Wednesday, December 17, 2008

ఎ.జి. ఆఫీసులో హాస్యోత్సవం.

Wednesday, December 17, 2008
బంధు మిత్రుల అభినందనలతో లో దృశ్యం
ప్రేక్షకులు ... నుంచున్న వారూ, ఆడవారూ రాలేదు ఈ ఫోటోలో
ఆలూ లేదు చూలూ లేదు లో ఒక దృశ్యం

ఎ.జి. ఆఫీసులో హాస్యోత్సవం

ఎక్కౌంటెంట్ జనరల్స్ ఆఫీసు నుంచి (టెలిఫోన్ భవన్ ఎదురుగా, రిజర్వు బ్యాంకు ప్రక్క, లకడీకాపుల్ లో వున్నది ఈ ఆఫీసు) ప్రసిధ్ధిగాంచిన అనేక సాహిత్యకారులు, రచయితలు, నటులేకాక అనేక రంగాలలో ఆరితేరిన గొప్ప వ్యక్తులు అనేకమంది ఉద్భవించారు. ఆ ఆఫీసులోని రంజని తెలుగు సాహితీ సంస్ధ ఉత్సవాలలో పాల్గొనాలని ఉవ్విళ్ళూరని సాహిత్యకారులు, అదే ఆఫీసులోని తెలుగు నాటక సమితి నాటక పోటీలలో పాల్గొనాలని ఉత్సాహం చూపించని కళాకారులూ వుండరంటే అతిశయోక్తి కాదు. ఈ ఆఫీసులో పెరిగి పెద్దవారైన రచయితలలో శ్రీయుతులు పరుచూరి వెంకటేశ్వర రావు, మల్లాది కృష్ణమూర్తి, శంకరమంచి పార్ధసారధి, డా. పాలకోడేటి సత్యనారాయణరావు, మరియు కీ.శే. డి. ప్రభాకర్, పమ్మి వీరభద్ర రావు వగైరా ఉద్దండులేకాక ఇంకా ఎందరో మహనీయులు వున్నారు. అలాగే అనేకమంది ఇక్కడ తెలుగు నాటక సమితి తరఫున నాటకాలు వేసి పేరు ప్రఖ్యాతులు పొందారు, సినిమా రంగం లో కూడా స్ధిర పడ్డారు. సాహిత్య, సినీ రంగానికి సంబంధించిన అనేక ప్రముఖులు ఇక్కడ అనేక కార్యక్రమాలలో పాల్గొన్న సందర్భాలలో ప్రతి ఒక్కరూ ఇక్కడ కార్యక్రమాలలో పాల్గొనాలని చాలా ఆసక్తిగా వచ్చామని చెప్తారు. కారణం ఇక్కడ వున్న అనేక మంది ప్రముఖులేగాక, అంతమంది చదువుకున్న శ్రోతలు, ప్రేక్షకులు ఒకచోట కూడటం కూడా అరుదు. మరి అక్కడ ఉద్యోగుల సంఖ్య వేలలో వుంటుంది. ఈ రెండు సంస్ధలేకాక ఇంకా అనేక సంస్ధలు ఇక్కడ అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి. ఈ సంస్ధలన్నింటి కార్యక్రమాలూ ఆ స్ధాయిలో వుంటాయి.

ఢిసెంబరు 16, 17, 18 2008 తారీకులలో తెలుగు నాటక సమితి ఎకౌంటెంట్ జనరల్స్ ఆఫీసు ఆవరణలో మధ్యాహ్నం 1-00 గం. నుంచి 2-00 గం. ల దాకా మళ్ళీ సాయంకాలం 6-00 గం. ల నుంచి 7-00 గం. లదాకా రాష్ట్ర స్ధాయి హాస్య నాటికల పోటీలు జరుగుతున్నాయి. ఇప్పటిదాకా ఈ క్రింది నాటికలు ప్రదర్శింపబడ్డాయి..

