Tuesday, December 22, 2009

భర్త పోయిన స్త్ర్రీని పదోరోజునే చూడాలా?

Tuesday, December 22, 2009




కొన్ని కుటుంబాలలో సాంప్రదాయం పేర భర్త పోయిన  మహిళని పదో రోజున చిత్రహింసలకి గురిచేసి మానసికంగా నానా  క్షోభ పెడుతున్నారు.  కాలం తీరి జీవిత సహచరుడు పోవటమే స్త్రీకి జీవితంలో పెద్ద శిక్ష.  ఇంకా ఆచారాల పేరిట పదో రోజు ఆవిడ సౌభాగ్య చిహ్నాలు బలవంతంగా తీసేసి, తెల్లచీర కట్టించి ఆవిడని ఒక మూల కూర్చోపెట్టి అందరూ చూడాలంటే ....ఒక స్త్రీని అంత క్షోభ పెట్టే అధికారం ఎవరికీ లేదు.  ఇలాంటివసలు ఏ శాస్త్రంలోనూ లేవంటున్నారు.

కరీంనగర్ జిల్లాలో మంధని అనే ఊరుంది.  ఇదివరకు ఈ ఊరు పేరు మంత్రపురి.  అక్కడ చతుర్వేదాలు చదివిన బ్రాహ్మలు వుండేవారు.  వారెవరూ ఈ ఆచారాలు పాటించలేదుట.  ఇప్పటికీ అక్కడివారెవరూ, బ్రాహ్మలు కూడా ఈ ఆచారాలని నిర్బంధంగా పాటించరు.

అయితే జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ద్వి పుష్కరయోగం అనేది వున్నది.  ఆ సమయంలో ఏపనయినా చేస్తే మళ్ళీ మళ్ళీ చేయవలసి వస్తుందిట.  అలాంటి వ్యక్తిని ఆ యోగ సమయంలో చూస్తే మళ్లీ ఇంకెవర్నయినా  అలా చూడాల్సివస్తుందేమో, దాన్ని ఆపాలనే చిన్న కారణంతోనే.......అంతేకానీ ఇది శాస్త్రబధ్ధంకాదు.  ఎవరూ పాటించక్కరలేదు. 

అలాంటి స్త్రీని పదో రోజే, అలా కూర్చోబెట్టే చూడక్కరలేదు.  ఏ అనుమానాలూ లేకుండా వుండటానికి ఏదో ఒక మంచి రోజున  వెళ్ళి పలకరించి వస్తే సరిపోతుంది.  ఆవిడ  ఆవిడ పనులు చేసుకుంటున్నప్పుడు మామూలుగా వెళ్ళి మాట్లాడి రావచ్చు.  ఆప్పుడు ఆవిడ కూడా ఈ ఆచారాలవల్ల బాధపడదు. 

(జీ తెలుగు ప్రసారం చేసిన గోపురం ఆధారంగా)

మనలోమాట

పిల్లలు పుట్టినప్పుడు 11వ రోజు పురిటి స్నానం కాగానే బొట్టు పెట్టటం మొదలు పెడతారు. ఆడ పిల్లలకి చిన్న పిల్లలకి కూడా కుంకుమ బొట్టు పెడతారు, పసుపు రాస్తారు, పూలు పెడతారు.  అవి పెళ్ళితో రాలేదుకదా.  మరి వీటన్నింటినీ భర్త పోగానే ఎందుకు తీసెయ్యాలి. 

3 comments

Saturday, December 19, 2009

సముద్ర స్నానం ఎప్పుడు చెయ్యాలి?

Saturday, December 19, 2009
సముద్ర స్నానం ఎప్పుడు చెయ్యాలి?

మన పెద్దలు సముద్ర స్నానానికి కూడా కొన్ని నియమాలు చెప్పారు.  ఈ నియమాలెందుకో తెలుసా?  మన ఆరోగ్యం గురించే.  కాలమాన పరిస్ధితులనుబట్టి సంవత్సరంలో నాలుగు మాసాలు సముద్ర స్నానానికి శ్రేష్టమయినవి అంటారు.  అవే ఆ కా మా వై.  ఈ భాషేమిటంటారా?   ఆషాఢమాసం, కార్తీక మాసం, మాఘ మాసం, వైశాఖ మాసం.  ఈ నెలలే ఎందుకంటారా? 

ఈ నెలలలో ఋతువులు మారటం వల్ల వాతావరణంలో మార్పులొస్తాయి.  ఎండాకాలంనుంచి వర్షాకాలంలోకి అడుగు పెడతాము ఆషాఢమాసంలో.  కార్తీక మాసం వర్షాకాలానికీ చలికాలానికీ మధ్య వారధి.  మాఘ మాసం చలికాలానికీ ఎండాకాలానికీ సంధి సమయం.  వైశాఖమాసం తీవ్ర ఎండలుకాసే మాసం.  వీటిని సంవత్సరంలో కోణాలంటారు.  ఈ నాలుగు నెలలలో ఋతువుల్లో వచ్చే మార్పులను శరీరం తట్టుకోలేదు.  పౌర్ణమి రోజు సముద్రంలో ఆటుపోట్లు ఎక్కువ వున్నట్లే మానవ శరీరంలో ఉద్వేగాలు ఎక్కువగా వుంటాయి.  ఈ మార్పులు తట్టుకోవటానికే ఈ నెలలలో సముద్ర స్నానం చేస్తే మంచిదంటారు.  అందులోనూ పౌర్ణమినాడు ఇంకా మంచిది అంటారు.  శరీరంలో కలిగే ఉద్వేగాలు సముద్రపు ఆటుపోట్లతో సర్దుకంటాయి.

సముద్ర స్నానం చేసేటప్పుడు తల మొత్తం మునిగేలాగా మునకవేయాలి.  సముద్రంలోని ఉప్పునీటివలన స్వేద గ్రంధులన్నీ శుభ్ర పడతాయి.  శరీరంలో ఎక్కడయినా చిన్న చిన్న గాయాలువున్నా ఈ ఉప్పునీటికి మానుతాయి.  సముద్ర అలలతో ఆడుకోవటంలో ఉల్లాసం, ఉత్సాహం ఎలాగూ వుంటుంది. 

(జీ తెలుగు ప్రసారం చేసిన గోపురం ఆధారంగా)

0 comments

Friday, December 18, 2009

సాలగ్రామాన్ని ఇంట్లో వుంచి పూజించవచ్చా?

Friday, December 18, 2009




సాలగ్రామాల్లో అనేక రకాలు వున్నాయి. ఆదిత్య, నారసింహ, శివ, విష్ణు, వగైరా. ఇవి ఎక్కడపడితే అక్కడ దొరకవు. కేవలం గండకీ నదిలో మాత్రమే దొరుకుతాయి. నునుపుదేలిన రాయి కోణంతో వుంటుంది. ఇవి మంచివికానివి ఇంట్లోవుంటే అరిష్టం. విరిగినవి, ఉబ్బెత్తుగా వున్నవి మంచివికావు.






సాలగ్రామాలు ఇంట్లో తరతరాలుగా వుంటే తప్పకుండా పూజించాలి. యాగాలు, హోమాలు చేయటంకన్నా సాలగ్రామ పూజ విశేష ఫలితాలనిస్తుంది. ఇంటికి మంచిది. మనం తెచ్చుకున్నా జీవితాంతం క్రమం తప్పకుండా పూజించాలి. ఇంటికి రక్షణ కవచంలాగా వుంటుంది, సకల దోషాలనీ పోగొడుతుందని పెద్దలు చెప్తారు.






(జీ తెలుగు ప్రసారం చేసిన గోపురం ఆధారంగా)



0 comments

మంగళవారంనాడు భూమి తవ్వకూడదా?

మంగళవారంనాడు భూమి తవ్వకూడదా?

