Friday, March 27, 2009

కొంటె కోణాలు - 1

Friday, March 27, 2009
కొంటె కోణాలు - 1
ఫలానా టూత్ పేస్టే వాడండి. మీరు కారులో వెళ్తున్నా, రైల్లోకి అమాంతం దూకినా .. ఏమైనా సరే. డ్యూటీలో వున్న అమ్మాయి టికెట్ కలెక్టరు అయినా, ట్రాఫిక్ ఇన్స్పెక్టరు అయినా .... ఎవరైనా సరే. డ్యూటీ వదిలేసి మిమ్మల్ని లాక్కెళ్ళిపోతుంది. ఇవి టీ వీ లో వచ్చే యాడ్స్. మరి కొంటె కోణాలో....

అక్కడ అమ్మాయి ఒక్కతే వుండాలి. లేకపోతే వున్నవాళ్ళంతా మీ వెనక పడితే .....

ఆ పేస్ట్ తో మొహం కడుక్కున్న వాళ్ళు కూడా మీ రొక్కళ్ళే అయివుండాలి. లేకపోతే ......

ఒక్కళ్ళు ... ఒక్కళ్ళు సరిపోయేట్లయితే మరి ఆ అడ్వర్టైజ్ మెంటు ఖర్చు ఎలా రాబడతారు ఆ కంపెనీ వాళ్ళు. వాళ్ళ గోల మనకెందుకుగానీ...... మన కోణంలో ఆలోచిస్తే....

అమ్మాయిలు మరీ ఇంత అల్ప సంతోషులా!!!???? లేక మరీ ఇంత చీప్ అయిపోయారా!!!!??????

2 comments

కొంటె కోణాలు

కొంటె కోణాలు

మనిషి మనసులో ఎన్నో ఆలోచనలు. అందమైనవి కొన్నయితే ఆలోచింపచేసేవి మరి కొన్ని. అవునండీ. ఆలోచనలు కూడా ఆలోచింప చేస్తాయి. నిఝం. కావాలంటే ఆలోచించి చూడండి. మరి బాధాకరంగా వుండేవి కొన్నయితే భయంకరంగా వుండేవి ఇంకొన్ని. ఇలా చెప్తూ పోతే మనిషికుండే భావాలన్నీ పోగు పెట్టినట్లవుతుందిగానీ ఒక్క విషయం మాత్రం అందరం ఒప్పుకోక తప్పదు. ఏ మనిషిలోనైనా సరైన ఆలోచనలు వివేకాన్ని పెంపొందింపచేసి మంచికి మార్గం చూపిస్తే, దురాలోచనలు దుష్ప్రవర్తనకీ, దుర్మార్గానికీ దారి తీస్తాయి. మరి మెరుపు తీగల్లా అప్పుడప్పుడూ తళుక్కుమనే కొంటె ఆలోచనలు కొన్ని చిరునవ్వు తెప్పిస్తే మరికొన్ని మళ్ళీ మళ్ళీ నవ్విస్తాయి. అలాంటి కొన్ని కొంటె కోణాలని ఆవిష్కరించే ప్రయత్నమే ఇది. గుర్తొచ్చినప్పుడల్లా నవ్వుతూ వుండండేం. నవ్వు నానా విధాల ఆరోగ్యకరమని నవ్వే ప్రతి వాళ్ళూ చెప్తున్నారు మరి.

0 comments

Wednesday, March 18, 2009

శపధం - లఘు నాటిక

Wednesday, March 18, 2009

శపధం



(నేను వ్రాసిన ఈ లఘు నాటిక మహిళా దినోత్సవ సందర్భంగా 4-3-2009 న హైదరాబాదు ఎ.జీ. ఆఫీసు ఆరుబయలు రంగస్ధలంలో ప్రదర్శింపబడింది. ప్రముఖ నటుడు, టి.వి. ఆర్టిస్టు శ్రీ పెరుమాళ్ళు దర్శకత్వం వహించారు.)

