Saturday, February 14, 2009
అన్నమయ్య సాహిత్యం - మానవతా దృక్పధం
Posted by psm.lakshmi at 11:13 AM Saturday, February 14, 2009అన్నమయ్య సాహిత్యం – మానవతా దృక్పధం
పద కవితా పితామహుడు తాళ్ళపాక అన్నమాచార్య 60వ జయంతి సందర్భంగా అన్నమయ్య సాహిత్యం – మానవతా దృక్పధం అన్న విషయంపై ప్రముఖ సంకీర్తన గాయని, సామాజిక సేవకురాలు కొండవీటి జ్యోతిర్మయి ప్రసంగం 13-2-2009 తేదీన ఎ.జీ. ఆఫీసు ఆరుబయలు రంగస్ధలంలో రంజని సంస్ధచే ఏర్పాటు చేయబడింది. ఈ సభకు ప్రిన్సపల్ ఎకౌంటెంట్ జనరల్ శ్రీ జి.ఎన్. సుందర రాజా అద్యక్షత వహించారు.
ఆద్యంతం మృదు మధురంగా, మధ్యలో అన్నమాచార్య పదాలను వినిపిస్తూ సాగిన ఈ ప్రసంగంలో అన్ని వందల సంవత్సరాలకు పూర్వమే, సనాతన సాంప్రదాయాలు బలంగా వేళ్ళూనుకుని వున్న ఆ సంఘంలో అన్నమయ్య మానతావాదాన్ని ఎంత చక్కగా తన పదాల ద్వారా ప్రచారం చేశారో గాయని జ్యోతిర్మయి గారు విశదీకరించారు.
అన్నమయ్య రాగి రేకులమీద వ్రాసిన 32 వేల సంకీర్తనలలో దురదృష్టవశాత్తు మనకి ఇప్పుడు 12 వేల సంకీర్తనలు మాత్రమే లభిస్తున్నాయి అన్నారు. ఆయన వ్రాసిన పదాలు కొన్ని సరిగా అర్ధం చేసుకోని కారణంగా శృంగార గీతాలనుకుంటున్నారు అంటూ జగడపు తనవుల జాతర ని ప్రస్తావించారు. పూర్వం రైతులు ఏ గింజలు ఎన్ని రోజుల్లో మొలకలెత్తుతాయో తెలుసుకుని ఆ ప్రకారం పంటలు పండించటానికి పిడతలలో అన్ని రకాల ధాన్యాలూ పోసి మొలకలొచ్చేదాకా వాటి సంరక్షణ భారం ఇంట్లోని ఆడపిల్లలకు అప్పచెప్పేవారు. అమ్మాయిలు రోజూ ఆ పిడతలు మధ్యలో పెట్టుకుని చుట్టూ తిరుగుతూ ఆడేవాళ్ళు, పాడేవాళ్ళు. ఆ ఆట పాటల్లోంచి పుట్టిన పాట ఇదన్నారు.
స్తీ వాదం అంటేనే తెలియని ఆ రోజుల్లోనే అన్నమయ్య ఆడది రాజ్యమేలితే అది మంచిదేకాదా అనే పాట ద్వారా స్త్రీలని ప్రోత్సహించాడన్నారు. అరయనాపన్నునికి అభయమీవలెగాక ఇలపైన సుఖిని కావనేల అని భగవంతుని నిలదీసి పక్కా సామాజికవాదినని నిరూపించుకున్నారు. అంతేకాదు, రైతు మిత్రుడు అన్నమయ్య. చీమకానీ దోమకానీ అనే పాటలో పొలం పుట్రాలో అనేక విష జంతువులనెదుర్కొనే రైతులు ఆ వెంకటేశ్వరస్వామినే అండా దండాగా ఎలా తలుస్తారో పేర్కొన్నాడు. అలాగే తనకి బట్టలు ఉచితంగా ఇచ్చే నేత వాళ్ళ గురించి .... పంచభూతములనెడి సరిగంచు నూలు..అంటూ జగన్నాయకుని లీలా విలాసాలతో నేతగాళ్ళ నేతని పోలుస్తూ పదాలల్లారు.
అంతేకాదు. అన్నమయ్య ఆ రోజుల్లోనే పక్కా ఎకనమిస్ట్ అని నిరూపిచకున్నాడనటానికి ఉదాహరణ ఆయన కట్టిన ఈ పాట....రూకలై మాడలై రువ్వలై తిరిగేను... దాకొని వున్నచోట తానుండదదివో...ఒకరి రాజుగ చేసు ఒకరి బంటుగ చేసు.....
వాక్కుని గేయాన్ని మిళితం చేసిన వాగ్గేయకారుడు అన్నమయ్య తన రచనలకు పదాలనెంచుకోవటానికి కారణం సామాన్యజనులకు అర్దమవటానికి. మన జీవిత విధానం ఎలా వుండాలో అందంగా చెప్పిన అన్నమయ్యను స్పిరిట్యుయల్ కమ్యూనిస్టుగాఅభివర్ణిచారు వక్త.
అన్నమయ్యకు పూర్వం కర్ణాటకలో బసవేశ్వరుడు కన్నడంలో పదాలు పాడాడుట. తెలుగులో కృష్ణమాచార్యులు తొలి పద కవితా రచయిత అయినా ఆయన రచనలు వచనంలో వుండేవి. అవి కూడా ఇప్పుడు దొరకటంలేదు. కేవలం ఆయన గురించి అన్నమయ్య వంశీకులు వ్రాసిన విశే్షాల వల్లే ఈ సంగతి తెలిసిందన్నారు.
అంతేకాదు. అన్నమయ్య పదాల్లో వచ్చే అన్నమయ్య అనే మాటని ఆయన వాడలేదు. ఆయన కుమారుడు పెద్ద తిరుమలాచార్యులు, మనవడు చిన్న తిరుమలాచార్యులు ఆ గీతాలు అక్కడదాకా అన్నమయ్య రచన అని తెలియజెయ్యటానికి ఆ పేరు చేర్చారన్నారు.
సాక్షాత్తూ గోవిందుని ప్రశంసలు అందుకున్న అన్నమయ్య చెడుని ఖండించి మానవతా దృక్పధాన్ని ప్రచారం చెయ్యటానికి అవతరించిన కారణ జన్ముడు. ఆయన బాటలో సంకీర్తన, సత్కర్మ నినాదంతో ముందుకు సాగి పోదామని ఉద్బోధించారు జ్యోతిర్మయి.
తదనంతరం రంజని సంస్ధ అద్యక్షులు, శ్రీ చీకోలు సుందరయ్య మాట్లాడుతూ అన్నమయ్య మహిళాభ్యుదయం గురించి మాటల్లోనే కాదు చేతల్లో కూడా చూపించారు, ఆయన భార్య తాళ్లపాక తిమ్మమ్మే దీనికి ఉదాహరణ. ఆవిడ మంచి కవయిత్రి. సుభద్రా పరిణయం అనే కావ్యం వ్రాశారు అని చెప్పారు.
వందన సమర్పణతో కార్యక్రమం ముగిసింది.
Labels: కాలక్షేపం బటాణీలు
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment