భాద్రపద బహుళ అమావాస్య రోజున బతుకమ్మనిపెట్టి
నవరాత్రులు తొమ్మిది రోజులూ అమ్మవారిని కొలుస్తారు. మన పూర్వీకులు పాటించిన ఆచార వ్యవహారాలకు, మన
పండగలకు, వాతావరణ మార్పులకు అవినాభావ సంబంధం వుంది. ఆశ్వీయుజ మాసంలో వాతావరణ మార్పులవల్ల ఎవరైనా
తొందరగా అనారోగ్య ప్రభావానికి గురి అయ్యే అవకాశం వున్నది. అలా అనారోగ్య ప్రభావానికి లోనుకాకుండా, ముఖ్యంగా
సుకుమారులైన స్త్రీల ఆరోగ్య పరిరక్షణకు ఏర్పరచిన ఉత్సవమిది. ఔషధ గుణాలుకల తంగేడు, మోదుగ, మొదలగు అనేక రకాల
పువ్వులను పేర్చి, పైన గౌరీ దేవిని పెట్టి పూజిస్తారు. ఈ పూవులనుంచి వచ్చే ఔషధ గుణాలుకల సువాసనలవలన అనేక రోగాలు నివారింపబడతాయి.
ఇప్పుడైతే ఈ పువ్వులను చాలా చోట్ల మార్కెట్ లో
కొనుక్కుంటున్నారు కానీ పూర్వం చుట్టపక్కలవున్న చెట్లనుంచి ఈ పువ్వులను
సేకరించేవారు. తోటల్లో, చెట్లమధ్య,
తోటివారితో కలిసి పువ్వులు సేకరిస్తుంటే అతివల మనసులు ఆనంద భరితమై మనసుకి ప్రశాంతత
చేకూరేది.
సాయంకాలం అందరూ ఒకచోట చేరికలిసి పాడుతూ
బతుకమ్మలచుట్టూ చేరి ఆడుతుంటే ఆ స్త్రీలలో ఎనలేని ఉత్సాహం సమకూరుతుంది. ఆరోగ్యపరంగానే కాదు సామాజికంగా అందరూ ఒకచోట
చేరి, కలిసి మెలిసి వుండటానికి అవకాశమున్న ఈ బతుకమ్మ పండుగ పాటల సాహిత్యం ఏ రచయితో
రాసినది కాదు. జీవితంలో ఎదుర్కొనే
ఆటుపోట్లనుంచి, అనుభవాలనుంచి ఉద్భవించినదే.
జీవితంలో ఎదుర్కొనే ఎన్నో ఒడుదుడుకులు, వాటినధిగమించి తమ జీవితాలని ఎలా
చక్కదిద్దుకోవాలనే జీవిత సత్యాలే ఈ
బతుకమ్మ పాటలుగా రూపొందాయి.
స్త్రీలని పువ్వులతో పోలుస్తారు. సున్నిత మనస్కులైన వారి జీవితాలు పూవులలాగే సుగంధాలు వెదజల్లుతూ వారు సంతోషంగా వుండి వారి కుటుంబంలో వారి జీవితాలు కూడా
సంతోషమయం చెయ్యాలని వారిని చల్లగా బతుకమ్మా అని అశీర్వదిస్తూ చేసే ఈ వేడుకలు
నవరాత్రుల సమయంలోనే చెయ్యటంలో ఇంకో అర్ధంకూడా వున్నది. స్త్రీ పువ్వులా సుకుమారంగా వుండటమేకాదు,
అవసరమైతే ఆదిశక్తిలా దుష్టులను దునుమాడాలి... ఆపద సమయంలో శక్తి, యుక్తులు ప్రదర్శించి విజయం సాధించాలి.
ఆరోగ్యపరంగా, సామాజికంగానేకాక, జీవిత సత్యాలను
నేర్పే ఈ బతుకమ్మ వేడుకలు మా శ్రీ కృష్ణా
నగర్ లో కూడా మైత్రీ మహిళా మండలి అధ్యక్షురాలు శ్రీమతి మల్లీశ్వరిగారి ఆధ్వర్యంలో
చాలా సందడిగా జరిగాయి. ఆ ఫోటోలు మీరూ
చూడండి.
0 comments:
Post a Comment