Thursday, November 11, 2010

కార్తీక స్నానం

Thursday, November 11, 2010


కార్తీక మాసం ప్రారంభం అయంది.  ఔత్సాహికులు తెల్లవారుఝామునే లేచి తలమీద చన్నీటి స్నానాలు చేసేస్తున్నారు.  దీపారాధనలు, శివపూజలు...ఓహ్ రోజంతా హడావిడే.  చూడటానికి బాగుంటుంది.  మరి తెల్లవారుఝామునే లేచి చన్నీళ్ళ స్నానం చెయ్యాలనే వుత్సాహం వున్నా ఆరోగ్యానికి పడనివాళ్ళు తెగ బాధపడిపోతున్నారు.

అసలు మన పెద్దలు ఏదైనా ఆచారమూ, సాంప్రదాయమూ అని ఒక పధ్ధతి పెడితే దాని వెనుక తప్పక ఏదో అర్ధముండే వుంటుంది.  దాన్ని అలాగే చెయ్యాలి అని చెబితే మనలాంటి మొండిఘటాలు చెయ్యకపోతే ఏం అని ఎదురు తిరుగుతాం.  అందుకే ఆచారం, దేవుడు దెయ్యం అనే పేర్లతో కొంచెం భయం పెట్టారు.  ఆ భయం కూడా ఈ మధ్య పోయిందనుకోండి.

అసలు కార్తీక స్నానం ఎక్కడ చెయ్యాలంటే ప్రవహించే నదుల్లో, కాలువల్లో, లేకపోతే దేవాలయాల దగ్గర వుండే పుష్కరిణిలలో, చెరువుల్లో, లేకపోతే కనీసం బావుల దగ్గర చెయ్యాలి.  ఈ మాసం లో చలి బాగా వుండి, నిద్ర లేచేసరికి కండరాలన్నీ పట్టేసి వుంటాయి.  వాటిని స్వాధీనంలోకి తీసుకురావటానికి, ఆరోగ్యంగా వుండటానికి నదీ స్నానమన్నారు.  నదీ స్నానమంటే నది దాకా నడవాలి.  దానితో వ్యాయామం చేసినట్లయ్యి ఒళ్ళంతా చెమట పడుతుంది.  ఇంక నదులు వగైరాలలోని నీళ్ళు పగలంతా సూర్యరశ్మికి వేడెక్కి, రాత్రంతా చంద్రుని కిరణాలతో చల్లబడి సమశీతోష్ణతను సంతరించుకుంటాయి.  పారే నీరు దోవలోని అనేక ఔషధమొక్కల గుణాలనికూడా తనలో కలుపుకొస్తాయి.  అవి ఆరోగ్యకరం.  వాటితో చేసిన స్నానం ఆహ్లాదాన్ని, ఆరోగ్యాన్ని ఇస్తుంది.

ప్రస్తుతం నగరాలలో పరిస్ధితులు మారాయి.  పైన టాంకుల్లో నింపుకున్న నీటితోనే చెయ్యాలి.  వాటితో చేస్తే అలవాటువున్న వాళ్ళకి పడ్డా, అలవాటు లేనివారికి  లేనిపోని జలుబు, దగ్గు, ఆస్తమా వగైరాలు మేమున్నామని పలకరించవచ్చు.  అందుకని అవసరమైతే ఆ నీటిని కొంచెం వేడి చేసుకోవటం ఆరోగ్యానికి మంచిది.  ఏమంటారు?

0 comments

Sunday, November 7, 2010

హైదరాబాదులో ఆడ బ్లాగర్ల సమావేశం

Sunday, November 7, 2010


ఆడ బ్లాగర్లేమిటి సంధి సరిగ్గాలేదు, కూసింత వ్యాకరణం నేర్చుకోరాదా? అని కూకలేస్తున్నారా  వుండండి బాబూ.  అసలే నిన్నటినుంచీ నాకంతా అయోమయంగా వుంది.  ఆడాళ్ళంతా ఎక్కడోక్కడ ఒకరోజు కలుద్దామని ప్రమదావనంలో ముచ్చట మొదలయింది.   6 వ తారీకు జ్ఞాన ప్రసూన గారింట్లో కలుద్దామన్నారు.  ఏదో ఆడోళ్ళ మీటింగు కదా,  నాలుగు  సినిమాలగురించీ, చీరెలు, నగలగురించి కొత్త కొత్త ముచ్చట్లు విని ఓ నాలుగు మెతుకులు నంజి వద్దామని బయల్దేరుదామనుకున్నానో లేదో, మాలా కుమార్ గారి ఆహ్వానం, ఇద్దరం కలిసి వెళ్దాం రండి అని.

