Wednesday, January 12, 2011

కదంబ మాలిక – 7 వ భాగం

Wednesday, January 12, 2011


 ప్రమదావనం సభ్యులు ప్రప్రధమంగా ఏర్చికూర్చుతున్న ఈ కదంబ మాలికలో ఏడవ మూర (సప్తమ భాగం) ఇది.  వ్రాసిన వాళ్లలో ఎవరూ చెయ్యి తిరిగిన రచయిత్రులు లేరు కనుక (నిఝంగా నిజమండీ.  ఒట్టు.  ఎందుకంటే అందరి చేతులూ మామూలుగానే వున్నాయి), మా ఈ ప్రయత్నాన్ని ఆదరించి, సద్విమర్శలు చేసి ప్రోత్సహిస్తారని ఆశిస్తున్నాను.

ఈ మాలికలో ఆరవ భాగం శ్రీమతి రుక్మిణీదేవిగారు   వ్రాశారు.  కధ సాగటంకోసం ఒకసారి ఆ భాకం గుర్తు చేసుకుందామా?

*********************************************************************

ఇంక ఇప్పుడు నా కధనం చిత్తగించి  సద్విమర్శలు అందించండి..........


ఏంటి లక్ష్మమ్మా?  నిన్న రాలేదు, ఇవాళ ఇంత ఆలస్యమా  ఎందుకిట్లా చేస్తున్నావు?” అంటూ బయటకొచ్చిన సరోజిని, పెరట్లో మామిడి చెట్టుకి ఆనుకుని నిస్సత్తువగా కూలబడి వున్న లక్ష్మమ్మని చూసి  కంగారు పడింది.

 లక్ష్మమ్మకి 35 ఏళ్ళుంటాయి.  స్కూల్లో చదువుకోలేదుకానీ, ఆ వయసుకే ప్రపంచాన్ని చాలానే చదివింది.  తెలివితేటలుతోపాటు ధైర్యం కలది. చదువుకునివుంటే మంచి పొజిషన్ లో వుండేది.  కానీ లక్ష్మమ్మ దురదృష్టం కలిమి పేరుకి మాత్రమే పరిమితమైంది.  అందుకే చదువుకునే అవకాశం రాలేదు.    మొగుడు తాగుబోతు.   లక్ష్మమ్మకి దడిసి రోజూ తాగకపోయినా, పెళ్ళాంమాట ఎందుకు వినాలి అనే పురుషాహంకారం నెత్తికెక్కినప్పుడు మాత్రం పూర్తిగా తాగేసి వచ్చి లక్ష్మమ్మనీ, అడ్డొస్తే పిల్లల్నీ చావగొడతాడు.  మర్నాడు వాళ్ళని చుట్టేసి రాత్రి వాళ్ళని కొట్టినందుకు తనని  తనే తిట్టుకుంటూ వాపోతాడు.   

ఇద్దరు ఆడపిల్లలు పుట్టగానే మొగుడికి తెలియకుండానే ఆపరేషన్ చేయించుకుని, అతని చేతిలో తన్నులు తిన్నది లక్ష్మమ్మ.  అదేమిటే చెప్పి చేయించుకోకపోయినావా అని    నారాయణమ్మగారంటే, ఆడికి చెబితే సేయించుకోనీడమ్మగారూ.  నా బిడ్డల బతుకూ నా బతుకుమల్లే కాకుండా వుండాలంటే ఆళ్ళని చదించుకోవాల. ఇట్టా బిడ్డల్ని కంటూ పోతే ఆళ్ళని చదించడంకాదుగదా తిండికూడా ఎట్టలేం. అని తను చేసిన పనే సరైనదని నిర్ధారించుకుంది.  మొగుడి తాగుడు మాన్పించటానికి నానా విధాలా ప్రయత్నిస్తూంటుంది.

అలాగే పిల్లల్ని చదివించటానికీ నానా అవస్తా పడుతుంది.  ఫీజులు కట్టలేనప్పుడు పిల్లలు కొన్నాళ్ళు స్కూలుకెళ్ళకపోతే కలవరపడిపోతుంది.  వాళ్ళదగ్గరా, వీళ్ళదగ్గరా అప్పుచేసి ఎలాగోలా ఫీజు కడుతుంది.  ఈ అవస్తలు చూసే సరోజిని జాలిపడి కొంత సహాయం చేద్దామనుకుంది.