నిజమే తవ్వకూడదు.  మరి కారణాలు....మంగళవారానికి అధిపతి అయిన కుజుడు భూమి పుత్రుడు.  ఈయన్నే మంగళుడు, అంగారకుడు అని కూడా అంటారు.  భూమిని తవ్వటానికి ఉపయోగించే గునపాలు వగైరా వాటికి అధిపతి కుజుడు.  ఆయన తన సంకేతాలు అయిన గడ్డపారలు వగైరాలతో తన తల్లి అయిన భూమిని గాయపరుస్తుంటే  సహించలేడుకదా.  ఏ కొడుకైనా తన తల్లిని బాధ పెట్టాలని అనుకోడుకదా.  అందుకే మంగళవారం నాడు భూమి తవ్వకూడదు అన్నారు పెద్దలు.

ఈ పెద్దవాళ్ళింతే ఏవో చెప్పి అందర్నీ పాటించమంటారు అంటారా?  వుండండి.  మీలాంటి వాళ్ళకోసం జ్యోతిష్య శాస్త్రం ఏమంటోందో కూడా చూద్దాము.  కుజుడు అగ్ని తత్వం కలవాడు.  (కుజ కారకం అగ్ని తత్వం కలది).  మనం భూమి ఎందుకు తవ్వుతాం?  మొక్కలు నాటటానికో, పంట వెయ్యటానికో, బావి లేక బోరింగు కోసమో, ఇల్లు కట్టటానికో ఇలాంటి పనులకేకదా.  అంటే మొక్కలకీ, చేలకీ, పంటలకీ, అన్నింటికీ నీటి అవసరముంది.  వాటికి నీరు సమృధ్ధిగా వుండాలి.  ఆ పొలాలు, మొక్కలూ పచ్చగా వుండి సమృధ్ధిగా దిగుబడి ఇవ్వాలి.  బావికానీ, బోరింగుకానీ నీళ్ళకోసమే వేస్తాము.  మరి ఇల్లు కట్టేటప్పుడు అంటే, ఆ ఇంటికి అగ్ని ప్రమాదాలు  వుండకూడదు.   అందుకే, అగ్ని తత్వంకల కుజుడు అధిపతి అయిన మంగళవారం నాడు భూమి తవ్వకూడదు అంటారు.

(జీ తెలుగు ప్రసారం చేసిన గోపురం ఆధారంగా)

2 comments

Thursday, December 17, 2009

సంతానంలేనివారు సీమంతానికూ నామకరణానికీ వెళ్ళకూడదా?

Thursday, December 17, 2009





ఇది చాలా చెడు సాంప్రదాయం.  కొన్ని ప్రాంతాల్లో బిడ్డనీ, గుండ్రాయినూ వుయ్యాల చుట్టూ మూడనసార్లు తిప్పి బిడ్డని తల్లికి, గుండ్రాయిని పిల్లలు లేని ఆవిడకీ ఇస్తారు.  ఇది మరీ అన్యాయం.  ఎదుటివారిని అవమానించటమే.  

యా దేవీ సర్వ భూతేషు మాతృ రూపేణ సంస్ధితా
నమస్తస్యై, నమస్తస్యై, నమస్తస్యై నమో నమః

అని దేవికి నమస్కరిస్తాము.  ఆ పరదేవత సర్వ ప్రాణుల్లోనూ మాతృ తత్వం రూపంలో వున్నది. అవును.  సర్వ ప్రాణుల్లో, పశు పక్షులలో, జంతువుల్లో, పురుషుల్లోకూడా  మాతృ తత్వం వుంటుంది.  తోటి ప్రాణిని  ప్రేమతో అక్కున చేర్చుకునే  ప్రతి మనిషికీ మాతృ తత్వం వుంటుంది.  వారు పిల్లల్ని కనకపోయినా మాతృమూర్తులే.    కొందరు అనాధ పిల్లల్ని పెంచటానికి తమకి పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేయించుకుని మరీ అనాధ పిల్లల్ని పోషిస్తున్నవాళ్ళున్నారు.

మాతృ తత్వం మనసులో వుండాలికానీ శరీరానికి కాదు.  పిల్లలు లేక పోవటం కేవలం శారీరక లోపమే.  మనం మనిషిలోని తత్వాన్ని గౌరవించాలి.  మానసికంగా మాతృభావం కలవారంతా మాతృమూర్తులే.  వారిని ఆదరించాలి, గౌరవించాలి.

(జీ తెలుగు ప్రసారం చేసిన గోపురం ఆధారంగా)


3 comments