Wednesday, December 17, 2008

ఎ.జి. ఆఫీసులో హాస్యోత్సవం.

Wednesday, December 17, 2008
బంధు మిత్రుల అభినందనలతో లో దృశ్యం
ప్రేక్షకులు ... నుంచున్న వారూ, ఆడవారూ రాలేదు ఈ ఫోటోలో
ఆలూ లేదు చూలూ లేదు లో ఒక దృశ్యం

ఎ.జి. ఆఫీసులో హాస్యోత్సవం

ఎక్కౌంటెంట్ జనరల్స్ ఆఫీసు నుంచి (టెలిఫోన్ భవన్ ఎదురుగా, రిజర్వు బ్యాంకు ప్రక్క, లకడీకాపుల్ లో వున్నది ఈ ఆఫీసు) ప్రసిధ్ధిగాంచిన అనేక సాహిత్యకారులు, రచయితలు, నటులేకాక అనేక రంగాలలో ఆరితేరిన గొప్ప వ్యక్తులు అనేకమంది ఉద్భవించారు. ఆ ఆఫీసులోని రంజని తెలుగు సాహితీ సంస్ధ ఉత్సవాలలో పాల్గొనాలని ఉవ్విళ్ళూరని సాహిత్యకారులు, అదే ఆఫీసులోని తెలుగు నాటక సమితి నాటక పోటీలలో పాల్గొనాలని ఉత్సాహం చూపించని కళాకారులూ వుండరంటే అతిశయోక్తి కాదు. ఈ ఆఫీసులో పెరిగి పెద్దవారైన రచయితలలో శ్రీయుతులు పరుచూరి వెంకటేశ్వర రావు, మల్లాది కృష్ణమూర్తి, శంకరమంచి పార్ధసారధి, డా. పాలకోడేటి సత్యనారాయణరావు, మరియు కీ.శే. డి. ప్రభాకర్, పమ్మి వీరభద్ర రావు వగైరా ఉద్దండులేకాక ఇంకా ఎందరో మహనీయులు వున్నారు. అలాగే అనేకమంది ఇక్కడ తెలుగు నాటక సమితి తరఫున నాటకాలు వేసి పేరు ప్రఖ్యాతులు పొందారు, సినిమా రంగం లో కూడా స్ధిర పడ్డారు. సాహిత్య, సినీ రంగానికి సంబంధించిన అనేక ప్రముఖులు ఇక్కడ అనేక కార్యక్రమాలలో పాల్గొన్న సందర్భాలలో ప్రతి ఒక్కరూ ఇక్కడ కార్యక్రమాలలో పాల్గొనాలని చాలా ఆసక్తిగా వచ్చామని చెప్తారు. కారణం ఇక్కడ వున్న అనేక మంది ప్రముఖులేగాక, అంతమంది చదువుకున్న శ్రోతలు, ప్రేక్షకులు ఒకచోట కూడటం కూడా అరుదు. మరి అక్కడ ఉద్యోగుల సంఖ్య వేలలో వుంటుంది. ఈ రెండు సంస్ధలేకాక ఇంకా అనేక సంస్ధలు ఇక్కడ అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి. ఈ సంస్ధలన్నింటి కార్యక్రమాలూ ఆ స్ధాయిలో వుంటాయి.

ఢిసెంబరు 16, 17, 18 2008 తారీకులలో తెలుగు నాటక సమితి ఎకౌంటెంట్ జనరల్స్ ఆఫీసు ఆవరణలో మధ్యాహ్నం 1-00 గం. నుంచి 2-00 గం. ల దాకా మళ్ళీ సాయంకాలం 6-00 గం. ల నుంచి 7-00 గం. లదాకా రాష్ట్ర స్ధాయి హాస్య నాటికల పోటీలు జరుగుతున్నాయి. ఇప్పటిదాకా ఈ క్రింది నాటికలు ప్రదర్శింపబడ్డాయి..

16-12-2008 మంగళవారం మధ్యాహ్నం శ్రీ సమ్మెట గాంధీ రచన దర్శకత్వంలో విశ్వశాంతి కల్చరల్ ఆసోసియేషన్ మెదక్ వారిచో తెలుగు దొంగలు అనే నాటిక ప్రదర్శించబడ్డది. సాయంత్రం శ్రీ పరమాత్ముని రచించిన తెల్ల చీకటి అనే నాటిక శ్రీ మల్లాది శివన్నారాయణ దర్శకత్వం, శ్రీ సైదారావు సంగీతంతో కళావర్షిణి, హైదరాబాదు వారిచే ప్రదర్శింపబడ్డది. ఈ కార్యక్రమంలో గౌరవ అతిధిగా శ్రీమతి జి. అనూరాధ, ప్రోగ్రామ్ హెడ్ జీ తెలుగు పాల్గొన్నారు.

డిసెంబరు 17, బుధవారం, మధ్యాహనం మల్లాది క్రియేషన్స్ హైదరాబాదు వారు శ్రీ మల్లాది రవికిరణ్ రచించిన ఆలూలేదు చూలూ లేదు అనే నాటికను శ్రీ మల్లాది భాస్కర్ దర్శకత్వంలో, శ్రీ బి.వి.రావు స్టేజి మేనేజ్మెంటు లో ప్రదర్శించారు. సాయంత్రం శ్రీ సాయి ఆర్ట్స్ కొలకలూరు, గుంటూరు వారిచే శ్రీ చిన్ని కృష్ణ రచించిన బంధుమిత్రుల అభినందనలతో అనే నాటికను శ్రీ గోపరాజు విజయ్ దర్శకత్వం, శ్రీ టి. సాంబశివరావు సంగీతంతో ప్రదర్శించారు. ఈ కార్యక్రమానికి సినీ హాస్య నటులు శ్రీ గౌతంరాజు గౌరవ అతిధిగా, డా. పాలకోడేటి సత్యనారాయణరావు, టి.వి. 5 క్రియేటివ్ హెడ్ ఆత్మీయ అతిధిగా పాల్గొన్నారు.

డిసెంబరు 18, గురువారం మధ్యాహ్నం ప్రముఖ సినీ నటులు శ్రీ రావి కొండలరావు బృందం, ఆర్ కె ఆర్ట్స్ హైదరాబాదు వారిచే ప్రత్యేక ప్రదర్శన వైకుంఠపాళి ప్రదర్శింపబడుతుంది. ఈ నాటికకు శ్రీ రావి కొండలరావు రచించి దర్శకత్వం వహించటమేగాక, ఆయన, ఆయన శ్రీమతి రాధాకుమారి నటిస్తున్నారు కూడా. ప్రదర్శన సమయం మధ్యాహ్నం 1-00 గం. నుండి 2-00 గం. ల దాకా ఖచ్చితంగా పాటింపబడుతుంది. ఆసక్తి, అవకాశం వున్నవారు ఈ హాస్య నాటికను తిలకించే అవకాశం వదులుకోవద్దు. ఈ కార్యక్రమానికి ఆత్మీయ అతిధిగా శ్రీ శంకరమంచి పార్ధసారధి, ప్రముఖ నాటక, సినీ, హాస్య సంభాషణల రచయిత పాల్గొంటారు.


సాయంత్రం 6-00 గం. లకు శ్రీయుతులు జె.యల్ నరసింహం, తెనాలి శేషుకుమార్ గార్ల హాస్య కదంబం వుంటుంది. తదుపరి బహుమతి ప్రదానోత్సవం. ఈ ఉత్సవానికి ముఖ్య అతిధి శ్రీ జి.ఎన్ సుందరరాజా, I.A. & A.S., ప్రిన్సిపల్ ఎకౌంటెంట్ జనరల్ ఆత్మీయ అతిధి శ్రీ పరుచూరి వెంకటేశ్వరరావు, రంగస్ధల సినీ నటులు, సినీ, నాటక రచయిత, దర్శకులు. గౌరవ అతిధి శ్రీ మురళీ మోహన్, ప్రముఖ సినీ నిర్మాత, నటులు. విశిష్ట అతిధి శ్రీ సునీల్ ప్రముఖ సినీ హాస్య నటులు.









0 comments

Sunday, December 14, 2008

వెర్రి వెయ్యి విధాలు

Sunday, December 14, 2008
వెర్రి వెయ్యి విధాలు

14-12-2008 రాత్రి 10-30 కి జీ తెలుగు ప్రసారం చేసిన చల్ మోహన రంగా చూశారా ఎవరైనా? ఒక గ్రామ వాసులంతా (కోడారు అనుకుంటా) ఒక శునకానికి ఘనంగా సీమంతం జరిపించారు. పైగా ఇది మూడవసారి. మొదటిసారి రెండు మూడు కుటుంబాలే హాజరైన ఈ సీమంత కార్యక్రమానికి తర్వాత జనాలు పెరిగి ఇప్పుడు చాలామంది పాల్గొన్నారు. ఆ శునకం కూడా చాలా బుధ్ధిగా కూర్చుని వేడుకలన్నీ జరిపించుకుంది. దండలు వేయించుకుంది బొట్లు పెట్టించుకుంది, అందరిచేతా అక్షింతలు వేయించుకుంది. బోలెడు మిఠాయిలు, పళ్ళు, మామూలు సీమంతాలకు కూడా అన్నిరకాలు అన్నిచోట్లా పెట్టరేమో. పైగా కొత్త చీరెలు కూడా కానుకగా ఇచ్చారండోయ్. మనలో మనమాట. ఎంత మంచి కుక్కయినా ఆ చీరెలేం చేసుకుంటుంది? వెర్రెత్తి చింపి పోగులు పెడుతుందా? ఏమోమరి. అందుకే అంటారు. వెర్రి వెయ్యి విధాలు అని. అందులో ఇదొకటి అనుకుందామా?

1 comments

Monday, December 1, 2008

హిందుత్వమే అసలైన సెక్యులరిజం

Monday, December 1, 2008
హిందుత్వమే అసలైన సెక్యులరిజం

దివ్యధాత్రి, అక్టోబరు 2008 సంచికలో ప్రచురింపబడిన శ్రీ కార్తికేయ గారి రచన మీ అందరికోసం...............

ఘర్షణలు తలెత్తితే, హింస పెచ్చరిల్లి పరిస్ధితి ప్రభుత్వాలూ, పోలీసుల చేయి జారిపోతే, మత భేదం, వర్గభేదం లేకుండా మనందరమూ సైన్యాన్ని రంగంలోకి దింపమని కోరుకుంటాం. సైన్యం నిజాయితీపైన నిష్పాక్షికత పైన ఎవరికీ సందేహంలేదు.

పెను తుఫానులూ, ప్రకృతి బీభత్సాలూ మనల్ని చుట్టు ముట్టితే రక్షించేందుకు సైన్యం రావాలని కోరుకుంటాం. సైన్యంపై మన నమ్మకం అలాంటిది.

సైన్యం స్ధైర్యంమీద సందేహం లేదు. సైన్యం సామర్ధ్యంమీద సందేహం లేదు. సైన్యం సాహసం మీద సందేహం లేదు. సైన్యం సెక్యులరిజమ్ మీద అంతకన్నా సందేహం లేదు.

సైన్యం సెక్యులరిజమ్ గురించి కధలు కధలుగా చెప్పుకుంటారు. ప్రపంచం యావత్తూ భారతీయ సైన్యాల లౌకిక విలువలను ఆశ్చర్యంతో చూస్తుంది, ఆభినందిస్తుంది.

దేశ విభజన సమయంలో లక్షలాది హిందువులు శరణార్ధులై ప్రాణాలరచేత పుచ్చుకొని వస్తున్న సమయంలోనూ మన జవాన్లు అబ్బురపరిచే సంయమనాన్ని ప్రదర్శించారు.

కార్గిల్ యుధ్ధంలో మన జవాన్లు పట్టుబడితే పాకిస్తానీలు కళ్ళు ఊడబెరికి, మర్మాంగాలను కోసి క్రౌర్యానికి పరాకాష్ఠగా నిలిచిన సమయంలోనూ, చనిపోయిన పాకిస్తానీల భౌతిక కాయాలకు గౌరవంతో, వారి మత విధులను అనుసరించి అంతిమ సంస్కారాలను చేయించారు మన సైనికులు.