నారాయణమ్మగారొకసారంది వుండబట్టలేక.  మీలో మారు మనువులున్నాయికదా.  ఇన్నవస్ధలు పడేబదులు వీడ్ని వదిలేసి నీ దోవ నువ్వు చూసుకోవచ్చుకదా అని.

ఏ రాయయితేనేమమ్మా పళ్ళూడగొట్టుకోటానికి.  బిడ్డల్నిడిసి పోలేను కదమ్మా.  అయినా వేరేవాడు సరిగ్గుంటాడని, నా బిడ్డల్ని సరిగ్గా చూసుకుంటాడనీ నమ్మకమేటమ్మా.  ఎవురయినా మమ్మల్నందర్నీ కూకోబెట్టి కూడెట్టలేరుకదా.  నా కట్టం నాకు తప్పదు.  అయినా ఈడి మనసూ మంచిదేనమ్మా.  నేనన్నా, పిల్లలన్నా పేణం.  ఆ తాగుడే ముంచేత్తోంది.

 ఈ గవర్నెమెంటోళ్ళేమో పేదోళ్ళకి ఇళ్ళివ్వలేరు, పని చూపించలేరుగానీ,  ఇయ్యన్నీ మరిసిపోడానికి బాగా తాగండని ఏడబడితే ఆడ  ఈ దుకాణాలు మాత్తరం తెరుత్తున్నారు.  అసలు నన్నుగాని ఓ పాలి   ఆ మినిట్టరుని చేత్తే ఈళ్ళందరి సంగతీ తేల్చిపారేత్తాను. 

ఆరోజు లక్ష్మమ్మ  ఆలోచనలకీ, ఆవేశానికీ అబ్బురపడ్డారందరూ.  ఏ చదువూ రానిదైనా, మనిషిని మనషిలా స్వీకరించాలనీ, ఏవో లోపాలున్నంతమాత్రాన ప్రేమాభిమానాలు కుంటుపడవనీ లక్ష్మమ్మ తన భాషలో ఎంత చక్కగా చెప్పింది అనుకున్నారు నారాయణమ్మ.

మధ్య తరగతి కుటుంబాల్లో సాధారణంగా  ఒక మనిషి సంపాదిస్తే కుటుంబమంతా ఆ మనిషిమీద ఆధారపడుతుంది.  కుటుంబంలో అవకాశంవున్నవాళ్ళు ఎవరికి తగ్గట్లు వాళ్ళు కుటుంబానికి చేయూతనివ్వాలనికూడా ఎంత చక్కగా అర్ధం చేసుకుంది లక్ష్మమ్మ అనుకుంది సరోజిని.

ప్రజల అవసరాలు పట్టించుకోని ప్రభుత్వాన్నికూడా వదలలేదు.  అసలు ఇలాంటివాళ్ళు ఎదురు తిరిగి నిలేస్తే ప్రభుత్వాల గతేమిటని అనుకుంది అనిత.

అలాంటి లక్ష్మమ్మ అసలు ప్రాణమే లేనట్లుగా పెరట్లో మామిడి చెట్టుకానుకుని కూలబడివుంది.  ముఖంలో కళ లేదు.  ఒంటిమీద బట్ట వుందో లేదో ధ్యాస వున్నట్లు లేదు.  చూపులు ఏ శూన్యాన్ని చూస్తున్నాయో తెలియటంలేదు.  లక్ష్మమ్మని ఆ పరిస్ధితుల్లో చూసి ఆశ్చర్యమో, భయమో తెలియని గగుర్పాటుకి లోనయింది సరోజిని.  అనాలోచితంగా లక్ష్మమ్మ దగ్గరకెళ్ళి భుజాలు పట్టి కుదుపుతూ,  లక్ష్మమ్మా, ఏమయింది  ఎందుకలా వున్నావ్?”  అని అడిగింది.  ఓదార్పుగా లక్ష్మమ్మ తల, చెదరిన బట్టలు సవరించింది.  నారాయణమ్మగారు తన మడిని మంటకలిపే ఈ పనులన్నీ చూస్తున్నా,  ఆవిడలోని మానవత్వం లక్ష్మమ్మ  పరిస్ధితి చూసి ఆందోళన చెందింది. 

