Wednesday, September 29, 2010

రావి చెట్టు ఇంట్లో పెరగకూడదా?

Wednesday, September 29, 2010


 రావిచెట్టుని అత్యంత పవిత్రమైనదిగా భావిస్తారు.  విష్ణుస్వరూపమనీ, శని దోషాలు పోగొడుతుందనీ, ఆలయాల్లో ప్రదక్షిణలు కూడా చేస్తారు.  అలాంటి పవిత్రమైన వృక్షం ఇంట్లో మొలిస్తే కీడు జరుగుతుందని పీకేస్తారు.  ఇదెంతమటుకు సమంజసం?  

అసలు నిజమేమిటంటే రావిచెట్టు ఇంట్లో మొలవటంవల్ల ఎలాంటి దోషమూ లేదు.  అయితే ఆ చెట్టు చాలా కాలం వుంటుంది.  పెద్ద చెట్టవ్వటంవల్ల వేళ్ళు బలంగా భూమిలోపలదాకా చాలా దూరం పాకుతాయి.  దానితో మన ఇంటి పునాదులు, గోడలే కాక చుట్టుపక్కల ఇళ్ళకి కూడా నష్టం కలగవచ్చు.  కొన్ని సార్లు ఇళ్ళు కూలిపోయేదాకా కూడా వెళ్ళవచ్చు.

పెద్ద వృక్షాలుకనుక సహజంగా పక్షులు గూళ్ళుకట్టి గుడ్లు పెడతాయి.  వాటికోసం కొన్నిసార్లు పాములు రావచ్చు.  ఆ పక్షులు, పాములు ఇంట్లోకి రావటం ఇబ్బందే కదా.  కొన్నిచోట్ల కొమ్మలు కరెంటు తీగెలకి అడ్డు రావచ్చు, విరిగి ఎవరిమీదయినా పడవచ్చు.  అందుకే రావిచెట్టేకాదు, ఏ పెద్ద చెట్టయినా ఇంట్లో పెరగటం అంత మంచిది కాదు.

అయితే రావి చెట్టు సాక్షాత్తూ విష్ణు స్వరూపమంటారు, పైగా ఆ చెట్టు గాలి కూడా చాలా మంచిది కనుక దాన్ని పీకి పెంట కుప్పమీద పారెయ్యకుండా, వీలయితే ఎక్కడన్నా విశాలమైన ఆవరణలో పాతి పెట్టటానికి ప్రయత్నించండి.

(జీ తెలుగు ప్రసారం చేసిన గోపురం ఆధారంగా)



0 comments

Friday, September 24, 2010

నవగ్రహాలు - వాటికి సంబంధించిన ధాన్యాలు

Friday, September 24, 2010



జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ప్రతి గ్రహానికీ వాటికి సంబంధించిన ధాన్యాలున్నాయి.  ఎవరికైనా జాతక చక్రంలో దోషాలేవైనా వున్నా, గ్రహ దోషాలవల్ల అనారోగ్యంపాలయినా,  ఆ గ్రహాలకి సంబంధించిన ధాన్యాలను దానం చెయ్యటం, తినటం వల్ల ఆ దోషాలు పోతాయని, స్వస్ధత చేకూరుతుందనీ అంటారు.  అవేమిటో చూద్దామా

రవి         --          గోధుమలు

చంద్రుడు   --          బియ్యం

కుజుడు     --          కందులు

బుధుడు    --          పెసలు

గురువు     --          శనగలు

శుక్రుడు     --          బొబ్బర్లు

శని           --          నువ్వులు

రాహువు    --           మినుములు

కేతువు      --           ఉలవలు    


5 comments

Wednesday, September 22, 2010

సఖి – ఈ టీవీ 2 కార్యక్రమం

Wednesday, September 22, 2010



అక్టోబర్ 1 వ తారీకు సీనియర్ సిటిజన్స్ డే ట.  ఈటీవీ-2 సఖి కోసం ఒక కార్యక్రమాన్ని రూపొందిస్తున్నాము, తప్పకుండా రండి అని డైరెక్టరు శ్రీమతి ఐ..వి. రమాదేవి గారి ఆహ్వానం మేరకు 20-9-10 న కార్ఖానా లోని శ్రీమతి లక్ష్మిగారింటికి వెళ్ళాము నేనూ, శ్రీమతి మాలా కుమార్.  రమాదేవిగారి ఉద్దేశ్యం ప్రస్తుతం సీనియర్ సిటిజన్స్ చాలా అర్ధవంతంగా జీవితాన్ని గడుపుతున్నారని, తమ తీరిక సమయాన్ని చక్కగా వినియోగించుకుంటున్నారనీ, యువత వీరిని చూసి స్ఫూర్తి పొందాలని.

మేము వెళ్ళేసరికి అక్కడ పదిమందిదాకా మహిళలున్నారు.  అందరూ ఈ వయసులో ఉత్సాహంగా తమ జీవితాలనీ, సమయాన్నీ సద్వినియోగం చేసుకుంటున్నవాళ్ళే...అందరూ ఎంతో ఉత్సాహంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.  నేను, మాలాకుమార్, రమాదేవి తప్ప మిగతా అంతా మాకు కొత్త.  అయినా ఎంతో  ఆత్మీయుల్లా పరస్పరం పరిచయాలు, అడ్రసులు, ఫోన్ నెంబర్లు ఇచ్చి పుచ్చుకోవటాలు,  తమ తమ కార్యక్రమాల గురించి చర్చలు.  ఉదయం 10-30 కి వెళ్తే మధ్యాహ్నం 1 గం. దాకా సమావేశం, టీవీ కార్యక్రమం చిత్రీకరణ అయ్యాక సమీపంలోని శ్రీమతి మాలాకుమార్ ఇంటికి వెళ్ళి తిరిగి ఇళ్ళకి చేరాము.

ఈ కార్యక్రమం అక్టోబర్ 1 వ తారీకు మధ్యాహ్నం ఈటీవీ 2 ప్రసారం చేసే సఖి కార్యక్రమం లో వస్తుంది.  మధ్యాహ్నం 2 గం. ల నుంచీ 3 గం. ల దాకా ఆ కార్యక్రమం ప్రసారమవుతుంది.  అందులో ఒక పది నిముషాలు మా కార్యక్రమం వస్తుంది.  అవకాశం వున్నవారు తప్పక చూడండి.

ఈ కార్యక్రమానికి శ్రీమతి హైమా శ్రీ గారు ఏంకర్ గా వ్యవహరించి తన ప్రతిభని కనబరిచారు.
డైరెక్టర్ శ్రీమతి రమాదేవి, యాంకర్ శ్రీమతి హైమ శ్రీ తో పాల్గొన్న బృందం
  
షూటింగ్
డైరెక్షన్ చేస్తూ శ్రీమతి రమాదేవి
 షూట్ చేస్తూ కెమేరామేన్ శ్రీ రమేష్

5 comments

Thursday, September 16, 2010

మంత్రాలను బహిరంగంగా ఉపదేశించవచ్చా?

Thursday, September 16, 2010

 
 మంత్రాలు గురు ముఖంగా ఉపదేశింపబడాలంటారు, అదీ రహస్యంగా.  పైగా గురువు కొన్నాళ్ళు శిష్యులను పరీక్షించి వారు దానికి అర్హులు,  సరిగ్గా చెయ్యగలరు అని తెలిశాక ఇస్తారు అంటారు.  మరి ఈ మధ్య శాస్త్రవేత్తలు, ప్రముఖ గురువులు, అనేకమంది పెద్దలు మంత్రాలను బహిరంగంగా సభల్లోకూడా ఉపదేశిస్తున్నారు.  ఇలా చెయ్యవచ్చా అని చాలామందికి సందేహాలు వస్తున్నాయి.

మంత్రాలలో అనేక రకాలు.  వాటిని  కొన్ని వర్గాలుగా విభజించారు.  ఉదా... శాంతీకరణ మంత్రాలు, వశీకరణ మంత్రాలు, మోక్ష మంత్రాలు.  ఇందులో శాంతి మంత్రాలలో ఎక్కడా తీవ్రత వుండదు.  పొరపాటున ఉఛ్ఛారణ దోషాలొచ్చినా చేసేవారికి ఎలాంటి హానీ జరగదు.  సాధారణంగా ఇవి పెళ్ళి కావటం కోసం, ఆరోగ్యం కోసం ఇలా వుంటాయి.  పెళ్ళి కావటం కోసం జపం చేసే మంత్రం వల్ల అది చేసిన వాళ్ళకి లాభం వుంటుంది.  మిగతావారు వినటం వలన వీరికి కలిగే హాని ఏమీ లేదు.  ఒకవేళ ఇంకెవరికైనా కావాలన్నా వారుకూడా చేసుకోవచ్చు.  అలాగే ఆరోగ్యం కోసం చేసే మంత్రాలు బహిరంగంగా చెప్పటంవల్ల అందరికీ ఆరోగ్యం కలగాలని కోరుకోవటం జరుగుతుంది.  దీనిని విని కావాలసినవారు జపం చేసుకోవటంవల్ల వారందరికీ ఆరోగ్యం చేకూరుతుంది, దానివల్ల ఎవరికీ నష్టంలేకపోగా సమాజ శ్రేయస్సు జరుగుతుంది.  పైగా వీటిని బహిరంగంగా చెప్పటంవల్ల వీటి గురించి తెలియనివారుకూడా  తెలుసుకుని ఆచరించే అవకాశం వుంటుంది.  అందుకని ఇలాంటివాటిని బహిరంగంగా సభల్లో చెప్పటంవల్ల ఎవరికీ ఏ హానీ జరగదు, ఎలాంటి దోషం వుండదు పైగా ఎక్కువమందికి మంచి జరిగే అవకాశంవుంది.

