి ఇంకా సిరి సంపదలు పొందాలనే వుద్దేశ్యంతో తన రాజ్యంలో అందర్నీ తోటకూర పెంచమని ఆజ్ఞ ఇస్తాడు.  అంతకు ఇంతయితే ఇంతకు ఎంత అనుకుంటూ (పూర్వ జన్మలో కొంచెం తోటకూర దానం ఇచ్చినందుకే అంత సిరి సంపదలు వస్తే ఇప్పుడు తన రాజ్యం మొత్తం తోటకూర పెంచి, దాన్నంతా దానం ఇస్తే, తనూ తన ప్రజలూ ఇంకెంత సిరి సంపదలతో తులతూగుతారో) ఆ తోటకూరంతా దానమివ్వటం మొదలు పెడతాడు.

ఒకసారి ఒక సన్యాసి ఆ రాజ్యానికి వస్తాడు.  రాజు సన్యాసికి సకల మర్యాదలు చేసి తన అనుమాన, అదే, అంతకు ఇంతయితే..ఇంతకు ఎంత?...అని అడుగుతాడు.  ఆ సన్యాసి, అంతకు ఇంతయితే ఇంతకు ఇంతే (శూన్యం అని అర్ధం వచ్చేటట్లు) చెప్తాడు.  రాజు నిర్ఘాంతపోతాడు.  అప్పుడా సన్యాసి చెప్తాడు...నీకు పూర్వ జన్మలో  ఏమీలేదు.  నిరుపేదవయిన నీవు నీ పెరట్లోని తోటకూర దానం చేసి ఎంతో పుణ్యం సంపాదించావు.  మరి ఈ జన్మలో నువ్వు సిరి సంపదలతో తులతూగుతున్నావు.  ఇంత సిరి సంపదలతో తులతూగే నువ్వు తోటకూరే దానం చేస్తానంటే ఫలితమేముంటుంది.  శక్తి లేని వాళ్ళు ఏమి దానం చేసినా అమిత ఫలాన్నిస్తుందికానీ, అన్నీ వుండి, దానం చేసే శక్తి కలవారు తమ శక్తికొద్దీ దానం చెయ్యాలి. అంతేకానీ చీమలకి చక్కెర వేస్తే పదివేలమందికి దానం చేసిన పుణ్యం వస్తుందని అత్యాశతో అలా చెయ్యకూడదు.  భూత దయతో, వాటికీ ఆహారం పెట్టే ఉద్దేశ్యంతో చెయ్యవచ్చు కానీ అల్ప దానంతో అనల్ప ఫలితాన్ని ఆశించకూడదు అని రాజుకి జ్ఞాన బోధ చేస్తాడు.

(జీ తెలుగు ప్రసారం చేసిన గోపురం ఆధారంగా)

మనలో మన మాట

మన పెద్దలు ఏది చెప్పినా చాలా ఆలోచించి చెప్పారనిపిస్తుంది కదా.   పరస్పర సహాయ, సహకారాలతో ఈ ప్రపంచం స్వర్గ తుల్యమవుతుందని గ్రహించిన వాళ్ళు, ఆ సహాయ సహకారాలను ప్రోత్సహించటానికి దాన ధర్మాలు, పుణ్యం ఇలాంటివన్నీ చెప్పారేమో.  ఆ మాత్రం స్వార్ధం లేకుండా (దానం చేస్తే వచ్చే పుణ్యం) మనుషుల్లో దాన గుణాన్ని పెంపొందింప చెయ్యటం కష్టమని వాళ్ళకూ తెలుసు.  అలాగే ప్రతివాళ్ళూ సూక్ష్మంలో మోక్షానికి పాకులాడకుండా వుండేందుకు కొన్ని కధలు కూడా.   ఏమంటారు?








0 comments: