గజిబిజి
మన పూర్వీకులు ఆచార వ్యవహారాలు చాలా ఆలోచించేకాదు, మనలాంటి ఎంతోమందిమీద రీసెర్చి చేశాకే వెట్టుంటారని ఈ ఆదివారం పొద్దున్నే నేను ఘాట్టి నిర్ణయానికొచ్చేశానండీ. మరి మీరేమంటారు?
అసలు సంగతేమిటంటే…ఇవాళ ఆదివారం ఏమైనా సరే పొద్దున్న ఎనిమిది గంటలగాకా లేవకూడదు…మహిళా దినోత్సవం దగ్గరకొచ్చేస్తున్న సందర్భంగానయినా నా విశ్రాంతికోసం నేను చూసుకోకుండా, నా హక్కులకోసం..కనీసం మా ఇంట్లోనైనా(మరీ నా ఇల్లు అనటం బాగుండదులెండి) నేను పోరాడకపోవటం నా ఆడజన్మకే అవమానం అని తీర్మానించుకుని శనివారం రాత్రే డిక్లేర్ చేశాను..రేపు నేను ఎనిమిది గంటలదాకా లేవను అని.
ఆడవాళ్ళకి శాపాలు అనేకం కదండీ. ఆ శాపాలే రకరకాల మనుషులై పీక్కు తింటాయి. అందులో మొదటిది పనిమనిషి. మనక్కావాల్సిన సమయానికి రానిదీ, మనకవసరమైన పని చేయనిదీ,…వాళ్ళ అవకాశాన్నిబట్టి వచ్చి, వాళ్ళకి వీలయిన పని చేసి పోయేది పనిమనిషి అని ఈ మధ్య చాలామంది గృహిణులు తమ నిఘంటువులో పనిమనిషి నిర్వచనాన్ని మార్చి రాసుకున్నారు. సదరు పనిమనిషి పొద్దున్నే 5 గం. ల కల్లా తయారు. రోజూ తను వచ్చే టైము 8-30 దాటాక. ఆ రోజు ఆమెకేదో పని వుంది కనుక, నేను పని చేసుకోవటానికి ఇబ్బంది పడతానని, మా ఇంట్లో పనిచేసి వెళ్ళిపోవటానికి, తద్వారా నన్నుధ్ధరించటానికి పొద్దున్నే వచ్చేసింది. మానకుండా వచ్చినందుకు సంతోషిచాలో, నా నిద్రని, తద్వారా నా ప్రతిజ్ఞని భంగం చేసినందుకు కోపం తెచ్చుకోవాలో తెలియని సందిగ్ధావస్తలోనే తలుపు తీసి, హాల్లోనే సోఫాలో చతికిలపడ్డాను (మల్లమ్మమీద..అదేనండీ మా పనిమనిషిమీద కోపం తెచ్చుకుంటే నష్టం నాకేనని తెలుసు..అందుకే పైకి కోప్పడే ప్రయత్నం అస్సలు చెయ్యలేదు).
సరే..ఎలాగూ ప్రతిజ్ఞ చేశానుకదా అని మల్లమ్మకి టీ పెట్టి ఇచ్చేసి హాల్లో సోఫాలోనే కునుకు తియ్యటం కొనసాగించాను. మా మల్లమ్మ పని చేస్తూ చేస్తున్న చప్పుళ్ళన్నీ నేపధ్య సంగీతంగా భావిస్తూ. నేపధ్య సంగీతానికి జోడుగా మల్లమ్మ కొన్ని ప్రవచనాలు కూడా చేసింది..పొద్దున్నే లేస్తేనే ఆరోగ్యం బాగుంటుందమ్మా. అయినా ఆడవాళ్ళు పొద్దున్నే లేవాల….ఇక్కడే నాకొళ్ళు మండేది. ఏం ఆడవాళ్ళు లేటుగా లేవకూడదా ఎందుకు లేవకూడదు..నేను లేస్తానని అలాగే పడుకున్నాను. అంతే. నా ఇష్టం నాది. ఇప్పుడు కూడా నా ఇష్టం జరక్కపోతే ఎలా పిల్లలుఇక్కడున్నంతకాలం వాళ్ళ స్కూళ్ళూ, కాలేజీలు, ఆఫీసులూ అంటూ పరుగులు పెట్టానుగా. ఇప్పుడు నాకు రెస్టు కావాలి. నేను పడుకుంటాను.
ఆలస్యంగా లేచానేమో. అన్ని పనులూ ఆలస్యం అయినాయి. రోజూ స్నానం చేసి దీపారాధన చేస్తేగానీ టిఫెన్ జోలికి వెళ్ళేదాన్నికాదు. ఈ రోజు నా మనసు చాలా విచ్చలవిడిగా సంచరిస్తోంది. దాని కోరికెందుకు కాదనాలని స్నానం చెయ్యకుండానే దోసెలు వేసి, మా ఆయనకి పెట్టి, నేనూ తినేశా. అప్పుడే వచ్చారు తెలిసిన వాళ్ళు పెళ్ళి పిలుపులకి. ఉదయం 11 గం. లు దాటినా స్నానం చెయ్యక అలాగే వున్న నా మీద నాకే విపరీతమైన కోపం వచ్చింది. నా ఇష్టం..నేను ఆలస్యంగానే లేస్తానని మొండికేసిన మనసు ఏ మాత్రం సహకరించకుండా అంతసేపు బధ్ధకంగా ఎందుకు కూర్చుందో వాళ్ళకి వివరించబోయింది వాళ్ళు అడక్కుడా పెట్టకుండానే. మరి ఆ పాచి బట్టలతోనే వాళ్లకి ఆతిధ్యం ఇవ్వాలంటే దానికి చాలా కష్టమనిపించింది. ఆ బధ్ధకం ఆలాగే కంటిన్యూ అయి పన్నెండయినా బధ్ధకం వదలక అలాగే కుక్కర్ ఎక్కించేశా. అసలు ఇలాంటప్పుడు ఎవరయినా ఇంత వండి కంచంలో పెడితే ఎంత బాగుంటుందో. సరేలే ఈ కలలకేంగానీ లేచి స్నానం చేసి ఆలోచనలు కంటిన్యూ చెయ్యి..బుధ్ధి తిట్టేసరికి ఎదురు తిరగలేక వెళ్ళి స్నానం చేసొచ్చా.
దీపారాధన చేస్తుంటే అనిపించింది. అపరాహ్ణం లోపలే దీపారాధన చెయ్యాలంటారు..ఇవాళ నేనేమో ఇంత ఆలస్యం చేసేశాను..అన్ని పనులూ అస్తవ్యస్తం అయినాయి. దాంతో అంతా చికాకే.
అప్పుడే అనిపించింది. మన పెద్దవాళ్ళు ఆచారాలు చాలా ఆలోచించి నాలాంటి వాళ్ళని చూసి పెట్టారని. అవ్వేలేకపోతే ఇవాళ నాకుమల్లే ఇష్టమొచ్చినప్పుడు ఇష్టమొచ్చిన పనిచేస్తే ఓ తీరువా వారువా, శుచీ శుభ్రం, సమయపాలన ఇవ్వన్నీ ఎక్కడుంటాయి? మీరే చెప్పండి.
1 comments:
బాగుంది లక్ష్మిగారు,అందుకే ఉండాలి బిజిబిజి.
Post a Comment