Friday, October 30, 2009

గోళ్ళు కొరకకూడదా

Friday, October 30, 2009
గోళ్ళు కొరక కూడదు అంటారు. ఎందుకు?

సైంటిఫిక్ గా గోళ్ళ చివరినుంచి ప్రతికూల శక్తి (negative energy) బయటకి వెళ్తుంటుంది. వాటిని నోటిలో పెట్టి కొరకటం వల్ల ఆ ప్రతికూల శక్తి తిరిగి మన లోపలకి ప్రవేశిస్తుంది. అదేకాక మనం ఎంత శుభ్రం చేసినా గోళ్ళల్లో మట్టి, సూక్ష్మక్రిములు వుంటూ వుంటాయి. ఇవ్వి లోపలకి వెళ్ళి అనారోగ్యం కలిగిస్తాయి. పిల్లలు ఒక్కోసారి వాటిని మింగేయవచ్చు. అరుదుగా ఇవ్వి పేగులలో ఎక్కడైనా గుచ్చుకుని ఒక్కోసారి ఆపరేషన్ దాకా వెళ్ళచ్చు. ఇన్ని విధాల మనకి నష్టం కలిగిస్తుంది కనుకే గోళ్ళు కొరకటం అరిష్టం అంటారు.

(జీ తెలుగు ప్రసారం చేసిన గోపురం ఆధారంగా)

1 comments

Thursday, October 29, 2009

రోబోలు

Thursday, October 29, 2009
మన పూర్వీకులు రోబోల గురించి చెప్పారా?

అవునంటే అశ్చర్యపోతారా? 11వ శతాబ్దంలో భోజరాజు తన సమరాంగణ సూత్రధార అనే వాస్తు శాస్త్రంలో విచిత్రమైన యంత్రాలు, నవ్వే బొమ్మలు, మాట్లాడే బొమ్మల గురించి చెప్పాడు. ఇలాంటి బొమ్మలని ఎక్కువగా ద్వారపాలకులుగా ఉపయోగించేవాళ్ళు. ఏదైనా కొత్త శబ్దం వినబడితే వెంటనే అటువైపు వచ్చే దానిని దేనినైనా నరికేసేవి ఆ బొమ్మలు. ఫలహారాలనీ, నీళ్ళనీ అందించటానికి కూడా ఉపయోగించేవాళ్ళు.

శాస్త్రాల్లో చెప్పని విషయం ఏమీ లేదు. ఇప్పుడు కనుక్కున్న వాటికన్నా ఎన్నో ఎక్కువ విషయాలను సూక్ష్మాతి సూక్ష్మంగా ఏ వస్తువుని ఎలాంటి వాతావరణంలో ఎప్పుడు, ఎక్కడ, ఎలా ఉపయోగించాలి అని అనేక శతాబ్దాల క్రితమే మన శాస్త్రాల్లో లిఖించబడివుంది.



సూక్ష్మదర్శిని


సప్త ఋషులలో ఒకరైన గౌతమ మహర్షి గాజు, అభ్రకము, స్ఫటికము ఉపయోగించి దుర్భిణిని ఆ కాలంలోనే తయారు చేశారు.

మానవ మనుగడకు అవసరమైన విషయాలెన్నో మన పూర్వీకులు ఎప్పుడో చెప్పారు. అవ్వన్నీ ఉపయోగించుకుంటూ, సమాజానికి ఉపయోగపడే ఇంకా ఎన్నో ఉపయోగకరమైన విషయాలను ఆవిష్కరించాల్సిన అవసరం వుంది.


(జీ తెలుగులో ప్రసారమైన గోపురం కార్యక్రమం ఆధారంగా)

1 comments

Tuesday, October 27, 2009

శాస్త్రల్లో విమానాలు

Tuesday, October 27, 2009
మన విమానాల గురించి పూర్వం పురాణాల్లోనూ, శాస్త్రాల్లోనూ చెప్పారా?

అవునండీ. నిజమే. మన సాంప్రదాయాలకి మూలం పురాణాలూ, వేదాలూ. ఈ నాడు మనం కనిబెడుతున్న ఎన్నో విషయాల గురించి ఏనాడో మన పూర్వీకులు విశదంగా చెప్పారు. మన విమానాలగురించి ఎన్నో విశేషాలను భరద్వాజ మహర్షి యంత్రసర్వస్వం అనే గ్రంధంలో వ్రాశారు. అందులో 40 ప్రకరణలు వున్నాయి. ఒక ప్రకరణ మొత్తం విమానాల గురించే...అందులో విమాన చోదకుడికి ఏ అర్హతలు వుండాలి, విమాన ప్రయాణీకులు ఏ రకం వస్థ్రధారణ చెయ్యాలి, విమానంలో ప్రయాణించేటప్పుడు ఎలాంటి ఆహారం తీసుకోవాలి, ప్రమాదాల సమయంలో విమానాన్ని భూమిమీదకి ఎలాదించాలి, ప్రయాణీకుల్ని ఎలా రక్షించాలి, ఆకాశ మార్గాన పరిభ్రమిస్తున్న గ్రహాల ప్రభావాన్నుంచి ఎలా రక్షించుకోవాలి వగైరా ఎన్నో విషయాలు వ్రాశారంటే ఆశ్చర్యం వేస్తోందికదూ!!

అంతే కాదండోయ్...యుధ్ధ సమయంలో శత్రువులు మూర్ఛపోయేలాగా విమానచోదకుడు భయంకర శబ్దాన్ని సృష్టించగలగాలిట. అలాగే ఆకాశాన్ని ఏడు మండలాలుగా విభజించి, ఒకమండలంలో విమాన చోదకుడు వుంటే మిగతా ఆరు మండలాల్లో ఎవరు వున్నారు, ఏ దిశగా ప్రయాణిస్తున్నారు, వాళ్ళ ఆలోచనలు, వ్యూహాలూ, అన్నీ విమాన చోదకుడు ఊహించగలగాలి అని చెప్పారు.

త్రిపుర అనే విమానాల గురించి కూడా చెప్పారు. ఇవి ఆకాశం, సముద్రం, నీళ్ళల్లో కూడా తిరగగలవు. ఈ యంత్రసర్వస్వం గ్రంధం ఇప్పుడు తెలుగులోకి కూడా అనువదింపబడటమేకాదు, అందుబాటులోకూడా వుందిట.

ఇన్ని అద్భుత విషయాలగురించి ఏనాడో వ్రాసి పెట్టిన మన ఋషుల అపార జ్ఞానాన్ని ఆ శాస్త్రాలు అధ్యయనం చేయటం ద్వారా గ్రహించి, సమాజానికి ఉపయోగపడే ఎన్నో క్రొత్త విషయాలను కనుగొనాల్సిన ఆవశ్యకత ఎంతైనా వున్నది.


(జీ తెలుగు ప్రసారం చేసిన గోపురం ఆధారంగా)

0 comments

Monday, October 26, 2009

నాగులచవితి

Monday, October 26, 2009
నాగుల చవితి

కార్తీక శుధ్ధ చవితినాడు నాగుల చవితిగా భావించి సుబ్రహ్మణ్యేశ్వరస్వామిని నాగేంద్రుని రూపంలో ఆరాధించటం మన సంప్రదాయం. ధర్మసింధులో ఈ నాగుల చవితి గురించి వివరణ వున్నది. ఆ రోజు మట్టితో నాగ ప్రతిమ తయారు చేసి దానిని పూజించి, పాలు సమర్పించాలన్నారు. లేకపోతే గోడమీద నాగేంద్రుని బొమ్మ గీసి దానినిగానీ, గుళ్ళో ప్రతిష్టింపబడిన నాగదేవతనన్నా పూజించి పాలు పొయ్యాలి. సంతానంలేని స్త్రీలుగానీ, పిల్లల ఆరోగ్యం సరిగ్గాలేని స్త్రీలుగానీ ఆ రోజు నాగేంద్రుని రూపంలో వున్న సుబ్రహ్మణ్యేశ్వరస్వామిని పూజించి ఉపవాసం వుంటే పిల్లలు కలుగుతారని, వారి ఆరోగ్య సమస్యలు తీరుతాయనీ అంటారు ఆ రోజు స్త్రీలు ఉపవాసం వుండి కేవలం స్వామికి నివేదనచేసిన చలిమిడి, చిమ్మిలి, వడపప్పు మాత్రమే తిని వుండటంలో కూడా శాస్త్రీయ దృక్పధం వున్నది.

చిమ్మిలిలో వుండే నువ్వులు, కొబ్బరి, బెల్లం, శరీరానికి వేడినిస్తాయి. స్త్రీలఋతు సంబంధం బాధలను నివారిస్తాయి. హార్మోన్స్ సమతుల్యాన్ని కాపాడతాయి. ఇంక చలిమిడి, వడపప్పు ఈ చిమ్మిలి వల్ల వచ్చే తాపాన్నించీ శరీరాన్ని కాపాడతాయి. అందుకే చలిమిడి కడుపు చలువ అంటారు. ఉపవాసం వున్న రోజున కారం, పులుపు, ఉప్పు వగైరా వేరే మసాలాలు లేకుండా కేవలు ఇవే తిని వుంటే స్త్రీలకి ఆరోగ్యం లభిస్తుందన్నమాటు. చూశారా, మన పూర్వీకులు మన గురించి ఎంత ఆలోచించి మనకిన్ని నియమాలేర్పరిచారో. మనం మాత్రం వాటిని ఎంతో తేలిగ్గా తీసి పడేస్తాము.

సుబ్రహ్మణ్యేశ్వరుణ్ణి నాగేంద్ర రూపంలో పూజించటానికి కూడా ఒక పురాణ కధ వుంది. ఒకసారి కైలాసానికి పార్వతీ పరమేశ్వరుల దర్శనార్ధం దిగంబరులొచ్చారు. వారిని చూసి సుబ్రహ్మణ్యుడు పరిహాసంగా నవ్వాడు. పార్వతీమాత సుబ్రహ్మణ్యుణ్ణి కోప్పడి, పరిహారంగా నాగేంద్ర రూపంలో ప్రజలను కాపాడమని చెబుతుంది.

ఇవ్వండీ నాగుల చవితి విశేషాలు. మరి మీరు చేశారా?


(జీ తెలుగు ప్రసారం చేసిన గోపురం కార్యక్రమం ఆధారంగా)

0 comments

Wednesday, October 21, 2009

కార్తీకమాస విశేషాలు

Wednesday, October 21, 2009
కార్తీకమాసంలో దీపాలు ఎందుకు పెట్టాలి?

కార్తీకమాసం అంతా మనం గుళ్ళల్లో, వాకిట్లో దీపాలు పెడతాం. అలా ఎందుకు చెయ్యాలి? శాస్త్రాల ప్రకారం శివ కేశవులకు ప్రీతిపాత్రమైన ఈ మాసంలో ఆ దేవాలయాల్లో దీపాలు వెలిగిస్తే చాలా పుణ్యమంటారు. సైంటిఫిక్ గా ఆలోచిస్తే కార్తీకమాసంలో పగలు సమయం తక్కువగా వుంటుంది. సాయంకాలం తొందరగా సూర్యాస్తమయం కావటంతో చీకటి పడుతుంది. పూర్వం సరైన రోడ్లుకానీ, ప్రయాణ సౌకర్యాలుకానీ, విద్యుత్ సౌకర్యం కానీ లేవు.. వీధి దీపాలు కూడా అన్నిచోట్లా వుండేవికావు. పొలాలనుంచి, పనులనుంచి ఇళ్లకు తిరిగి వచ్చేవారికి దోవ సరిగ్గా కనబడటానికి బయట దీపాలువెలిగించి పెట్టేవాళ్లు. మన పూర్వీకులు ఏ పని చేసినా తమ శ్రేయస్సేకాక సమాజ శ్రేయస్సుకూడా కాంక్షిచేవారు చూశారా. అంతేకాదు, చలికి చిన్న చిన్న పురుగులు ఇంట్లోకి రాకుండా కూడా ఇవ్వి ఉపయోగపడతాయి.. పురుగులు వీధిలోవున్న ఈ దీపాల వెలుతురుకి ఆకర్షింపబడి వీటి చుట్టూ తిరిగి అక్కడే పడిపోతాయి.

(గోవురం కార్యక్రమం, జీ తెలుగు ఆధారంగా)

0 comments

Tuesday, October 20, 2009

Tuesday, October 20, 2009
కార్తీకమాస విశేషాలు

ఈరోజు జీతెలుగు లో గోపురం కార్యక్రమం ద్వారా తెలుసుకున్న విశేషాలు....
కార్తీకమాసంలో నదీ స్నానం ఎందుకు చెయ్యాలి?

ఆశ్వీయుజ, కార్తీక మాసాలలో యమకోరలు ఎక్కువగా వుంటాయి, ఈ మాసాలలో యముడు ఎక్కువగా తిరుగుతూ వుంటాడు. అంటే వాతావరణం లో మార్పుల కారణంగా ప్రజలలో జబ్బులు, తద్వారా మరణాలు ఎక్కువగా వుంటాయి. వీటిని నివారించటానికే ఈ ఆచారాల పేరుతో ఆరోగ్యాన్ని పెంపొందించే సాంప్రదాయాలు.

ఇంక నదీ స్నానం చెయ్యాలంటే నది దాకా నడవాలి. దానితో శారీరిక వ్యాయామం అవుతుంది. ప్రవహిచే నదులలో సహజంగా వుండే ఓషధులే కాకుండా నదీ పరీవాహక ప్రదేశాలలో వుండే ఓషధులను కూడా నదులు తమలో కలుపుకుని వస్తాయి. ఆ నీటిలో స్నానం చెయ్యటం ఆరోగ్యప్రదం. తెల్లవారుఝామున స్నానం చేసి నదిలో దీపాలు వదిలి పెడితే ఆ దృశ్యం ఎంత అద్భుతంగా వుంటుందో వర్ణిచనలవికాదు. అలాంటి దృశ్యాలను చూసి, ఆసమయంలో భగవంతుని ధ్యానిస్తే మనసు ఎంత సంతోషంతో, ఉత్సాహంతో ఉప్పొంగిపోతుందో కదా.

ఆధ్యాత్మికంగా కూడా, ఈ నెలలో చేసిన నదీ స్నానాలు, పూజలు, దీపారాధనలు, దాన ధర్మాలు విశేష ఫలితాలనిస్తాయి. నది దగ్గర లేకపోతే, చెరువులోనో, కాలువ లోనో, అదీ లేకపోతే ఇంట్లో బావి దగ్గరో, అదీ లేకపోతే మన బాత్ రూమ్ లోనో స్నానం చేసి, వీలయితే గుడికి వెళ్ళి గుళ్ళో దీపం పెడితే మంచిది. స్నానం చేసే సమయంలో చెంబులో నీళ్ళని
కలుపుతూ

గంగేచ యమునేచైవ గోదావరి సరస్వతి
నర్మదే సింధూ కావేరి జలేస్మన్ సన్నిధిం కురు

అనే శ్లోకంతో ఆ సప్త నదులనీ మన చేతిలోవున్న నీటిలోకి ఆవాహన చేసుకుని ఆనీటితో స్నానం చెయ్యాలి.

0 comments
కార్తీకమాస విశేషాలు

ఇవాళ జీ తెలుగు గోపురం కార్యక్రమం ఆధారంగా.....

కార్తీక మాసంలో సోదరి విదియ/యమ ద్వితీయ /భగినీ హస్త భోజనం అంటే ఏమిటి? అలా ఎందుకు చెయ్యాలి?

కార్తీక శుధ్ధ విదియనాడు సోదరుడు తన సోదరి ఇంటికి వెళ్ళ ఆవిడ చేతి భోజనం చేస్తే మంచిదంటారు. భగిని అంటే సోదరి. ఆవిడ పెట్టే భోజనం కనుక భగినీ హస్త భోజనం అంటారు.

పురాణాల్లో కధ ప్రకారం యమధర్మరాజు సోదరి యమున. ఆవిడ వివాహమై వెళ్ళాక తన సోదరుడిని తన ఇంటికి ఎన్నోసార్లు పిలిచింది. కానీ యమధర్మరాజు వెళ్ళలేకపోయాడు. చివరికి ఒకసారి ఈ కార్తీకమాస విదియ రోజున యమున ఇంటికి వెళ్తాడు. సోదరుడు వచ్చాడని యమున సంతోషంగా పిండివంటలతో భోజనం పెట్టింది. చాలా రోజుల తర్వాత సోదరీ సోదరులు కలుసుకోవటంతో ఇరువురూ సంతోషించారు. ఆ సంతోషంతో యమధర్మరాజు యమునని ఏదైనా వరం కోరుకోమన్నాడు. వాళ్ళు దేవతలు కనుక వారు కోరే వరాలుకూడా జన ప్రయోజనాలుగా వుంటాయి. ఆవిడ ఈ కార్తీక శుధ్ధ విదియనాడు లోకంలో ఎక్కడైనా సరే, తన సోదరి ఇంటికి వెళ్ళ భోజనం చేసిన సోదరులకి ఆయురారోగ్యాలు ప్రసాదించమని అడిగింది. ఈ కోరికకి యమధర్మరాజు సంతోషించి. అంతేకాదు వారికి అపమృత్యు దోషం (అకాల మరణం) లేకుండావుంటుంది, ఆ సోదరి సౌభాగ్యవతిగా వుంటుంది అని ఇంకా వరాలిచ్చాడుట.

పురాణ కధ ఇది అయితే, ఆడపిల్ల పెళ్ళి అయ్యి అత్తవారింటికి వెళ్ళాక కూడా అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళ మధ్య ప్రేమ, ఆదరణని పటిష్టం చెయ్యటానికి ఏర్పరిచిన నియమం ఇది అనుకోవచ్చు. మనుషుల మధ్య ప్రేమాభిమానాలనీ, మంచినీ పెంచే ఏ ఆచారాలయినా అవశ్యం ఆచరణీయం కదా.

0 comments

Monday, October 19, 2009

Monday, October 19, 2009
కార్తీకమాసం విశేషాలు

జీ తెలుగు ప్రసారం చేసే గోపురం కార్యక్రమంలో కార్తీకమాసం విశేషాలు చెప్తున్నారు. ఆసక్తికలవారికోసం ఆ విశేషాలు ఇక్కడ ఇస్తున్నాను.

కార్తీక మాసాన్ని కౌముదీమాసం అనికూడా అంటారు. కౌముది అంటే వెన్నెల. ఈ నెల అంతా వెన్నెల బాగుంటుంది. ఈ మాసంలో తెల్లవారుఝామున నదీ స్నానాలు, దైవ పూజలు, నక్తాలు (ఒంటిపూట భోజనం), ఉసిరి చెట్టుకి పూజలు, వనభోజనాలు, ఓహ్...ఎంత హడావిడోకదా.

కార్తీకమాసంలో తెల్లవారుఝామునే స్నానంచెయ్యాలా? నక్తాలు చెయ్యాలా?

జ్యోతిష్యశాస్త్ర ప్రకారం సూర్యుడు తులారాశిలో వుంటాడు. సూర్యునికి ఇది నీచ స్ధానం. అంటే సూర్యుని ఉష్ణోగ్రత ఈ మాసం అంతా తక్కువగా వుంటుంది. చలికాలం ప్రారంభం అవుతుంది. ఇది మనిషి ఆరోగ్యంమీద ప్రభావం చూపిస్తుంది. మన జీర్ణశక్తి తగ్గుంతుంది. చురుకుతనం తగ్గుతుంది, బధ్ధకం పెరుగుతుంది. శరీరంలో నొప్పులు పెరుగుతాయి. నరాల బలహీనతవున్నవాళ్ళు చలికి ముడుచుకుని పడుకోవటంతో అవి ఇంకా పెరుగుతాయి. వీటన్నిటికీ దూరంగా వుండటంకోసమే, మన ఆరోగ్య రక్షణకోసమే ఈ నియమాలు. తెల్లవారుఝామున నక్షత్రాలుండగానే స్నానం చేసి దీపారాధన చెయ్యాలి, పగలంతా ఉపవాసంవుండి సాయంత్రం నక్షత్ర దర్శనానంతరం ఆహారం తీసుకోవాలి.

తెల్లవారుఝామున లేవటంవలన ఈ కాలంలో సహజంగా వచ్చే ఋగ్మతలనుంచి మనల్ని కాపాడుకోవచ్చు. నక్షత్రాలుండగానే స్నానం, దైవపూజ, వగైరాలవలన బధ్ధకం వదిలి, శారీరకంగా ఉత్సాహంగా వుండటమేకాక, మానసికంగాకూడా చాలా ఉల్లాసంగా వుంటుంది. అలాగే సహజంగా ఈ కాలంలో మనుషుల జీర్ణశక్తి తగ్గుతుంది. నక్తాలవల్ల మన జీర్ణశక్తిని క్రమబధ్ధం చేసినవాళ్ళమవుతాం.

మీరిలా చేస్తే మీ ఆరోగ్యమే బాగుంటుందంటే మనవాళ్ళు వింటారా? అందుకే పధ్ధతి, ఆచారం, పాటించాలి అన్నారు. ఆచారం అని పాటించేవాళ్ళు కొందరయితే, ఏమో పాటించకపోతే ఏమవుతుందో, పాటిద్దామనుకునేవాళ్ళు కొందరు. ఎలాగయితేనేం, మంచి పధ్ధతులు పాటించి తద్వారా శారీరిక, మానసిక ఆరోగ్యం పెంపొందించుకోవటం అందరికీ అవసరమేకదా.

ఈ కార్తీకమాస స్నానం గురించి ఒక కధకూడా వుంది. వూర్వం ఒక నది ఒడ్డున చెట్టుమీద ఒక దెయ్యం వుండేది. అది ఆ ప్రక్కగా వచ్చినవాళ్ళందరినీ ఒక ప్రశ్న అడిగేది. అది విని అందరూ దెయ్యానికి భయపడి పారిపోయేవాళ్ళు. ఒకసారి ఒక బ్రాహ్మణుడు అటుగా వచ్చాడు. దెయ్యం తన ప్రశ్న తన అలవాటు ప్రకారం సంస్కృతంలో వేసింది. అదేమిటంటే ఎవరైనా ఆశ్వీయజం, కార్తీకం, మాఘం, వైశాఖ మాసాల్లో ఏ ఒక్క మాసంలోనైనా తెల్లవారుఝామున స్నానాలు చేస్తున్నారా అని. దానికి ఆ బ్రాహ్మణుడు నేను చేస్తున్నాను అని సమాధానం చెప్పాడు. వెంటనే ఆ దెయ్యం ఆ బ్రాహ్మణుడి కాళ్ళమీదపడి మహానుభావా, నా కీ దెయ్యం రూపం ఒక శాపంవల్ల వచ్చింది. ఇది పోవాలంటే ఈ నాలుగు మాసాల్లో ఏ ఒక్క మాసంలోనైనా తెల్లవారుఝామున స్నానంచేసినవారు వారి స్నాన ఫలాన్ని నాకు ధారపోస్తే నాకు నా రూపం వస్తుంది, నీ స్నాన ఫలాన్ని నాకు ధారపోసి నన్ను శాప విముక్తుణ్ణి చెయ్యని ప్రార్ధించాడు.

అప్పుడా బ్రాహ్మణుడు నేను ఈ నాలుగు మాసాల్లోనేకాదు, అన్ని రోజులూ తెల్లవారుఝామునే స్నానం చేసి దైవపూజ చేసుకుంటాను. నీకు నీ మామూలు రూపం వస్తుందంటే నేను సంతోషంగా వేకువఝామునే నేను చేసిన స్నాన ఫలాన్ని నీకు ధారపోస్తాను అని అలా చేసేసరికి ఆ పిశాచానికి శాప విముక్తి కలిగిందట.

ఇక్కడ అసలు అర్ధం చలికాలంలో తెల్లవారుఝామునే లేచి మనం చేసే స్నాన సంధ్యలవల్ల వ్యాయామం చేస్తాము. పూజలవల్ల మానసిక ప్రశాంతత కలుగుతుంది. అంటే మనకి అన్నివిధాలా ఆరోగ్యం లభిస్తోంది. అలాకాక దుప్పటి కప్పుకుని ముడుచుకు పడుకుంటే హాయిగానే వుంటుంది ఆ కొంచెం సేపూ, తర్వాత ఎంత బధ్ధకంగా వుంటుందో మనకి తెలియనిదా.

అందుకని ఈ కార్తీక మాసంలో మన ఆచారాలను మన పధ్ధతులను కనీసం మనకి చేతనయినంత మటుకూ పాటిద్దాం మనమూ ఆరోగ్యంగా వుందాం. ఏమంటారు


కార్తీక మాసంలో ఉసిరి చెట్టుకి పూజ చెయ్యాలా?


ఉసిరి చెట్టుమీద ఈ కార్తీక మాసంలో నారాయణుడుంటాడనీ అందుకనే ఆ చెట్టుని ధాత్రీ నారాయణుడుగా భావించి పూజ చెయ్యాలనీ శాస్త్రాల్లో చెప్పారు. ఉసిరి చెట్టుకి ఎనిమిది వైపులా దీపాలు పెట్టి ఎనిమిది ప్రదక్షిణలు చెయ్యాలి. ఈ ఉసిరి పత్రితో విష్ణువుకి పూజ చెయ్యాలి.

ఈ కాలంలో ఉసిరి కాయలు వస్తాయి. ఉసిరి మన ఆరోగ్యానికి సంజీవినిలాంటిది. రోజూ ఉసిరి ఏదో ఒక రూపంలో మనం తినాలి. ఇందులో షడ్రుచులలోని చేదు తప్ప మిగతా ఐదు రుచులు వున్నాయి. ఇది మన జీర్ణశక్తిని కాపాడుతుంది. మన శరీర ఉష్ణోగ్రత తగ్గిస్తుంది. శరీరంలో సమతుల్యంతీసుకు వస్తుంది. ఈ చెట్టుగాలి కూడా చాలా మంచిది. అందుకే ఈ నెలలో ఈ చెట్టు దగ్గర దీపాలు, పూజలు, ప్రదక్షిణలు, వన భోజనాలు అంటూ ఎక్కువసేపు ఈ చెట్టుదగ్గర గడపేలా చెప్పారు.

0 comments

Wednesday, October 14, 2009

గోపురం

Wednesday, October 14, 2009
గోపురం

ఈ మధ్య జీ తెలుగులో ఉదయం 8 గం.లకు గోపురం అనే కార్యక్రమం చూశాను. బాగుంది. సమయం దొరికినవాళ్ళు తప్పక చూడవలసిన కార్యక్రమం. మన ఆచారాలకు, పెద్దలు చెప్పిన నియమాలకు సైంటిఫిక్ విశ్లేషణలిస్తూ మన అనుమానాలను తీరుస్తున్న కార్యక్రమం. చాలామందికి అనేక కారణాలవల్ల ఈ కార్యక్రమం చూడటం కుదరదు. అలాంటివారికోసం నేను చూసిన వాటిలో నాకు నచ్చిన వాటిని ఇక్కడ వ్రాస్తున్నాను. మీరూ చదివి మీ సందేహాలు తీర్చుకోండి.

జపం చేసేటప్పుడు, పూజ చేసేటప్పుడు 108 సంఖ్యతోనే ఎందుకు చెయ్యాలి?

మన శరీరంలో ముఖ్య నాడులు, శక్తి కేంద్రాలు 108 వున్నాయి. వాటిని సూచిస్తూ జపమాలకి 108 రుద్రాక్షలు, పగడాలు, తులసి పూసలు వగైరాలు ఏవైనా (వారి వారి ఆసక్తి, శక్తి బట్టి) వుండాలన్నారు. అంతేగానీ మనం జపం 108 సార్లే చెయ్యాలి వగైరా నియమాలు లేవు, దానికి ఒక సంఖ్య లేదు. ఎవరి ఇష్టం వారిది. ఎంత చేస్తే అంత ఫలితం.


ఏ ఉపదేశమూ తీసుకోనివాళ్ళు కూడా జపం చెయ్యవచ్చా?

నిస్సందేశంగా చెయ్యవచ్చు. ఏ ఉపదేశమూ తీసుకోని వాళ్ళు కూడా వాళ్ళవీలునిబట్టి వాళ్ళకిష్టమైన దైవ నామాన్ని జపించవచ్చు.

అంతేకాదండీ. నేటి ఉరుకుల పరుగుల జీవితంలో ఒక చోట కూర్చుని దైవ జపం అనేది అసాధ్యమనే చెప్పవచ్చు. అందుకే మీరేపని చేస్తున్నా మీ వీలుని బట్టి ఏదైనా నామాన్ని అనుకోండి. అనవసరమైన ఆలోచనలు మీ బుఱ్ఱలోకి వచ్చే ఆస్కారం వుండదు.

0 comments