Thursday, October 7, 2010

మహాలయ అమావాస్య విశేషమేమిటి? ఆ రోజు నిర్వహించాల్సిన కార్యక్రమాలు ఏమిటి?

Thursday, October 7, 2010


భాద్రపద బహుళ అమావాస్యని మహాలయ అమావాస్య అంటారు.  చనిపోయినవారందరి స్మృతికోసం చేసే ఈ అమావాస్యను సర్వ పితృ అమావాస్య అని కూడా అంటారు.  చనిపోయిన తమ పెద్దల జ్ఞాపకార్ధం ఏ కులం వారైనా, ఏ మతం వారైనా, ఏ వర్గం వారైనా పాటించే  కార్యక్రమం ఇది.   ప్రపంచ వ్యాప్తంగా అందరికీ ఈ పితృ స్మరణ రోజు ప్రత్యేకంగావున్నది.  క్రిస్టియన్స్ ఆల్ ఫాదర్స్ డే రోజున ఈ కార్యక్రమం చేస్తారు..   ఒక్కో సంవత్సరంలో ఒక్కో నెలలో, ఒక్కో రోజు వస్తుంది ఈ ఆల్ ఫాదర్స్ డే.  అలాగే ముస్లిమ్స్ మొహరం పాటిస్తారు.  హిందువులు తర్పణలు వదులుతారు.  కొందరు పెద్దలకి బియ్యమిస్తారు.

ఏ జాతి వారైనా, ఏ కులం వారైనా, వాళ్ళెక్కడవున్నా, వారి వారి సంప్రదాయాన్నిబట్టి, ఇంటి ఆచారాల్నిబట్టి,    వాళ్ల వాళ్ల అనుకూలతనుబట్టి పితృ దేవతలను సంస్మరించుకునే రోజు ఇది.  లేకపోతే రౌరవాది నరకాలకి పోతారంటారు.  ఈ కార్యక్రమంలో కేవలం చనిపోయిన తండ్రి, తల్లులనే కాదు వారి ముందు ఇంకో రెండు తరాల వారిని కూడా సంస్మరిస్తారు అంటే తండ్రి, తాత (తండ్రి తండ్రి), ముత్తాత (తాత తండ్రి), అలాగే తల్లి, నానమ్మ (తల్లి అత్తగారు), ఆవిడ అత్తగారు. 


ఇంక ఆరోజు నిర్వహించవలసిన కార్యక్రమాల గురించి శాస్త్రాల్లో వివరించారు ప్రత్యామ్నాయాలతోసహా.  వారి వారి ఆచారాలూ, పధ్ధతుల ప్రకారం విధి విధానంగా వాటిని పాటించటం ఉత్కృష్టం.  ఆ రోజు  పెద్దలకు తర్పణలు వదలాలి.  వారిని తలచుకుని బ్రాహ్మణులకు భోజనం పెట్టాలి.  అలాగే పేదలకు అన్నదానం చేయాలి.  వీలుకానివారు ఇద్దరు వ్యక్తులకు భోజనం తయారు చేసుకోవటానికి సరిపడే అన్ని వస్తువులూ, బియ్యం, ఉప్పు, పప్పు, కూరలు,  నూనెతో సహా అన్నీ పెద్దల పేరు తలచుకుంటూ ఉచితమైన వ్యక్తులకి ఇవ్వాలి.    వారి పేరున శక్తి కొలదీ దాన ధర్మాలు చెయ్యాలి.

ఈ రోజుల్లో బ్రతికివున్న తల్లిదండ్రులనే పట్టించుకోని సంతానం, వారిని పలకరించటానికి కూడా తీరికలేని సంతానం చాలామందే వున్నారు.  వారంతా తమని తమ తల్లిదండ్రులు ఎంత ప్రేమతో పెంచారో అంతకన్నా ఎక్కువ ప్రేమ, ఆప్యాయతలు వారి వృధ్ధాప్యంలో వారిపట్ల చూపించాలి.  అలాగే వారి తదనంతరం వారు పోయిన రోజేకాక ఈ మహాలయ అమావాస్యనాడుకూడా, వారి వారి ఆచారాల ప్రకారం, వారి ఇంటి పధ్ధతుల ప్రకారం తల్లి దండ్రులను స్మరించుకోవాలి.

(జీ తెలుగు ప్రసారం చేసిన గోపురం ఆధారంగా)

0 comments: