Monday, November 2, 2009

బ్లాగ్ వనంలో వనభోజనాలు

Monday, November 2, 2009



బ్లాగ్ వనంలో వనభోజనాలు

పాలక్ పరోటా -- మీకిష్టమయిన పధ్ధతిలో

కార్తీక పౌర్ణమి..గుడికి వెళ్ళాలి. మీరేమో వనభోజనానికి పిలిచారు. అందుకే నా రెసిపీ చెప్పేసి, నేను చేసినవి ఇక్కడ పెట్టి గుడికి వెళ్ళి వస్తాను. అప్పటిదాకా మీరు లాగిస్తూండండి మరి.

వనభోజనానికి నా స్పెషల్ రెసిపీ తయార్. ఇది తప్పని సరిగా అందరూ తినవలసినదే. ఆర్డర్ కాదండీ, కారణాలు చెప్తున్నాగా. పెద్దలకు ఆరోగ్య ప్రదాయిని, పిల్లలకు చూడటానికి ఆకర్షణీయంగావుండి వెంటనే తినాలనిపిస్తుంది. ఇంతకీ ఏమిటా స్పెషల్ అంటారా. హమ్మో చెప్పకపోతే మూత తీసి చూసేటట్లున్నారు. నేనే చెప్పేస్తా. టట్టటాయ్..... పాలక్ పరోటా, పెరుగు. ఆ...ఆ....వేరే కబుర్లల్లో పడిపోకండి...దీనికి కావాల్సిన పదార్ధాలూ, ఎలా తయారు చేసుకోవాలో చెప్తున్నాను. జాగ్రత్తగా నోట్ చేసుకోండి. మరి ప్రారంభించనా

అన్నింటికన్నా ముందు ఒక్కవిషయం మాత్రం గుర్తు పెట్టుకోండి. మీరంతా ఇంత సరదాగా వనభోజనాలకొచ్చారు..అందుకని మీ సరదాని ఇంకా పెంచటానికి ఇవాళ్టిమటుకు నేను మీ ఇష్టా ఇష్టాలకు ఫస్ట్ టిక్ పెడతా. అంటే, ఈ పాలక్ పరోటాలు, నేను చెప్పిన విధంగా, మధ్యలో మీ ఇష్టాలని కలుపుకుంటూ ఇంచక్కా చేసుకోండి. బాగుంటేనే నేను చెప్పానని చెప్పండి. బాగుండకపోతే బాధ్యత అంతా మీదే.

ఇంతకీ ఏం చెయ్యాలంటే ముందు మీకు కావాల్సినంత, అదేనండీ, ఒక రూపాయిదో, వంద రూపాయలదో పాలకూర కొనండి. కొనకపోతే దొడ్లో వుంటే కోసుకొచ్చినా పరవాలేదు, అలవాటు వుంటే పక్కింట్లో అరువు తెచ్చయినా చేసుకోవచ్చు, అదీ ఇదీ కాకపోతే మీ ఇష్టం వచ్చిన ఏ విధంగానైనా తెచ్చుకోండి, పాలకూర మాత్రం తెండి. దాన్ని బాగు చెయ్యటం కూడా మీ ఇష్ట ప్రకారమే చేసుకోండి. కొందరికి కొంచెం కాడలు వుంటే ఇష్టం, శరీరానికి కాస్త పీచు పదార్ధం అందుతుందని. వీళ్ళకి డయట్ కాస్ష,స్నెస్ కాస్త ఎక్కువ. కొందరు ఆ గడ్డంతా ఎక్కడ తింటామని ఆకులు గిల్లి వేసుకుంటారు. ఏం పర్వాలేదు. సో, మీ ఇష్టం వచ్చినట్లు దాన్ని బాగు చేసుకోంది. చైనా వాళ్ళుంటే వాళ్ళ ఇష్టం ప్రకారం ఆకుల్లో ఏమన్నా పురుగూ పుట్రా వుంటే అలాగే వుంచేయచ్చు. నేను ముందే చెప్పాను, మీ ఇష్టానికే ఫస్ట్ టిక్ అని. పాల కూర తెచ్చారు, బాగు చేశారు. ఇంక కొన్ని నీళ్ళుపోసి ఆ ఆకును కడగండి. ఎందుకండీ, ఆకుకూరలు అమ్మేవాళ్ళు దాన్నిండా ఎప్పుడూ నీళ్ళు పోస్తూనే వుంటారు కదా మళ్ళీ మనం నీళ్ళుపోసి కడగాలా, మరీ చాదస్తంకాకపోతే అంటారా. సరే. మీ ఇష్టం. పాలకూరని మాత్రం తీసుకుని కుక్కర్లో ఉడికించండి. డైరెక్టుగా కుక్కర్లో పెట్టాలా లేక గిన్నెలో పెట్టి పెట్టమంటార అంటున్నారా. నేనేమీ టీవీలో వంటల ప్రోగ్రామ్ లో చెప్పినట్లు ఇలా చేస్తేనే బాగుంటుందని చెప్పను. ఇది బ్లాగు లోకం. కాబట్టి ఎవరి ఇష్టాలు వాళ్ళవే. మీ ఇష్టా ఇష్టాలకే ప్రధమ తాంబూలం. తాంబూలమన్నానని ఇది తిన్నాక తాంబూలం వేసుకోవచ్చా అని అడుగుతున్నారు శ్రీమతిగారు. నేను ముందే చెప్పానండీ...మీ ఇష్టానికే.....