పరిచయ వాక్యాలు తెరలోంచి
(తరాలు మారుతున్నాయి. స్త్రీలు ఎంతో పురోభివృధ్ధి చెందుతున్నారు. అనేక రంగాలలో ఎదుగుతున్నారు. అయినా, ఆడవారి కన్నీటి గాధలు మాత్రం కనుమరుగు కాలేదు. కష్టాలు కడతేరలేదు.... రూపు రేఖలు మార్చుకుని కొత్త కష్టాలు తయారవుతున్నాయి...... కొత్త నేరాలు పెరుగుతున్నాయి....అతివల ప్రాణాలకి విలువ లేకుండా పోతోంది....ప్రేమ పేరుతో అమాయకుల ప్రాణాలు అవలీలగా తీసుకోవటం ఇప్పుడు ఆటయింది. వీటినిలా సాగనివ్వాల్సినదేనా ఆపటానికి మనవంతు ప్రయత్నం ఏంచెయ్యాలి అనే ఆలోచనలోంచి వచ్చిందే ఈ శపధం. ఘోర ప్రేమకి బలైపోయిన అమాయకుల ఆర్తనాదాలు ఇవి. వీటిని ఆపటానికి అందరూ కలసి చెయ్యవలసినదే ఈ శపధం.)


రమః-- హలో నేను గుర్తున్నానా నేనండీ. రమని. నిన్న మొన్నటిదాకా మీ మధ్య తిరుగుతూ మీతో సంతోషంగా గడిపినదాన్ని. మా అమ్మా నాన్నలకు ఒక్కగానొక్క కూతుర్ని. మా అమ్మా నాన్నా నన్నెంత ప్రేమగా చూసుకునేవాళ్ళో.. వాళ్ళపాలిటి్ పెన్నిది అన్నారు నన్ను. చదువుల సరస్వతి అని మెచ్చుకునే వాళ్ళు. ఎంతయినా చదువుకోమన్నారు. అమ్మ చిన్న పని కూడా చెప్పేది కాదు. పెళ్ళయితే బాధ్యతలూ పనులూ తప్పవు. మా దగ్గర మహా రాణిలాగా బతుకు అనేది. అమ్మా, నాన్నా, చదువు, స్నేహితులతో ఆట పాటలు తప్ప వేరే లోకం లేని నేను ఆ రాక్షసుడుకెలా నచ్చానో తెలియదు. ప్రేమ ప్రేమ అంటూ వెంటపడ్డాడు.

(ఉమ ప్రవేశం)

ఉమః-- హాయ్ రమా నన్ను గుర్తు పట్టావా. ఉమని. నీ కధ నాకు తెలుసు.

రమః-- తెలుసా అయితే నన్ను నమ్ముతావా నాకు చదువు తప్ప ప్రేమా గీమా ఏమీ తెలియదు. ఎవరో అనుకున్నట్లు నేనెవర్నీ మోసం చెయ్యలేదు.

ఉమః-- నాకు తెలుసు రమా. నువ్వు చాలా మంచిదానివి. నేను నిన్ను నమ్ముతాను. ఎందుకంటే నేనూ నీలాగే వ్రేమాగ్నికి ఆహుతి అయిన సమిధనేగా. మా అమ్మా నాన్నా ఎంత ప్రేమగా చూసుకునేవాళ్ళు మమ్మల్ని. ఎంత అందమైన జీవితాన్నిచ్చారు మాకు.

(సుమ ప్రవేశం. వస్తూనే) అవును. మా అమ్మా నాన్నా కూడా . ఎంత హాయిగా వుండేవాళ్ళం. మా తమ్ముడు. ఆ వెధవతో అల్లరి చెయ్యకపోతే నాకేమీ తోచేది కాదు. ఇద్దరం ఇంటినపడి ఎంత అల్లరి చేసేవాళ్ళం. ఇప్పడా ఇల్లు ఒక శ్మశానం లాగా వుంది.

రమః-- నువ్వు

సుమః-- నేను సుమని. మీ మాటలు విని ఇటు వచ్చా. నేనూ మీ కోవకి చెందినదాన్నే.

ఉమః-- నిన్నూ ఎవడైనా ప్రేమించాడా
సుమః-- ఊ. ప్రేమించానన్నాడు. అమ్మా, నాన్నా, తమ్ముడూ, ఇలా నన్ను ప్రేమించిన వాళ్ళంతా నేను సంతోషంగా వుండాలనుకుంటే ఈ వెధవమాత్రం ప్రేమ పేరుతో నా జీవితాన్ని నరకం చేశాడు. చివరికి యాసిడ్ పోసి నన్నే చంపేశాడు. ఇదేనా ప్రేమంటే

(రమా, ఉమా) అమ్మో (అంటూ యాసిడ్ వాళ్ళమీదే పడ్డట్లు ముఖాలమీద చేతులు పెట్టుకుని భయంతో ఒక్కడుగు వెక్కి వేస్తారు.)

(సుమ గడగడా వణికి పోతుంది. యాసిడ్ అప్పుడే పోసినట్లు, ఆ బాధ తట్టుకోలేనట్లు...)
సుమ మంటలు మంటలు. అబ్బ. వారం రోజులు ఆ నరకం అనుభవించిన తర్వాత ప్రాణాలే పోగొట్టుకున్నాను.

రమః-- ఆ బాటిల్ లాక్కుని వాడి మొహాన్నే కొట్టుండాల్సిది.

సుమః--(అంత బాధననుభవుంచిన తర్వాత నీరసంతో) ఆ సమయంలో అంత తోస్తుందా. నేనూహించని సంఘటన అది.

ఉమః-- నిజమే నిన్ను క్లాసు రూములో కత్తితో పొడుస్తుంటే నువ్వే కాదు. నీ చుట్టూవాళ్ళు కూడా ఏమీ చెయ్యలేకపోయారు కదా. నన్ను నడిరోడ్డులో కత్తితో పొడిస్తే ఏం చేశాం.

రమః-- మనమేమీ చెయ్యలేక పోయాము. అందరూ తేరుకునేసరికి వాళ్ళు పారిపోయారు. గొప్ప ప్రేమికులు.

సుమః-- అసలు వాళ్ళెవరో ప్రేమిస్తే మనం ప్రేమించక్కరలేదా. కాదన్న నేరానికి మనమిలా బలి కావాలా ఇదెక్కడి న్యాయం ప్రేమంటే ఇదేనా. ఎదుటివాళ్ళు ప్రేమించకపోతే చంపెయ్యటమేనా

ఉమః-- వాళ్ళ మొహం. ప్రేమా దోమా. సరైన ప్రేమా సిన్సియారిటీ వాళ్ళకెక్కడేడిశాయ్.

సుమః-- అవ్వే వుంటే జీవితాల విలువ తెలిసేది. అవ్వేమిటో తెలియదుగనుకే అమ్మా నాన్నా గాలికొదిలేస్తే ఏం చెయ్యాలో తోచక ఇలా జనం మీద పడతారు.

రమః-- వాళ్ళ అమ్మా నాన్నా మన అమ్మా నాన్నల్లాంటి వాళ్ళు కారా

ఉమః-- ఎవరికి తెలుసు వాళ్ళు బాధ్యత లేని వాళ్ళో వీళ్ళు బరితెగించినవాళ్ళో.

సుమః-- ఎవరెలాంటి వాళ్ళయినా నష్టపోయింది మనం, మన కుటుంబాలు.

రమః-- పాపం. అమ్మా నాన్నా నా కోసం ఎంత బాధ పడుతున్నారో. వాళ్ళేం పాపం చేశారని వాళ్ళ కీ శిక్ష.

ఉమ-- మా అమ్మ దిగులుతో మంచంమీదనుంచి లేవటంలేదు. చెల్లయితే బయటకు వెళ్ళటానికే భయపడుతోంది. ఆ వెధవ మూలంగానే కదా మాకీ కష్టాలన్నీ.

రమః-- అసలు మనల్నింత బాధపెట్టే హక్కు వీళ్లకెవరిచ్చారు

సుమః-- బోడి ప్రేమ వాడొక్కడే ప్రేమిస్తే సరిపోతుందా. ఎదుటివాళ్ళు ప్రేమించక్కర్లేదా

ఉమః-- మనమేమైనా ప్రేమ కోసం వెంపర్లాడామా మనం, మన చదువు, మన కెరీర్ వీటితోనే సతమతమవుతుంటే ప్రేమకీ దోమకీ టైమెక్కడిది.

సుమః-- ఎవడో ప్రేమిస్తున్నానంటే పళ్ళికిలించుకుంటూ మనమూ ప్రేమించెయ్యాలా మన అభిప్రాయాలకీ, మన కోరికలకీ విలువ లేదా.

రమః-- అక్కడికీ చెప్పాను. నాకు కెరీర్ ముఖ్యం. నాకలాంటి ఆలోచనే లేదని.

ఉమః-- వినలేదు. వాడి ఖర్మ అని వదిలేశాను.

సుమః-- ఇంకా విసిగిస్తుంటే ఇంట్లో చెప్పాను.

రమః-- వాళ్ళు చెప్పి చూసినా వినకపోతే పోలీసులకు చెప్పారు.

ఉమః-- వాళ్లేం చేశారు

రమః-- కంపైంట్ తీసుకుని యాక్షను తీసుకుంటామన్నారు.

సుమః-- నన్ను కూడా అనుమానించి ప్రశ్నలతో విసిగించారు.

ఉమః-- అసలు మన జీవితాలతో ఆడుకునే హక్కు వీళ్ళకెవరిచ్చారు

రమః-- మనల్ని చంపే అధికారం వీళ్ళకెవరిచ్చారు

సుమః-- అంతగా పిచ్చెక్కితే ఆ చావేదో వాళ్ళే చావచ్చుగా మనల్ని చంపటం ఎందుకు

రమః-- చూసే వాళ్ళు కూడా చోద్యం చూశారేగానీ ఇదేమిటని ఒక్కళ్ళన్నా అడిగారా

ఉమః-- రోజు రోజుకీ ఈ ఘోరాలు పెరిగి పోతున్నాయి.

సుమః-- అడిగేవాళ్ళు లేరని పెట్రేగి పోతున్నారు.

రమః-- వీటిని ఇలాగే సాగనిస్తారా

ఉమః-- ఇవాళ మేమయ్యాము

సుమః-- రేవు మీ వాళ్ళు

రమః-- మీ వాళ్ళు

ఉమః-- మీ వాళ్ళు కావచ్చు

సుమః-- ఆ రేపు రానియ్యకండి

రమః-- ఆలోచించండి

ఉమః-- అమాయక జీవులతో ఆటలాడుకోవద్దు

సుమః-- ప్రేమ పేరుతో ప్రాణాలు తియ్యద్దు

రమః ఈ ఘోరాల్ని ఆపండి.

ఉమః తల్లి దండ్రుల ఉసురు పోసుకోవద్దు.

సుమః కాలేజీ విద్యార్ధుల్లారా ఇది మీ కాలేజీ విద్యార్ధులకు సంబంధించిన విషయం

రమః-- తల్లి దంఢ్రులారా, ఇది మీ పిల్లలకు సంబంధించిన విషయం

ఉమః -- సోదర సోదరీ మణులారా, ఇది మీ తోబుట్టువులకు సంబంధించిన విషయం

రమః-- మాకెందుకులే అని వూరుకోకండీ.

సుమః అందరూ కలసికట్టుగా పోరాడండి.

రమః-- ఇలాంటి అన్యాయాలు ఎక్కడ కనిపించినా అడ్డుకోండి

(ముగ్గురీ కలసి) మాలాంటి వాళ్ళని బ్రతికించండి. మాకు బతకాలని వుంది. మమ్మల్లి బతికించండి.

(ఆడియన్సులోంచి ఒక్కొక్కళ్ళూ ఒక్కో డైలాగు చెప్తూ కొందరు లేచి రావాలి).

అవును. ఈ అన్యాయాలు సాగనివ్వం. మా విద్యార్ధులకు మేము తోడుగా వుంటాం.

మా బిడ్డలకు మేము తోడుగా వుంటాం.

మా తోబుట్టువులకు మేము తోడుగా వుంటాం.

ఒకరికొకరం మేము తోడుగా వుంటాం.

ఈ అన్యాయాన్నెదిరిస్తాము.

మిమ్మల్ని బతికిస్తాము.

మిమ్మల్ని బతికిస్తాము.












3 comments

Saturday, March 14, 2009

రైలోపాఖ్యానం -- ఫోటోలు

Saturday, March 14, 2009
రైలోపాఖ్యానం -- ఫోటోలు
రైలోపాఖ్యానం చదివారు కదా. ఇవిగో 15-02-09 గుంటూరు--సికింద్రాబాదు ఇంటర్ సిటీ ఎక్స్ప్రెస్ -- కంపార్టుమెంటు 3 ( ముందు డి వుందనుకుంటాను) ఫోటోలు.




రైలోపాఖ్యానం -- ఫోటోలు





7 comments

Friday, March 13, 2009

రైలోపాఖ్యానం

Friday, March 13, 2009
రైలోపాఖ్యానం

(ఆంధ్ర భూమి సచిత్ర వార పత్రిక వారు.... ఆలోచించండి....అనే ఒక క్రొత్త శీర్షిక ప్రారంభించారు. దీనిలో 19-3-2009 సంచికలో ప్రచురించబడిన నా వ్యాసం ఇది).

