Thursday, November 5, 2009

పౌర్ణమి, అమావాస్యలలో ప్రయాణాలు చేయకూడదా?

Thursday, November 5, 2009
పౌర్ణమినాడు, అమావాస్యనాడు ప్రయాణాలు చెయ్యకూడదా?

పౌర్ణమినాడు చంద్రుడు పూర్ణ కళలతో వుంటాడు. చంద్రుడు జలానికీ, లవణానికీ, మనసుకీ అధిపతి. అందుకే సముద్రంలో పౌర్ణమినాడు ఆటుపోట్లు ఎక్కువగా వుంటాయి. అలాగే మన శరీరంలో కూడా నీరు, లవణాలు, మనసు వుంటాయికదా. వీటికీ అధిపతి చంద్రుడే కనుక మన శరీరానికీ ఆటుపోట్లు ఎక్కువగా వుంటాయి. ఆయితే ఇవి అంతగా పైకి కనబడవు. మన శరీరంలో ఆటుపోట్లెక్కువగా వున్నప్పుడు మనం ఏ విషయంలోనైనా సరైన నిర్ణయం తీసుకోలేక పోవచ్చు. ప్రయాణాల్లో సరైన నిర్ణయాలు తీసుకోవటం ప్రయాణ సమయంలోకానీ, మన పనుల్లోకానీ చాలా అవసరం. అందుకే, ఆ నిర్ణయాలు తీసుకోలేని సమయంలో ప్రయాణం చెయ్యవద్దు అంటారు.

అలాగే అమావాస్యనాడు చంద్రుడు వుండడు. అంటే రాత్రి వెలుతురు చాలా తక్కువగా వుంటుంది. అందుకే అమావాస్యనాడు అర్ధరాత్రి ప్రయాణాలు కూడదంటారు. వెలుతురు తక్కువగా వుండటంవల్ల త్రోవ సరిగ్గా కనబడక ప్రమాదాలు జరగవచ్చు, చీకట్లో ఏదైనా చూసి ఇంకేదో అనుకుని భయపడవచ్చు, చీకట్లో దొంగల భయం వుండవచ్చు, మనం ప్రయాణం చేసే వాహనం ఏ కారణం వల్లనన్నా ఆగినా ఇబ్బంది పడవచ్చు. రాత్రి పూట, అందులో చీకటి రాత్రి అలా జరిగితే ఎవరికైనా ఇబ్బందే కదా, అందుకే అమావాస్య అర్ధరాత్రి ప్రయాణాలు, అందులోనూ ఒంటరిగా అసలు ప్రయాణం చెయ్యద్దంటారు. ఈ శాస్త్రాలన్నీ మన మంచికే కదండీ. పాటిస్తేపోలా. ఏ కారణంవల్లనైనా ఆ రోజుల్లో ప్రయాణం చెయ్యవలసివస్తే, లేనిపోని శంకలు పెట్టుకోకుండా, తగు జాగ్రత్తలతో బయల్దేరండి.

(జీ తెలుగు ప్రసారం చేసిన గోపురం ఆధారంగా)

0 comments: