ఫోన్ చెయ్యగానే రింగ్ అయింది. మా ఆయన అదృష్టం బాగుందేమో, అందుకే వెంటనే
రింగయిందని ఆయనకి ఇవ్వబోయా. నాకొద్దు,
నువ్వే మాట్లాడు, నీకే ఆ సరదాలని. నిజం
చెప్పొద్దూ ఆ మాటకి నాక్కొపం వచ్చింది.
ఏమీ తోచకపోతే చెల్లెళ్ళతోనో, స్నేహితులతోనో చాలాసేపు ఫోన్లో మాట్లాడే సరదా
మాత్రమే వున్న నన్ను టీవీలకీ ఇలాంటి ప్రోగ్రామ్స్ కి ఫోన్ లు తరచూ చేసేదానిగా
చిత్రించారనుకుని వుడుక్కున్నాను. కానీ నా
వుడుకుమోతుతనాన్ని కాసేపు పక్కనపెట్టి ఆ ఫోన్ లో వాళ్ళు వాగే....కాదు
కాదు....రికార్డు చేసి మాలాంటి మూర్ఖులందరి మొహానా కొట్టే డైలాగులు వింటూ
కూర్చున్నాను. ఓపిగ్గా వేచి చూస్తే అదష్టం
మిమ్మల్నే వరించవచ్చు...అని కొంచెంసేపు వూరించారు. తర్వాత వినేవాళ్ళని ములగ చెట్టు
ఎక్కించటానికి...మీరు చాలా తెలివికలవాళ్ళు.
అందుకే ఇంతసేపు వేచి వున్నారు.
మీరు వైటింగ్ లో వున్నారు. అంటే
స్టూడియోకి చాలా దగ్గరలో వున్నారు. ఏ
క్షణమైనా మీ కాల్ కనెక్టుకావచ్చు.... అనే ధైర్య వచనాలు, మీరు కావాలంటే డిస్
కనెక్టు చేసి మళ్ళి రింగ్ చెయ్యవచ్చు అనే సలహాలు.
అమ్మో వినీ వినీ నాకు డైలాగులన్నీ కంఠతా వచ్చేశాయి.
దీనికితోడు మధ్య మధ్యలో రెండు నిముషాలసేపు వైటింగ్
టైమ్. అంటే ఆ సమయంలో కాల్ తీసుకోరు. పోనీ ఫోన్ పెట్టేద్దామా అంటే ఏమో స్టూడియోకి
దగ్గరగా వున్నానన్నాడుకదా. నిజంగానే
దగ్గరలోనే వున్నానేమో అనే మానవ సహజమైన ఆశ.
ఇటువంటి ప్రోగ్రామ్స్ కి ఎప్పుడూ ఫోన్ చెయ్యలేదుగా,
ఈ ఒక్కసారికీ దీని అంతు చూద్దామనుకున్నా.
నేనింత పట్టు వదలని విక్రమార్కడిలా ఫోన్ వదలకుండా కూర్చునేసరికి మా
శ్రీవారికి కూడా సరదా వేసిందో ఏమో ఆయన సెల్ నుంచి ఆయనా చేశారు. మరి ఆ రికార్డెడ్ డైలాగులన్నీ నాకు కంఠతా
వచ్చేశాయి, ఆయనక్కూడా వస్తే, మాకు ప్రైజు వస్తే ఇద్దరంకలిసి సరదాగా అందరికీ ఆ
డైలాగులు చెప్పచ్చులే అనుకున్నా.
ఓ పక్కన మా ఫోన్ లో నానా సంభాషణలూ వింటూనే టీవీనీ
గమనిస్తున్నా ఎందుకైనా మంచిదని. ఒకవేళ వేరే ఎవరికైనా ప్రైజు వస్తే నేను ఫోన్
పెట్టెయ్యచ్చుకదా, కనీసం నా ఫోన్ డబ్బులు మిగులుతాయని. ఆ యాంకరేమో అసలు ఏ ఫోనూ రానట్లు పోజు వైటింగ్ లో మా ఇంట్లోంచే రెండు
ఫోన్లున్నాయి. అలా ఇంకెంతమందో మరి. ఏ ఫోన్ కీ కనెక్షన్ ఇవ్వకుండా ఎందుకలా
చేసింది. అంటే ... ఏమో .. అన్నీ సందేహాలే. ఫోన్
రింగ్ అవటం, హలో అనటం అరే డిస్ కనెక్టు అయిందే అని పైగా సిగ్నల్ వున్నచోటనుంచీ
మాట్లాడండి అని ఓ ఉచిత సలహా. సిగ్నల్
లేకపోతే రింగ్ ఎలా అవుతుందని నాలాంటి డౌటమ్మలకి డౌట్లొచ్చినా ఎవ్వరినీ ఏమీ
అనలేంకదా. సరేలెండి ఇన్ని చిత్ర హింసలు
భరించి చివరికి తేలిందేమిటయ్యా అంటే నా ఫోన్లో 300 రూ. పైన వున్న బేలెన్స్ కాస్తా
16 రూ. కి వచ్చి నేను తిడతాననో ఏమో తనంతటతనే డిస్ కనెక్టు అయింది. ఈ బుధ్ధి ముందే వుండచ్చుకదా అనుకున్నాను. మావారు 110 రూ. కాగానే చూసుకోలేదు ఇంత వేస్ట్
చేశానని ఫోన్ కట్టేశారు.