ఆలోచించండి....హృదయమున్న ప్రతి ఒక్కరూ స్పందించగలిగిన, స్పందించవలసిన కాలమ్ ఇది.

15-02-2009న గుంటూరు నుంచి సికింద్రాబాద్ వచ్చే ఇంటర్ సిటీ ఎక్సప్రెస్ లో విజయవాడలో ఎక్కాం మేము ఏడుగురం. ఇబ్బంది లేకుండా ప్రయాణం చేసే ఉద్దేశ్యంతో టికెట్లు ముందే రిజర్వు చేసుకున్నాం. విజయవాడలో రైలు ఎక్కడానికి మేము ఏడుగురం మూడు ఎంట్రెన్స్ ల ద్వారా తోసుకుంటూ, నెట్టుకుంటూ, మాకు రిజర్వేషన్ వుంది, జరగండి అని అరుచుకుంటూ చిన్న సైజు దొమ్మీ చేశాం. అంతే కాదు అప్పటికే మా సీట్లల్లో కూర్చున్నవారిని లేపి మరీ కూర్చోవాల్సి వచ్చింది. మాకేం పాపం అంటుకోదులెండి వాళ్ళని లేపినందుకు. వాళ్ళు మా నెత్తినే నుంచుని మరీ కక్ష తీర్చేసుకున్నారు.

స్టేషన్లో రైలాగినప్పుడల్లా దిగేవారు ఒకరిద్దరైతే ఎక్కేవారు పది, పదిహేనుమంది. అందరూ యుధ్ధ వీరులే. అంతలోనే పోట్లాటలు...ఎక్కడ కొట్టుకుంటారో...మీద పడిపోతారేమో....మళ్ళీ అంతలోనే సద్దుబాట్లు...మామూలు మాటలు. హమ్మయ్మ మన వాళ్ళకి సర్దుబాటు గుణం చాలా ఎక్కువగా వుందనిపించింది. లేకపోతే టిక్కెట్టు కొని మరీ ఆరు గంటలు ఆ నరకయాతన ఎలా భరిస్తున్నారు ఇంకో కొంటె ఆలోచన. యమలోకం ఫుల్ అయిందో లేకపోతే అక్కడ కూడా సిబ్బందిలో కోత వల్లనో మనుషులు బ్రతికుండగానే కొన్ని శిక్షలు భూమ్మీద ఇలా వేసేస్తున్నారేమో. ఇది చదివే వాళ్ళలో రైల్వే అధికారులు, ప్రభుత్వాధికారులు వుండొచ్చునని ఆశ, లేదా ఏం చేయగలం అని మీరూ ఆలోచించవచ్చు సరదాగా.

ఇదివరకెప్పుడో మేము కాజీపేట నుంచి సికింద్రాబాద్ ఈ రైల్లోనే వెళ్ళాం. అప్పుడూ ఇంతే. ఈ రైలు తనకి మించిన భారాన్ని తలకెత్తుకుంది. ఇప్పుడూ ఇంతే. ఏమీ మారలేదు.

ఈ రైల్లో ఇంతమంది ప్రయాణిస్తున్నట్లు అసలు రైల్వే వాళ్ళకి తెలిసుండదండీ. ఈ రైలు కసలు టీ.సీ.లు లేరు. మేమీ రెండుసార్లూ చూడలేదు. వున్నా ఆయన కాలు పెట్టే చోటేదీ అదే వుంటే ఇంకో పది మంది ఎక్కేస్తారు. పోనీ దిగాక స్టేషన్ లో టిక్కెట్ కలెక్టరుండి టికెట్లు తీసుకుంటే కొంతయినా లెక్కలు తెలిసేవి. ఆదీ లేదు.

గాలి కూడా చొరబడలేనంత సంఖ్యలో ఒక రైల్లో ప్రయాణీకులు ఎక్కుతున్నారంటే లిమ్కాబుక్కులూ, గిన్నీసు బుక్కుల వాళ్ళేం చేస్తున్నారు మనమంటే అంత అలుసా

సాయంత్రం 4 గంటలకి విజయవాడలో ఎక్కిన వాళ్ళలో పసివారి దగ్గరనుంచీ వయోవృధ్ధుల దాకా, రౌడీలనుంచీ తాగుబోతుల దాకా అనేక రకాల మనుషులు, కాలు కూడా కదపటానికి లేక అలాగే నుంచున్నారు. మరి వీళ్ళకి రైలు వీర, రైలు చక్ర లాంటి బిరుదులిచ్చే వుద్దేశ్యం రైల్వే వారికి వుందా?

అసలు మన వాళ్ళు మరీ ఇంత అమాయకులూ, మంచివాళ్ళూ అయితే ఎలాగండీ? టిక్కెట్టు కొని ఆరు గంటలు అలా నుంచుని ప్రయాణం చేసి నోరు మెదపట్లేదంటే నాదుట్టి మనిషి బుర్రండీ. ఏదో అనుమానం. రైల్వేవాళ్ళకి ప్రింటింగ్ ఖర్టు తగ్గిద్దామని టిక్కెట్లు వాళ్ళ దగ్గరే భద్రంగా వున్నాయా అని.

అవునూ ఈ మధ్య అనేక యాక్సిడెంట్ల గురించి వింటున్నాం. భగవంతుడా ఈ రైలుని సర్వవేళలా కాపాడు.

ఇన్ని కష్టాల్లో ఒకటే సుఖం. తన బరువు తొందరగా వదిలించుకోవాలని రైలు గబగబా పరిగెత్తి టైముకి గమ్యం చేరింది.

సందర్భం వచ్చింది కదా. రైల్వే వాళ్ళకి ఇంకొన్ని సలహాలు మీ తరుఫున గూడా చెప్పేస్తానేం. వాళ్ళు వినకపోతే మాత్రం నన్నడగద్దు.

కంప్యూటర్లకి కూడా 60 ఏళ్ళు దాటిన వాళ్ళు సీనియర్ సిటిజన్లు అని నేర్పేశారు రైల్వేవారు. అవేమో వీళ్ళని గౌరవించటం వాటి తక్షణ విధి అని, వాళ్ళనెప్పుడూ ఉన్నత స్ధానంలో చూడాలనే సదుద్దేశ్యంతో వాళ్ళకి మిడిల్ బెర్తులూ, అప్పర్ బెర్తులే కేటాయిస్తాయి. వాళ్ళకి మరీ అంత మర్యాద అక్కరలేదు, ఏదో లోయరు బెర్తుల్లో సర్దుకుంటారని కాస్త గట్టిగా చెప్పరూ.

ఇంకో విషయం...సీజను టికెట్టు వాళ్ళు, తక్కువ దూరం ప్రయాణించే వాళ్ళు రైలంతా వాళ్ళ సొంతమైనట్లు స్లీపర్ బోగీలు, ఎ.,సీ.. బోగీలు చెడతిరిగేస్తారు. వాళ్ళకోసం కొన్ని బోగీలు కేటాయిస్తే ఇంచక్కా కబుర్లు చెప్పుకుంటూ వెళ్ళొస్తారు కదా.


రైలు జ్ఞానం లేని దాన్ని ఏదో చెప్పాను. కోపం తెచ్చుకోక కొంచెం ఆలోచించండి.

6 comments

Tuesday, March 3, 2009

క్రికెట్ని దెబ్బ తీసిన ఆటంకవాదులు

Tuesday, March 3, 2009
క్రికెట్ ని దెబ్బ తీసిన ఆటంకవాదులు

పాకిస్తాన్ లోని లిబర్టీ స్క్వేర్ లో శ్రీలంక క్రికెట్ టీమ్ మీద ఉగ్రవాదుల కాల్పులు...7గురు శ్రీలంక ఆటగాళ్ళకి గాయాలు...ప్రమాదంలేదు. గాయపడినవారిలో జయవర్దనే, సంగక్కర, మెండిస్....అసిస్టెంట్ కోచ్ వున్నారు.

ఈరోజు (3-03-2009) ఉదయం 8-39 నుంచి 8-51 వరకి 12 నిముషాలపాటు జరిగిన కాల్పులలో ఆటంకవాదులు ఎ.కె. 47, రాకెట్ లాంచర్లు వాడారు. శ్రీలంక క్రికెట్ టీమ్ బస్ మీద గ్రెనేడ్ల్ విసిరారు. బస్లులోకి తుపాకీ తూటాలు చొచ్చుకు పోయాయి.

అరగంటసేపు ఉగ్రవాదులకు, పాకిస్తాను పోలీసులకు మధ్య జరిగిన పోరాటంలో 5 మంది పాకిస్తాను పోలీసులు చనిపోయారు. పోలీసులు స్టేడియం దగ్గర 2 కారు బాంబులను నిర్వీర్యం చేశారు. కాల్పులు జరిపిన వారుగా అనుమానిస్తున్న సలుగురు ఉగ్రవాదులను ఆయుధాలతో సహా పట్టుకున్నారు.