మన సైనికుల స్ధైర్య, సాహస, సామర్ధాలకూ, సెక్యులరిజానికీ పునాది ఎక్కడ ఉంది? వారి ధీరోదాత్తత ఏ పేరణా స్రోతస్సునుంచి ధారగా జాలువారుతోంది?

హిందూ భావనలలో నుంచి! నిస్సందేహంగా హిందూ జీవన విలువల్లో నుంచే!

ఆశ్చర్యంగా ఉందా? అయితే ఒక్కసారి మన సైనికులు, వారి వివిధ రెజిమెంట్ల రణ నినాదాలను పరిశీలించండి. అర్ధమైపోతుంది.

వీరత్వానికి మారుపేరైన మరాఠా రెజిమెంట్ వారి రణనాదం ‘హరహర మహాదేవ్’ .

పరాక్రమానికి పట్టుకొమ్మలాంటి గూర్ఖా రెజిమెంట్, సైనికుల రణనాదం ‘ జై మహాకాళీ – ఆయో గూర్ఖాలీ’ – అంటే ‘ జై మహాకాళీ – గూర్ఖావీరులు వస్తున్నారు’ అని అర్ధం. అసలు గూర్ఖా అన్నపదం – గోరఖ్ – అంటే గోరక్ష నుంచి పుట్టింది.

19 బెటాలియన్లతో కూడిన రాజపుటానా రైఫిల్స్ వారు యుధ్ధంలో గుండెనిండా ఊపిరిపీల్చుకొని, ఉచ్చస్వరంతో చేసే నినాదం – ‘రాజా రామచంద్రకీ జై’. 17 బెటాలియన్ల బలగంతో నిలిచే బీహార్ రెజిమెంట్ నినాదం’ జై బజరంగ బలి’ . 18 బెటాలియన్ల డోగ్రా రెజిమెంట్ ‘జ్వాలామాతాకీ జై’ అంటూ యాభై ఒక్క శక్తిపీఠాల్లో ఒకటైన జ్వాలాముఖిని స్మరిస్తారు.

కుమాయూ రెజిమెంట్ ‘ కాళికా మాతాకీ జయ్’ అంటే, నాగా రెజిమెంట్ ‘ జై దుర్గే నాగా’ అంటారు.

రాజపుట్ రెజిమెంట్ ‘బోల్ బజరంగ బలీకీ జై’ అని నినదిస్తే, మహార్ రెజిమెంట్ ‘బోలో హిందుస్తాన్ కీజై’ (బోలో ఇండియాకీ జై కాదు సుమా) అని గర్జిస్తారు.

జమ్మూ కాశ్మీర్ రెజిమెంట్ (మొత్తం 19 బెటాలియన్లు) ‘ దుర్గామాతాకీ జై’ అంటే జమ్మూ కాశ్మీర్ లైట్ ఇన్ఫాంట్రీ సైనికులు ‘ భారతమాతాకీ జై’ అంటారు. ఇక మొక్కవోని ధైర్యసాహసాలకూ, తెగింపునకూ మారుపేరైన జాట్ రెజిమెంట్ ‘జాట్ బలవాన్ – జై భగవాన్’ అంటారు.

గ్రెనెడియర్ లు ‘ సర్వదాశక్తిశాలి’ కి జై కొడితే, పంజాబ్ రెజిమెంట్ ‘ బోలే సో నిహాల్ – సత్ శ్రీ అకల్ ‘ అని విజయధ్వానం చేస్తారు.


ఇక గఢ్ వాలీ రెజిమెంట్ సైనికులు గొంతెత్తి ఉత్తరాంచల్ లోని హిమధామాల నడుమ విరాజిల్లే బదరీనాధుని నామాన్ని ఉచ్చరిస్తారు. 18 బెటాలుయన్లతో కూటిన ఈ రెజిమెంట్ రణనినాదం ‘బద్రీవిశాల్ లాల్ కీ జై’ . గఢ్ వాల్ రెజిమంట్ సైనికులున్నచోట బదరీనాధుని మందిరం ఉండాల్సిందే.

2002 నాటికి మన సైన్యంలో 9,80,000 మంది రెగ్యులర్ సైనికులూ, 8,00,000 మంది రిజర్వస్టులూ ఉన్నారు. వీరందరి గొంతుల్లోనుంచి వెలువడే యుధ్ధ నినాదాలన్నీ హైందవంతో అవినాభావంగా ముడిపడ్డవే. వీరత్వాన్ని ఆవాహన చేయటమే కాక, విలువలను వర్ధిల్ల చేయటమే ఈ నినాదాల లక్ష్యం.

పైగా కొరియన్ యుధ్ధానంతరం ప్రపంచవ్యాప్తంగా సైనికుల మనోదార్ఢాన్ని పెంపొందించే దిశగా జరిగిన విస్తృత పరిశోధనలన్నిటిలోనూ ధార్మిక విశ్వాసప్రతీకల ద్వారా సైనికుల్లోమానసిక ఒత్తిడులను ఎదుర్కొనే స్ధైర్యాన్ని పెంచవచ్చునని, శత్రువు చేసే బ్రయిన్ వాషింగ్ ని తట్టుకోవచ్చని తేలింది.

హిందుత్వాన్ని మతతత్వంగా, ఛాందసంగా, మతోన్మాదంగా చూసే మాయపొర మన రాజకీయులకూ, మేధావులనబడే వారికీ కమ్మి ఉండవచ్చుగాక, మన సైన్యానికి కమ్మతేదు. ఎందుకంటే హిందుత్వమే సిసలైన సెక్యులరిజం కనుక

7 comments

Thursday, November 27, 2008

కార్తీక దీపాలు

Thursday, November 27, 2008
అమరావతిలో శివలింగం ఆకారంలో దీపాలు (మా కోటా కాదండోయ్)
శ్రీ భీమేశ్వర స్వామి దేవాలయం, సామర్లకోట, తూ.గో.జిల్లా

శక్తీశ్వరస్వామి దేవాలయం లో కార్తీక దీపాల కళకళ (యనమదుర్రు, ప.గో.జిల్లా)

పంచముఖ అమృతలింగేశ్వరస్వామి, కోటిలింగ మహా శివ క్షేత్రం -- అభిషేకము
కోటిలింగక్షేత్రం, ముక్త్యాలలో శివలింగ ప్రతిష్ట
కోటిలింగ క్షేత్రంలో కార్తీక దీపాలు -- క్రింద రెండు ఫోటోలు కూడా