ఇద్దరం కలిసి ఉదయం 11-30కల్లా జ్ఞాన ప్రసూనగారింటికి చేరుకున్నాము.  ఆత్మీయమైన ఆహ్వానాన్ని అందుకుని కూర్చున్నామో లేదో.  శ్రీ లలితగారొచ్చారు.  మరి అందరొస్తుంటే కొంచెం సందడి చెయ్యాలికదా..అందుకే అందరి చేతా గుమ్మంలోనే పేరు చెప్పించి లోపలకి తీసుకొచ్చాను.  తర్వాత జ్యోతి, స్వాతి, సి. ఉమాదేవి, భవాని, లక్ష్మి వచ్చేశారు.  దీపావళి పండగ మర్నాడవ్వటంతో వూళ్ళకి వెళ్ళిన వాళ్లు కొందరు, వేరే కార్యక్రమాలవల్ల కొందరు శారీరకంగా రాలేకపోయినా, మానసికంగా మా దగ్గరే వున్నారు, వీళ్ళేం చేస్తున్నారో, ఏం కబుర్లు చెప్పుకుంటున్నారో మిస్ అయిపోతున్నామే అనుకుంటూ. 

ఉదయం 11-30 నుంచీ సాయంత్రం 5-30 దాకా జరిగిన ఈ మీటింగులో ఒక సినిమా గురించిగానీ, ఒక చీరె గురించిగాని, ఒక నగ గురించిగానీ ఒక్క ముచ్చటకూడారాలేదు.  ఇదెక్కడి ఆడోళ్ళ మీటింగో మరి.  ఆ ముచ్చట్లు ఆశించికూడా ఎవరూ రాలేదులెండి.  వాటి కధా కమామీషూ లేకుండా ఇంతసేపు నోరు ముయ్యకుండా మాట్లాడుకోగలరు నారీమణులు అని నిరూపించేశాము.  మరి మహిళా బ్లాగర్లా మజాకానా.

మాటల మధ్యలో భోజనాలు.  ఏం తిన్నామో, తాగామో చెప్పమంటారా స్ప్రైట్. నాన్, రుమాలీ రోటీ, చనా మసాలా, బగారా బైంగన్, కాకర కాయ చిప్స్, కొత్త వెరైటీ గోంగూర పులిహోర, అన్నం, పెసర పప్పు వామన చింతకాయలు కలిపి పచ్చడి, అద్భుతమైన సాంబారు, చింతకాయ పచ్చడి,  ఆవకాయ, ఇంకా మేము వేసుకోని పచ్చళ్ళు, పూర్ణంబూరెలు, రవ్వ లడ్డూలు, జంతికలు, గులాబ్ జామూన్, ఐస్ క్రీం, చివరాఖరికి టీ.. ఇవి ప్రస్తుతానికి గుర్తున్నవి.   భుక్తాయాసంలో పడి ఇంకేమైనా మర్చిపోయానేమో గుర్తుచెయ్యండర్ర్రా.  అన్నట్లు కార్తీకమాస శుభారంభానికి గుర్తుగా జ్ఞాన ప్రసూన గారు స్వయంగా పూర్ణం బూరెలు చెయ్యటమే కాక తాను తయారు చేసిన ఉసిరికాయ మురబ్బా కూడా తినిపించారు.  కార్తీక మాసంలో ఉసిరి తినాలంటారు.  మేము తినేశామోచ్.

జ్ఞాన ప్రసూన తను వేసిన రకరకాల పైంటింగ్స్, చేసిన పలురకాల చేతి పనులు చూపించారు. ఆసక్తి వుంటే వయసు, ఓపిక అడ్డురావని నిరూపించారు. 

ఇంతలో మలక్ పేట రౌడీగారి అమ్మగారొస్తున్నారన్నారు.  రౌడీగారి తల్లిగారు కదా తెలంగాణా శకుంతల టైపులో వస్తారేమోనని కాస్త సర్దుకు కూర్చున్నా ఎందుకైనా మంచిదని.  ప్రశాంతమైన సరస్వతీదేవిలా వచ్చేశారు ఆవిడ.  నాకేం రాయటం రాదండీ అన్న ఆవిడ శ్రీ భమిడిపాటి రామగోపాలంగారి పుస్తకంలో పొరపాట్లని ఆయనకే చెప్పి, ఆ పుస్తకం పునర్ముద్రణలో  ఆయనకే సహకరించిన రచయిత్రి.  డాక్టరేటు పొందిన విదుషీమణి.   అన్నీ వున్న విస్తరి సామెత  ఆవిడకి సరిగ్గా సరిపోతుందనుకున్నాను.

సమయంకూడా తెలియకుండా, ఒక్క నిముషంకూడా వృధా చెయ్యకుండా అంతసేపు గడిపి, 5-30 అయిందని ఇంటికి బయల్దేరాము.  జ్ఞాన ప్రసూనగారు అందరికీ పసుపు, కుంకుమ, పండు, బ్లౌజ్ పీస్ లే కాక అందమైన బహుమతులుకూడా ఇచ్చారు.  అంతేకాదు, మంచి పుస్తకాలు కూడా ఇచ్చారు వారు, వారి తండ్రిగారు రాసినవి.

అవ్వే కాకుండా ఇంకా కొన్ని  తినుబండారాలుకూడా మూటగట్టుకుని ఇంటికి చేరాము.  ఆహా ప్రమదావనం సభ్యుల అదృష్టమేమని చెప్పవచ్చు! జ్యోతి ప్రమదావనం పెట్టటంవలన కదా మనమంతా ఒకచోట చేరి ఊసులాడుకోవటం మొదలయింది,  హైదరాబాదులో వారందరం ఒకసారి కలుద్దామని ముందు మొదలు పెట్టింది అన్నపూర్ణ అనుకుంటా, వారివల్లకదా ఈ కార్యక్రమం మొదలయింది, మాలా కుమార్ ఎప్పుడోదాకా ఎందుకు 6వ తారీకు కలుద్దామనటంవల్లకదా ఇవాళ కలిసి ఇంత సంతోషంగా గడిపింది, అని వరలక్ష్మి వ్రత కధ టైప్ లో కబుర్లు చెప్పుకుంటూ, మాలా కుమార్, స్వాతి, నేను ఇంటికి తిరిగి వచ్చాము.

సో, హైదరాబాదు సోదరీమణులారా, ఇలాంటి మీటింగులకి రాకపోవటంవల్ల మీరేం  మిస్ అయ్యారో తెలిసిందా?  హమ్మయ్య.  ఈ మాటు మీటింగు పెడితే బుధ్ధిగా వచ్చెయ్యండి.




11 comments

Wednesday, November 3, 2010

సినిమా సందడి

Wednesday, November 3, 2010


తోచీ తోచనమ్మ తోడికోడలి పుట్టింటికెళ్ళిందట.  సరిగ్గా అట్టాంటి పనే చేశాము నేనూ మా ఆయనా తీరి కూర్చుని నిన్న.  రాత్రి 11 గం. దాటినా నిద్ర రాకపోవటంతో టీ వీ ఛానల్స్ తిప్పుతూ మా టీ వీ లో గెస్ ది సెలబ్రెటీ లో ఇద్దరు హీరోలను కలిపిన ఫోటో చూసి మావారు ఠక్కున చిరంజీవి, బాలకృష్ణ అన్నారు.  ఆయన జనరల్ నాలెడ్జ్ ప్రశ్నలకి సమాధానాలు చెప్తారుకానీ, సినిమా వాటి జోలికి పోరు.  అలాంటిది ఆ అతికించిన ఫోటో చూడగానే వాళ్ళ గురించి చెప్పేశారని సంబరపడిపోయాను.  అక్కడితో ఆగచ్చుగా.  అలా ఆగితే ఈ టపా ఎలా వస్తుంది.  ఫోన్ చెయ్యి అన్నారు.  సరే ఏదో ఒక ఫోన్ కాలేగా  చేస్తే పోలా అనుకున్నాను.  పైగా నా ఫోన్ లో 300 రూ. పైన బాలెన్స్ వుంది.  మహా అయితే ఓ 50 రూ. అవుతుందిలే కాల్ కి వస్తే బహుమతి 25000 రూ. వస్తాయి లేకపోతే ఫోన్ తో కొంచెంసేపు కాలక్షేపం అనుకున్నా. 

