Sunday, April 25, 2010

ఏలినాటి శని అంటే భయమా?

Sunday, April 25, 2010


ఇవాళ ఉదయం 8 గంటలకు జీ తెలుగు ప్రసారం చేసిన శుభమస్తు కార్యక్రమం చూడటం జరిగింది. డా. సంధ్యాలక్ష్మిగారు నిర్వహిస్తున్నారు దీనిని.  ఈవిడ జ్యోతిష్య శాస్త్రంలో డాక్టరేట్ పొందిన తొలి తెలుగు మహిళ అని జీ తెలుగువారు చెప్పారు.   నేను విన్నవాటిలో అందరికీ పనికివచ్చేవి అనుకున్నవి ఈ లేబుల్ కింద చెబుతాను ఈ ప్రోగ్రాం చూడలేనివారికోసం.                  
జ్యోతిష్యం అంటే ఎంత నమ్మకం లేని వాళ్ళయినా ఏలినాటి శని గురించి భయపడతారు.  కానీ ఏలినాటి శని అంటే భయపడాల్సిన అవసరమే లేదని ధైర్యం చెప్పారు డా. సంధ్యా లక్ష్మి.  ప్రతి మనిషి జీవితంలో ఏలినాటి శని ముఫ్ఫై ఏళ్ళకొకసారి తప్పక వస్తుంది.  ప్రతిసారీ 7 సంవత్సరాలు వుంటుంది.  సగటున మనిషి జీవితంలో 19 ఏళ్ళు శని  ప్రభావంతో గడుపుతారు.  శనిని అస్సలు తిట్టకోవాల్సిన అవసరంలేదు.  ఎందుకంటే శని ఆయు­కారకుడు.  శని మందుడు కనుక తలపెట్టిన పనులను ఆలస్యం చేస్తాడు కానీ అసలు కాకుండా చెయ్యడు.  వివాహాలు, ప్రమోషన్లు, ఏ శుభ కార్యాలయినా కేవలం శని మూలంగా ఆగవు.  అవి కావటం లేదంటే శనే కాకుండా జాతకంలో ఇంకా వేరే గ్రహ ప్రభావాలుకూడా వున్నట్టు.

శనికి శనివారంనాడు అరచేతి వెడల్పు నల్లబట్టలో నల్ల నువ్వులు మూటలాగా కట్టి నవగ్రహాలు వున్నచోటో, లేక ఎక్కడన్నా శనీశ్వరుడుకి దానితో దీపారాధన చేసి, శనివారంనాడు 19 ప్రదక్షిణలు చేస్తే చాలా మంచిది.  జన్మ నక్షత్రం రోజున శివునికి అభషేకం చేయించినా మంచిది.

ఇవ్వన్నీ నమ్మేవాళ్ళున్నట్లే ట్రాష్ అని కొట్టిపారేసేవాళ్ళూ వున్నారు.  నేను దేనినీ సపోర్టు చెయ్యటం లేదు.  ఎవరి ఇష్టం వాళ్ళది.  అయితే ఒక్క విషయం మాత్రం అందరూ నమ్మితే బాగుంటుందనిపించింది....అదే శనికి భయపడాల్సిన అవసరం లేదని.  సరైన అవగాహన లేక అనవసర ఆందోళన చెందేవారికి ఇలాంటి ధైర్య వచనాలు అవసరం.  ఈ  విషయం  ఏదో నాలాంటి వాళ్ళు మాట వరసకి అన్నది కాకుండా ఆ సబ్జెక్టు చదువుకున్నవాళ్ళు చెబితే వినే వాళ్ళకి బాగుంటుంది  కదా.   అందుకే ఆ ప్రోగ్రాం చూడని వాళ్ళకోసం ఈ పోస్టు.

2 comments

Friday, April 16, 2010

అంటు అంటే ఏమిటి? ఎందుకు పాటించాలి?

Friday, April 16, 2010



అంటు అనగానే పెద్దవాళ్ళు చాదస్తంగా అది ముట్టుకోవద్దు, ఇది ముట్టుకోవద్దు అంటారని,  అంటు ముట్టుకుంటే చెయ్యి కడుక్కోమంటారని చిన్నవాళ్ళు విసుక్కుంటూంటారు.  పూర్వీకులు చెప్పినవెప్పుడూ, మన జీవన విధానాలను గుర్తుపెట్టుకని, మన మంచికే చెప్పారు.  కాల క్రమేణా వాటికి ఎవరికి తోచిన రంగులు వాళ్ళు పులిమి భయంకరంగా తయారు చేస్తున్నాము.

