ఆడవారూ - ఉద్యోగాలు
ప్రియ ఈమని, తన తృష్ణ వెంట బ్లాగులో వ్రాసిన గుర్తింపు అనే టపా చదివి కామెంటు వ్రాయబోయి కాదులే అని టపా వ్రాస్తున్నాను. వెనుకటి కాలంలో ఉద్యోగం పురుష లక్షణం మాత్రమే. అప్పుడూ ఆడవారు గుర్తింపు పొందారు, పేరు ప్రఖ్యాతులు గడించారు కానీ వారి సంఖ్య అతి తక్కువ మాత్రమే. మీరెప్పుడయినా పాత తెలుగు, హిందీ సినిమాలు చూశారా వాటిలో మహిళలను వ్యక్తిత్వం వున్నవారిగా చిత్రీకరించినవే ఎక్కువగానీ, ఇప్పటి సినిమాలలోలాగా గుడ్డలకు కూడా కరువైనవాళ్ళలా చూపించలేదు.
సరే మనం మహిళల ఉద్యోగాల గురించి మాట్లాడుకుంటున్నాముకదా. ఉద్యోగం ఆర్ధిక అవసరాలకోసం మాత్రమే కాదు మహిళ తన ప్రతిభతో సమాజాన్ని ప్రగతి పధాన నడిపించటానికి కూడా. అత్యంత ప్రతిభావంతురాలైన మహిళ ఆర్ధిక అవసరాలు లేవని కేవలం ఇంటికే పరిమితమవటం వల్ల ఆమె కుటుంబం సుఖంగా వుండవచ్చు కానీ...ఇలాంటి ఒకళ్ళు, ఒకళ్ళు అనేకులై సంఘ పురోభివృధ్ధి మందగించవచ్చు.
ఇంకొక విషయం..ఉద్యోగం చెయ్యటం ఇష్టంలేని వాళ్ళందర్నీ చెయ్యమని నేను బలవంత పెట్టటంలేదు కానీ ప్రతిభా పాటవాలు కేవలం ఇంటికే పరిమితం చెయ్యవద్దు. అలా చేస్తే మహిళలు అభ్యుదయంచెందేదెప్పుడు? వంటింటి కుందేలు అలాగే వుంటుంది. ఇంట్లోవాళ్ళు మంచివాళ్ళయితే అప్పుడప్పుడూ పొగుడుతారు. మనల్ని మనం నిరూపించుకోవాలనే తపన వున్నవాళ్ళకి ఆ పొగడ్తలు కంటికానవు.
మహిళాభివృధ్ధికి మహిళలకి ఆర్ధిక స్వాతంత్ర్యం కూడా చాలా అవసరం. దానికి చాలామందికి ఉద్యోగం అవసరం అవుతుంది. ఆర్ధిక స్వాతంత్ర్యం వున్న మహిళకి ధైర్యంకూడా ఎక్కువగానే వుంటుంది. ఇంట్లో, బయట ఎలాంటి సంఘటనలు ఎదురయినా ధైర్యంగా ఎదుర్కోగలదు ఏడుస్తూ ఎవరి సహాయంకోసమో చూడకుండా. నేటి సమాజంలో ఇది చాలా అవసరం. చాలా కుటుంబాలలో మహిళల ఉద్యోగాలవల్ల కుటుంబాలు కూడా ఆర్ధికంగా పురోభివృధ్ధి చెందుతున్నాయి.
ఇంక ఉద్యోగం చేసే మహిళలు పడుతున్న శ్రమ, ఇంట్లోవాళ్లు కోల్పోతున్న అనుభూతులు...నిజమే..కొన్ని కావాలంటే కొన్ని వదులుకోవాలి తప్పదు. అయితే వదులుకోవాల్సినవి ప్రేమాభిమానాలు, ఆప్యాయతానురాగాలూ కాదు..వాటి విలువ వేటికీ లేదు. ఇంట్లో మిగతావారు కూడా బాధ్యతలు పంచుకుంటే ఆప్యాయతానురాగాలు పూర్తిగా పంచలేకపోయినా లోటు తెలియనివ్వక్కరలేదు.
