Wednesday, August 26, 2009

Wednesday, August 26, 2009

శ్రీ మహలక్ష్మీ—3

కలిమికలవారి బిడ్డ కూరిమితో పెంచబడదు

ప్రేమలేని పరమాన్నమెందుకే

ప్రేమవున్న గంజిచాలు కదా ఓ మహలక్ష్మీ!

ప్రేమ అమృతమై ఆవరిస్తే మనిషంతా

దుష్టబుధ్ధులకు శుష్క జబ్బులకు

చోటెక్కడుందే శ్రీ మహలక్ష్మీ!!


1 comments

Monday, August 3, 2009

కొంటె కోణాలు - 10

Monday, August 3, 2009

క్రేజీ యూత్

ప్రేమ యాత్రలకు బృందావనమూ నందనవనమూ ఏలనో....అప్పుడెప్పుడో భార్యా భర్తలు పాడుకున్న పాటను ఇప్పటికీ ఆ బాపతువాళ్ళే పాడుకుంటుంటే ఆ పాత మధురాలని తలచుకుని మురిసిపోయేవాళ్ళెంతమందోకదా.

కానీ ఇప్పుడు యూత్ లో ఇంకో హల్ చల్ మొదలయిందండీ. మా ముందు తరాల వాళ్ళకి అస్సలు బుఱ్ఱలేదు..అన్నీ ఓల్డ్ ధాట్స్..పాడుకున్న పాటలే పాడుకుంటూ వుంటారు..మేము చూడండి, ఏ సమయంలోనైనా ఎంత జాలీగా వుంటామో. మాడిపోయిన మూడ్స్ ఎలా మార్చేసుకుంటామో అని యాడ్స్ ద్వారా చెప్పేస్తున్నారు. నిన్ననే టీవీలో ఈ యాడ్ చూశానండీ.

గోవా వెళ్ళాల్సిన ఫ్రెండ్స్ గ్రూప్ ఫ్లైట్ మూడు గంటలు డిలే అవుతుంది. ఫ్లైట్ డిలే వల్ల గోవాకెళ్ళటానికయ్యే ఆలస్యాన్ని భరించలేక అర్జంటుగా గోవా సముద్రతీరాల్లో సేద తీరాలని ఆరాట పడేవాళ్ళు కొందరయితే, రాగాలు తీసే రాలుగాయిలు కొందరు. పాపం..తెలివైన అమ్మాయిలు ఏం చేస్తారు? ఏం చేస్తారు??!! స్నేహితుల కోర్కెలు తీర్చక చస్తారా!? వాళ్ళ తెలివితేటలుపయోగించి ఆందర్నీ మెస్మరైజ్ చేస్తారు. ఎలాగంటారా? ఫలానా కంపెనీవారి డియోడరెంట్ స్ప్రే చేసుకుని ఆ వాసన అందరికీ తగిలేలా ఎగిరితేసరి..మీతోబాటు అందరూ గోవా సముద్ర తీరాల్లోవున్నట్లే ఫీలయిపోతారు. కాలేదంటారా వెళ్ళి ఆ కంపెనీ వాళ్ళనే అడగండి...డియోడరెంట్ లో మార్పులు చేర్పులు చేసుకుంటారేమో.

కొంటె కోణం

కడుపే కైలాసం..ఇల్లే వైకుంఠం, ప్రేమే పరమార్ధం ఇలాంటివేవో విన్నాముగానీ, డియోడరంట్లే గోవా సముద్ర తీరాలని ఎక్కడా వినలేదండీ అంటారా. అందులోనూ అసలే రిసెషన్ రోజులు..ఇవి స్ప్రే చేసుకుని ఎక్కడివాళ్ళు అక్కడే వుంటే పర్యాటక రంగం ఏమయిపోతుందా అని దిగులు పడుతున్నారా? అంత సీనుందంటారా!???


5 comments

Thursday, July 16, 2009

నా పాక శాస్త్ర ప్రావీణ్యం

Thursday, July 16, 2009

స్పెషల్ ఉండ్రాళ్ళు

అప్పుడు నాకు 16 ఏళ్ళు. అప్పటికే మా అమ్మ పోవటం, మా అక్క పెళ్ళయ్యి హైదరాబాదు వచ్చెయ్యటం, నేను మళ్ళీ హైదరాబాదులో ఉద్యోగంలో చేరటం జరిగింది. ఉద్యోగం హైదరాబాదులో అయినా మనసంతా విజయవాడలో వున్న నాన్న, చెల్లెళ్ళ మీదే వుండేది. ఏ పండగలు వచ్చినా ఒక రోజుకైనా విజయవాడ వెళ్ళి ఏదో ఒక హడావిడి చేసొచ్చేదాన్ని వాళ్ళు బెంగ పెట్టుకోకూడదని. అలాగే వినాయక చవితికి కూడా వెళ్ళాను.