ఇంతకీ పాలకూర ఉడికించారా. ఇప్పుడు గోధుమపిండి తీసుకోండి. పిండి పేకెట్ తీసుకొచ్చి ఏం చెయ్యమంటారంటారా. మీ ఇష్టం వచ్చిన పాత్ర తీసుకోండి. ఇక్కడ మాత్రం కొంచెం నేను చెప్పేది పాటించండీ. పాత్ర లేకపోతే పిండి కలపటం కష్టం. అందుకని పాత్ర దేనికి అని ఎదురు ప్రశ్న వెయ్యకుండా మీ ఇష్టం వచ్చిన పాత్ర తీసుకోండి. నేను చెప్పేది మాత్రం ఒక్కమాట వినండి. మీరు తీసుకునే పిండి కలపటానికి ఆ పాత్ర అనువుగా వుండాలి. ఈ ఒక్క విషయంలో నేను చెప్పే విధంగా విని, మీ ఇష్టం వచ్చిన పాత్ర తీసుకుని దానిలో గోదుమ పిండి వేసి, అందులో ఉడికించిన పాలకూర, ఉప్పు, కారం, జీలకఱ్ఱ, వెయ్యండి. మీకు కావాలంటే ఇంకా ఇంట్లో తినే వస్తువుల్లో చపాతీల్లోకి బాగుంటాయనుకున్న పదార్ధాలన్నీ వేసెయ్యండి. ఇవ్వి మీ ఇష్ట ప్రకారం చేసుకునే పరోటాలండీ. ఎవరడ్డొచ్చినా ఖాతరు చెయ్యకండి. ఇవ్వన్నీ వేశాక నీళ్ళు పోసి కలపాలండీ. ఇక్కడ మళ్ళీ నా మాటే వినాలి మీరు. మీకిష్టమని ఏ నూనో, పెరుగో పోసి కలపకండి పిండిని. ఏంలేదు..పరోటాలు అంతబాగా రాకపోవచ్చేమోనని కొంచెం అనుమానం..

సరే పిండి కలిపారా. కొంచేంసేపు దానిమీద ఒక గిన్నె బోర్లించి వుంచండి. ఎంతసేపంటారా పది నిముషాలు, 15 ని. లు అని నేను మీకు టైము లిమిట్ పెట్టనండీ. మీ ఇష్టం వచ్చినంతసేపు నాననివ్వండి. ఇప్పుడు మీ ఇష్టం వచ్చిన చపాతీలు వత్తే పీట, కఱ్ఱ తీసుకుని పిండిని బాగా మర్దించి, ఉండలు చేసి గుండ్రంగా వత్తాలి. దాని మీద కొంచెం నూనెగానీ, పొడి పిండిగానీ వేసి మీ ఇష్టం వచ్చినట్లు మడత పెట్టండి. మళ్ళీ వత్తండి. ఇలా మీ ఇష్టం వచ్చినంతసేపు, ఇష్టం వచ్చిన షేపులో చేసుకుని, పెనం మీద నూనె వేసో, వేయకుండానో, కొంచెంగా వేసో, మీకెలా ఇష్టం అయితే అలా, రెండు వేపులా మాత్రం కాల్చాలండీ. ఇంత శ్రమ పడ్డారుకదా. ఇంకా దాన్లోకి కూరా గీరా అని మళ్ళీ శ్రమ పడకుండా సుభ్భరంగా మంచి పెరుగు వేసుకుని తినెయ్యండి. ఇదేం ఆంక్ష కాదండీ. మీరు అలిసిపోతారని.

చూశారా. మీ కేమాత్రం కష్టంలేకుండా, మీకిష్టమైన రీతిలో మీ కిష్టమైన రుచులతో పాలక్ పరోటా ఎంత తేలిగ్గా చేసుకోవచ్చో. అయితే ఎందుకైనా మంచిది.... వీటిని ఎవరికైనా పెట్టేటప్పుడు మాత్రం కాస్త జాగ్రత్తగా వుండండి. సరేనా.



13 comments:

చిలమకూరు విజయమోహన్ said...

మీరు కూరా గీరా వద్దన్నా నేస్తంగారి గుత్తొంకాయ,జ్యోతిగారి కాప్సికమ్ మసాలాతో మీ పాలక్ పరోటాలు లాగించాల్సిందే!

సిరిసిరిమువ్వ said...

వీటిని ఎవరికైనా పెట్టేటప్పుడు మాత్రం కాస్త జాగ్రత్తగా ఉండండి--ఎందుకలా! అన్నీ చెప్పి ఇది చెప్పకపోతే ఎలా!

మీరు వర్డు వెరిఫికేషన్ తీసివేయకపోతే వ్యాఖ్యలు వ్రాయటం కష్టమండి.

నేస్తం said...

అవును నాది కూడా సిరిసిరి మువ్వగారి డవుటే :)

సుభద్ర said...

వావ్ లక్ష్మిగారు బాగు౦ది .చూస్తేనే తినేయల్నిపిస్తూ౦ది.....
ఎలా చెయాలో కుడా బాగా చెప్పేరు..పైగా కూర అవసర౦ లేకు౦డా !!!
అయినా నేను జ్యొతి గారి బ్లాగ్ లో౦చి,నేస్త౦ గారి బ్లాగ్ ను౦చి కొ౦చ౦ కొ౦చ౦ కూరలు తెచ్చుకున్నా...అవి వేసి లాగిస్తాను.
హ హ్హహ్హి ఒఓ హు హా....

psm.lakshmi said...

విజియమోహన్, సిరిసిరిమువ్వ, నేస్తం, సుభద్ర
ధన్యవాదాలు.
సిరిసిరిమువ్వా, ఇవి నేను చెప్పిన ప్రకారం, మీ ఇష్టాలని రంగరించి చేశారు కదా. అందుకు వేరేవాళ్ళకి పెట్టేటప్పుడ జాగ్రత్త అవసరం అన్నా. ముందే ఎలర్ట్ గా వున్నారనుకోండి తప్పులన్నీ నామీద రుద్దేసి, మంచంతా మీరు స్వీకరించవచ్చు. అంతే.
psmlakshmi

భావన said...

లక్ష్మి గారు బలే వున్నాయి పరోటాలు నోరు వూరిపోతోంది..

జయ said...

లక్ష్మి గారు, మీ పాలక్ పరోఠాలు చూస్తుంటేనే నోరూరుతోంది. బాగున్నాయి.

మాలా కుమార్ said...

మా ఇష్టాలు , మీ ఇష్టాలు కలబోసి ఎంతబాగా చెప్పారండి ! బాగున్నాయి .

sunita said...

చాలా బాగున్నాయి.

జ్యోతి said...

చాలా బావున్నాయి, పరాఠాలు.. మీరు చెప్పిన పద్దతి, వివరాలు..

తృష్ణ said...

చాలా బావున్నాయండీ parathaas..

శ్రీలలిత said...

లక్ష్మిగారూ, నేను గుడ్ గాల్ ని. ఎందుకంటే అందరిలా అదే రోజు రాకుండా మీరు చెప్పినట్లే నాకు ఇష్టం వచ్చినరోజు కాస్త ఆలస్యంగా బ్లాగ్ వనానికి వచ్చాను. ఇప్పుడు పడతాను మీ పరోటాలు చేసే పని. విష్ మి గుడ్ లక్..

కార్తీక్ said...

లక్ష్మి గారు మీ బ్లాగు బావుందండి

అన్ని బ్లాగుల వాళ్ళు అనుకుని మరీ కార్తీక మాసంలో ఇన్ని వంటలు చేసారన్నమాట పొని లెండి ఈ వంటల పుణ్యమా అని మీబ్లాగు దర్సించే అవకాసం లబుఇంచింది.
అన్ని బ్లాగిళ్ళలొ తింటూ తింటూ మీ బ్లాగింట్లో కూడా ఈ పరొటాలను ఒకా పట్టు పట్టేసా

www.tholiadugu.blogspot.com