పొగడ మల్లె
పేరు చూసి నేనేదో కొత్త చెట్టు కనిబెట్టానని అనుకోకండి. పొగడ చెట్టూ, మల్లె చెట్టూ, ఈ రెండింటితో నాకంత అనుభవం వుంది మరి. జ్యోతిగారు చెట్లతో అనుబంధం మైల్ చూడగానే నా ఊహల్లో సజీవంగావున్న మా పొగడ చెట్టుని మీ అందరికీ చూపించాలనిపించింది. మరి వస్తారా..చక్రాల రధంమీద రింగులు తిప్పుకుంటూ అలా నా బాల్యంలోకి వెళ్ళివద్దాము.
నా బాల్యంలో కొంతకాలం మా అమ్మమ్మ తాతగార్లదగ్గర ఏలూరు లో పెరిగాను. పవర్ పేటలోని రామాలయం దగ్గర వాళ్ళ ఇల్లు. ఇంటి వెనక, ముందు రోడ్లను కలుపుతూ మధ్యలో చాలా పెద్ద స్ధలంలో రకరకాల చెట్లు..కొబ్బరి, సపోటా, ఉసిరి, దానిమ్మ, మందార.. వీటన్నింటినీ మించి నాకాత్మీయమైనది వీధిలోంచి ఇంట్లోకి అడుగుపెడుతూనే ఎడమవైపు వున్న పెద్ద పొగడ చెట్టు. పొద్దున్న లేచేసరికి పూలన్నీ కింద రాలి వుండేవి. లేస్తూనే ఆ చెట్టుకింద చేరి ఆపూల పరిమళాలను ఆస్వాదిస్తూ వాటినన్నింటినీ ఏరి అరటి నారతో గుచ్చేదాన్ని. ఇంటిముందు సిమెంటు చప్టామీద వున్న కృష్ణుని విగ్రహానికి వేసేదాన్ని, నేను తలలోనూ పెట్టుకునేదాన్ని. చిన్నప్పుడు ఆ విగ్రహం దగ్గర తీయించుకున్న నా ఫోటో ఎక్కడో వుండాలి. ఇండియాలో వుంటే వెతికి పట్టి పోస్టు చేసేదాన్ని.
ఈ అనుబంధంతోనే ఎక్కడ పొగడ చెట్టు కనబడ్డా ఆత్మీయులని చూసినట్లు సంబరపడతాను. కింద పూలుకనబడితే కొన్నయినా ఏరుకుంటాను.
ఇన్నేళ్ళ తర్వాత ఆ ప్రదేశాలు అలాగే వుండవని తెలిసినా ఒకసారి మళ్ళీ ఆ ప్రదేశాలని చూడాలని కోరిక వుండేది. ఈ మధ్యనే మా పిన్ని, శ్రీమతి సావిత్రీ మౌళి అదే కోరికతో ఆ వూరు వెళ్ళి వచ్చి ఆ ప్రదేశం గుర్తుపట్టలేనంతగా మారిపోయిందన్నారు.
ఇంక మా మల్లె చెట్టుతో నాకున్న అనుబంధం 1985లో మొదలయింది. మేము హైదరాబాదులో ఇల్లు కట్టుకున్న కొత్తల్లో ఒక తీగమల్లె మొక్క, మా అక్క కీ.శే. రమాదేవి ఇచ్చింది నాటాను. మొదట్లో ఇల్లు చిన్నదిగా వుండటంతో వున్న ఖాళీ స్ధలమంతా మొక్కలతో నింపేశాము. ఇంటి విస్తరణ సమయంలో మిగతా మొక్కలన్నీ పోయాయి. ఈ మల్లె చెట్టుని అదే సమయంలో అడ్డొస్తోందని (అప్పటికి పూలు పుయ్యటంలేదు) అనేక స్ధలాల్లో మార్చాము. అయినా పాపం పిచ్చిమొద్దు..కోపం తెచ్చుకోకుండా మళ్ళీ మళ్ళీ చిగిర్చింది, మా కోసం విరగబూసింది. మా మల్లె మొగ్గలు పెద్దగా వుంటాయి, చాలా మంచి వాసన. వేసవిలో మూడుతడవలుగా, ప్రతిసారీ ఒక వారం, పదిరోజులపాటు పూసేది. మధ్యలో మూడు, నాలుగు రోజులు చాలా ఎక్కువగా వచ్చేవి (ఒక్కోసారి మూడు, నాలుగు పెద్దగిన్నెలనిండా). సాయంకాలం ఆఫీసునుంచి రాగానే ఓపిగ్గా అన్నీ కోసి ఫ్రిజ్ లో పెట్టి మర్నాడు ఆఫీసుకు తీసుకెళ్లేదాన్ని. మా సెక్షనులో శ్రీమతి పార్వతి సెక్షనులో మిగతావాళ్లు వచ్చేసరికి మాల కట్టేసి ముక్కలు కట్ చేసి అందరికీ ఇచ్చివచ్చేది. వేసవి కాలంలో 20 సెక్షన్ల పైన వున్న మా హాలంతా మా మల్లెల పరిమళాలతో గుబాళించేది. ఒకసారి మా ఆఫీసరు అడిగారు మీకు మల్లె తోట వుందా అని. అవి ఒక చెట్టు పూలంటే అంతా ఆశ్చర్యపోయేవాళ్ళు. అంతేకాదు. మా ఆఫీసు పెద్దది కదా, అందుకే ఉద్యోగినుల సంఖ్య కూడా ఎక్కువే. అంతగా పరిచయంలేని వారుకూడా అడిగి మరీ తీసుకునేవాళ్ళు మా మల్లెలని. మర్నాటి సాయంకాలానికి కూడా తెల్లగా పరిమళాలు వెదజల్లే ఆ పూలతో అనుబంధం నాకే కాదు, మా ఆఫీసులో వాళ్ళకి కూడా వుంది. నేనిప్పుడు ఆఫీసుకు వెళ్లినా మీ మల్లెచెట్టు ఎలా వుంది పూలు బాగా పూస్తోందా అని అడుగుతారు.
ఇప్పటికీ ఆ చెట్టు మా పెరట్లో వుంది. ఇప్పుడు సీజను మొత్తం రోజూ కొద్దిగానే పూస్తోంది మా దేవుళ్ళకోసం.
Monday, June 22, 2009
Subscribe to:
Post Comments (Atom)
10 comments:
pogada,malle vasanaa naa manasantaa pattesindi laxmi gaaru.
లక్ష్మి గారూ,
పూల మొక్కలతో మీ జ్ఞాపకాలు బావున్నాయి. కానీ, నాకు పొగడ పూలంటే తెలియదు :(
ఒకవేళ వేరే ఏదయినా పేరుతో తెలుసేమో మరి.! ఇంకా ఏ పేర్లతో పిలుస్తారో చెప్పగలరా.?
కృతజ్ఞతలు సుభద్రగారూ, మధురవాణిగారూ
మధురవాణీ, పొగడ పూలు షర్టు గుండీ సైజులో వుంటాయి, క్రీమ్ కలర్, ఆకారం పళ్ళరసం తీసే జ్యూసర్ (ఎలక్టి్క్ ది కాదు) లాగా వుంటుంది. ఇది మొక్క కాదు చెట్టు. చెట్టునుంచి కొయ్యటం కష్టం రాలితే ఏరుకోవటమే. ఒక రోజు వుంటాయి. వాడినా వాసన బాగుంటుంది. వీటితో పర్ ఫ్యూమ్స్ తయారు చేస్తారు.
psmlakshmi
లక్ష్మిగారు , మీ పోస్ట్ పాత జ్ఞాపకాలను తట్టి లేపిందండీ ....వడిలి పోయినా వాసనపోని పొగడపూల పరిమళాల్ని గుర్తుచేశారు .ఇప్పుడు ఎక్కడోగానీ పొగడచెట్లు కనిపించవు.
పొగడ పూలు ,ఈ మద్యనే కనిపెట్టా మా వీధి చివరింట్లో చెట్టువుందని.
ఎంత బాగుంటుందో పూవు, సువాసన కూడా
మల్లె ఐతే ప్రాణం .
రెండూకలిపారు. బాగుంది.
పొగడ మల్లె తెలీదండి. గిన్నెలనిండా మల్లెపూలు అనగానే వాసనలు గుప్పుమన్నాయి. అయ్యో మీ ఇంటిపక్కనుంటే ఎంత బాగుండేది అనుకున్నా.. మీరువచ్చాక ఒక పిలక ఇవ్వాల్సిందే. అది పెరిగినా పెరగకున్నా, ఒకరోజు వచ్చి పూలన్నీ కోసుకెళతాను.. ముందే అడ్వాన్స్ బుకింగ్ చేసుకున్నా మరి..
మాలా, జ్యోతీ
కృతజ్ఞతలు. జ్యోతీ, చెట్టు పిలక సంపాదినచాలని చాలామంది చాలా ప్రయత్నాలు చేశారు. లాభం లేకపోయింది. మేమా చెట్టుని చాలా చోట్ల మార్చామన్నానుకదా. అది పెరిగి పూలు పూసేసరికి కింద కాండం ముదిరింది పక్కన వచ్చే ఒకటి రెండు కొమ్మలు ఏదో ఒక విధంగా పోయేవి. మా చెల్లెలు డాబాపైన కుండీ పెట్టి, అంటుకట్టి, ఇది నాది అన్నది. రాలేదు. మరి మీ అదృ ష్టం ఎలా వుందో పరీక్షించుకోండి.
psmlakshmi
పొగడ చెట్టు, పూల ఫొటోస్ ఉంటే ఇక్కడ పెట్టగలరా ?
Z గారూ,
మీ ఆసక్తికి ధన్యవాదాలు.నేను ప్రయత్నిస్తాను కానీ కొన్ని నెలల టైము పడుతుంది. ఈ లోపల బ్లాగు మిత్ర్రులెవరన్నా సహకరిస్తే తెలియనివారికి ఒక చక్కని పూల చెట్టుని పరిచయంచేసినవాళ్ళమవుతాము.
psmlakshmi
లక్ష్మి గారు, మీ టపా చదివాక మీరు పూలు తీసుకెళ్ళి ఆఫీసులో ఇవ్వడం, హాలంతా ఘుమ ఘుమ లాడి పోవడం, అంతా కళ్ళ ముందు కదిలినట్లనిపించింది. సర్లెండి, నాక్కూడా ఒక మాంఛి ముదురు అంటు కావాలి. బోలెడన్ని పూలు మా బాల్కనీ నిండా నిండి చుట్టుపక్కల వాళ్ళు కుళ్ళుతో చచ్చిపోవాలి.ఎప్పుడు రమ్మంటారో చెప్పండి. ఒక మంచి వాన పడగానే రానా?
Post a Comment