ఫోన్ చెయ్యగానే రింగ్ అయింది.  మా ఆయన అదృష్టం బాగుందేమో, అందుకే వెంటనే రింగయిందని ఆయనకి ఇవ్వబోయా.  నాకొద్దు, నువ్వే మాట్లాడు, నీకే ఆ సరదాలని.  నిజం చెప్పొద్దూ ఆ మాటకి నాక్కొపం వచ్చింది.  ఏమీ తోచకపోతే చెల్లెళ్ళతోనో, స్నేహితులతోనో చాలాసేపు ఫోన్లో మాట్లాడే సరదా మాత్రమే వున్న నన్ను టీవీలకీ ఇలాంటి ప్రోగ్రామ్స్ కి ఫోన్ లు తరచూ చేసేదానిగా చిత్రించారనుకుని వుడుక్కున్నాను.  కానీ నా వుడుకుమోతుతనాన్ని కాసేపు పక్కనపెట్టి ఆ ఫోన్ లో వాళ్ళు వాగే....కాదు కాదు....రికార్డు చేసి మాలాంటి మూర్ఖులందరి మొహానా కొట్టే డైలాగులు వింటూ కూర్చున్నాను.  ఓపిగ్గా వేచి చూస్తే అదష్టం మిమ్మల్నే వరించవచ్చు...అని కొంచెంసేపు వూరించారు.  తర్వాత వినేవాళ్ళని ములగ చెట్టు ఎక్కించటానికి...మీరు చాలా తెలివికలవాళ్ళు.  అందుకే ఇంతసేపు వేచి వున్నారు.  మీరు వైటింగ్ లో వున్నారు.  అంటే స్టూడియోకి చాలా దగ్గరలో వున్నారు.  ఏ క్షణమైనా మీ కాల్ కనెక్టుకావచ్చు.... అనే ధైర్య వచనాలు, మీరు కావాలంటే డిస్ కనెక్టు చేసి మళ్ళి రింగ్ చెయ్యవచ్చు అనే సలహాలు.  అమ్మో వినీ వినీ నాకు డైలాగులన్నీ కంఠతా వచ్చేశాయి.

దీనికితోడు మధ్య మధ్యలో రెండు నిముషాలసేపు వైటింగ్ టైమ్.  అంటే ఆ సమయంలో కాల్ తీసుకోరు.  పోనీ ఫోన్ పెట్టేద్దామా అంటే ఏమో స్టూడియోకి దగ్గరగా వున్నానన్నాడుకదా.  నిజంగానే దగ్గరలోనే వున్నానేమో అనే మానవ సహజమైన ఆశ.  ఇటువంటి ప్రోగ్రామ్స్ కి ఎప్పుడూ ఫోన్  చెయ్యలేదుగా,  ఈ ఒక్కసారికీ దీని అంతు చూద్దామనుకున్నా.  నేనింత పట్టు వదలని విక్రమార్కడిలా ఫోన్ వదలకుండా కూర్చునేసరికి మా శ్రీవారికి కూడా సరదా వేసిందో ఏమో ఆయన సెల్ నుంచి ఆయనా చేశారు.  మరి ఆ రికార్డెడ్ డైలాగులన్నీ నాకు కంఠతా వచ్చేశాయి, ఆయనక్కూడా వస్తే, మాకు ప్రైజు వస్తే ఇద్దరంకలిసి సరదాగా అందరికీ ఆ డైలాగులు చెప్పచ్చులే అనుకున్నా. 