నాకప్పటికి వంట రాదు. అమ్మమ్మ లేనప్పుడు మా నాన్నగారు వంట చేసే వారు. మరి వినాయక చవితి అంటే ఉండ్రాళ్లు చెయ్యాలి కదా. నాన్నగారికీ అవి చెయ్యటం రాక కొబ్బరి కాయతో సంతృప్తి చెందుతాడులే దేవుడు అన్నారు. కానీ నేనుండగా నా చెల్లెళ్ళు ఉండ్రాళ్లు లేకుండా వినాయకుడికి పూజ చెయ్యటమా. నాకు పౌరుషం వచ్చేసింది. పైగా అమ్మమ్మ ఊరెళ్తూ బియ్యం రవ్వ తయారుచేసి పెట్టింది. ఆ మాత్రం ఉండ్రాళ్ళు చెయ్యలేనా. వెంటనే వెనకింటి కాళికాంబ పిన్నిగారి దగ్గరకెళ్ళి ఉండ్రాళ్ళ ప్రాసెస్ అంతా కనుక్కొచ్చాను. పిన్నిగారు చెప్పిన విషయాలన్నీ అతి శ్రధ్ధగా గుర్తు పెట్టుకుని ఉండ్రాళ్ళు తయారు చేశాను. చూడటానికి చాలా బాగా వచ్చాయి. పూజ, నైవేద్యం అయ్యాయి. భోజనాలలో ఉండ్రాళ్ళు ముందు నాన్నగారే తిన్నారు. ఎలా వున్నాయి అని ఆత్రంగా అడిగాను. మా నాన్నగారు మహానుభావులు. ఏది చేసినా బాగుందనేవారు. బాగున్నాయి..కొంచెం ఉప్పు తక్కువయిందేమో అన్నారు. అదేంటి వీటిలో ఉప్పు వేస్తారా పిన్నిగారు నాకు చెప్పలేదే అన్నాను చటుక్కున. మరి ఆవిడ చెప్పింది అంతా అంత శ్రధ్ధగా గుర్తు పెట్టుకుని చేసిన నాకు ఆవిడ ఉప్పు వెయ్యమని చెప్తే వెయ్యనా.

కాళికాంబ పిన్నిగారు తర్వాత అడిగారు ఉండ్రాళ్ళు చేశావా ఎలా వచ్చాయి అని. జరిగిన విషయం చెప్పాను. అరే నేనూ తర్వాత అనుకున్నాను..ఉప్పు వెయ్యమని చెప్పలేదేఅని, తర్వాత పూజ హడావిడిలోపడి మర్చిపోయాను అన్నారు. ఆరోజు నేను చేసిన ఉండ్రాళ్ళ గురించి చెప్పుకుని చాలా సేపు నవ్వుకున్నాం. దానితోబాటు తల్లిలేని పిల్లలతో ఆయన ఎన్ని అవస్తలు పడుతున్నారో సానుభూతులు కూడా.

అప్పటినుంచీ వినాయక చవితి వస్తే చాలు ఆ రోజంతా కళ్ళముందు తిరుగుతుంది. మా మరిది గోపీ కూడా ప్రతి వినాయకచవితికీ తప్పనిసరిగా అడుగుతారు ఉండ్రాళ్ళల్లో ఉప్పువేశారా అని. కాళికాంబగారు వాళ్ళ చుట్టాలు మరి.

చాలా ఏళ్ళ తర్వాత మొన్నీమధ్య కాళికాంబగారు కలిసినప్పుడు కూడా అడిగారు..ఇంతకీ ఉండ్రాళ్ళల్లో ఉప్పు వేస్తున్నావా లేదా అని.

మరి ఇన్నేళ్ళ తర్వాత కూడా ఇంతమందికి గుర్తున్న నేను చేసిన ఉప్పలేని ఉండ్రాళ్ళు సూపర్ అంటారా...అనక పోతే చెప్పండి మీకు కూడా ఉప్పులేని ఉండ్రాళ్ళు చేసి పెట్టేస్తా.


4 comments

Tuesday, July 7, 2009

కొంటె కోణాలు - 9

Tuesday, July 7, 2009

కొంటె కోణాలు – 9

హన్నా!!

బ్రిటానియా 50-50 బిస్కెట్స్ ఎడ్వర్టయిజ్మెంటు చూశారా? మహిళామణులు ఆ అబ్బాయిని ఆడవాళ్ళ సీట్లోనుంచి లేవమని గోలపెడుతుంటే 50-50 బిస్కెట్స్ తింటున్న ఆవిడమాత్రం పడుచువాళ్ళు పక్కన కూర్చున్నారని కుళ్ళా? కూర్చోమని లాగి కూర్చోపెడుతుంది. బ్రిటానియా బిస్కట్స్ తినని ఆడవాళ్ళంతా అంతకుముందు అంత గోల పెట్టినా ఠక్కున నోళ్ళు మూసేసుకుంటారు.

కొంటె కోణం

మహిళామణులూ, మహిళామండలులూ, ఏం చేస్తున్నారు? ఎక్కడవున్నారు? అన్యాయం జరిగిపోతుంటే! ఆడవాళ్ళే ఆడవాళ్ళకి అన్యాయం చేసేస్తున్నారు. పైగా అది చిత్రీకరించి అందరికీ చూపెడుతున్నారు. మహిళా సంఘాలూ లేవండి. బ్రిటానియా 50-50 బిస్కెట్స్ తినండి. నడుంబిగించండి. ఆడవాళ్ళ సీట్లోనుంచి మగవాళ్లని లేపండి. హన్నా!!


1 comments

Saturday, July 4, 2009

అమెరికాలో పొగడపూలు

Saturday, July 4, 2009






అమెరికాలో పొగడపూలు

నిఝంగా। మొన్న వాకింగ్ కి వెళ్ళినప్పుడు చూశాను ఆ చెట్టుని, దానికి విరగబూసిన పూలని. ఇక్కడ వాటినేమంటారో తెలియదుకానీ, అచ్చం మన పొగడ పూలలాగా వున్నాయి. వాసనేమీ రాలేదు. ఆ ఫోటోలు మీకోసం.




3 comments