మొత్తానికి రాత్రి దగ్గర దగ్గర 12 గం. లదాకా ఆ
యాంకరుగారు సుత్తి వేసీ, వేసీ, సగం సమాధానం ఒక కాలర్ చెప్తే ఇంకో సగం లో సగం తను
చెప్పి అక్కడికి ప్రేక్షక మహాశయులంతా ఆ మాత్రం మొగాస్టార్ ని కూడా కనుక్కోలేని
పామరులుగా భావించి చివరికి ప్రోగ్రామ్ ముగించబోయేముందు ఒక కాలర్ చేత చిరంజీవి పేరు
చెప్పించుకుని ప్రోగ్రామ్ ముగించింది.
ఈ కార్యక్రమాల్లో ఎన్ని సవ్యంగా జరుగుతున్నాయో నాకు
తెలియదుగానీ, ఇవాళ నేను నేర్చుకున్న నీతి నాలాంటి ఔత్సాహికులకు వెంటనే
చెప్పాలనిపించింది. పురుషుడు పుట్టిన
ఇన్నాళ్ళకు యజ్ఞం చేశాడని తెలుగులో ఒక సామెత.
మేమేదో ఇన్నేళ్ళకు తీరిగ్గా కూర్చుని తోచీ తోచక చేసిన పనితో నష్టం 400
రూ. అంతే కాదు రేప్పొద్దున్న ఎవరికి ఫోన్
చెయ్యాలన్నా ముందు రీఛార్జ్ చేయించుకోవటానికి పరిగెత్తాలి.
రోజూ ఆ సమయానికి నిద్ర పోతాను. అలా నిద్రపోక టీవీ ముందు కూర్చోవటంవల్ల ఇప్పుడు
వెంటనే నిద్ర పట్టకపోవటం, రేపు ఆలస్యంగా లేవటం సరే, నిద్రలో దీనికి సంబంధించిన
కలలు రాకుండా వుండాలంటే ముందు ఆంజనేయ దండకం వగైరాలు చదువుకోవాలికదా. వుంటా మరి.
అన్నట్లు మీరంతా మాంఛివాళ్ళు, ఇలాంటి వ్యసనాల
జోలికి వెళ్ళని వాళ్ళని నాకు తెలుసుగానీ సలహా చెప్పకపోతే మరి నా మనసు
శాంతించాలికదా. మీ ఫోన్ లో బాగా బేలెన్స్
వుండీ, మీకు టైమ్ పాస్ కాకపోతే ఇలాంటి ప్రోగ్రామ్స్ ప్రసారం చేస్తున్న ఛానల్స్
ఎన్నో వున్నాయి. సరదాగా ఎంజాయ్
చెయ్యండి. అనవసరంగా డబ్బులు దండగ
చెయ్యకూడదనుకుంటే ఈ వ్యసనం జోలికి వెళ్ళకండి.
నిజంగా ఇది పేకాట, తాగుడు లాంటి వ్యసనమే.
ఎంతమంది ఆశతో ఇలాంటి ఫోన్లమీద ఎంతెంత డబ్బు వృధా చేస్తున్నారో కదా. వీటితో బాగుపడుతున్నవాళ్ళు వ్యాపారస్తులు
మాత్రమే.
1 comments:
Last time I have seen the chiru & pawan photo at Maa music same program. As like you I called them and they are not taking the call. I have waitied for 6 min and got to know that they are intentionally not taking the call and itching a lot at the program.
I have seen the TV scrolling words that for every minute call charge is 10 Rs. Immediately I disconnected from the call.
I have reliased that simply wasted 60 RS. They are cheating and trapping the people and making lot of moneny form viewrs.
Post a Comment