కార్తీక దీపాలు

చిన్నప్పుడెప్పుడో అమ్మమ్మతో కార్తీకమాసం తెల్లవారుఝామున చలిలో తెనాలిలో కాలువలో స్నానంచేసి దీపాలు పెట్టటం నేను ఇప్పటికీ మరచిపోలేని ఒక అందమైన అనుభూతి. అరటిదొప్పలో పెట్టిన దీపాలు కాలువలో అలా అలా కదలివెళ్తుంటే ఎంత అందంగా వుంటుందో సినిమాల్లో కాకుండా నిఝంగా మీరెప్పుడన్నా చూశారా? తర్వాత కాలంలో అనేక భవసాగరాలవల్ల కార్తీకమాసంలో ఎప్పుడైనా ఆ అందమైన స్మృతులు గుర్తుచేసుకోవటంతప్ప కార్తీకమాస అనుభూతులు ఇంకేమీ పొందలేకపోయాను. ఈ ఏడాది పదవీ విరమణ చేయటంవల్ల ఉత్సాహం ఉరకలువేసి కార్తీక మాసం మొదట్లోనే కూర్చున్నదానికి కూర్చున్నట్లు ఈ కార్తీకమాసంలో 108 శివ లింగాల దగ్గర 108 దీపాలు పెట్టాలనే ఆలోచన వచ్చేసింది. నాచేత ఇలాంటి పనులు చేయించే ఉద్దేశ్యంతోనే అనుకుంటా ఆ భగవంతుడు మా ఆయన్ని మంచివాడుగా పుట్టించాడు. నేనీమాట చెప్పగానే ఊళ్లో గుళ్ల జాబితా తయారుచెయ్యటం మొదలుపెట్టారు. మరి 108 లింగాలు కావాలి కదా. మర్నాడు పొద్దున్నే ఆయన ఆఫీసుకెళ్ళేలోపల దగ్గరలో వున్న మూడు గుళ్ళకి తీసుకెళ్ళారు. ఎక్కడెక్కడున్న గుళ్ళనూ గుర్తు తెచ్చుకుంటుంటే జనవరిలో చూసి వచ్చిన జగ్గయ్యపేట మండలంలోని ముక్త్యాల లో నిర్మంపబడుతున్న కోటిలింగ క్షేత్రం గుర్తొచ్చింది మా వారికి. అక్కడ పంచముఖ శివునితోబాటు కోటి శివ లింగాలను ప్రతిష్టించటానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. (దీని గురించి వేరే చెప్తాను). వెంటనే వాళ్ళకి ఫోన్ చేసి గుళ్ళో ప్రతిష్ట జరిగిందా అని అడిగారు. జరిగింది, లింగ ప్రతిష్టలు కూడా చాలా జరిగాయి, ఇంకా రోజూ జరుగుతున్నాయి అన్నారు. 108 లింగాల కోసం 108 చోట్లకి వెళ్ళటం కష్టం అందుకని ముక్త్యాల వెళ్దాం, నీ ఇష్టం వచ్చినన్ని దీపాలు పెట్టుకోవచ్చు అన్నారు. ఇంక ఆలస్యం దేనికని 1-11-2008 న మేమిద్దరమూ, స్నేహితురాళ్ళు సుజాత, సక్కు, పద్మిని బయల్దేరాము. జగ్గయ్యపేట లో హోటల్ లో గది తీసుకుని కొంచెం సేద తీరిన తర్వాత బయల్దేరాము.

మొదటి మజిలీ ముక్త్యాల లో ముక్తేశ్వర స్వామి గుడి. అక్కడ సాయంకాలం 365 వత్తులతో దీపం పెట్టాను. అక్కడనుంచి ముక్త్యాలలోనే వున్న శ్రీ కోటిలింగ మహా శివ క్షేత్రం లో కొలువైన శ్రీ పంచముఖ అమృత లింగేశ్వర స్వామి ఆలయం మా తర్వాత మజిలీ. ఈ క్షేత్రం ఇంకా నిర్మాణ దశలో వున్నది. మధ్యలో ప్రధాన ఆలయంలో శ్రీ పంచ ముఖ అమృత లింగేశ్వర స్వామి, చుట్టూ 108 దేవతా మూర్తులకు చిన్న దేవాలయాలేకాక కోటి శివ లింగాలను ప్రతిష్టించాలని సంకల్పం. ప్రధాన దేవాలయం, కొన్ని దేవతా మూర్తుల గుళ్ళు, వేలల్లో శివలింగాల ప్రతిష్ఠ జరిగింది. మిగతా పని సాగుతోంది. ఇక్కడ 108 శివ లింగాల దగ్గర 108 దీపాలు స్నేహితురాళ్ళ సహాయంతో నేను వెలిగించాను. మా వాళ్ళు కూడా కొన్ని దీపాలు వెలిగించారు. ఎంత బాగున్నాయో ఫోటోలో చూడండి.

మర్నాడు నాగుల చవితి. వేదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి గుళ్ళో కృష్ణా నదీ స్నానం, స్వామి దర్శనం, దీపారాధన, ముక్త్యాల ముక్తేశ్వరస్వామి గుళ్ళో వున్న పురాతన పుట్టలో పాలు పోద్దామనే ఉత్సాహంతో పూజ చేశాముగానీ పాలు పోయటానికి సైన్సు అడ్డు వచ్చింది. ఈ కార్యక్రమం మానేసి కూడా చాలా ఏళ్ళయింది. ఓపిక, తీరిక వుంటే ఇంట్లోనే చెయ్యటం, లేకపోతే ఒక దణ్ణం. అందుకని ఇంతా వెళ్ళానుకదాని శాస్త్రానికి ఒక చుక్క పోసి అక్కడనుండి కోటిలింగ క్షేత్రానికి వచ్చాము. అక్కడ లింగ ప్రతిష్ట చేసి అభిషేకము చేయించాము. (693 రూ. లు కడితే మనచేత లింగ ప్రతిష్ట చేయిస్తారు) ఫోటోలో ఆ దేవుణ్ణి మీరు కూడా చూడండి.


