Thursday, November 26, 2009

తీర్ధాన్ని మంత్ర జలం అంటారా?

Thursday, November 26, 2009

తీర్ధానికి మంత్రజలం అనే పేరుకూడా వుందా?

అవును. మనం అభిషేకం చేసినప్పుడు, పంచామృతాలతో, శుధ్ధోదకంతో దేవతా మూర్తులకు స్నానం చేయించినప్పుడు దానిని తీర్ధంగా తీసుకుంటాము. పూజ మొదలు పెట్టేటప్పుడు ఓం కేశవాయస్వాహా, ఓం నారాయణ స్వాహా, ఓం మాధవాయస్వాహా అని మూడుసార్లు ఆచమనం చేస్తాము.. కొందరు నిష్ణాతులు భోజనం ముందు కూడా గాయత్రీ మంత్రంతో ఔపోసన పడతారు. వీటివెనకాల ఆధ్యాత్మికతేనా లేక శాస్త్రీయత కూడా వున్నదా? వుంటే అది ఏమిటి?

పంచ భూతాలలో జలం ఒకటి. ఈ జలానికి శబ్దగ్రాహక శక్తి వున్నది. మంత్ర జపం చేస్తూ చేసే ఆభిషేకాలు, పూజాదికాలు చేస్తూ సమర్పించే జలం, ఆ మంత్రాలలో వుండే శక్తిని గ్రహిస్తుంది. దానితో ఆ జలం మంత్ర జలం అవుతుంది.

మన పూర్వీకుల ద్వారా మనకిన్ని విషయాలు తెలిసినా వాటిని సరిగ్గా ఆచరించటానికి ఉత్సాహం చూపించం. ఆధ్యాత్మికంగా నమ్మేవాళ్ళు కొన్ని ఆచరిస్తారు, లేనివారు కొట్టి పారేసి మన సంపదను మనమే తోసిరాజనుకుంటున్నాము. కానీ ఈ విషయాలను పరిశీలించి, పరిశోధించి నిజానిజాలు కనుగొనే ప్రయత్నాలు చెయ్యము.

కానీ పాశ్తాత్యులు జలానికి శబ్దగ్రాహక శక్తి వున్నదని పరిశోధనలు చేసి నిరూపించటమేకాదు వాటి చిత్రాలను ఇంటర్నెట్ లో కూడా పెట్టారు. ఆ చిత్రాలు చూసిన వారెవరన్నా ఇక్కడ వాటి లింకు ఇస్తే అందరూ చూస్తారు.

పాశ్చాత్యులు మంత్రాలతో ప్రయోగాలు చెయ్యలేదుకానీ నీటికున్న శబ్దగ్రాహక శక్తి గురించి మాత్రమే ప్రయోగాలు చేశారు. వివిధ శబ్దాలు విన్నప్పుడు నీటి కణాలలో వచ్చే మార్పులను చిత్రాలు తీశారు. జానపద సంగీతం వినిపిస్తున్నప్పుడు నీటి కణంలో తెల్ల మందారంలాంటి ఆకారం ఏర్పడింది. అలాగే ఫేర్ వెల్, గుడ్ బై చెబుతున్నప్పుడు నీటిలో వుండే పరమాణువులన్నీ విడిపోయినట్లు కనిపించాయి. ప్రార్ధన ముందు ఒక విధంగా వున్న పదార్ధం తర్వాత షట్కోణాకారంగా వజ్రంలా మెరుస్తూ కనిపించిందిట. ఒక చిత్రంలో నిన్ను చంపుతానంటూ చంపటానికి వస్తున్నట్లు ఒక భావం కనిపించిందట. ఆ జలం గ్రహించిన భావం అదన్నమాట. ఇన్ని పరిశోధనలు చేసి వారు నిరూపించినదీ, ఏ పరిశోధనలూ తెలియని కాలంలో మన పూర్వీకులు చెప్పిందీ, చేసిందీ ఒకటే.

ఇప్పుడు మనం తెలుసుకున్నదేమిటంటే మన ఋషులు చెప్పిన మాటలు అక్షర సత్యాలు. ఆధ్యాత్మికంగానే కాక, శాస్త్రీయంగా కూడా వాటి విలువ అపారం. మంత్ర పారాయణ ప్రభావం కలిగిన జలాన్ని తీర్ధంగా తీసుకోవటంవల్ల జలం గ్రహించిన ఆ మంత్ర శక్తి మన శరీరంలోకి వెళ్ళి మన శరీరానికి మేలు జరుగుతుంది.

తీర్ధం విలువ తెలుసుకున్నారుకదా...ఇంక ఆచరణలో చూపించండి మరి.

(జీ తెలుగు ప్రసారం చేసిన గోపురం ఆధారంగా)


3 comments

Wednesday, November 25, 2009

మౌనవ్రతం పాటించటంవల్ల లాభం వుందా?

Wednesday, November 25, 2009

మౌనవ్రతం ఎందుకు చేస్తారు?

మునీశ్వరులు ఎక్కువగా మౌన వ్రతం పాటిస్తారు. మౌన వ్రతం పాటించేవారు కనుకే వారికి ముని అనే పేరు వచ్చిది. ఇప్పటికీ చాలామంది చాతుర్మాస దీక్షలోనో లేక వేరో ఏదో కొన్నిరోజులో లేకపోతే ఫలానా వారమనో మౌన వ్రతాన్ని పాటిస్తున్నారు. ఇది ఎందుకు చెయ్యాలి? దీని వల్ల ఉపయోగం ఏమైనా వుంటుందా?

తప్పకుండా వుంటుంది. ఆరోగ్యపరంగా, ఆధ్యాత్మికంగా మౌనవ్రతం మనిషికి ఎంతో మేలు చేస్తుంది. ఆధ్యాత్మికంగా చూస్తే మౌనవ్రతం వల్ల వాక్శుధ్ది, వాక్ శక్తి పెరుగుతాయి. ఆరోగ్యపరంగా చూస్తే మనని మనం ప్రశాంతంగా వుంచుకోవటానికీ, కోపాన్ని అదుపులో పెట్టుకోవటానికి ఈ మౌనవ్రతం ఉపయోగపడుతుంది. సిధ్ధులు వాక్ శక్తిని పెంచుకోవటానికి, వాళ్ళని వాళ్ళు ప్రశాంతంగా వుంచుకోవటానికి ఎక్కువగా మౌనవ్రతాన్ని పాటిస్తారు.

మనకి వచ్చే రోగాలు చాలామటుకు మన ఆవేశాలతో, కోపంతో వస్తాయి. వాటిని నియంత్రించుకుంటే మన ఆరోగ్యం బాగుంటుంది. మనకి ఎదుటివారిమీద వచ్చిన కోపాన్ని చూపించకుండా కొంత సంయమనాన్ని పాటిస్తే గొడవలు పెరగటం, అనవసరమైన పోట్లాటలు, అశాంతి వుండవు. సమస్యలు తేలిగ్గా పరిష్కారమవుతాయి. దీనిమూలంగా సామాజికంగా ఉపయోగం వున్నట్లేకదా. ఈ కలికాలంలో మనకి అంత వాక్శుధ్ధి అక్కరలేకపోవచ్చు...మనం ఏమైనా అంటే వెంటనే అది జరిగేంత వాక్శక్తి మన వాక్కుకి వుండాల్సిన అవసరం కూడా వుండకపోవచ్చు. కానీ ఈ టెన్షన్ల ప్రపంచంలో మన ఆరోగ్యం కాపాడుకోవాల్సిన అవసరం మనకి చాలావుంది. అంటే కోపం వచ్చినప్పుడు మాట తూలకుండా మనల్ని మనం కంట్రోల్ చేసుకోవాల్సిన అవసరం చాలావుంది. దానికోసం మౌనవ్రతం పాటించటం చాలా అవసరం. కనీసం కోపం వచ్చినప్పుడు మాట్లాడకుండా వుండటం అలవాటు చేసుకున్నా చాలు. ఏమంటారు?

(జీ తెలుగు ప్రసారం చేసిన గోపురం కార్యక్రమం ఆధారంగా).


7 comments

Monday, November 23, 2009

ఆశీర్వచనం సమయంలో అక్షింతలు ఎందుకు చల్లుతారు?

Monday, November 23, 2009

ఆశీర్వచనం సమయంలో తలమీద అక్షింతలు ఎందుకు చల్లుతారు?

సాధారణంగా శిశువు జన్మించినప్పుడు పురిటి స్నానం రోజునుంచీ ప్రతి శుభ సందర్బంలోనూ ఆశీర్వదించినప్పుడు తలమీద అక్షింతలు జల్లుతారు. ఆశీర్వచనానికీ, అక్షింతలకీ ఎమీటి సంబంధం? అక్షింతలే ఎందుకు చల్లాలి వేరే ధాన్యాలు వున్నాయికదా వాటిని చల్లవచ్చుకదా? మరి పసుపుతో కలిపిన బియ్యమే ఎందుకు చల్లాలి? బియ్యం చంద్రుడికి కారకం. చంద్రుడు మనస్సుకి కారకుడు. అంటే మనస్ఫూర్తిగా ఇచ్చే ఆశీర్వచనానికి చిహ్నమన్నమాట. బియ్యంలో కలిపే పసుపు గురువుకి కారకం. గురువు శుభ గ్రహం. ఆయనకి సంకేతంగా, శుబానికి సంకేతంగా పసుపు రంగు కలిపిన అక్షింతలను మంత్రపూర్వకంగా తలమీద చల్లుతారు. మంత్రం అంటే క్షయం లేనటువంటిది. అకారంనుంచి క్షకారం దాకా వున్న అక్షరాలతో, బీజాక్షరాలతో కూడిన మంత్రానికి శక్తి వుంటుంది. మంత్రాన్ని చదివేటప్పుడి చేతితో పట్టుకున్న అక్షింతలకి కూడా ఆ శక్తి వస్తుంది. క్షయంలేని మంత్రాలను, క్షయంలేని అక్షింతలు పట్టుకుని చదివి, అవి ఎవరి తలపై వేస్తారో వారుకూడా క్షయం లేకుండా ఆభివృధ్ధి చెందాలని ఆశీర్వదిస్తారు. ఆలాంటి ఆశీర్వచనానికి శక్తి వుంటుంది.

(జీ తెలుగులో ప్రసారం చేసిన గోపురం ఆధారంగా).


0 comments

Saturday, November 21, 2009

గయలో ఇష్టమైన పదార్ధాలు వదలాలంటారు, ఎందుకు?

Saturday, November 21, 2009

గయలో ఇష్టమైన పదార్ధాలను వదలాలంటారు. ఎందుకు?

శాస్త్రం ప్రకారం, మన జీవితంలోధర్మంతో అర్ధ, కామాల్ని జయించిమోక్షాన్ని సాధించాలి. దానికోసం కామక్రోధ మద, మాత్సర్యాలను వదలాలని. ఇవ్వన్నీ వదిలేసి నిష్కల్మషంగాజీవించండి అంటే...ఎంతమంది వింటారో, . మవుతుందో మీకూ తెలుసు. ఇదికలికాలం. అందుకే, పెద్దలు అహంకార, మద, మాత్సర్యాలకిమనల్ని దూరం చేసే ప్రయత్నంలోదానికి నాందిగా చెప్పిందే గయలోవిష్ణు పాదాల దగ్గర ఇష్టమైనపదార్ధాన్ని వదిలెయ్యటం.

ఇలా వదిలేసినవారు మళ్ళీ తమ జీవితంలో ఆ పదార్ధాన్ని తినరు. అంటే క్రమ శిక్షణతో మన ఇష్టా ఇష్టాలను నియంత్రించుకోవటం మొదలు పెడతారన్నమాట. ఒక విషయంలో మొదలైన నియమాలు క్రమేపీ జీవితంలో మిగతా విషయాలకి కూడా పాకుతాయి. దానితో నియమబధ్ధమైన జీవితం మొదలవుతుంది. మనిషి తను బాగా బ్రతకటమే కాదు, ఎదుటివారికి కూడా హాని కలగకుండా వుండాలని ఆలోచిస్తాడు. అంటే సమాజంలో మంచి పెరుగుతుంది. ఈ కలికాలంలో మనం నిబధ్ధతగా వుంటే, మనకి మనం మేలు చేసుకుని ఎదుటివారికీ మేలు చేస్తే అదే మోక్షం. నిజానికి మన మంచిని మనం చూసుకుని ఎదుటివాళ్ళ మంచి కూడా కాంక్షిస్తే సమాజం దానంతటదే బాగుపడదా చెప్పండి.

మూఢ నమ్మకాలు చొప్పిస్తేగానీ మాట వినని వాళ్ళకోసం పెద్దలు వాటిని చెప్పినా, వాటి వెనక సమాజ శ్రేయస్సుకోసం వారు ఆలోచించిన తీరు విశ్లేషించి వారి ఆలోచనా ధోరణిని అర్ధం చేసుకుని ఆచరించగలిగితే వచ్చే మార్పుకు అంతా స్వాగతం పలకాల్సిందే.


(జీ టీవీ ప్రసారం చేసిన గోపురం కార్యక్రమం ఆధారంగా)


0 comments

Friday, November 20, 2009

కార్తీకమాస వనభోజనాలు

Friday, November 20, 2009
శ్రీ మహాకాళీ సమేత శ్రీ వీరభద్రస్వామి ఆలయం, బొంతపల్లి
గుత్తి వంకాయ చూపిస్తోంది ఉష (ఎడమనుంచి మూడు)
లలితా సహస్రనామ పారాయణ

ఏడుపాయలు వనదుర్గాదేవి ఆలయంలో కార్తీక దీపాలు




ఏడుపాయలు వనదుర్గాదేవి

ఏడుపాయలు వనదుర్గాదేవి ఆలయం ముందు
సామాను సర్దండి


కార్తీక మాస వన భోజనాలు

ఈ ఏడాది కార్తీకమాసం చివరిలో వనభోజనం అవకాశం వచ్చింది. ఏ.జీ. ఆఫీసు మిత్రురాళ్ళు శ్రీమతులు శేషలక్ష్మి, పద్మావతి, ఉష, భారతి, వరలక్ష్మీప్రసన్న కుమారి, వగైరాల ఆధ్వర్యంలో ఎనభైమంది స్నేహితురాళ్ళం 14-11-2009 న ఏడుపాయలు వెళ్ళాం. అభ్భ...అంతమంది స్నేహితురాళ్ళు కలిస్తే ఎంత సందడోకదా. అందుకే ఆలస్యమయినా ఆ సంగతులు మీకోసం..

ఉదయం 9-30 కి ఎనభైమంది ఏ.జీ. ఆఫీసు మహిళా ఉద్యోగినులతో రెండు బస్సులు బయల్దేరాయి ఏడుపాయలలోని వనదుర్గా ఆలయ దర్శనానికి. ఎంత సందడో ఎంత హడావిడో. వచ్చినవారిని సరి చూసుకునే వాళ్ళు కొందరయితే, సామాను చేరవేసేవారు కొందరు. అందరూ అందర్నీ పలకరించే వాళ్ళే. చాలా రోజుల తర్వాత ఆత్మీయులని చూసిన సంతోషం మాలాంటి రిటైరయినవారిది. ఎంత హడావిడి చేశామో చూడండి.


బస్సులోనే ఉదయం అల్పహారం ఇడ్లీ, వడ, కొబ్బరి, అల్లం చట్నీలతో కానిచ్చాం. మా మొదటి మజిలీ ఉదయం 10-30 కి బొంతపల్లి శ్రీ మహాకాళీ సమేత శ్రీ వీరభద్ర స్వామి దేవాలయం.


దర్శనానంతరం తేనీరు సేవించి మళ్ళీ బయల్దేరాము. మధ్యాహ్నం ఒంటిగంట ప్రాంతంలో ఏడుపాయలు చేరాం. అమ్మవారి దర్శనానంతరం ఆలయంలో అందరం కలసి దీపారాధన, లలితా సహస్రనామ పారాయణ. తర్వాత కొంతసేపు కొండల్లో విహారం అయ్యేసరికి ఆకళ్ళు వెయ్యటం మొదలయింది. గుడికి కొంత దూరంలో రోడ్డుప్రక్కనే ఒక చెట్టు కింద వన భోజనాలు. పాలకూర పప్పు, గుత్తి వంకాయ కూర, కేబేజ్ కూర, బెండకాయ వేపుడు, సాంబారు, టమేటా చట్నీ, దోసావకాయ, పులిహోర, పెరుగు కేటరింగ్ వాళ్ళ స్పెషల్స్ అయితే శ్రీమతి రమాదేవి ఈ అకేషన్ కి ప్రత్యేకంగా తెచ్చిన ఉసిరికాయ పచ్చడి అద్భుతంగా వుండి నిముషంలో ఎగిరి పోయింది.
మా విహార యాత్రలలో సాధారణంగా భోజనాల తర్వాత వినోద కార్యక్రమాలుంటాయి. ఆ రోజు సమయాభావం వల్ల భోజనాలు కాగానే చిట్కుల్ శ్రీ చాముండేశ్వరీదేవి దర్శనానికి బయల్దేరాము. అమ్మవారి దర్శనానంతరం అక్కడే లడ్డూ, మిక్శ్చర్, చిప్స్ తిని తిరిగి ఇళ్ళకి బయల్దేరాము.

దోవ పొడుగూ పాటలు, అంత్యాక్షరి, డాన్సులూ, తంబోలా వగైరాలతో చాలా అద్భుతంగా సాగింది.

చాలా ఏళ్ళ క్రితం మేము మొదలు పెట్టిన ఈ మహిళా ఉద్యోగినుల విహార యాత్ర ఇప్పటికీ కొనసాగిస్తున్న శ్రీమతి శేషలక్ష్మీ బృందానికి ప్రత్యేక కృతజ్ఞతలు. మరి ఏడాదిలో ఒక రోజు స్నేహితులతో సరదాగా గడిపే అవకాకశం ఇచ్చారుకదా.

2 comments

Wednesday, November 18, 2009

గోపురం

Wednesday, November 18, 2009
పగిలిన అద్దంలో ముఖం చూసుకోకూడదా?

అద్దం లక్ష్మీ స్వరూపంగా చెప్తారు. అది పగిలితే దానిలో ముఖం చూసుకోకూడదు అంటారు. దానికి కారణం, పగిలిన అద్దంలో ముఖం సరిగ్గా కనబడదు. దాంతో మనం, అయ్యో మన ముఖమేమిటి ఇలా అయిపోతోందని లేని వంకరలనాపాదించుకుని బాధ పడ్తాము. బలహీన మనస్కులయితే నేనిలా అయిపోయానే అని భయ పడతారు కూడా.

అంతే కాదు. అద్దం పగిలినప్పుడు ముక్కలు చెరురుమదురుగా పడితే ఎవరికైనా గుచ్చుకోవచ్చు. పగిలిన అద్దాన్ని వెంటనే మార్చకపోతే మనం ఏ హడావిడిలోనో వున్నప్పుడు ఆ ముక్కలు వూడి మనల్ని ఇబ్బంది పెట్టచ్చు. ఈ గోలలేం లేకుండా పగిలిన అద్దాన్ని వెంటనే మార్చేయటం మంచిదని మీరూ ఒప్పుకుంటారు కదూ.


(జీ తెలుగు ప్రసారం చేసిన గోపురం కార్యక్రమం ఆధారంగా)

0 comments

Tuesday, November 17, 2009

గోపురం

Tuesday, November 17, 2009
పది రోజులనుంచీ చికెన్ గున్యాతో స్నేహం చెయ్యటంతో ఏమీ రాయలేక పోయాను. చాలా రోజులయిందికదూ కలిసి. మళ్ళీ గోపురం కబుర్లతోనే మొదలు పెడుతున్నాను.

శాస్త్రం జున్ను తినకూడదని చెప్తోందా?

అవును. శాస్త్రం ప్రకారం జున్ను తినకూడదు. దానికి కారణం మనకేదన్నా నష్టం జరుగుతుందని కాదు. అప్పుడే ఈ ప్రపంచంలోకి వచ్చిన దూడలకి సరైన పోషణ లభించదని. పశువులు ఈనిన తర్వాత మొదటి పదిరోజులూ వాటి పాలల్లో దూడలకి పోషక పదార్ధాలు చాలా వుంటాయి. ఆ పాలని దూడలే తాగటంవల్ల అవ్వి బలంగా పెరుగుతాయి. పశువులు ఆరోగ్యంగా వుంటే లాభాలు మనకే. మన పనులు సజావుగా సాగటమేకాక పశు సంపద కూడా ఆరోగ్యకరంగా వృద్ధి అవుతుంది. ఆపాల జున్ను మనం తినటంవల్ల ఆ పోషక పదార్ధాలు దూడలకి అందవు. అవి బలహీన పడటమేకాక వాటి సంతతి కూడా బలహీనంగానే వుంటుంది. దానితో మనం బలమైన పశు సంపదను నష్టపోతాం.

మనం కొంచెం భూత దయ చూపించి, అనేక పోషక పదార్ధాలూ, రోగ నిరోధక శక్తి వున్న పాలని దూడలని తాగనిస్తే పశువులు ఆరోగ్యంగా పెరుగుతాయి. ఈ కారణాలవల్లనే శాస్త్రం మనల్ని జన్ను తినకూడదని చెప్తోంది.


(జీ తెలుగు ప్రసారం చేసిన గోపురం ఆధారంగా)

0 comments

Friday, November 6, 2009

దీపారాధన ఎలా చెయ్యాలి?

Friday, November 6, 2009
దేవుడి దగ్గర దీపారాధన ఎలా చెయ్యాలి?

దీపారాధన గురించి అనేక విషయాలు చెప్తారు. శివుడికి ఎడమవైపు దీపారాధన చెయ్యాలని, విష్ణువుకి కుడివైపు అనీ ఏ దేవుడికీ ఎదురుగా దీపారాధన చెయ్యకూడదనీ అంటారు. అమ్మవారిముందు తెల్లని బియ్యంపోసి దానిమాద వెండి దీపారాధన కుందిలో దీపారాధన చేసి, తెల్లకలువ పూలతో దీపాన్ని అలంకరించి, అమ్మవారికి పూజ చేస్తే తెలివి తేటలు, మేధస్సుపెరిగి, సాత్విక మార్గంలో సంపాదన పెరుగుతుంది.

ఇంటిముందు తులసి మొక్కముందు మట్టి ప్రమిదలో దీపారాధన చేస్తే ఇంట్లోకి దుష్ట శక్తులు రావు.

శనీశ్వరుడంటే అందరికీ భయం. అసలు, మనలో జీవ శక్తికీ, ఆయుష్షుకూ అధిదేవత ఆయనే. శనీశ్వడికి అరచేతి వెడల్పుగల నల్లగుడ్డలో ఒక చెంచా నల్ల నవ్వులు పోసి మూటకట్టి, ఆమూట చివర వత్తిగా చేసి, ఇనప ప్రమిదలో నువ్వుల నూనె పోసి దీపారాధన చెయ్యాలి. ఈ దీపారాధనకూడా శివుడు, శనీశ్వరుడు, ఆంజనేయస్వామి ముందుచేసి శని దోషాలు పోవాలని నమస్కరించాలి. ఇది ఆధ్యాత్మకం.

ఇంక శాస్త్రీయం ఏమిటంటే ఈ దీపం చుట్టూ జీవ శక్తి ప్రసరిస్తూవుంటుంది. ఆ దీపం దగ్గరకూర్చుని పూజ చెయ్యటం, దానికి ప్రదక్షిణ చెయ్యటం, వగైరాలతో ఆ జీవశక్తి మన శరీరంపై ప్రభావం చూపి, మన శరీరంలోని చిన్నచిన్న లోపాలు పోగొడుతుంది.

మనవాళ్ళు బంగారం, వెండి ఆభరణాలు ధరించమని చెప్తారు. ఆ లోహాలను ఆయుర్వేదం మందుల్లోకూడా వాడుతూంటారు. బంగారం, వెండి ధరించటంవల్ల మన శరీరం వేడికి ఆ లోహాలు కరిగి కొంచెం కొంచెం శరీరంలోకి చేరతాయి. తద్వారా శరీరానికి కావాల్సిన ధాతువులు అందుతాయి.

అలాగే బంగారం, వెండి ప్రమిదల్లో ఆవునెయ్యి తో దీపారాధనచేసి ఆ దీపం దగ్గర కూర్చుని పూజ చేసినట్లయితే మనలో జీవ శక్తి ప్రవేశించి చిన్న చిన్న లోపాలు సవరింపబడతాయి.

చూశారా, దేవుడికి మనం చేసే దీపారాధన వల్ల ఏ విధంగా చూసినా లాభం మనకే.


(జీ తెలుగు ప్రసారం చేసిన గోపురం ఆధారంతో)

1 comments

Thursday, November 5, 2009

పౌర్ణమి, అమావాస్యలలో ప్రయాణాలు చేయకూడదా?

Thursday, November 5, 2009
పౌర్ణమినాడు, అమావాస్యనాడు ప్రయాణాలు చెయ్యకూడదా?

పౌర్ణమినాడు చంద్రుడు పూర్ణ కళలతో వుంటాడు. చంద్రుడు జలానికీ, లవణానికీ, మనసుకీ అధిపతి. అందుకే సముద్రంలో పౌర్ణమినాడు ఆటుపోట్లు ఎక్కువగా వుంటాయి. అలాగే మన శరీరంలో కూడా నీరు, లవణాలు, మనసు వుంటాయికదా. వీటికీ అధిపతి చంద్రుడే కనుక మన శరీరానికీ ఆటుపోట్లు ఎక్కువగా వుంటాయి. ఆయితే ఇవి అంతగా పైకి కనబడవు. మన శరీరంలో ఆటుపోట్లెక్కువగా వున్నప్పుడు మనం ఏ విషయంలోనైనా సరైన నిర్ణయం తీసుకోలేక పోవచ్చు. ప్రయాణాల్లో సరైన నిర్ణయాలు తీసుకోవటం ప్రయాణ సమయంలోకానీ, మన పనుల్లోకానీ చాలా అవసరం. అందుకే, ఆ నిర్ణయాలు తీసుకోలేని సమయంలో ప్రయాణం చెయ్యవద్దు అంటారు.

అలాగే అమావాస్యనాడు చంద్రుడు వుండడు. అంటే రాత్రి వెలుతురు చాలా తక్కువగా వుంటుంది. అందుకే అమావాస్యనాడు అర్ధరాత్రి ప్రయాణాలు కూడదంటారు. వెలుతురు తక్కువగా వుండటంవల్ల త్రోవ సరిగ్గా కనబడక ప్రమాదాలు జరగవచ్చు, చీకట్లో ఏదైనా చూసి ఇంకేదో అనుకుని భయపడవచ్చు, చీకట్లో దొంగల భయం వుండవచ్చు, మనం ప్రయాణం చేసే వాహనం ఏ కారణం వల్లనన్నా ఆగినా ఇబ్బంది పడవచ్చు. రాత్రి పూట, అందులో చీకటి రాత్రి అలా జరిగితే ఎవరికైనా ఇబ్బందే కదా, అందుకే అమావాస్య అర్ధరాత్రి ప్రయాణాలు, అందులోనూ ఒంటరిగా అసలు ప్రయాణం చెయ్యద్దంటారు. ఈ శాస్త్రాలన్నీ మన మంచికే కదండీ. పాటిస్తేపోలా. ఏ కారణంవల్లనైనా ఆ రోజుల్లో ప్రయాణం చెయ్యవలసివస్తే, లేనిపోని శంకలు పెట్టుకోకుండా, తగు జాగ్రత్తలతో బయల్దేరండి.

(జీ తెలుగు ప్రసారం చేసిన గోపురం ఆధారంగా)

0 comments

Wednesday, November 4, 2009

కొంటె కోణాలు - 11

Wednesday, November 4, 2009
జస్ట్ కిడ్డింగ్

నేను వెళ్ళేసరికి ఇల్లంతా చిందరవందరగా వుంది. కుర్చీలు, సోఫాలు, వుండవలసిన స్ధలంలోగానీ, వుండవలసిన పధ్ధతిలోగానీ లేవు. కొన్ని పక్కకి లాగబడివున్నాయి, కొన్ని తల్లక్రిందులుగా....ఓహ్....అక్కడ ఇప్పుడే ఓ దొమ్మీ జరిగిందంటే నమ్మచ్చు.

మా బుజ్జి ఆయాసపడుతూ, చేతిలో హిట్ డబ్బా పట్టుకుని దెయ్యం పట్టినదానిలా హాలులో అటూ ఇటూ పరిగెత్తుతోంది. నన్ను చూసి పరుగులాపి, వగరుస్తూ ఒ కుర్చీ సరిచేసుకుని కూలబడి, నన్నూ కూర్చోమని సైగ చేసింది. నేను కంగారు పడుతూ ఏంటే ఇదంతా అని అడిగాను.

ఆయాసం కొంచెం తగ్గాక చెప్పింది. ఇంట్లో దోమలున్నాయే. హిట్ తో దోమలని కొడితే ఒక్క దోమ కూడా వుండదని టీవీలో చెప్పారు. అందుకే హిట్ డబ్బాతీసుకుని దోమల్ని కొట్టానికి ప్రయత్నిస్తున్నా. అంతే.

నీకేమన్నా పిచ్చి పట్టిందా. నీ తెలివి తేటలు ఏ హిట్ డబ్బాలో పెట్టి మూత పెట్టావు హిట్ తో దోమల్ని కొట్టమంటే హిట్ డబ్బాతో ఒక్కొక్క దోమనీ వెతికి పట్టుకుని కొట్టమనా. ఇల్లంతా ఎలా చేశావో చూడు. ఇవ్వన్నీ సర్దాలంటే ఎంతటైము పడుతుంది. దానికన్నా చాలా కుంచెం పెద్దదాన్ని నేను, కానీ నన్నెప్పుడూ అది పెద్దదానిగా గుర్తించదు. ఈ అవకాశాన్ని వదులుకోకుండా నా పెద్దరికం వుపయోగించి కేకలేసేశాను.