16-12-2008 మంగళవారం మధ్యాహ్నం శ్రీ సమ్మెట గాంధీ రచన దర్శకత్వంలో విశ్వశాంతి కల్చరల్ ఆసోసియేషన్ మెదక్ వారిచో తెలుగు దొంగలు అనే నాటిక ప్రదర్శించబడ్డది. సాయంత్రం శ్రీ పరమాత్ముని రచించిన తెల్ల చీకటి అనే నాటిక శ్రీ మల్లాది శివన్నారాయణ దర్శకత్వం, శ్రీ సైదారావు సంగీతంతో కళావర్షిణి, హైదరాబాదు వారిచే ప్రదర్శింపబడ్డది. ఈ కార్యక్రమంలో గౌరవ అతిధిగా శ్రీమతి జి. అనూరాధ, ప్రోగ్రామ్ హెడ్ జీ తెలుగు పాల్గొన్నారు.

డిసెంబరు 17, బుధవారం, మధ్యాహనం మల్లాది క్రియేషన్స్ హైదరాబాదు వారు శ్రీ మల్లాది రవికిరణ్ రచించిన ఆలూలేదు చూలూ లేదు అనే నాటికను శ్రీ మల్లాది భాస్కర్ దర్శకత్వంలో, శ్రీ బి.వి.రావు స్టేజి మేనేజ్మెంటు లో ప్రదర్శించారు. సాయంత్రం శ్రీ సాయి ఆర్ట్స్ కొలకలూరు, గుంటూరు వారిచే శ్రీ చిన్ని కృష్ణ రచించిన బంధుమిత్రుల అభినందనలతో అనే నాటికను శ్రీ గోపరాజు విజయ్ దర్శకత్వం, శ్రీ టి. సాంబశివరావు సంగీతంతో ప్రదర్శించారు. ఈ కార్యక్రమానికి సినీ హాస్య నటులు శ్రీ గౌతంరాజు గౌరవ అతిధిగా, డా. పాలకోడేటి సత్యనారాయణరావు, టి.వి. 5 క్రియేటివ్ హెడ్ ఆత్మీయ అతిధిగా పాల్గొన్నారు.

డిసెంబరు 18, గురువారం మధ్యాహ్నం ప్రముఖ సినీ నటులు శ్రీ రావి కొండలరావు బృందం, ఆర్ కె ఆర్ట్స్ హైదరాబాదు వారిచే ప్రత్యేక ప్రదర్శన వైకుంఠపాళి ప్రదర్శింపబడుతుంది. ఈ నాటికకు శ్రీ రావి కొండలరావు రచించి దర్శకత్వం వహించటమేగాక, ఆయన, ఆయన శ్రీమతి రాధాకుమారి నటిస్తున్నారు కూడా. ప్రదర్శన సమయం మధ్యాహ్నం 1-00 గం. నుండి 2-00 గం. ల దాకా ఖచ్చితంగా పాటింపబడుతుంది. ఆసక్తి, అవకాశం వున్నవారు ఈ హాస్య నాటికను తిలకించే అవకాశం వదులుకోవద్దు. ఈ కార్యక్రమానికి ఆత్మీయ అతిధిగా శ్రీ శంకరమంచి పార్ధసారధి, ప్రముఖ నాటక, సినీ, హాస్య సంభాషణల రచయిత పాల్గొంటారు.


సాయంత్రం 6-00 గం. లకు శ్రీయుతులు జె.యల్ నరసింహం, తెనాలి శేషుకుమార్ గార్ల హాస్య కదంబం వుంటుంది. తదుపరి బహుమతి ప్రదానోత్సవం. ఈ ఉత్సవానికి ముఖ్య అతిధి శ్రీ జి.ఎన్ సుందరరాజా, I.A. & A.S., ప్రిన్సిపల్ ఎకౌంటెంట్ జనరల్ ఆత్మీయ అతిధి శ్రీ పరుచూరి వెంకటేశ్వరరావు, రంగస్ధల సినీ నటులు, సినీ, నాటక రచయిత, దర్శకులు. గౌరవ అతిధి శ్రీ మురళీ మోహన్, ప్రముఖ సినీ నిర్మాత, నటులు. విశిష్ట అతిధి శ్రీ సునీల్ ప్రముఖ సినీ హాస్య నటులు.









0 comments: