Tuesday, March 6, 2012

ఐ లవ్ యూ

Tuesday, March 6, 2012

ఐ లవ్ యూ

టీవీ లో లవ్ ఫెయిల్యూర్ సినిమా గురించి చెప్తూ వేసిన పాటలోని వాక్యం ఈ పోస్టుకు కారణమయింది సుమండీ. అదేమిటంటే ఐసీయూ లో పడుకున్నా ఐ లవ్ యూ అంటే హేపీ హేపీ హేపీ….ఈ వాక్యం నన్ను బాగా ఆకర్షించింది. ప్రేమికుడు ఐసీయూ లో వున్నా గుండె ఐ లవ్ యూ అంటూ వుంటే ప్రపంచమే తెలియదు. ఇంకా ఆ ప్రియురాలుకూడా జత కలిసి ఐ లవ్ యూ అంటే ఇంక చెప్పాలా. సరే ఇప్పుడు వాళ్ళ సంగతి కాదు మనం మాట్లాడుకునేది. మనిషికీ మనిషికీ మధ్య ప్రేమ వుంటే..వాళ్ళు దగ్గరవారయినా, అసలు పరిచయమే లేకపోయినా..భూతలమే స్వర్గసీమకదా. ఉదాహరణకి ఐసీయూనో, ఆస్పత్రినోనే తీసుకోండి. ఎవరైనా రోగి వాళ్ళవాళ్ళెవరూ ఏకారణం వల్ల రాలేకపోయినా, పోనీ వచ్చినా మనకనవసరం..ఒంటరిగా వున్నారనిపిస్తే ఒకసారి పలకరించి యోగ క్షేమాలు విచారిస్తే ఆ రోగికి కొండంత బలం వస్తుంది. మనం చేసేదేమీలేదు..రెండు మాటలు చెప్పటమే. మహా అయితే ఒక అయిదు, పది నిముషాలు సమయం వెచ్చించాల్సివస్తుంది. దాని విలువ కొన్ని వేల రెట్లయి ఆ రోగి ముఖంలో ప్రతిఫలిస్తుంటే మీ గుండె తృప్తితో నిండిపోయి మళ్ళీ మళ్ళీ అలాంటి పనులు చేయాలనిపించదూ? రోగి, ఆస్పత్రి ఒక వుదాహరణ మాత్రమే. నిత్య జీవితంలో అనేక సంఘటనలు… సాటివారితో మీరు మనిషికీ మనిషికీ మధ్య వుండాల్సిన ప్రేమపంచుకోవటానికి…ఎన్నో మీకోసం ఎదురు చూస్తున్నాయి. ఒకరిని చూసి ఒకరు నేర్చుకుంటారు. ప్రారంభించండి మరి. మీలాగా అంతా చేస్తే ప్రపంచమే ప్రేమతో నిండిపోదా? అవునూ అప్పుడీ రాజకీయ నాయకులేమవుతారబ్బా? ఏముందిలెండి.. వాళ్ళూ మనలా మారిపోతారు.

అయితే మీరు జాగ్రత్తపడాల్సిన విషయం ఒకటుంది. ఈ విషయమేదో బాగుంది, ఇవాళ్టినుంచీ అందర్నీ ప్రేమించేద్దామని అత్యుత్సాహానికిపోయి అవసరమున్నా లేకున్నా అందర్నీ హడలుకొట్టించకండి. కాస్త మీ బుర్ర వుపయోగించి అవసరమా కాదా, సమయం, సందర్భం వగైరాలు కూడా ఆలోచించి మరీ అడగెయ్యండి. మీరు వారికి సంతోషం కలిగించినా లేకపోయినా, చికాకు మాత్రం కలిగించకండేం. బెస్ట్ ఆఫ్ లక్.

జ్యోతి సే జ్యోతి జగాతే చలో, ప్రేమ్ కీ గంగా బహాతే చలో


0 comments: