పూయని పుష్పాల పూజ
అంటున్నారు...ఆ తెలిసిందిలెండి మేము రోజూ
బంగారు పుష్పాలతో భగవంతుణ్ణి అర్చిస్తాము...అవేకదా అంటున్నారా
కొందరు బంగారు పూలతో పూజ చెయ్యవచ్చు, కొందరు వెండి పూలతో చెయ్యవచ్చు, అలాగే
వారి వారి అభిరుచులనుబట్టి భగవంతుణ్ణి అనేకమంది అనేక విధాల పూజించవచ్చు. అయితే అన్ని పూలలోకి భగవంతుడికి అత్యంత
ప్రీతిపాత్రమైన పూవు ఏమిటి అంటే ఇదిగో
అహింసా ప్రధమం పుష్పం. ఆ అఖిలాండకోటి
బ్రహ్మాండ నాయకుడికి అత్యంత ప్రీతిపాత్రమైన పుష్పం అహింస. ఇంక మరో పుష్పం ఏమిటంటే సర్వ భూత దయ. అలాగే మిగతా పుష్పాలు శాంతి, క్షమ,
తపస్సు. క్షమా పుష్పం అన్నింటికన్నా
విశేషమయినది. ఈ పూవులు ఏ చెట్టుకీ పూయవు,
ఎంత ధనమిచ్చినా కొనలేరు. కేవలం మన నడవడి
బట్టే సంపాదించవచ్చు ఈ పుష్పాలను.
రోజూ రాత్రి పడుకోబోయేముందు
భగవంతుని ధ్యానించి ఈ పుష్పాలను సమర్పిస్తే చాలు.
ఎలాగంటే నేను ఇవాళ ఎవరినైనా ఏ విధంగానైనా, శారీరకంగానేకాదు, మానసికంగా
అయినా సరే హింసించానా అని మీలో మీరు ఒక్కసారి ఆలోచించుకోండి. సమాధానం లేదు అని వస్తే, భగవంతుడా, ఇవాళనేను నీకు
అహింసా పుష్పం సమర్పిస్తున్నాను అని ఆ దేవ దేవునికి నమస్కరించండి. అలాగే సర్వ భూత దయ..తోటి ప్రాణి పట్ల ఏవిధమైన సానుభూతయినా చూపి, అవసరానికి సహాయం చేశామా. ప్రతిరోజూ మన సహాయం కావాల్సినవాళ్ళు వుండక
పోవచ్చు. సహాయం చేయకపోయినా మనమెవ్వరికీ
హాని చెయ్యకుండా వున్నా చాలు. అలాగే
ప్రాణికోటికి, ముఖ్యంగా పశు పక్ష్యాదులు, క్రిమి కీటకాలకు ఆహారాన్ని
అందించామా. సమాధానం అవును అయితే మీరు
భగవంతునికి సర్వ భూత దయ అనే మరో పుష్పం సమర్పించవచ్చు.
అలాగే క్షమా పుష్పం. ఎవరైనా మీ పట్ల అనుచితంగాగానీ, మీకు కష్టం
కలిగేలాగానీ ప్రవర్తించినా, వారిని
క్షమించారా. వారి పట్ల దురుసుగా ఏమీ
మాట్లాడకుండా, ప్రవర్తించకుండా మీ సహనాన్నీ, క్షమా గుణాన్నీ ప్రదర్శిచారా. అయితే మీరు భగవంతునికి క్షమా గుణమనే పుష్పం
సమర్పించటానికి అర్హులు.
అలాగే సత్యం, ధ్యానం,
తపస్సు, శాంతి ఇవ్వన్నీ మనమాచరించటం, ఈ గుణాలనే భగవంతునికి పూజా పుష్పాలుగా
సమర్పించటం వల్ల ఏ భగవంతుడైనా భక్తుని తప్పక కరుణిస్తాడు. భగవంతుడనేవాడున్నాడో, లేదో మనకి తెలియదు. మనలో ఎవరం ఆయన్ని చూడలేదు. భగవంతుని మీద నమ్మకం లేనివాళ్ళు కూడా ఇవి
ఆచరించి చూడండి. దానితో సామాజికంగా ఎంత ప్రశాంతత నెలకొంటుందో, శాంతి
సౌభ్రాతృత్వాలు ఎలా వెల్లివిరుస్తోయో మీకే అవగతమవుతుంది. కనిపించే పుష్పాలు ఎన్నింటితో పూజించినా ఫలితం
వెంటనే కనిపిస్తుందో కనిపించదో, ఈ కనిపించని, ఏ చెట్టుకూ పూయని పూవులతో పూజ చేస్తే
భగవంతుడు మెచ్చటంతోబాటు మన కెంత లాభం.
సత్యం మాట్లాడటం, శాంతియుతంగా వుండటం, స్నేహ భావం పెంచుకోవటం వల్ల శాంతి
వెల్లివిరుస్తుంది. మనిషికి తేజస్సు,
వర్చస్సు పెరుగుతుంది. భగవంతుని ఇలాంటి
పుష్పాలలో రోజూ కనీసం ఒక దానితో నయినా పూజించటంవల్ల మనం క్రమశిక్షణతో వుంటాం,
దానివల్ల సమాజం బాగుపడుతుంది.
4 comments:
Chaala baagundandi
Thank you Rishi
psmlakshmi
పూయని పుష్పాలన్తే /పత్రం-పుష్పం/ఫలం-తోయం.వీటికి భావగర్భితమైన సంకేతాలున్నాయి.హృదయం =పత్రం [హృదయమనే పత్రాన్ని]పుష్పం=అంతర్ద్రుస్తి [అంతరంగంలో హృదయమనే పత్రం లో దాగిన అంతర్యామిని చూడటానికి చేసే ప్రయత్నం ]ఫలం=ధ్యాన/జపః అర్పణం [చేసిన జప -ఫలాన్ని భగావానుడుకి మనఃపూర్తిగా ధారపోయడం.తోయం=భావావేశంలో భక్తుని కంటి నుంచి వూరే ఆనందభాష్పజలము.ఈ నాల్గింటిని ఒక క్రమంలో అర్ధం చేసుకుంటే ఒక గొప్ప ఆధ్యాత్మిక సత్యం భోధపడ్తమేకాదు..అసలు పూజ ఎలా చేయాలో తెలుస్తుంది.పూయని పుష్పాలన్తే ఇవే --jayadev
బాగుంది పూయని పుష్పాలపూజ, మాన్సికపూజ కన్నాఉత్తమమైనది మరిలేదు, ఈఆడంబరపూజను ఏదేవుడూ హర్షించడు.ఆదూరి.హైమవతి.
Post a Comment