కొన్ని మంత్రాలుంటాయి.  ఉదాహరణకి మోక్ష మంత్రం.  ఈ మంత్రం ఉపదేశించిన తర్వాత శిష్యుడు సరిగా చెయ్యకపోతే గురువుకి హాని జరుగుతుంది.  అందుకే గురువు శిష్యుని అనేక విధాల పరీక్షించిన తర్వాతే  ఉపదేశించబడతాయి,  అదీ బహిరంగంగా కాదు.

(జీ తెలుగు ప్రసారం చేసిన గోపురం ఆధారంగా)


0 comments

Monday, September 13, 2010

పక్షి పూజ ఎందుకు చెయ్యాలి?

Monday, September 13, 2010



పక్షి పూజ చెయ్యటమంటే పక్షులను తెచ్చి, పసుపు కుంకాలు, పూలు పెట్టి పూజ చెయ్యమని అర్ధం కాదు.  భూత దయ కలిగి వుండటం.  మన శాస్త్రాలు భూత యజ్ఞం చెయ్యాలని చెప్తాయి.  అంటే సర్వ ప్రాణులయందు దయ కలిగి వుండాలి.  వాటికి ఆహారాన్ని ఇవ్వాలి అని.  అందుకే భోజనం చేసేముందు ప్రతి వ్యక్తీ,  ప్రతి రోజూ ఎంగిలి చెయ్యకముందు ఒక ముద్ద పక్షుల కోసం బయట పెట్టి రావాలి.

వ్యవసాయ ప్రాధాన్యంగల ప్రాంతాల్లో, పంట వచ్చాక, అది ఏ పంటైనా, గుత్తులుగా గుచ్చి ఇంటి ముందు కడతారు.  అలా చెయ్యటం తోరణాలకోసమో, అందానికో కాదు.  పక్షుల కోసం.  కొంతమంది గుడికెళ్ళి మొక్కుకుంటారు.  పంట బాగా వస్తే దేవాలయంలో పక్షులకి ఆహారం పెడతామని.  అదే విధంగా పంట వచ్చాక దేవాలయంలో గుత్తులుగా ధాన్యంతో సహా కంకులు తోరణాల్లా కడతారు.

ఇలా ఇళ్ళల్లో, దేవాలయాల్లో కంకులు కట్టటం వల్ల తెలియక చేసిన దోషాలన్నీ పోతాయనీ, సిరి సంపదలతో సుఖంగా వుంటారనీ నమ్మకం.

కొన్ని చోట్ల కఱ్ఱలు పాతి వాటికి కంకులు కడతారు.  అనీ పక్షుల కోసమే.  కొందరు, ఆకులో వండిన అన్నం పెట్టి, రంగులు వేసి వీధి కూడలిలో పెట్టి దానిని పక్షులు తిన్నాయో లేదో గమనిస్తారు.  దానిని పక్షులు తింటే తమ కుటుంబంలో అందరూ సిరి సంపదలతో, సుఖ సంతోషాలతో తులతూగుతారని విశ్వసిస్తారు. 

సర్వ ప్రాణులయందు దయ కలిగి వుండి, పక్షులకోసం ధాన్యాన్ని, అన్నాన్ని రోజూ పెట్టటంవల్ల తెలియక చేసిన దోషాలు పోయి, సిరి సంపదలు కలుగుతాయని నమ్మకం.

(జీ తెలుగు ఇదివరకు ప్రసారం చేసిన గోపురం ఆధారంగా.  నేనప్పుడు పోస్టు చెయ్యని వాటిలో ఉపయోగ పడేవాటిని కొన్నింటిని ఇప్పుడు పోస్టు చేస్తున్నా.)



0 comments