ఓ పక్కన మా ఫోన్ లో నానా సంభాషణలూ వింటూనే టీవీనీ గమనిస్తున్నా  ఎందుకైనా మంచిదని.  ఒకవేళ వేరే ఎవరికైనా ప్రైజు వస్తే నేను ఫోన్ పెట్టెయ్యచ్చుకదా, కనీసం నా ఫోన్ డబ్బులు మిగులుతాయని.  ఆ యాంకరేమో అసలు ఏ ఫోనూ రానట్లు పోజు  వైటింగ్ లో మా ఇంట్లోంచే రెండు ఫోన్లున్నాయి.  అలా ఇంకెంతమందో మరి.   ఏ ఫోన్ కీ కనెక్షన్ ఇవ్వకుండా ఎందుకలా చేసింది.  అంటే ... ఏమో ..   అన్నీ సందేహాలే.   ఫోన్ రింగ్ అవటం, హలో అనటం అరే డిస్ కనెక్టు అయిందే అని పైగా సిగ్నల్ వున్నచోటనుంచీ మాట్లాడండి అని ఓ ఉచిత సలహా.  సిగ్నల్ లేకపోతే రింగ్ ఎలా అవుతుందని నాలాంటి డౌటమ్మలకి డౌట్లొచ్చినా ఎవ్వరినీ ఏమీ అనలేంకదా.  సరేలెండి ఇన్ని చిత్ర హింసలు భరించి చివరికి తేలిందేమిటయ్యా అంటే నా ఫోన్లో 300 రూ. పైన వున్న బేలెన్స్ కాస్తా 16 రూ. కి వచ్చి నేను తిడతాననో ఏమో తనంతటతనే డిస్ కనెక్టు అయింది.  ఈ బుధ్ధి ముందే వుండచ్చుకదా అనుకున్నాను.  మావారు 110 రూ. కాగానే చూసుకోలేదు ఇంత వేస్ట్ చేశానని ఫోన్ కట్టేశారు. 

మొత్తానికి రాత్రి దగ్గర దగ్గర 12 గం. లదాకా ఆ యాంకరుగారు సుత్తి వేసీ, వేసీ, సగం సమాధానం ఒక కాలర్ చెప్తే ఇంకో సగం లో సగం తను చెప్పి అక్కడికి ప్రేక్షక మహాశయులంతా ఆ మాత్రం మొగాస్టార్ ని కూడా కనుక్కోలేని పామరులుగా భావించి చివరికి ప్రోగ్రామ్ ముగించబోయేముందు ఒక కాలర్ చేత చిరంజీవి పేరు చెప్పించుకుని ప్రోగ్రామ్ ముగించింది.

ఈ కార్యక్రమాల్లో ఎన్ని సవ్యంగా జరుగుతున్నాయో నాకు తెలియదుగానీ, ఇవాళ నేను నేర్చుకున్న నీతి నాలాంటి ఔత్సాహికులకు వెంటనే చెప్పాలనిపించింది.  పురుషుడు పుట్టిన ఇన్నాళ్ళకు యజ్ఞం చేశాడని తెలుగులో ఒక సామెత.  మేమేదో ఇన్నేళ్ళకు తీరిగ్గా కూర్చుని తోచీ తోచక చేసిన పనితో నష్టం 400 రూ.  అంతే కాదు రేప్పొద్దున్న ఎవరికి ఫోన్ చెయ్యాలన్నా ముందు రీఛార్జ్ చేయించుకోవటానికి పరిగెత్తాలి.

రోజూ ఆ సమయానికి నిద్ర పోతాను.  అలా నిద్రపోక టీవీ ముందు కూర్చోవటంవల్ల ఇప్పుడు వెంటనే నిద్ర పట్టకపోవటం, రేపు ఆలస్యంగా లేవటం సరే, నిద్రలో దీనికి సంబంధించిన కలలు రాకుండా వుండాలంటే ముందు ఆంజనేయ దండకం వగైరాలు చదువుకోవాలికదా.  వుంటా మరి.

అన్నట్లు మీరంతా మాంఛివాళ్ళు, ఇలాంటి వ్యసనాల జోలికి వెళ్ళని వాళ్ళని నాకు తెలుసుగానీ సలహా చెప్పకపోతే మరి నా మనసు శాంతించాలికదా.  మీ ఫోన్ లో బాగా బేలెన్స్ వుండీ, మీకు టైమ్ పాస్ కాకపోతే ఇలాంటి ప్రోగ్రామ్స్ ప్రసారం చేస్తున్న ఛానల్స్ ఎన్నో వున్నాయి.  సరదాగా ఎంజాయ్ చెయ్యండి.  అనవసరంగా డబ్బులు దండగ చెయ్యకూడదనుకుంటే ఈ వ్యసనం జోలికి వెళ్ళకండి.  నిజంగా ఇది పేకాట, తాగుడు లాంటి వ్యసనమే.  ఎంతమంది ఆశతో ఇలాంటి ఫోన్లమీద ఎంతెంత డబ్బు వృధా చేస్తున్నారో కదా.  వీటితో బాగుపడుతున్నవాళ్ళు వ్యాపారస్తులు మాత్రమే.

1 comments