ఓహో, కార్తీక మాస ప్రారంభం చాలా బాగుంది, కష్టమనుకున్న పని వెంటనే సునాయాసంగా చేసేశామని రెట్టించిన ఉత్సాహంతో పంచారామాలతోపాటు ఈ నెలలోనే ఇంకో 40 (శివ, కేశవ, అమ్మవారి) గుళ్ళల్లో వీలైనన్ని పూజలూ, దీపాలూ. కొన్ని ఫోటోలు మీరూ చూడండి.






































































































































































































































































0 comments

Friday, November 21, 2008

దిక్కుతోచని యముడు

Friday, November 21, 2008
దిక్కు తోచని యముడు

స్వర్గం మూసేశారు. ఒక్క కేసు కూడా రావటంలేదని. నరకంలో మాత్రం జనం కిటకిటలాడుతున్నారు. అప్పటికే గవర్నమెంటువారి సిటీ బస్ లో లాగా కెపాసిటీకన్నా ఎక్కువమందినే కూరారు. అక్కడికీ యమధర్మరాజు అర్జంటుకేసులు తప్పితే తీసుకోవద్దని భటులకు గట్టి వార్నింగ్ ఇచ్చాడు. అలా తీసుకువచ్చిన వాళ్ళని భూలోకానికి పంపిస్తాననేసరికి యమభటులు హడలిపోయి భూలోకంలో ఎంత పెద్ద ప్రమాదాలు జరిగినా, ఎన్ని లక్షల ఆస్తి నష్టమయినా మనుషుల ప్రాణాలు మాత్రం దగ్గరుండి జాగ్రత్తగా కాపాడుతున్నారు. అర్జంటు కేసులకి కూడా స్ధలం చూపించలేక యముడు తికమక పడుతూ, ఆకేసులకు కారణభూతులయిన కల్తీదారులనీ, అతివృష్టి అనావృష్టులనూ ఛడామడా తిడుతున్నాడు. అక్కడికీ వరుణుడికి ఇంటర్ ఆఫీసు మెమో ఒకటిచ్చాడు. అతివృష్టినీ, అనావృష్టినీ తగ్గించమని. ఎంతకాలం చూసినా రిప్లయి రాకపోయేసరికి బ్రహ్మదేవుడికి ఒక అప్లికేషన్ వెట్టాడు. సృష్టిని కొంతకాలం ఆపమనీ లేకపోతే చాలా ఘోరాలు జరుగుతాయనీ.

బ్రహ్మదేవుడు అసలే భూలోకంలో గవర్నమెంటువారు కుటుంబనియంత్రణపట్ల చూపే శ్రధ్ధచూసి విసుక్కుంటున్నాడు. వున్నవాళ్ళకి కూడు పెట్టటం చేతకాక నేనిచ్చిన అనేక వనరులను సరిగా వుపయోగించుకోలేక వాళ్ళ చచ్చు మేధస్సును వుపయోగించి వున్న వాటిని కలుషితం చేసుకుంటున్నారని అక్కడికీ ప్రముఖులందరికీ కలలో స్వయంగా కనబడి చెప్పారుట ఈ ప్రయత్నాలు మానమని. కానీ అంతా అయ్యో బ్రహ్మగారు స్వయంగా వచ్చారే అని కనీసం నమస్కారమైనా చేయకపోగా పై వాళ్ళ ఆర్డర్స్ మేమీ విషయంలో మీకేమీ సహాయం చేయలేమని నిర్మొహమాటంగాచెప్పి వెంటనే ముసుగుతన్ని పడుకున్నారుట. పోనీ ఆపై వాళ్ళకే చెప్దామనుకుంటే వాళ్ళు కలలు కనే తీరిక కూడా లేనంత బిజీగా వున్నారుట. అయినా వీళ్ళే యింత మర్యాద చేశారు, వాళ్ళింకెంత చేస్తారోనని, ప్రజలలో తమయందు భయభక్తులు బొత్తిగా తగ్గిపోయాయని దిగులుపడుతున్న సమయంలో చేరిందట మన యమధర్మరాజుగారి పిటిషన్. ఇపుడేమీ చూడను పొమ్మని విసుక్కున్నాడుట చేసేదిలేక.

బ్రహ్మదేవుడికి పంపిన అప్లికేషన్కి కూడా సమాధానం రాకపోవటంతో యముడికి చిర్రెత్తుకొచ్చింది. నాకింకోళ్ళు సహాయం చేసేదేమిటి? చతుర్విధోపాయాలలో ఏదో ఒక ఉపాయంతో నా సమస్య నేనే పరిష్కరించుకుంటానని హూంకరించాడు. నరకంలో వున్న వాళ్ళలో కొందరికి ప్రమోషన్ ఇచ్చి భూలోకం పంపాలనుకున్నాడు. ఏ ఒక్కరూ ముందుకు రాలేదు. పోనీ కొందరినైనా ఏ చిన్న కారణం దొరికినా గట్టి రికమెండేషన్ తో స్వర్గానికి తోసేసి స్వర్గం తెరిపిస్తే కొంతరద్దీ తగ్గుతుందనుకున్నాడు. ఆలోచన వచ్చిందే తడువుగా ఒక పదిరోజులు చిత్రగుప్తుడితో సహా రాత్రింబగళ్ళు శ్రమపడి అన్ని కేసులూ వివరంగా చదివాడు. లాభంలేకపోయింది. ఒకటీ అరా దొరికినాయిగానీ, ఈ ఒకళ్ళిద్దరి కోసం రికమండ్ చేస్తే తమ ప్రపోజల్ వీగి పోతుందనుకున్నాడు. అందులోనూ పెట్టిన అప్లకేషన్ కే దిక్కూ దివాణం లేదయ్యే.

