Friday, June 10, 2011

గోపురంలో పొరబాటా?

Friday, June 10, 2011

9-6-2011 ఉదయం జీ తెలుగు ప్రసారం చేసిన గోపురం కార్యక్రమంలో చిన్న పొరబాటు దొర్లింది. పొరబాట్లు ఎవరికైనా సహజం..దానినంత ఎత్తి చూపించాలా అనంటారా? వాళ్ళకన్నా నాకేదో బ్రహ్మాండంగా తెలుసనో, లేక వాళ్ళ తప్పుని ఎత్తి చూపించే అత్యుత్సాహంతోనో నేనిది రాయటంలేదు.

ఈ మధ్య టీవీలోవచ్చే ఇలాంటి కార్యక్రమాలపట్ల యువత చాలా ఉత్సాహం చూపిస్తోంది. చదువుకునే సమయంలో ఇలాంటివి నేర్చుకునే సమయం దొరకక మన సంస్కృతికి దూరమైనవారు, ఉద్యోగాలలో స్ధిరపడి దూరప్రాంతాలలో వుండి స్వదేశం, మన సంస్కృతివైపు మొగ్గుచూపుతూ ఈ మాధ్యమాలద్వారా అనేక విషయాలు తెలుసుకుంటున్నారు. దానికి ఉదాహరణ నా ఈ బ్లాగే. గోపురంలో నేను విని, నాకు నచ్చిన విశేషాలను పోస్టు చేస్తే దానికి స్పందన చాలా బాగుంటున్నది. అలాంటివారికోసమే ఈ తప్పు సవరించి నాకు తెలిసిన విషయం చెబుతున్నాను. వారు సరైన విషయం తెలుసుకోవాలనే అభిలాషతో మాత్రమే.

నిన్న కార్యక్రమంలో భగవంతునికి వస్త్రాలు సమర్పించే విషయంగురించి చెబుతూ, పూజలో భగవంతునికి నూతన వస్త్రాలు సమర్పించటానికి అవకాశం లేనప్పుడు పత్తితో చేసిన వస్త్రయుగ్మం సమర్పిస్తారని చెబుతూ, దానిని పత్తితో పొడుగుగా చేస్తూ మధ్య మధ్యలో గంధం, పసుపులతో పత్తిని నలిపి సన్నగా చేస్తారని చెప్పారు. నాకు తెలిసి దానిని యజ్ఞోపవీతమనీ, కొందరు, కంఠాభరణమనీ అంటారు. వస్త్రాలంటే పత్తితో గుండ్రంగా చేసి గంధం, కుంకుమ అద్దుతారు. వీటిని భగవంతునికి రెండు సమర్పిస్తారు. వస్త్రం ఒక్కటి ఇవ్వకూడదు. వస్త్రయుగ్మం సమర్పించాలి.

ఈ విషయంలో నాది పొరబాటయితే విజ్ఞులు సవరించాలని కోరుతున్నాను.


2 comments