ఏంటి లక్ష్మమ్మా  ఏమయింది  అంటూ కంగారుగా ఆవిడకూడ  లక్ష్మమ్మ దగ్గరకొచ్చేసింది.  వాళ్ళ వెనకాలే ఇంట్లో వాళ్ళూ, సుభద్రా.  లక్ష్మమ్మ పరిస్ధితి చూసి అనిత వెళ్ళి గ్లాసుతో మంచినీళ్ళు తెచ్చిచ్చింది.  లక్ష్మమ్మ వాటిని తాగకుండా తోసేస్తుంటే సరోజిని, అనిత కొంచెం నీళ్ళు బలవంతాన తాగించారు.   

నీళ్ళు తాగేసరికి లక్ష్మమ్మ లోపలున్న ఆవేదనంతా ఉబకి ఉబికి ఏడుపు రూపంలో తన్నుకొచ్చింది.  వెక్కిళ్ళ మధ్య చెప్పింది...  జానక్కన్నాయం జరిగిపోనాది తల్లీ.  దాని బతుకు బుగ్గయి పోవాల్సిందేనమ్మా ఆ పోరగాళ్ళు రాకపోతే.  ఇట్టా అయిందేటమ్మా  నేనేంసేతును నేనేమయిపోవాల.....ఏడుస్తూనే వున్నది.

ఏం జరిగింది లక్ష్మమ్మా?  కొంచెం అర్ధమయ్యేటట్లు చెప్పు   సరోజిని నెమ్మదిగాసముదాయిస్తున్నట్లు అడిగితే లక్ష్మమ్మ వెక్కెక్కి ఏడుస్తూనే చెప్పింది.  జానకిని ఎవురో ఇద్దరు పోరగాళ్ళు లాక్కెళ్ళారంటమ్మా.  నిన్న పొద్దున్న మీ ఇంటికని వచ్చింది.  దోవలో ఆళ్ళెవరో సూసి ఆటోలో లాక్కుపోయారంట.   ఆ చివుర ఇళ్ళు కడుతూ ఆపేశారుకదా ఆడకి తీసుకెళ్ళి పాడు చెయ్యబోతుంటో ఇది బయపడి అరిచిందంట. ఆటోలో పోతూకూడా ఇది అరుస్తూ, చెయ్యూపుతూనే వుందట. కాలేజి పోరగాళ్ళు టూషన్ కెళ్తా సూసారంట.  ఆళ్ళు లగెత్తి ఆళ్ళని బెదరగొట్టి పారదోలారంట.  దీనికి దెబ్బలు తగిలి, ఆగోరానికి సుహ తప్పి పడిపోతే ఆస్పత్రికి తీసుకెళ్ళారంట.  తెలివొచ్చాక మాకు కబురెడితే ఎల్లాం.

ఆ మాటలు వినగానే దిగ్భ్రాంతి చెందారు అంతా.  అమ్మో...లేచిన వేళ బాగుంది!  ఎంత ఘోరం తప్పింది!!  అంత చిన్నపిల్ల....పట్టుమని పదేళ్ళన్నా వుంటాయో వుండవో... ఎప్పుడన్నా లక్ష్మమ్మ రాలేక పనికి పంపిస్తే  తమ ఇంట్లే పని చేయించుకోవటానికే బాధపడతారు.  అంత చిన్న పిల్ల.  ఎవరికి ఎలా ప్రాణం ఒప్పింది.  అసలు మనుషులేనా వాళ్ళు...తలా ఒక మాట.

బాధ పడకు లక్ష్మమ్మా, జానకెలా వుంది  దానికేం కాలేదుకదా ఎక్కడుంది ఇప్పుడు  ఒక్కదాన్నీ వదిలేసి వచ్చావా?”  మళ్ళీ తలా ఒక ప్రశ్నా వేశారు.

ఆసుపత్రిలోనే వుందమ్మా.  మా ఆయన్ని కూసోపెట్టొచ్చా.  పిల్లకే గోరం జరగలేదు.  కానీ  బాగా బయపడ్డది.  బెంబేలెత్తిపోతున్నది.  మాకు కాల్సెయ్యాడటంలా.   దేవుళ్ళల్లా ఆ కాలేజీ టూడెంట్లొచ్చి కాపాడారు.  లేకపోతే పిల్లేమయిపోయుండేదో.  నా పిల్ల నాకు దక్కేదికాదు దేవుడో....

మరి ఆ స్టూడెంట్స్ వాళ్ళని పట్టుకోలేదా అట్లాంటి వాళ్ళని వూరికే వదలకూడదు.   అనిత ఆవేశం లక్ష్మమ్మ బాధలో వుందని కూడా చూడకుండా ఆరా తీసింది.

లేదమ్మా.  ఈళ్ళయిదారుగురుండి ఒక్కురుకున ఎల్లేసరికి ఆళ్ళు లగెత్తారంట.  ఈళ్ళేంచెయ్యలేక పిల్లనాసుపత్రిలో చేర్చాలని తీసుకొచ్చారంట.  ఒక్కడు దొరికినా ఆడి పేనాలు తీసుండేదాన్ని.  సచ్చినోళ్ళు.  ఆడపిల్లలతో ఆడుకుంటారా.  ఆళ్ళిళ్ళల్లో ఆడోళ్ళుండరా.  ఆళ్ళ అక్క సెల్లెల్కిలా అయితే.  అప్పుడు తెలస్తాది మా బాద.    కాలేజీ టూడెంట్లు అల్లరి సేత్తారనుకుంటాంకానీ, సూడండమ్మా, ఆళ్ళే మా జానకిని కాపాడారు.  దైర్నం సెప్పి ఆసుపత్రికి తీసుకెళ్ళి వైద్దెం సేయించారు.  ఏ తల్లులు కన్న బిడ్డలో ఆళ్ళని సల్లటేల తల్సుకోవాల.  కళ్ళు తుడుచుకుంది.

అసలు ఎవురన్నా ఆపదలోవుంటే ఆళ్ళనాదుకోటానికి ఇలా నలుగురొక్కసారెల్తే  ఎవరైనా ఏం సెయ్యగలరమ్మా.  ఎవరికోల్లు మాకెందుకులే అనుకుంటే ఈ గోరాలిట్టాగే సాగుతాయి.  ఆళ్ళు నలుగురెళ్ళారు కనుక జానకి బతికి బయటపడ్డది.  లేపోతే బిడ్డేమయిపోయుండేది.

నిజమే.  ఆ రోజు  ఆ రౌడీ ఉత్తేజ్ వాళ్ళు అడ్డుకున్నప్పుడు లక్ష్మమ్మ తెలిసో తెలియకో దూరంనుంచే తనని పలకరించి ఆ సమయంలో తన ఆపద తప్పించిన సంగతి గుర్తొచ్చింది అనితకి.  అప్పుడు లక్ష్మమ్మ పరకరించకపోతే ఇంకెంత గోల చేసేవాళ్ళో ఆ వెధవలు.

అమ్మా నేనోపాలి మీకు సెప్పి ఎల్దామనొచ్చా.  ఇంకపోతా.  కొంచెం డబ్బుకూడా కావాలమ్మా  ఓ రెండు రోజులు పనికి రాను.  లక్ష్మమ్మ లేవబోయింది. 

పద లక్ష్మమ్మా నేనూ వస్తాను.  డాక్టరుగారితో ఒకసారి మాట్లాడి వస్తాను.  హాస్పటల్ బిల్లు కూడా మేము కడతాంలే.  నువ్వేం కంగారు పడకు. తనూ బయల్దేరారు  శ్రీరాంగారు.

మీది శానా గొప్ప మనసయ్యా.  దండాలు బాబయ్యా.”  అంత కష్టంలోనూ కృతజ్ఞతలు తెలపటం మర్చిపోలేదు లక్ష్మమ్మ.

అయ్యా, నేనోమాట సెబుతా  పనిమడిసి సెప్పేదేటని తోసెయ్యకండేం.”   ఒక్క క్షణం శ్రీరాంగారిని చూసి మళ్ళీ అన్నది లక్ష్మమ్మ.   అనితమ్మగారి ఇషయం కూడా ఆల్ల కాలేజీ టూడెంట్లకి సెబితే ఆల్లంతా కలిసి ఆ రౌడీల బరతం పట్టరా.  ఇట్టాంటిషయాల్లో ఏమన్నా చేత్తే టూడెంటు కుర్రాళ్ళే సెయ్యాల.  ఇంటో అయితే బిడ్డలిషయం మనం జాగర్త తీసుకుంటాం.  మరి కాలేజీలో  అక్కడున్న టీచర్లూ, ఇంకా మిగతా పిల్లలూ సూసుకోవాలగదయ్యా.  మామూలుగా అయితే శ్రీరాంగారున్న గదిలోకి కూడారాని లక్ష్మమ్మ ఆ సమయంలో ప్రపంచంలో అన్యాయాన్ని అంతంచేయటానికి తపించే అపర కాళిలా వుంది.


వాళ్ళూ చిన్న పిల్లలు.  వాళ్ళల్లోనూ అనేక రకాలుంటారు.  ఎవరో కొంతమంది ముందుకు రావచ్చు కానీ, చదువుకునే పిల్లలమీద బాధ్యతలు పెట్టకూడదమ్మా.

ఇదే పెద్ద బాద్యతయ్యా.  ఎవురన్నా అల్లరి చేస్తావుంటే కాత్త బెదరగొట్టటం అంతేగందా.  అదీ కాలేజీ చుట్టుపక్కల.  ఇంటో మీరే చూసుకుంటారుగదా.

సరే దాని సంగతి తర్వాత ఆలోచిద్దాంలే.  ముందు పద.  జానకిని చూద్దాం.    అయినా ఇలాంటి చిన్న చిన్న విషయాలు గోల చేసుకోకూడదమ్మా.  అనిత పెళ్ళికావాల్సిన పిల్ల.   నలుగురినోళ్ళల్లో పడితే మంచిదికాదు.  ఇంక లక్ష్మమ్మకు మాట్లాడే అవకాశం ఇవ్వకుండా బయటకు నడిచారు శ్రీరాం గారు.

ఏంటో ఈ సదూకున్నోళ్ళుబుఱ్ఱ గోక్కుంటూ వెనకే బయల్దేరింది లక్ష్మమ్మ.


మరి తరువాత భాగం కోసం వచ్చే బుధవారందాకా ఆగక తప్పదు మరి.
 8వభాగం శ్రీమతి లక్ష్మీరాఘవగారు పోస్టు చేశారు చూడండి.







    

6 comments:

చెప్పాలంటే...... said...

chaalaa baagaa raasaru baavundi

Lakshmi Raghava said...

లక్ష్మీ గారూ ,
ఎవరు చెప్పారండి మీరందరూ చెయ్యితిరిగిన రచయితలూ కారని? జ్యోతీ గారన్నట్టు అందరిలోనూ ఒకజ టాలెంట్ ,ఒక రచయితా వుంటారు..ఇప్పుడు చూడండి ప్రమదావనంలో ఎంతమంది రచయితలో!!
జరుగుతున్నా చరిత్ర చక్కగా రాసారు అభినందనలు..
లక్ష్మిరఘవ

శ్రీలలిత said...

మామాట పక్కన పెడితే మీ చెయ్యి తిరిగినట్టే వుందికదండీ...
good job

psm.lakshmi said...

cheppalante garu, lakshmi raghava garu, sree lalitha garu
dhanyavadalu.

రుక్మిణిదేవి said...

లక్ష్మి గారూ, చాలా బాగా వ్రాసారండి..

మాలా కుమార్ said...

లక్ష్మి గారు ,
బాగా రాసారండి .