ఇంక ఇదికాదు పని అని చిత్రగుప్తునితో బాగా ఆలోచించినమీదట, నరకంలోని పాపులందరితో ఒక సమావేశం ఏర్పాటు చేశాడు. భూలోకానికి వెళ్ళేవాళ్ళని లక్షాధికారుల ఇళ్ళల్లో పుట్టిస్తానన్నాడు. మంత్రి పదవులిప్పిస్తానన్నాడు. కానీ జీవులంతాఏకమై కన్నుమూసి తెరిచేసరికి పదిమంది మంత్రులు మారుతున్నారు. లక్షాధికారులు భిక్షాధికారులవుతున్నారు. మేం వెళ్ళం పొమ్మన్నారు. అతిలోక సుందరుల రూపమిస్తానని ఆశపెట్టాడు. మామూలు ఆడవాళ్ళనే పదిమందిముందు రోడ్డుమీద నానాగోలా చేస్తుంటే పట్టించుకునే దిక్కులేదు .ఆ సంఘంలో ఇంక ఈ సౌందర్యంతో మేమవస్తలు పడలేము స్వామీ అన్నారు. అయినా భూలోకంలో పెద్దపెద్దవాళ్ళంతా ప్రపంచాన్ని స్వర్గంగామారుస్తామని కడుపునిండా తిండి, ఒంటినిండా బట్ట దొరుకుతుందనీ, ఇలా ఎన్నెన్నో ఆశలు పెడితే నమ్మి నమ్మి విసుగొచ్చింది. స్వర్గం కాదుకదా కనీసం నరకంలో వున్న ప్రశాంతత కూడా లేదక్కడ. ఇంక ఏ ఆశలకూ లొంగం పొమ్మన్నారు.

వీళ్ళు చాలా ఆరితేరిన ఘటాలు, ఇలా లొంగరనుకుని ఎవరూ లేకుండాచూసి ఒక్కొక్కళ్ళనీ పిలిచి బాబ్బాబు అని కాళ్ళూ గడ్డాలూ పట్టుకున్నంత పనిచేశాడు. లాభంలేకపోయింది. యముడుకి చిర్రెత్తుకొచ్చింది. నా అంతటివాణ్ణి ఇలా బతిమాలుతుంటే ఇంత విర్రవీగుతారా అని ఇంక భయపెట్టటం ప్రారంభించాడు. సలసల కాగే నూనెలో వేయిస్తాాననీ, అగ్ని స్తంభాలకు అంటగడతాననీ బెదిరించాడు. ఊహు, లాభంలేకపోయింది. పైగా నమ్రతగా యమధర్మరాజుకు యిలా విన్నవించారు.

ఆయ్యా, యముడుగారూ, తమరు మమ్మల్ని నూనెలో వేయిస్తారో, అగ్ని స్తంభాలకే కడతారో లేకపోతే నీరుగడ్డకట్టుకునే చల్లగాలిలో వదులుతారో అంతా మీ ఇష్టం, మేమేమీ అభ్యంతర పెట్టం కానీ మమ్మల్మి మాత్రం తిరిగి భూమి మీద పుట్టమనద్దు. అక్కడివాతావరణం ఏ క్షణంలో ఎలా వుంటుందో మీ బ్రహ్మగారికే అంతు పట్టటంలేదు. ఆ వాతావరణం తట్టుకోవటం ముందు మీరు చెప్పే బాధలు ఒక లెక్కలోవికావు. ఇంకా మామీద కోపం తీరకపోతే విషవాయువులు వదలండి. కావాలంటే కాలనాగులతో కాటు వేయించండి. ఒకసారి ఎటూ చచ్చాంకనుక చావంటే భయం లేదు. బాధంటారా? భూలోకంలో కల్తీ మందులూ, కల్తీ వస్తువులు తిని క్రమ క్రమంగా క్షీణిస్తూ, ఏ క్షణంలో చస్తామో తెలియక చస్తామనే భయంతో క్షణమొక యుగంగా గడపటంముందు ఇదో లెక్కా. అదీగాక మాకింకో భరోసా వుందండోయ్. ఇక్కడ పెరిగిపోయే జీవులను అదుపులో పెట్టటానికి మీ భృత్యులెటూ సరిపోరు. మీ కొలీగ్సందరూ ఎవరిగోలల్లోవాళ్ళుండటంవల్ల వాళ్ళవల్ల మీకే సహాయమూరాదు. అందుకని ఇవాళకాకపోతే రేపయినా మాలో కొందరిని మీ భృత్యులుగా తీసుకోకతప్పదు. అంటే కొంతకాలానికైనా మాకు నమ్మకంగా ఉద్యోగాలు దొరుకుతాయి. భూ లోకంలో ఏముందండీ ఎన్ని గవర్నమెంటులు మారినా ఎన్ని సంస్ధలు పెరిగినా నిరుద్యోగులకుమాత్రం దిక్కులేదు. అదీగాక మీరేమీ అనుకోకపోతే ఒక చిన్న సలహా. భూలోకంలో వస్తువుల ధరలు నక్షత్రాలంటుతున్నాయంటున్నారుకదా రేపో మాపో నరకం దాకా రావచ్చు. ఎటూ ధరలు మనదాకా వస్తాయి గనక, వచ్చిన తర్వాత మనల్మి దాటిపోలేవు కనుక మనకి వస్తువులన్నీ చౌకగా దొరుకుతాయి.

ఆయ్యా, ఒక సలహా ఎటూ విన్నారుకదా, రెండోదికూడా వినండి. అంతగా అయితే మాకో దోవ చూపించేదాకా వచ్చిన అభ్యర్ధులని క్యూలో నుంచోపెట్టండి. మా అందరికీ పొద్దున్నేలేచి కాఫీకి పాలకోసం దగ్గరనుంచీ, చివరకి వినోదంకోసంచూసే సినిమాదాకా క్యూలో నుంచోవటంఅలవాటే. అందుకని ఏమీ అనుకోము. పైగా అక్కడలాగాఇక్కడ ఉత్తచెయ్యి చూపించరుకనుక ఓపిగ్గా వైట్ చేస్తాము. ఇంకా కావాలంటే ఆ క్యూల్ని కంట్రోల్ చెయ్యటానికి మాలో కొందరిని నియమించండి. అంటూ సలహాలిచ్చారు.

మేము భూలోకానికి పోమని మూకుమ్మడిగా నినాదాలిచ్చారు. వీలుంటే సమ్మెకూడా చెయ్యటానికి సిధ్ధమయ్యారు.

ఈగోలతో పాపం యముడికి దిక్కు తోచటంలేదు.
(రంజని, ఎ.జి. ఆపీసు సాహితీ సమితి సంచికలో 1980 ల్లో ప్రచురించబడ్డ రచన ఇది.)

0 comments

Thursday, November 20, 2008

vyra yaatra - published in Andhra Bhoomi 20/11/2008

Thursday, November 20, 2008




0 comments

Wednesday, October 22, 2008

నల్గొండ జిల్లా విశేషాలు

Wednesday, October 22, 2008
height="500" width="100%"> value="http://documents.scribd.com/ScribdViewer.swf?document_id=7454834&access_key=key-17gk1zhm8k7vmv17q2ve&page=&version=1&auto_size=true&viewMode=">    

0 comments

Thursday, October 16, 2008

బ్లాగ్ ప్రయాణంలో నేను -- పి.యస్. యమ్. లక్ష్మి

Thursday, October 16, 2008





బ్లాగుతో నా పరిచయం ఒక వార్తా పత్రిక వార్తతో మొదలయింది. నేను చూసిన వార్త ఫారెన్ లో వుంటున్న వంటలు సరిగ్గా రాని ఒకావిడ తనలాంటి వారి కోసం వంటల బ్లాగు మొదలు పెట్టారుట. అది దినదిన ప్రవర్ధమానమై ప్రకటనల జోరుతో హోరెత్తి పుస్తకాల రూపంలో కూడా వచ్చాయనుకుంటాను. బ్లాగుల గురించి నాకు తెలిసింది అప్పడే.

నాకూ మా వారికీ ముందునుంచీ కొత్త ప్రదేశాలు చూడటం సరదా. మధ్యలో కొంతకాలం ఆఫీసు వత్తిళ్ళు, పిల్లల చదువులు వగైరాలతో కుదరలేదు. తర్వాత మాకు దొరికిన ఖాళీ సమయాలలో కొత్త ప్రదేశాలు చూడటం మళ్ళీమొదలు పెట్టాం. ఇది వరకు కొంచెం పేరున్న ప్రదేశాలకే వెళ్ళేవాళ్ళంకానీ ప్రస్తుతం కారులో సొంత డ్రైవింగ్ లో తిరగటంతో దోవలో కనబడ్డ చిన్న చిన్న ప్రదేశాలు కూడా చూడటం మొదలు పెట్టాం. దానితో కొన్ని ఇబ్బందులు ఎదురయ్యాయి. దోవ కనుక్కోవటం, వసతి, భోజనం వగైరా విషయాలలో. ఇంటర్నెట్ వెతికినా అన్నింటి వివరాలూ తెలియలేదు. అప్పడు నేను చదివిన బ్లాగు గురించి గుర్తు వచ్చిది. మాకు అన్ని వివరాలూ తెలియలేదు సరే. మాకు తెలిసిన విషయాల గురించి బ్లాగులో రాస్తే ప్రదేశాలు చూడాలనుకునేవాళ్ళకి వివరాలవల్ల కొన్ని ఇబ్బందులన్నా తప్పించిన వాళ్ళమవుతామనుకున్నా. అదీగాక మేము చూసిన విషయాల గురించీ, మన చారిత్రాత్మిక, ఆధ్యాత్మిక సంపద గురించి అందరికీ చెప్పాలనే తపన ఒకటి. ఆలోచన వచ్చిన దగ్గరనుంచి ఇండియాలో మేము చూసిన ప్రదేశాల వివరాలు రాసి పెట్టుకున్నాను.

ఇంతలో పిల్లల దగ్గరకి అమెరికా వెళ్ళాం. అక్కడ మా అబ్బాయి తేజస్వి సహాయంతో బ్లాగు మొదలు పెట్టాను. ఎలాగూ మొదలు పెట్టాను కదా అని ముందు అమెరికా లో చూసినవి రాశాను ఒక రెండు మూడు ప్రదేశాల గురించి తప్ప.. అక్కడ వుండగానే కొన్ని తెలుగు పోస్ట్ లు కూడా పబ్లిష్ చేశాను గూగుల్ సహాయంతో. అక్కడ మా పిల్లల స్నేహితులనుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది.

13-7-2008
తిరిగి ఇండియా ప్రయాణం. పిల్లలదగ్గరనుంచి వచ్చేస్తున్నామని దిగులు. ఇంటి దగ్గర శూన్య ప్రపంచం నన్ను కొంచెం భయపెట్టింది. మొన్నటిదాకా ఉద్యోగం మూలంగా క్షణం తీరిక లేకుండా గడిపిన నాకు ఇంట్లో కాలక్షేపం గురించి కొంచెం దిగులు వుండేది. సమయంలో వచ్చింది శ్రీ దూర్వాసుల పద్మనాభం గారి మెయిల్. తెలుగు బ్లాగర్స మీటింగు గురించి. మెయిల్ ని చూసిన నాకు ఎంత సంతోషం వేసిందో మాటల్లో చెప్పలేను. రిటైరయినంత మాత్రాన నేను ఖాళీగా కూర్చోనక్కరలేదు. ఇంత దూరాన్నుంచి ఏవో నాలుగు పోస్ట్ లు పబ్లిష్ చేసినంతమాత్రానే నాకు బ్లాగర్స్ అసోసియేషన్ తరఫున మీటింగుకి పిలుపు వచ్చిందంటే ఇండియా వెళ్తే బోల్డు కాలక్షేపమని ఎగురుకుంటూ, మనోధైర్యంతో ఉత్సాహంగా వచ్చాను. ఒక విధంగా డిప్రెషన్ లోకి వెళ్తానేమోనని భయపడ్డ నేను హుషారుగా ఇండియా వచ్చేటట్లు చేసింది మాత్రం పరిచయంలేని శ్రీ పద్మనాభంగారూ ఇంకా తెలుగు బ్లాగులూ. నా బ్లాగుల మూలంగా నేను పొందిన లాభం విలువ కట్టలేనిది.

ఇండియా వచ్చిన తర్వాత సెప్టెంబర్ నెలలో శ్రీ సి.బి. రావు గారి ఇంట్లో జరిగిన బ్లాగర్ల సమావేశానికి వెళ్ళాము నేనూ శ్రీవారూ. అక్కడ పరిచయమయ్యారు శ్రీ పద్మనాభంగారు ఇంకా కొంతమంది సభ్యులతోపాటు. విశేషమేమిటంటే నాకు ఆయన చేసిన మేలు ఆయనకూ తెలియదు. సమావేశం గురించి హైదరాబాదులో వున్న తెలుగు బ్లాగర్లందరికీ టపా పంపించారు. అందులో నా పేరు వచ్చింది. ఎంత త్రిల్లింగ్ గా అనిపించిందో చెప్పలేను.

