Friday, January 29, 2010

అష్ట లక్ష్ములలో ధైర్య లక్ష్మిని ఎప్పుడూ వదలవద్దంటారు. ఎందుకు?

Friday, January 29, 2010

అసలు ధైర్యం అంటే?  అది ప్రత్యేకంగా వుండటమేమిటి?  దాన్ని వదలద్దనటమేమిటి?  ఏం ధైర్యంగా లేకపోతే మనిషి బ్రతకలేడా?  ఇలాంటి సందేహాలు కొందరికి రావచ్చు.  అన్నీ అనువుగా వుండి, భోగ భాగ్యాలతో తులతూగుతూ, జీవితంలో ఏ సమస్యా లేకుండా సంతోషంగా వున్నవాళ్ళు వీళ్ళు.  అలాంటి సందర్భలలో అందరూ ధైర్యంగానే వుంటారు.   నిజానికి ఆ సమయంలో ఆ వ్యక్తికి ధైర్యం వుందో, లేదో కూడా తెలియదు.  దాని అవసరమేమిటో తెలియదు.

కానీ సమస్యల సుడుగుండంలో చిక్కుకున్నవాళ్ళకి తెలుస్తుంది ధైర్యం విలువ, దాని అవసరం.  అలాంటి సమయంలో ఏ వ్యక్తయితే నిబ్బరంగా వుంటాడో, ఏ వ్యక్తయితే చిరునవ్వు వీడడో ఆ వ్యక్తి ధైర్యం కలవాడు అని చెప్పవచ్చు.  చెప్పటం సులభమేకానీ, ఆచరించటం  అంత సులభమేమీ కాదు.  అందుకే  ఏ మనిషయితే ఎన్ని చిక్కులొచ్చినప్పటికీ, ఎన్ని సమస్యలొచ్చినప్పటికీ ధైర్యంగా వుండి కార్యసాధన చెయ్యగలుగుతాడో, చిక్కులు పరిష్కరించుకలుగుతాడో ఆ వ్యక్తి ధైర్యం కలవాడు అన్నారు..అసలు ధైర్యం వున్నప్పుడే సరిగ్గా ఆలోచించి సమస్యలకి పరిష్కరం కూడా కనుక్కోగలుగుతాడు. అలాగే ఏ వ్యక్తయితే ఎప్పుడూ ధర్మాన్ని ఆచరిస్తాడో, ఏ వ్యక్తయితే ఇంద్రియాలని అదుపులో వుంచుకుంటాడో,  ఆ వ్యక్తి ఏ పరిస్ధితుల్లోనూ  ధైర్యాన్ని విడువడు.  ఆ వ్యక్తి గడిపే నిబధ్ధతాయుతమైన జీవితమే ఆ వ్యక్తియొక్క ధైర్యం అవుతుంది.

పురాణాల ప్రకారం కూడా ఒక కధ వుంది.  పూర్వం ఒక రాజు వుండేవాడు.  ఆయన ప్రజలని చక్కగా పరిపాలించేవాడు.  ఒకసారి శత్రు రాజులు చేసిన దాడిలో ఆ రాజు రాజ్యాన్ని పోగొట్టుకున్నాడు.  అష్టలక్ష్ములు ఒక్కొక్కళ్లూ ఆ రాజుని విడిచి వెళ్ళిపోయారు.  విజయలక్ష్మి, రాజ్య లక్ష్మి ఆయన్ని వదిలి వెళ్ళినా తలవంచుకుని వున్నాడేగానీ మారు మాట్లాడలేదు.  సంతాన లక్ష్మి  వెళ్ళి పోయింది.  రాజు సంతతంతా దూరమయ్యారు.  ధాన్య లక్ష్మి వెళ్ళటంతో ఆహారం సమస్య అయింది.  అలా అందరూ లక్ష్ములూ రాజుతో మేము వెళ్ళి పోతున్నాము అని చెప్పినా రాజు చేసేదేమీలేక తలవంచుకుని కూర్చున్నాడు.  చివరికి ధైర్య లక్ష్మి వచ్చి తనూ వెళ్ళిపోతున్నానని చెప్పింది.  అప్పుడు ఆ రాజు ఆమెకి నమస్కరించి అమ్మా, నువ్వెలా వెళ్తావు.  ధర్మమనే ధైర్యలక్ష్మి నా దగ్గర వుంది.  నువ్వెలా నన్నొదిలి వెళ్తావు అని ప్రశ్నించాడు.  ఆమె  రాజు ధార్మిక ప్రవర్తనకు సంతసించి ఆ రాజుతో వుండిపోయింది. 

ధైర్యం వుంటే తను తిరిగి చేసే ప్రయత్నాలవల్ల తన రాజ్యం తన దగ్గరకు వస్తుంది, తన సంతానం తన దగ్గరకు వస్తుంది, తను పోగొట్టుకున్న సకల సిరి సంపదలు, భోగ భాగ్యాలూ తన దగ్గరకు వస్తాయని, తను పోగొట్టుకున్న సకల సంపదలూ  తన దగ్గరకు వస్తాయని నమ్మాడు ఆ రాజు.  ఆ ధైర్యంతోనే ఆ రాజు అన్నీ సాధిస్తాడు.  దీనివల్ల అర్ధమయిందేమిటి.  ఎలాంటి సందర్భాలలోనైనా మనిషి ధైర్యం వదలకుండా వుంటే ఏదైనా సాధించవచ్చు.

ధైర్యం అంటే మొండిగా మనం చేసిందే సరైనదనటం కాదు.  తప్పు, చెడు, అధర్మాలకు దూరంగా వుండి, శాస్త్రాలు దేనిని ధర్మమని చెబుతున్నాయో దాన్ని ఆచరిస్తే ధైర్యలక్ష్మి ఆ వ్యక్తిని వదిలి వెళ్ళదు.  ఆ వ్యక్తి సాధించలేనిది ఏదీ లేదు.

(జీ తెలుగు ప్రసారం చేసిన గోపురం ఆధారంగా)

మనలో మాట

ారాంశమేమిటంటే మన జీవిత గమ్యంలో ఎన్ని చికాకులెదురయినా ధైర్యంగా వాటిని పరిష్కరించుకునే మార్గాలు వెతుక్కోవాలిగానీ నిరాశ చెంది బ్రతుకు బరువు చేసుకోకూడదు.స



3 comments:

శ్రీనివాస్ said...

నిన్ననే మహానగరంలో మాయగాడు సినిమాలో చిరంజీవి కూడా ఇదే చెప్పాడు

పరిమళం said...

బావుందండీ ...గోపురం అప్పుడప్పుడూ నేనూ చూస్తూ ఉంటాను .

Anonymous said...

అందుకే స్వామి వివేకానందుడు కూడా అంటాడు.

Fearness is death అని...