శ్రీలంక ఆటగాళ్ళని ఆర్మీ హెలికాప్టరులో పాకిస్తాన్ ఎయిర్ పోర్టుకి తరలించారు. అక్కడనుండి శ్రీలంకకి వెళ్ళబోతున్నారు. పాకిస్తానులో ఏ జట్టు పర్యటిచకపోయినా మేము ధైర్యంచేశామని రణతుంగ అన్నారు.

ఈ వార్త తెలియగానే శ్రీలంక తమ ఫారెన్ మినిస్టరుని పాకిస్తాను పంపించింది.

సెక్యూరిటీ లోపాలు లేవని చెప్తున్నారు. సెక్యీరిటీ ది బెస్ట్ అయితే అంతమంది ఆంటంకవాదులు అన్ని ఆయుధాలతో ఎలా జొరబడి కాల్పులు జరిపారో నాలాంటి సామాన్యులకు అర్ధం కాదు.
ఇండియా న్యూజీలాండ్ టీమ్స్ ముంజేతులకు నల్ల బ్యాడ్జ్ లు కట్టుకుని తమ నిరసన తెలియజేశారు.
ఒక దేశ ప్రతినిధులుగా క్రికెట్ ఆడటానికి వెళ్ళిన ఆటగాళ్ళు క్షతగాత్రులై అర్ధాంతరంగా తిరుగు ప్రయాణమవుతుంటే ఇంకే దేశవాసులన్నా ఏ ధైర్యంతో పాకిస్తాన్ వెళ్తారు

2 comments

Sunday, March 1, 2009

నువ్వంటే నాకిష్టం నేస్తం

Sunday, March 1, 2009
నువ్వంటే నా కిష్టం నేస్తం


నువ్వంటే నాకిష్టం నేస్తం
నిన్ను చూసుకునే నాకీ ధైర్యం
ఈ సంసార సాగరానికి గమ్యానివి నీవని
ఈ బాధామయ ప్రపంచంలో వీచే చల్లని పిల్లగాలివి నీవని
నాకు తెలుసు నేస్తం, నాకు తెలుసు.
అందుకే నువ్వంటే నా కిష్టం నేస్తం
నిన్ను చూసుకునే నాకీ ధైర్యం

ఏదో ఒకనాడు తప్పక నీవు వస్తావని
ఎవరు మరచినా నన్ను నీవు మరువలేవని
నీ చల్లని ఒడిలో చేర్చి నా బాధ మరిపిస్తావని
ఈ భవ బంధాలనుండి నాకు చేయూతనిస్తావని
నాకు తెలుసు నేస్తం నాకు తెలుసు
అందుకే నువ్వంటే నాకిష్టం నేస్తం
నిన్ను చూసుకునే నాకీ ధైర్యం

నీ ఉనికే జీవితానికి అర్ధం తెలిపింది
నీ పలకరింపే బ్రతుకుమీద మమత నేర్పుతోంది
నీ ఆగమనమే మనిషి విలువ పెంచుతోంది
నీవు లేనినాడు ప్రపంచంలో అశాంతి పెరుగుతుంది
అందుకే నువ్వంటే నాకిష్టం నేస్తం
నిన్ను చూసుకునే నాకీ ధైర్యం

నిన్ను చూసి భయపడుతుంది ఈ ప్రపంచం
నీ మాట అంటేనే ఉలికులికి పడుతుంది ఈ ప్రపంచం
నీ వంటి మంచి మిత్రుడుండడని తెలియలేకపోతోంద పాపం
నీవు చూపించే స్వర్గాలను ఉహించ లేకపోతోందేం శాపం

అయినా మిత్రమా, మృత్యువా
నిన్ను ఈసడించినవారికి
దూరంగా తొలగి పోలేవు నువ్వు
పక్షపాత బుధ్ధి చూపలేవు నువ్వు
అందులోనే వుంది నీ గొప్పతనం
అందుకే నువ్వంటే నాకిష్టం నేస్తం
నిన్ను చూసుకునే నాకీ ధైర్యం

(తరుణి మాస పత్రికలో 1980 దశకంలో ప్రచురించబడింది)
.......................................................................

0 comments