అసలు అంటు అంటే ఏమిటో తెలుసా?  అంటుకునేది.  తడి పదార్ధాలను ముట్టుకున్నప్పుడు చేతికి అంటుకుంటాయి.  అదే చేత్తో ఇంకో వస్తువుని ముట్టుకుంటే, పొరపాటున వీటిమీదికి చేరిన బాక్టీరీయా ఏమైనా వుంటే దానికీ వ్యాపిస్తుంది.  అందుకే అలా ఏదైనా చేతికి అంటుకుంటే కడుక్కోమన్నారు.  ఆ పదార్ధంమీద ఏ బాక్టీరియా లేకపోయినా, మన చేతులకో, వేళ్ళ గోళ్ళుకో వున్నా ఆ పదార్ధంద్వారా అన్నింటికీ వ్యాపించవచ్చు.  అలాగే  ఏ పదార్ధాన్నీ, ముఖ్యంగా తినేవాటిని ఎడమ చేత్తో పట్టుకోవద్దంటారు.  సరిగ్గా శుభ్రం చేసుకోకపోతే చేతి గోళ్ళల్లో వుండే బాక్టీరియా ప్రమాదకరంగా పరిణమిస్తుందని.  పిల్లలికి వచ్చే పోలియోకి ఈ బాక్టీరియా ముఖ్య కారణం.

ఆలోచిస్తే ఈ అంటులో చాదస్తం లేదు.  సైన్స్ వుంది.  మన శరీరం, చేతుల మీద వుండే బాక్టీరియా ఆహార పదార్ధాలకు పాకకుండా తీసుకునే జాగ్రత్త వుంది.  మరి ఈ చిన్న చిన్న జాగ్రత్తలతో సగం రోగాలను దూరంగా వుంచినట్లేగా.  

(జీ తెలుగు ప్రసారం చేసిన గోపురం ఆధారంగా)


2 comments

Wednesday, April 14, 2010

గుమ్మాలకి బంతిపూలు ఎందుకు కడతారు?

Wednesday, April 14, 2010



మన సాంప్రదాయం ప్రకారం గుమ్మాలకి, ముఖ్యంగా పండగల సమయంలో ఎక్కడ చూసినా  బంతిపూలు కడతారు.  అవి ఎందుకు కడతారో తెలుసా?  అసలు బంతిపూలే ఎందుకు కడతారు?  సువాసనలు వెదజల్లే మల్లెపూలో జాజిపూలో కట్టచ్చుగా.  అవ్వి ఒక్క రోజుకూడా వుండవు.  తొందరగా వాడిపోతాయి.  కొన్ని పూలు నెగెటివ్ ఎనర్జీకి లీడ్ చేస్తాయనే శంక ఒకటి.    ఇవ్వన్నీ ఎందుకని తేలిగ్గా, రంగు రంగుల్లో దొరికే బంతి వూలు కడతారంటున్నారా.  పైగా 2, 3 రోజులు వాడకుండా కూడా వుంటాయి, ధర కూడా తక్కువ.  అందుకే అవి కడతారు.  ఇది కూడా తెలియదా అంటున్నారా? 

మీరు చెప్పింది నిజమేనండీ.   అంతే కాదు.  దీని వెనుక ఇంకో శాస్త్రీయమైన కారణం కూడా వున్నది.   ఈ పూలకి క్రిమి సంహారక శక్తి వున్నది.  రంగు రంగుల ఈ పూలు తమ సువాసనలతో, రంగులతో, క్రిములనాకర్షించి ఇంట్లోకి రాకుండా చేస్తాయి.  తద్వారా మన ఆరోగ్య పరిరక్షణ చేస్తున్నాయి.  చూశారా  బంతి పూలు ఆకర్షణీయంగా, అందంగా వుండి ఇంటికి అందాన్ని ఇవ్వటమేగాక మన ఆరోగ్యాన్ని కూడా ఎలా రక్షిస్తున్నాయో.

ఊళ్ళల్లో పొలాల చుట్టూ గట్లమీద కూడా బంతి చెట్లని వేస్తారు.  వాటిని చూసి మనం, పల్లె అందాలకు సంతోషిస్తాము.  దాని వెనుక అసలు సంగతి కూడా పైన చెప్పినదే.  పంటలను పాడుచేసే కొన్ని రకాల  క్రిమి కీటకాలను ఈ బంతిపూలు తమ రంగు, వాసనలతో ఆకర్షించి నాశనం చేస్తాయి.   

(జీ తెలుగు ప్రసారం చేసిన గోపురం ఆధారంగా)



0 comments

Monday, April 12, 2010

పూయని పుష్పాల పూజ భగవంతునికి ప్రీతిపాత్రమైనది అంటారు. ఏమిటది?

Monday, April 12, 2010



పూయని పుష్పాల పూజ అంటున్నారు...ఆ తెలిసిందిలెండి  మేము రోజూ బంగారు పుష్పాలతో భగవంతుణ్ణి అర్చిస్తాము...అవేకదా  అంటున్నారా  కొందరు బంగారు పూలతో పూజ చెయ్యవచ్చు, కొందరు వెండి పూలతో చెయ్యవచ్చు, అలాగే వారి వారి అభిరుచులనుబట్టి భగవంతుణ్ణి అనేకమంది అనేక విధాల పూజించవచ్చు.  అయితే అన్ని పూలలోకి భగవంతుడికి అత్యంత ప్రీతిపాత్రమైన పూవు ఏమిటి  అంటే ఇదిగో అహింసా ప్రధమం పుష్పం.  ఆ అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడికి అత్యంత ప్రీతిపాత్రమైన పుష్పం అహింస.  ఇంక మరో పుష్పం ఏమిటంటే సర్వ భూత దయ.  అలాగే మిగతా పుష్పాలు శాంతి, క్షమ, తపస్సు.  క్షమా పుష్పం అన్నింటికన్నా విశేషమయినది.   ఈ పూవులు ఏ చెట్టుకీ పూయవు, ఎంత ధనమిచ్చినా కొనలేరు.  కేవలం మన నడవడి బట్టే సంపాదించవచ్చు ఈ పుష్పాలను.

రోజూ రాత్రి పడుకోబోయేముందు భగవంతుని ధ్యానించి ఈ పుష్పాలను సమర్పిస్తే చాలు.  ఎలాగంటే నేను ఇవాళ ఎవరినైనా ఏ విధంగానైనా, శారీరకంగానేకాదు, మానసికంగా అయినా సరే హింసించానా అని మీలో మీరు ఒక్కసారి ఆలోచించుకోండి.  సమాధానం లేదు అని వస్తే, భగవంతుడా, ఇవాళనేను నీకు అహింసా పుష్పం సమర్పిస్తున్నాను అని ఆ దేవ దేవునికి నమస్కరించండి.  అలాగే సర్వ భూత దయ..తోటి ప్రాణి పట్ల ఏవిధమైన  సానుభూతయినా చూపి, అవసరానికి సహాయం చేశామా.  ప్రతిరోజూ మన సహాయం కావాల్సినవాళ్ళు వుండక పోవచ్చు.  సహాయం చేయకపోయినా మనమెవ్వరికీ హాని చెయ్యకుండా వున్నా చాలు.  అలాగే ప్రాణికోటికి, ముఖ్యంగా పశు పక్ష్యాదులు, క్రిమి కీటకాలకు ఆహారాన్ని అందించామా.  సమాధానం అవును అయితే మీరు భగవంతునికి సర్వ భూత దయ అనే మరో పుష్పం సమర్పించవచ్చు.

అలాగే క్షమా పుష్పం.  ఎవరైనా మీ పట్ల అనుచితంగాగానీ, మీకు కష్టం కలిగేలాగానీ ప్రవర్తించినా,  వారిని క్షమించారా.  వారి పట్ల దురుసుగా ఏమీ మాట్లాడకుండా, ప్రవర్తించకుండా మీ సహనాన్నీ, క్షమా గుణాన్నీ ప్రదర్శిచారా.  అయితే మీరు భగవంతునికి క్షమా గుణమనే పుష్పం సమర్పించటానికి అర్హులు.

అలాగే సత్యం, ధ్యానం, తపస్సు, శాంతి ఇవ్వన్నీ మనమాచరించటం, ఈ గుణాలనే భగవంతునికి పూజా పుష్పాలుగా సమర్పించటం వల్ల ఏ భగవంతుడైనా భక్తుని తప్పక కరుణిస్తాడు.  భగవంతుడనేవాడున్నాడో, లేదో మనకి తెలియదు.  మనలో ఎవరం ఆయన్ని చూడలేదు.  భగవంతుని మీద నమ్మకం లేనివాళ్ళు కూడా ఇవి ఆచరించి చూడండి.   దానితో  సామాజికంగా ఎంత ప్రశాంతత నెలకొంటుందో, శాంతి సౌభ్రాతృత్వాలు ఎలా వెల్లివిరుస్తోయో మీకే అవగతమవుతుంది.  కనిపించే పుష్పాలు ఎన్నింటితో పూజించినా ఫలితం వెంటనే కనిపిస్తుందో కనిపించదో, ఈ కనిపించని, ఏ చెట్టుకూ పూయని పూవులతో పూజ చేస్తే భగవంతుడు మెచ్చటంతోబాటు మన కెంత లాభం.  సత్యం మాట్లాడటం, శాంతియుతంగా వుండటం, స్నేహ భావం పెంచుకోవటం వల్ల శాంతి వెల్లివిరుస్తుంది.  మనిషికి తేజస్సు, వర్చస్సు పెరుగుతుంది.  భగవంతుని ఇలాంటి పుష్పాలలో రోజూ కనీసం ఒక దానితో నయినా పూజించటంవల్ల మనం క్రమశిక్షణతో వుంటాం, దానివల్ల సమాజం బాగుపడుతుంది.

(జీ తెలుగు ప్రసారం చేసిన గోపురం ఆధారంగా)

4 comments