నేనూ మొన్న మొన్నటిదాకా ఉద్యోగం చేసి రిటైరయినదాన్నే. ఆ సాధకబాధకాలు మేము పడ్డవాళ్ళమే. నా ఉద్యోగంమూలంగా, మా ప్రణాళికాబధ్ధ జీవితాలవల్ల మా పిల్లలిద్దరికీ విదేశాల్లో ఉన్నత విద్య చెప్పించగలిగాము. గ్రాడ్యుయేషన్ కాగానే మా అమ్మాయికి వివాహం చెయ్యాలనుకున్నా అది పీ జీ చేస్తానన్నది. దానికిష్టమయిన సబ్జక్టు పైగా మెడికల్ లైను. సరేనన్నాము. ఇప్పుడొక చాలా మంచి సంబంధం..వచ్చింది. వాళ్ళకి అమ్మాయి బాగా చదువుకుని వుండాలికానీ ఉద్యోగం చెయ్యక్కరలేదన్నారు. మేము చాలా మంచి సంబంధం అని కొంచెం వూగినా మా అమ్మాయి అక్కరలేదు పొమ్మంది. ఇంత కష్టపడి ఇంత దూరం వచ్చి చదువుకున్నది ఇంట్లో కూర్చోవటానకా అన్నది. మాకూ నిజమేననిపించింది.
ఇంతకూ చెప్పొచ్చేదేమిటంటే మంచి, చెడులు, లాభ నష్టాలు అన్నింటిలోనూ వున్నాయి. ఇలాంటి విషయాలలో ఏదో ఒక పధ్ధతి అందరికూ ఆపాదించటం కుదురదు. పరిస్ధితులనుబట్టి, అవసరాలనుబట్టి ఎవరికివారు నిర్ణయించుకునే విషయాలివ్వి. కానీ ఆడవాళ్ళ వ్యక్తిత్వాన్ని గుర్తించని సర్దుబాట్లుమాత్రం ఎవరూ చేసుకోవద్దు. గృహిణి అయినా ఉద్యోగి అయినా, ఇంకేంచేస్తున్నా, ఒక మంచి వ్యక్తిగా, మనసున్న మనిషిగా, మమతానురాగాలకు నిలువెత్తు రూపంలా బ్రతకండి. చాలు. మీ వ్యక్తిత్వం సమాజాభివృధ్ధికి తప్పకుండా తోడ్పడుతుంది.
Sunday, June 7, 2009
Subscribe to:
Post Comments (Atom)
3 comments:
అనుభవం దృష్ట్యా బాగా వ్రాసారు. మీకన్నా బాగా చిన్నదాన్నే అయినా నేనూ ఉద్యోగస్థురాననేనండి. ఉద్యోగం మనిషి లక్షణం అని నమ్మినదాన్ని. స్త్రీ స్వేఛ్ఛ కి విలువతో పాటు ప్రేమాభిమానాలు, ఆప్యాయతానురాగాలు వదులుకోనిదాన్నే.
చాలా సంతోషం ఉషగారూ. భార్యాభర్తలని మన పెద్దవాళ్ళు కాడికి కట్టిన జోడెడ్లతో పోల్చేవాళ్ళు. అవి రెండూ సమంగా లాగితేనే సంసారమనే బండి సవ్యంగా సాగుతుంది. ఒక్కోసారి స్త్రీ పురుషుల్లో ఒక్కోరు కొంచెం ఎక్కువ అనిపించినా అంతా మనమేననుకుంటే ఆనందంగా వుంటుందికదూ.
psmlakshmi
లక్ష్మి గారూ,
మీరు చెప్పిందంతా చాలా బాగుంది. మీ అమ్మాయి అభిప్రాయమే నాది కూడా. ఇన్నేళ్ళు నానా కష్టాలు పడీ ఈ డిగ్రీలు సంపాదించి, ఉద్యోగం వద్దు ఇంట్లోనే ఉండు అంటే నేను కూడా ఒప్పుకోలేను. మీరన్నట్టు కేవలం ఆర్ధిక స్వాతంత్ర్యం కోసమనే కాకుండా, మనకంటూ ఒక వ్యక్తిత్వం కోసం కూడా మనకి నచ్చిన పని/ఉద్యోగం మనం చేయాలని అనిపిస్తుంది నాక్కూడా.
చాలా మంచి విషయాల్ని చక్కగా చెప్పారు. ధన్యవాదాలు.
Post a Comment