Saturday, March 10, 2012

బధ్ధకించమ్మడూ

Saturday, March 10, 2012

బధ్ధకించమ్మడూ

బధ్ధకం ఎంత అందమైనది! ఎంత హాయినిస్తుంది! ఎంత ప్రశాంతంగా వుంటుంది! (మధ్యలో ఎవరూ డిస్ట్రబ్ చెయ్యకుండా వుంటే) ఎంత అవసరమైనది!! ఎంత ఇదయినదీ ఎంత అదయినదీ ఇవ్వన్నీ ఏల దీనిని స్తుతించ వేయి నాల్కలయిన సరిపోవు. ఎందుకంటే అది చాలామందికి అందని ద్రాక్షపండుగనుక. కనుక ఎవరి పరిజ్ఞానంబట్టి వారే అనుభవించండి.

పనీపాటూ లేకపోతే బధ్ధకం పెరుగుతుందంటారు. నిజమేమేమోగానీ, పనీపాటలున్నవాళ్ళకి బధ్ధకం అవసరం చాలావుందని..ఇక్కడ ఢంకా లేదుగానీ, వుంటే బజాయించి మరీ చెప్తాను నేను. మరి అంత రీసెర్చి చేశాను.

మీ జీవితంలో అప్పుడప్పుడ ఒక్కరోజు బధ్ధకించి చూడండి..మీ జీవితం మీకే కొత్తగా అనిపిస్తుంది. రోజూకన్నా ఆలస్యంగా లేవండి. అన్ని పనులకూ సెలవిచ్చెయ్యండి. మీ ఇంట్లో వాళ్ళకి ముందే చెప్పండి ఆ రోజు మీరు మీ రొటీన్ డ్యూటీలకి వ్యతిరేకంగా సమ్మెచేస్తున్నానని. మిమ్మల్ని మీరుతప్ప ఇంకెవరినీ పట్టించుకోకండి. రోజంతా హాయిగా నిద్రపోతూనో, పస్తకం చదువుకుంటూనో, టీవీ చూస్తూనో మీ ఇష్టం వచ్చినట్లు, మీకిష్టమయిన, మీకు సరదాగావున్న పనులుమాత్రమే చేస్తూ గడిపెయ్యండి.

భోజనం అంటారా మీరాల్రెడీ డిక్లేర్ చేశారుగా మీ స్ట్రైక్ గురించి..ఇంక మరి మాట్లాడకుండా కూర్చోండి. ఇంట్లోవాళ్ళు వండో, హోటల్ నుంచి తెచ్చో తిందాం రమ్మంటే, ఆనందంగా కబుర్లు చెబుతూ తినెయ్యండి. హోటల్ కి తీసుకెళ్తాం రమ్మంటే సంతోషంగా వెళ్ళి కావాల్సినవన్నీ తినెయ్యండి. బిల్లు ఎంత అనికూడా అడక్కండి..మానసిక రోగం మొదలవుతుంది మరి. అందుకే ఝామ్మని ఓ మీఠా పాన్ వేసుకుని ఓ సినిమా చూసొచ్చేయండి.

అప్పుడప్పుడూ మీరు తెప్పించుకునే ఈ బధ్ధకంవల్ల మీ ఇల్లూ, పర్సూ కొంచెం చిందరవందర అయినా ఈ చిట్కా మీ మానసిక, శారీరిక ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. నాదీ గ్యారెంటీ.

సో, రేపాదివారం..అర్జెంటుగా బధ్ధకం తెచ్చేసుకోండి. ఆగండాగండి. అందరూ రెడీ అయిరోతున్నారు. నేనీ చిట్కా చెప్పింది అలుపెరగకుండా ఇంట్లో అందరికీ అన్నీ, ఎల్లవేళలా అమర్చే ఇంటి ఇల్లాళ్ళకీ, ఇల్లూ ఆఫీసూ మేము భేషుగ్గా మేనేజ్ చేస్తామని పోజుకొడుతూ వెట్టిచాకిరీ చేస్తున్న అమ్మళ్ళకూ..అంతేగానీ ఆఫీసూ, ఫ్రెండ్సేతప్ప ఇల్లు పట్టించుకోని మగ మహారాజులకూ, కోలేజీలకెళ్ళొస్తేనే అలసిపోయే బుల్లెమ్మలకూ, బుల్లోళ్ళకూ కాదు. ఎందుకంటే మీ కాల్రెడీ ఇలాంటివి బోలెడు చిట్కాలు తెలుసు..ప్రత్యేకించి నేను చెప్పక్కర్లా. రేపు ఆదివారం ఇంటి ఇల్లాళ్ళిక సెలవిచ్చి, ఇంటి పనులకి మీరు తలో చెయ్యీ వెయ్యండి. మరి నా చిట్కా ఎవరికంటారా

మీకోసం మీరు కొంచెంసేపు బతకండి తల్లీ అని నాలాంటిది నెత్తీ నోరూ కొట్టుకున్నా వినిపించుకోని ఆధునిక నారీమణులలో అనేకులకి. అర్ధమయిందా తల్లులూ??


0 comments: