Monday, November 2, 2009

బ్లాగ్ వనంలో వనభోజనాలు

Monday, November 2, 2009



బ్లాగ్ వనంలో వనభోజనాలు

పాలక్ పరోటా -- మీకిష్టమయిన పధ్ధతిలో

కార్తీక పౌర్ణమి..గుడికి వెళ్ళాలి. మీరేమో వనభోజనానికి పిలిచారు. అందుకే నా రెసిపీ చెప్పేసి, నేను చేసినవి ఇక్కడ పెట్టి గుడికి వెళ్ళి వస్తాను. అప్పటిదాకా మీరు లాగిస్తూండండి మరి.

వనభోజనానికి నా స్పెషల్ రెసిపీ తయార్. ఇది తప్పని సరిగా అందరూ తినవలసినదే. ఆర్డర్ కాదండీ, కారణాలు చెప్తున్నాగా. పెద్దలకు ఆరోగ్య ప్రదాయిని, పిల్లలకు చూడటానికి ఆకర్షణీయంగావుండి వెంటనే తినాలనిపిస్తుంది. ఇంతకీ ఏమిటా స్పెషల్ అంటారా. హమ్మో చెప్పకపోతే మూత తీసి చూసేటట్లున్నారు. నేనే చెప్పేస్తా. టట్టటాయ్..... పాలక్ పరోటా, పెరుగు. ఆ...ఆ....వేరే కబుర్లల్లో పడిపోకండి...దీనికి కావాల్సిన పదార్ధాలూ, ఎలా తయారు చేసుకోవాలో చెప్తున్నాను. జాగ్రత్తగా నోట్ చేసుకోండి. మరి ప్రారంభించనా

అన్నింటికన్నా ముందు ఒక్కవిషయం మాత్రం గుర్తు పెట్టుకోండి. మీరంతా ఇంత సరదాగా వనభోజనాలకొచ్చారు..అందుకని మీ సరదాని ఇంకా పెంచటానికి ఇవాళ్టిమటుకు నేను మీ ఇష్టా ఇష్టాలకు ఫస్ట్ టిక్ పెడతా. అంటే, ఈ పాలక్ పరోటాలు, నేను చెప్పిన విధంగా, మధ్యలో మీ ఇష్టాలని కలుపుకుంటూ ఇంచక్కా చేసుకోండి. బాగుంటేనే నేను చెప్పానని చెప్పండి. బాగుండకపోతే బాధ్యత అంతా మీదే.

ఇంతకీ ఏం చెయ్యాలంటే ముందు మీకు కావాల్సినంత, అదేనండీ, ఒక రూపాయిదో, వంద రూపాయలదో పాలకూర కొనండి. కొనకపోతే దొడ్లో వుంటే కోసుకొచ్చినా పరవాలేదు, అలవాటు వుంటే పక్కింట్లో అరువు తెచ్చయినా చేసుకోవచ్చు, అదీ ఇదీ కాకపోతే మీ ఇష్టం వచ్చిన ఏ విధంగానైనా తెచ్చుకోండి, పాలకూర మాత్రం తెండి. దాన్ని బాగు చెయ్యటం కూడా మీ ఇష్ట ప్రకారమే చేసుకోండి. కొందరికి కొంచెం కాడలు వుంటే ఇష్టం, శరీరానికి కాస్త పీచు పదార్ధం అందుతుందని. వీళ్ళకి డయట్ కాస్ష,స్నెస్ కాస్త ఎక్కువ. కొందరు ఆ గడ్డంతా ఎక్కడ తింటామని ఆకులు గిల్లి వేసుకుంటారు. ఏం పర్వాలేదు. సో, మీ ఇష్టం వచ్చినట్లు దాన్ని బాగు చేసుకోంది. చైనా వాళ్ళుంటే వాళ్ళ ఇష్టం ప్రకారం ఆకుల్లో ఏమన్నా పురుగూ పుట్రా వుంటే అలాగే వుంచేయచ్చు. నేను ముందే చెప్పాను, మీ ఇష్టానికే ఫస్ట్ టిక్ అని. పాల కూర తెచ్చారు, బాగు చేశారు. ఇంక కొన్ని నీళ్ళుపోసి ఆ ఆకును కడగండి. ఎందుకండీ, ఆకుకూరలు అమ్మేవాళ్ళు దాన్నిండా ఎప్పుడూ నీళ్ళు పోస్తూనే వుంటారు కదా మళ్ళీ మనం నీళ్ళుపోసి కడగాలా, మరీ చాదస్తంకాకపోతే అంటారా. సరే. మీ ఇష్టం. పాలకూరని మాత్రం తీసుకుని కుక్కర్లో ఉడికించండి. డైరెక్టుగా కుక్కర్లో పెట్టాలా లేక గిన్నెలో పెట్టి పెట్టమంటార అంటున్నారా. నేనేమీ టీవీలో వంటల ప్రోగ్రామ్ లో చెప్పినట్లు ఇలా చేస్తేనే బాగుంటుందని చెప్పను. ఇది బ్లాగు లోకం. కాబట్టి ఎవరి ఇష్టాలు వాళ్ళవే. మీ ఇష్టా ఇష్టాలకే ప్రధమ తాంబూలం. తాంబూలమన్నానని ఇది తిన్నాక తాంబూలం వేసుకోవచ్చా అని అడుగుతున్నారు శ్రీమతిగారు. నేను ముందే చెప్పానండీ...మీ ఇష్టానికే.....

ఇంతకీ పాలకూర ఉడికించారా. ఇప్పుడు గోధుమపిండి తీసుకోండి. పిండి పేకెట్ తీసుకొచ్చి ఏం చెయ్యమంటారంటారా. మీ ఇష్టం వచ్చిన పాత్ర తీసుకోండి. ఇక్కడ మాత్రం కొంచెం నేను చెప్పేది పాటించండీ. పాత్ర లేకపోతే పిండి కలపటం కష్టం. అందుకని పాత్ర దేనికి అని ఎదురు ప్రశ్న వెయ్యకుండా మీ ఇష్టం వచ్చిన పాత్ర తీసుకోండి. నేను చెప్పేది మాత్రం ఒక్కమాట వినండి. మీరు తీసుకునే పిండి కలపటానికి ఆ పాత్ర అనువుగా వుండాలి. ఈ ఒక్క విషయంలో నేను చెప్పే విధంగా విని, మీ ఇష్టం వచ్చిన పాత్ర తీసుకుని దానిలో గోదుమ పిండి వేసి, అందులో ఉడికించిన పాలకూర, ఉప్పు, కారం, జీలకఱ్ఱ, వెయ్యండి. మీకు కావాలంటే ఇంకా ఇంట్లో తినే వస్తువుల్లో చపాతీల్లోకి బాగుంటాయనుకున్న పదార్ధాలన్నీ వేసెయ్యండి. ఇవ్వి మీ ఇష్ట ప్రకారం చేసుకునే పరోటాలండీ. ఎవరడ్డొచ్చినా ఖాతరు చెయ్యకండి. ఇవ్వన్నీ వేశాక నీళ్ళు పోసి కలపాలండీ. ఇక్కడ మళ్ళీ నా మాటే వినాలి మీరు. మీకిష్టమని ఏ నూనో, పెరుగో పోసి కలపకండి పిండిని. ఏంలేదు..పరోటాలు అంతబాగా రాకపోవచ్చేమోనని కొంచెం అనుమానం..

సరే పిండి కలిపారా. కొంచేంసేపు దానిమీద ఒక గిన్నె బోర్లించి వుంచండి. ఎంతసేపంటారా పది నిముషాలు, 15 ని. లు అని నేను మీకు టైము లిమిట్ పెట్టనండీ. మీ ఇష్టం వచ్చినంతసేపు నాననివ్వండి. ఇప్పుడు మీ ఇష్టం వచ్చిన చపాతీలు వత్తే పీట, కఱ్ఱ తీసుకుని పిండిని బాగా మర్దించి, ఉండలు చేసి గుండ్రంగా వత్తాలి. దాని మీద కొంచెం నూనెగానీ, పొడి పిండిగానీ వేసి మీ ఇష్టం వచ్చినట్లు మడత పెట్టండి. మళ్ళీ వత్తండి. ఇలా మీ ఇష్టం వచ్చినంతసేపు, ఇష్టం వచ్చిన షేపులో చేసుకుని, పెనం మీద నూనె వేసో, వేయకుండానో, కొంచెంగా వేసో, మీకెలా ఇష్టం అయితే అలా, రెండు వేపులా మాత్రం కాల్చాలండీ. ఇంత శ్రమ పడ్డారుకదా. ఇంకా దాన్లోకి కూరా గీరా అని మళ్ళీ శ్రమ పడకుండా సుభ్భరంగా మంచి పెరుగు వేసుకుని తినెయ్యండి. ఇదేం ఆంక్ష కాదండీ. మీరు అలిసిపోతారని.

చూశారా. మీ కేమాత్రం కష్టంలేకుండా, మీకిష్టమైన రీతిలో మీ కిష్టమైన రుచులతో పాలక్ పరోటా ఎంత తేలిగ్గా చేసుకోవచ్చో. అయితే ఎందుకైనా మంచిది.... వీటిని ఎవరికైనా పెట్టేటప్పుడు మాత్రం కాస్త జాగ్రత్తగా వుండండి. సరేనా.



13 comments

Friday, October 30, 2009

గోళ్ళు కొరకకూడదా

Friday, October 30, 2009
గోళ్ళు కొరక కూడదు అంటారు. ఎందుకు?

సైంటిఫిక్ గా గోళ్ళ చివరినుంచి ప్రతికూల శక్తి (negative energy) బయటకి వెళ్తుంటుంది. వాటిని నోటిలో పెట్టి కొరకటం వల్ల ఆ ప్రతికూల శక్తి తిరిగి మన లోపలకి ప్రవేశిస్తుంది. అదేకాక మనం ఎంత శుభ్రం చేసినా గోళ్ళల్లో మట్టి, సూక్ష్మక్రిములు వుంటూ వుంటాయి. ఇవ్వి లోపలకి వెళ్ళి అనారోగ్యం కలిగిస్తాయి. పిల్లలు ఒక్కోసారి వాటిని మింగేయవచ్చు. అరుదుగా ఇవ్వి పేగులలో ఎక్కడైనా గుచ్చుకుని ఒక్కోసారి ఆపరేషన్ దాకా వెళ్ళచ్చు. ఇన్ని విధాల మనకి నష్టం కలిగిస్తుంది కనుకే గోళ్ళు కొరకటం అరిష్టం అంటారు.

(జీ తెలుగు ప్రసారం చేసిన గోపురం ఆధారంగా)

1 comments

Thursday, October 29, 2009

రోబోలు

Thursday, October 29, 2009
మన పూర్వీకులు రోబోల గురించి చెప్పారా?

అవునంటే అశ్చర్యపోతారా? 11వ శతాబ్దంలో భోజరాజు తన సమరాంగణ సూత్రధార అనే వాస్తు శాస్త్రంలో విచిత్రమైన యంత్రాలు, నవ్వే బొమ్మలు, మాట్లాడే బొమ్మల గురించి చెప్పాడు. ఇలాంటి బొమ్మలని ఎక్కువగా ద్వారపాలకులుగా ఉపయోగించేవాళ్ళు. ఏదైనా కొత్త శబ్దం వినబడితే వెంటనే అటువైపు వచ్చే దానిని దేనినైనా నరికేసేవి ఆ బొమ్మలు. ఫలహారాలనీ, నీళ్ళనీ అందించటానికి కూడా ఉపయోగించేవాళ్ళు.

శాస్త్రాల్లో చెప్పని విషయం ఏమీ లేదు. ఇప్పుడు కనుక్కున్న వాటికన్నా ఎన్నో ఎక్కువ విషయాలను సూక్ష్మాతి సూక్ష్మంగా ఏ వస్తువుని ఎలాంటి వాతావరణంలో ఎప్పుడు, ఎక్కడ, ఎలా ఉపయోగించాలి అని అనేక శతాబ్దాల క్రితమే మన శాస్త్రాల్లో లిఖించబడివుంది.



సూక్ష్మదర్శిని


సప్త ఋషులలో ఒకరైన గౌతమ మహర్షి గాజు, అభ్రకము, స్ఫటికము ఉపయోగించి దుర్భిణిని ఆ కాలంలోనే తయారు చేశారు.

మానవ మనుగడకు అవసరమైన విషయాలెన్నో మన పూర్వీకులు ఎప్పుడో చెప్పారు. అవ్వన్నీ ఉపయోగించుకుంటూ, సమాజానికి ఉపయోగపడే ఇంకా ఎన్నో ఉపయోగకరమైన విషయాలను ఆవిష్కరించాల్సిన అవసరం వుంది.


(జీ తెలుగులో ప్రసారమైన గోపురం కార్యక్రమం ఆధారంగా)

1 comments

Tuesday, October 27, 2009

శాస్త్రల్లో విమానాలు

Tuesday, October 27, 2009
మన విమానాల గురించి పూర్వం పురాణాల్లోనూ, శాస్త్రాల్లోనూ చెప్పారా?

అవునండీ. నిజమే. మన సాంప్రదాయాలకి మూలం పురాణాలూ, వేదాలూ. ఈ నాడు మనం కనిబెడుతున్న ఎన్నో విషయాల గురించి ఏనాడో మన పూర్వీకులు విశదంగా చెప్పారు. మన విమానాలగురించి ఎన్నో విశేషాలను భరద్వాజ మహర్షి యంత్రసర్వస్వం అనే గ్రంధంలో వ్రాశారు. అందులో 40 ప్రకరణలు వున్నాయి. ఒక ప్రకరణ మొత్తం విమానాల గురించే...అందులో విమాన చోదకుడికి ఏ అర్హతలు వుండాలి, విమాన ప్రయాణీకులు ఏ రకం వస్థ్రధారణ చెయ్యాలి, విమానంలో ప్రయాణించేటప్పుడు ఎలాంటి ఆహారం తీసుకోవాలి, ప్రమాదాల సమయంలో విమానాన్ని భూమిమీదకి ఎలాదించాలి, ప్రయాణీకుల్ని ఎలా రక్షించాలి, ఆకాశ మార్గాన పరిభ్రమిస్తున్న గ్రహాల ప్రభావాన్నుంచి ఎలా రక్షించుకోవాలి వగైరా ఎన్నో విషయాలు వ్రాశారంటే ఆశ్చర్యం వేస్తోందికదూ!!

అంతే కాదండోయ్...యుధ్ధ సమయంలో శత్రువులు మూర్ఛపోయేలాగా విమానచోదకుడు భయంకర శబ్దాన్ని సృష్టించగలగాలిట. అలాగే ఆకాశాన్ని ఏడు మండలాలుగా విభజించి, ఒకమండలంలో విమాన చోదకుడు వుంటే మిగతా ఆరు మండలాల్లో ఎవరు వున్నారు, ఏ దిశగా ప్రయాణిస్తున్నారు, వాళ్ళ ఆలోచనలు, వ్యూహాలూ, అన్నీ విమాన చోదకుడు ఊహించగలగాలి అని చెప్పారు.

త్రిపుర అనే విమానాల గురించి కూడా చెప్పారు. ఇవి ఆకాశం, సముద్రం, నీళ్ళల్లో కూడా తిరగగలవు. ఈ యంత్రసర్వస్వం గ్రంధం ఇప్పుడు తెలుగులోకి కూడా అనువదింపబడటమేకాదు, అందుబాటులోకూడా వుందిట.

ఇన్ని అద్భుత విషయాలగురించి ఏనాడో వ్రాసి పెట్టిన మన ఋషుల అపార జ్ఞానాన్ని ఆ శాస్త్రాలు అధ్యయనం చేయటం ద్వారా గ్రహించి, సమాజానికి ఉపయోగపడే ఎన్నో క్రొత్త విషయాలను కనుగొనాల్సిన ఆవశ్యకత ఎంతైనా వున్నది.


(జీ తెలుగు ప్రసారం చేసిన గోపురం ఆధారంగా)

0 comments

Monday, October 26, 2009

నాగులచవితి

Monday, October 26, 2009
నాగుల చవితి

కార్తీక శుధ్ధ చవితినాడు నాగుల చవితిగా భావించి సుబ్రహ్మణ్యేశ్వరస్వామిని నాగేంద్రుని రూపంలో ఆరాధించటం మన సంప్రదాయం. ధర్మసింధులో ఈ నాగుల చవితి గురించి వివరణ వున్నది. ఆ రోజు మట్టితో నాగ ప్రతిమ తయారు చేసి దానిని పూజించి, పాలు సమర్పించాలన్నారు. లేకపోతే గోడమీద నాగేంద్రుని బొమ్మ గీసి దానినిగానీ, గుళ్ళో ప్రతిష్టింపబడిన నాగదేవతనన్నా పూజించి పాలు పొయ్యాలి. సంతానంలేని స్త్రీలుగానీ, పిల్లల ఆరోగ్యం సరిగ్గాలేని స్త్రీలుగానీ ఆ రోజు నాగేంద్రుని రూపంలో వున్న సుబ్రహ్మణ్యేశ్వరస్వామిని పూజించి ఉపవాసం వుంటే పిల్లలు కలుగుతారని, వారి ఆరోగ్య సమస్యలు తీరుతాయనీ అంటారు ఆ రోజు స్త్రీలు ఉపవాసం వుండి కేవలం స్వామికి నివేదనచేసిన చలిమిడి, చిమ్మిలి, వడపప్పు మాత్రమే తిని వుండటంలో కూడా శాస్త్రీయ దృక్పధం వున్నది.

చిమ్మిలిలో వుండే నువ్వులు, కొబ్బరి, బెల్లం, శరీరానికి వేడినిస్తాయి. స్త్రీలఋతు సంబంధం బాధలను నివారిస్తాయి. హార్మోన్స్ సమతుల్యాన్ని కాపాడతాయి. ఇంక చలిమిడి, వడపప్పు ఈ చిమ్మిలి వల్ల వచ్చే తాపాన్నించీ శరీరాన్ని కాపాడతాయి. అందుకే చలిమిడి కడుపు చలువ అంటారు. ఉపవాసం వున్న రోజున కారం, పులుపు, ఉప్పు వగైరా వేరే మసాలాలు లేకుండా కేవలు ఇవే తిని వుంటే స్త్రీలకి ఆరోగ్యం లభిస్తుందన్నమాటు. చూశారా, మన పూర్వీకులు మన గురించి ఎంత ఆలోచించి మనకిన్ని నియమాలేర్పరిచారో. మనం మాత్రం వాటిని ఎంతో తేలిగ్గా తీసి పడేస్తాము.

సుబ్రహ్మణ్యేశ్వరుణ్ణి నాగేంద్ర రూపంలో పూజించటానికి కూడా ఒక పురాణ కధ వుంది. ఒకసారి కైలాసానికి పార్వతీ పరమేశ్వరుల దర్శనార్ధం దిగంబరులొచ్చారు. వారిని చూసి సుబ్రహ్మణ్యుడు పరిహాసంగా నవ్వాడు. పార్వతీమాత సుబ్రహ్మణ్యుణ్ణి కోప్పడి, పరిహారంగా నాగేంద్ర రూపంలో ప్రజలను కాపాడమని చెబుతుంది.

ఇవ్వండీ నాగుల చవితి విశేషాలు. మరి మీరు చేశారా?


(జీ తెలుగు ప్రసారం చేసిన గోపురం కార్యక్రమం ఆధారంగా)

0 comments