తర్వాత నేను పొందిన ఇంకో గొప్ప సహాయం శ్రీ జాలయ్య గారి దగ్గరనుంచి. గూగుల్ తెలుగు లో రాయటం నాకు బాగా అలవాటయినా వైరస్ మూలంగా ఇబ్బందులు ఎదుర్కొన్నాను. అను స్క్రిప్ట్, లేఖిని ప్రయత్నించాను కానీ సాఫీగా సాగలేదు. గుంపుకి ఒక లేఖ రాశాను. అప్పుడు జాలయ్యగారు ఇన్ స్క్రిప్ట్ ప్రయత్నించమని చెప్పారు. తర్వాత విషయంలో మళ్ళీ నాకు ఇబ్బంది ఎదురుకాలేదు.

అప్పుడే అయిపోలేదు ఆగండి. ఇప్పుడు నేను పొందిన ఇంకో మాంఛి సహాయం శ్రీమతి జ్యోతి దగ్గరనుంచి. అడిగిన వెంఠనే నా బ్లాగు రూపురేఖలు మార్చటానికి ఆవిడ ఒప్పుకున్నారు. అలాగే బ్లాగు విషయంలో నాకొచ్చిన అనుమానాలను తీర్చిన శ్రీ వీవెన్ గారు, శ్రీ సిబిరావు గారు, పాత కాలం భాష లో రాస్తే మాలాంటి వాళ్ళకి చదవటానికి ఓపిక వుండదు, రచనలు వాడుక భాషలో వుండాలని చెప్పిన శ్రీ కత్తి మహేష్,.....హమ్మయ్య. జ్యోతి పోస్ట్ ఇప్పుడు మొదలు పెట్టింది కనుక సరిపోయింది. ఇంకొన్నాళ్ళాగితే లిస్టు ఎన్ని పేజీలు సాగేదో.


మిగతా బ్లాగర్ల గురించి .... నిజం చెప్పాలంటే నాకు బ్లాగులగురించీ, వాటిలో ఏమి రాస్తారనీ తెలియదనే చెప్పాలి. ఏదో పత్రికల్లో రాసినట్లు నాకు తెలిసింది నేను రాస్తే కొందరికన్నా ఉపయోగ పడుతుందనే ఆలోచన తప్ప ఇంత ఇంటర్ ఏక్షన్ వుంటుందని తెలియదు. అలాంటి నేను రంగుల ప్రపంచంలోకి అడుగు పెట్టగానే అబ్బ! ఎంత అందమైనదీ లోకం. నాకు తెలియని ఒక అద్భుత ప్రపంచంలోకి వచ్చాను ఎన్నో విషయాలు తెలుసుకోవచ్చనుకున్నాను. ఇంతలో ఒక వైపు నుంచి అందమైన విరులెన్నో తమ సౌరభాలతో నన్ను రా రమ్మని పిలిచాయి. అంతే. ప్రమదావనంలో నన్ను నేనే మరచిపోయాను. ప్రస్తుతం నా చుట్టూ వున్న బంధాలను మరచిపోకుండా వుండేందుకు గట్టి ప్రయత్నం చేస్తున్నాను. అంటే ప్రమదావనం ఆకర్షణ ఎలాంటిదో అర్ధమయిందికదండీ.

బ్లాగు లోకానికి మనమేమి ఇచ్చామంటే, కొత్త ప్రదేశాలు చూసే సరదా వున్న వాళ్ళకి నా బ్లాగు ద్వారా అక్కడి వివరాలు తెలిసి ఇబ్బంది పడకుండా వెళ్ళి వస్తే నాకదే చాలు. వెళ్ళలేనివాళ్ళు నా బ్లాగులో ప్రదేశాల ఫోటోలు చూసి మన ప్రాచీన, నవీన దేవళాల గురించి, విహార స్ధలాల గురించీ తెలుసుకోవాలని నా కోరిక.

ఇంక నేనేమి పొందానంటే పైన కొన్ని విషయాలు చెప్పాను కదా. అవే కాకుండా బోలెడు పనికి వచ్చే కాలక్షేపం, చాలామంది స్నేహితులూ, అన్నింటికన్నా ముఖ్యం లోక ఙానాన్ని పెంచుకుంటున్నాను. ఇంతకన్నా ఇంకేం కావాలండీ. ఏమో. మహా సముద్రంలో ఇంకేం నిధులున్నాయో దొరికాక మళ్ళీ చెప్తాను. ఇంకో విషయం మాత్రం ఇప్పుడే చెప్పాలండీ. లోకంలో ఎవరికైనా ఏదైనా అనుమానం వచ్చి ఒక్క టపా రాశారంటే చాలు. సహాయం చెయ్యటానికి ఎంతమంది తయారయిపోతారండీ. నిస్వార్ధతకి నిలువెత్తు అద్దాలు కదండీ స్నేహ హస్తాలు.

దీని వల్ల లాభాలేకాదు. నష్టాలు కూడా వున్నాయండీ. చెయ్యాలనుకున్న చాలా పనులు చెయ్యటానికి సమయం సరి పోవటంలేదు. సాఫ్ట్ వేర్ ఇంజనీర్లు కూడా ఇంతసేపు కంప్యూటర్ ముందు కూర్చుంటారో లేదో తెలియదుగానీ ఇంతంత సేపు కంప్యూటర్ ముందు కూర్చుని కళ్ళనీ నడుమునీ పాపం ఇబ్బంది పెడుతున్నాను.


ఏది ఏమైనా ఇది ఒక అందమైన అనుభవం. అనుభవిస్తేకానీ అర్ధంకాదు. అందుకే బ్లాగర్లు కాని వారందరూ తొందరగా మీ మీ ఖాతాలు తెరవండి. శుభాభినందనలు.


Psmlakshmi
Psmlakshmi.blogspot.com






















































































13 comments