కొంటెకోణం

అయిందా దండయాత్ర. ఈ మధ్య ఎక్సర్సైజు చెయ్యాలన్నా, ఇల్లు సర్దాలన్నా చాలా బధ్ధకంగా వుందే. ఇవాళ ఆ యాడ్ వినగానే ఈ ఐడియా వచ్చింది. సరదాగా నేను కొంచెంసేపు ఎంజాయ్ చేసినట్లుంటుంది, ఎక్సర్సైజు అవుతుంది, ఇల్లు సర్దుడూ అవుతుంది అని ఇప్పుడే మొదలు పెట్టాను, నువ్వొచ్చావు. అయినా ఎక్సర్సైజుకోసం మ్యూజిక్ పెట్టుకుని డాన్స్ చేస్తే మెచ్చుకుంటారుగానీ, దీనికలా చూస్తావేం....నాకే ఝలక్ ఇచ్చింది.


2 comments

Monday, November 2, 2009

బ్లాగ్ వనంలో వనభోజనాలు

Monday, November 2, 2009



బ్లాగ్ వనంలో వనభోజనాలు

పాలక్ పరోటా -- మీకిష్టమయిన పధ్ధతిలో

కార్తీక పౌర్ణమి..గుడికి వెళ్ళాలి. మీరేమో వనభోజనానికి పిలిచారు. అందుకే నా రెసిపీ చెప్పేసి, నేను చేసినవి ఇక్కడ పెట్టి గుడికి వెళ్ళి వస్తాను. అప్పటిదాకా మీరు లాగిస్తూండండి మరి.

వనభోజనానికి నా స్పెషల్ రెసిపీ తయార్. ఇది తప్పని సరిగా అందరూ తినవలసినదే. ఆర్డర్ కాదండీ, కారణాలు చెప్తున్నాగా. పెద్దలకు ఆరోగ్య ప్రదాయిని, పిల్లలకు చూడటానికి ఆకర్షణీయంగావుండి వెంటనే తినాలనిపిస్తుంది. ఇంతకీ ఏమిటా స్పెషల్ అంటారా. హమ్మో చెప్పకపోతే మూత తీసి చూసేటట్లున్నారు. నేనే చెప్పేస్తా. టట్టటాయ్..... పాలక్ పరోటా, పెరుగు. ఆ...ఆ....వేరే కబుర్లల్లో పడిపోకండి...దీనికి కావాల్సిన పదార్ధాలూ, ఎలా తయారు చేసుకోవాలో చెప్తున్నాను. జాగ్రత్తగా నోట్ చేసుకోండి. మరి ప్రారంభించనా

అన్నింటికన్నా ముందు ఒక్కవిషయం మాత్రం గుర్తు పెట్టుకోండి. మీరంతా ఇంత సరదాగా వనభోజనాలకొచ్చారు..అందుకని మీ సరదాని ఇంకా పెంచటానికి ఇవాళ్టిమటుకు నేను మీ ఇష్టా ఇష్టాలకు ఫస్ట్ టిక్ పెడతా. అంటే, ఈ పాలక్ పరోటాలు, నేను చెప్పిన విధంగా, మధ్యలో మీ ఇష్టాలని కలుపుకుంటూ ఇంచక్కా చేసుకోండి. బాగుంటేనే నేను చెప్పానని చెప్పండి. బాగుండకపోతే బాధ్యత అంతా మీదే.

ఇంతకీ ఏం చెయ్యాలంటే ముందు మీకు కావాల్సినంత, అదేనండీ, ఒక రూపాయిదో, వంద రూపాయలదో పాలకూర కొనండి. కొనకపోతే దొడ్లో వుంటే కోసుకొచ్చినా పరవాలేదు, అలవాటు వుంటే పక్కింట్లో అరువు తెచ్చయినా చేసుకోవచ్చు, అదీ ఇదీ కాకపోతే మీ ఇష్టం వచ్చిన ఏ విధంగానైనా తెచ్చుకోండి, పాలకూర మాత్రం తెండి. దాన్ని బాగు చెయ్యటం కూడా మీ ఇష్ట ప్రకారమే చేసుకోండి. కొందరికి కొంచెం కాడలు వుంటే ఇష్టం, శరీరానికి కాస్త పీచు పదార్ధం అందుతుందని. వీళ్ళకి డయట్ కాస్ష,స్నెస్ కాస్త ఎక్కువ. కొందరు ఆ గడ్డంతా ఎక్కడ తింటామని ఆకులు గిల్లి వేసుకుంటారు. ఏం పర్వాలేదు. సో, మీ ఇష్టం వచ్చినట్లు దాన్ని బాగు చేసుకోంది. చైనా వాళ్ళుంటే వాళ్ళ ఇష్టం ప్రకారం ఆకుల్లో ఏమన్నా పురుగూ పుట్రా వుంటే అలాగే వుంచేయచ్చు. నేను ముందే చెప్పాను, మీ ఇష్టానికే ఫస్ట్ టిక్ అని. పాల కూర తెచ్చారు, బాగు చేశారు. ఇంక కొన్ని నీళ్ళుపోసి ఆ ఆకును కడగండి. ఎందుకండీ, ఆకుకూరలు అమ్మేవాళ్ళు దాన్నిండా ఎప్పుడూ నీళ్ళు పోస్తూనే వుంటారు కదా మళ్ళీ మనం నీళ్ళుపోసి కడగాలా, మరీ చాదస్తంకాకపోతే అంటారా. సరే. మీ ఇష్టం. పాలకూరని మాత్రం తీసుకుని కుక్కర్లో ఉడికించండి. డైరెక్టుగా కుక్కర్లో పెట్టాలా లేక గిన్నెలో పెట్టి పెట్టమంటార అంటున్నారా. నేనేమీ టీవీలో వంటల ప్రోగ్రామ్ లో చెప్పినట్లు ఇలా చేస్తేనే బాగుంటుందని చెప్పను. ఇది బ్లాగు లోకం. కాబట్టి ఎవరి ఇష్టాలు వాళ్ళవే. మీ ఇష్టా ఇష్టాలకే ప్రధమ తాంబూలం. తాంబూలమన్నానని ఇది తిన్నాక తాంబూలం వేసుకోవచ్చా అని అడుగుతున్నారు శ్రీమతిగారు. నేను ముందే చెప్పానండీ...మీ ఇష్టానికే.....

ఇంతకీ పాలకూర ఉడికించారా. ఇప్పుడు గోధుమపిండి తీసుకోండి. పిండి పేకెట్ తీసుకొచ్చి ఏం చెయ్యమంటారంటారా. మీ ఇష్టం వచ్చిన పాత్ర తీసుకోండి. ఇక్కడ మాత్రం కొంచెం నేను చెప్పేది పాటించండీ. పాత్ర లేకపోతే పిండి కలపటం కష్టం. అందుకని పాత్ర దేనికి అని ఎదురు ప్రశ్న వెయ్యకుండా మీ ఇష్టం వచ్చిన పాత్ర తీసుకోండి. నేను చెప్పేది మాత్రం ఒక్కమాట వినండి. మీరు తీసుకునే పిండి కలపటానికి ఆ పాత్ర అనువుగా వుండాలి. ఈ ఒక్క విషయంలో నేను చెప్పే విధంగా విని, మీ ఇష్టం వచ్చిన పాత్ర తీసుకుని దానిలో గోదుమ పిండి వేసి, అందులో ఉడికించిన పాలకూర, ఉప్పు, కారం, జీలకఱ్ఱ, వెయ్యండి. మీకు కావాలంటే ఇంకా ఇంట్లో తినే వస్తువుల్లో చపాతీల్లోకి బాగుంటాయనుకున్న పదార్ధాలన్నీ వేసెయ్యండి. ఇవ్వి మీ ఇష్ట ప్రకారం చేసుకునే పరోటాలండీ. ఎవరడ్డొచ్చినా ఖాతరు చెయ్యకండి. ఇవ్వన్నీ వేశాక నీళ్ళు పోసి కలపాలండీ. ఇక్కడ మళ్ళీ నా మాటే వినాలి మీరు. మీకిష్టమని ఏ నూనో, పెరుగో పోసి కలపకండి పిండిని. ఏంలేదు..పరోటాలు అంతబాగా రాకపోవచ్చేమోనని కొంచెం అనుమానం..

సరే పిండి కలిపారా. కొంచేంసేపు దానిమీద ఒక గిన్నె బోర్లించి వుంచండి. ఎంతసేపంటారా పది నిముషాలు, 15 ని. లు అని నేను మీకు టైము లిమిట్ పెట్టనండీ. మీ ఇష్టం వచ్చినంతసేపు నాననివ్వండి. ఇప్పుడు మీ ఇష్టం వచ్చిన చపాతీలు వత్తే పీట, కఱ్ఱ తీసుకుని పిండిని బాగా మర్దించి, ఉండలు చేసి గుండ్రంగా వత్తాలి. దాని మీద కొంచెం నూనెగానీ, పొడి పిండిగానీ వేసి మీ ఇష్టం వచ్చినట్లు మడత పెట్టండి. మళ్ళీ వత్తండి. ఇలా మీ ఇష్టం వచ్చినంతసేపు, ఇష్టం వచ్చిన షేపులో చేసుకుని, పెనం మీద నూనె వేసో, వేయకుండానో, కొంచెంగా వేసో, మీకెలా ఇష్టం అయితే అలా, రెండు వేపులా మాత్రం కాల్చాలండీ. ఇంత శ్రమ పడ్డారుకదా. ఇంకా దాన్లోకి కూరా గీరా అని మళ్ళీ శ్రమ పడకుండా సుభ్భరంగా మంచి పెరుగు వేసుకుని తినెయ్యండి. ఇదేం ఆంక్ష కాదండీ. మీరు అలిసిపోతారని.

చూశారా. మీ కేమాత్రం కష్టంలేకుండా, మీకిష్టమైన రీతిలో మీ కిష్టమైన రుచులతో పాలక్ పరోటా ఎంత తేలిగ్గా చేసుకోవచ్చో. అయితే ఎందుకైనా మంచిది.... వీటిని ఎవరికైనా పెట్టేటప్పుడు మాత్రం కాస్త జాగ్రత్తగా వుండండి. సరేనా.



13 comments