Monday, October 26, 2009

నాగులచవితి

Monday, October 26, 2009
నాగుల చవితి

కార్తీక శుధ్ధ చవితినాడు నాగుల చవితిగా భావించి సుబ్రహ్మణ్యేశ్వరస్వామిని నాగేంద్రుని రూపంలో ఆరాధించటం మన సంప్రదాయం. ధర్మసింధులో ఈ నాగుల చవితి గురించి వివరణ వున్నది. ఆ రోజు మట్టితో నాగ ప్రతిమ తయారు చేసి దానిని పూజించి, పాలు సమర్పించాలన్నారు. లేకపోతే గోడమీద నాగేంద్రుని బొమ్మ గీసి దానినిగానీ, గుళ్ళో ప్రతిష్టింపబడిన నాగదేవతనన్నా పూజించి పాలు పొయ్యాలి. సంతానంలేని స్త్రీలుగానీ, పిల్లల ఆరోగ్యం సరిగ్గాలేని స్త్రీలుగానీ ఆ రోజు నాగేంద్రుని రూపంలో వున్న సుబ్రహ్మణ్యేశ్వరస్వామిని పూజించి ఉపవాసం వుంటే పిల్లలు కలుగుతారని, వారి ఆరోగ్య సమస్యలు తీరుతాయనీ అంటారు ఆ రోజు స్త్రీలు ఉపవాసం వుండి కేవలం స్వామికి నివేదనచేసిన చలిమిడి, చిమ్మిలి, వడపప్పు మాత్రమే తిని వుండటంలో కూడా శాస్త్రీయ దృక్పధం వున్నది.

చిమ్మిలిలో వుండే నువ్వులు, కొబ్బరి, బెల్లం, శరీరానికి వేడినిస్తాయి. స్త్రీలఋతు సంబంధం బాధలను నివారిస్తాయి. హార్మోన్స్ సమతుల్యాన్ని కాపాడతాయి. ఇంక చలిమిడి, వడపప్పు ఈ చిమ్మిలి వల్ల వచ్చే తాపాన్నించీ శరీరాన్ని కాపాడతాయి. అందుకే చలిమిడి కడుపు చలువ అంటారు. ఉపవాసం వున్న రోజున కారం, పులుపు, ఉప్పు వగైరా వేరే మసాలాలు లేకుండా కేవలు ఇవే తిని వుంటే స్త్రీలకి ఆరోగ్యం లభిస్తుందన్నమాటు. చూశారా, మన పూర్వీకులు మన గురించి ఎంత ఆలోచించి మనకిన్ని నియమాలేర్పరిచారో. మనం మాత్రం వాటిని ఎంతో తేలిగ్గా తీసి పడేస్తాము.

సుబ్రహ్మణ్యేశ్వరుణ్ణి నాగేంద్ర రూపంలో పూజించటానికి కూడా ఒక పురాణ కధ వుంది. ఒకసారి కైలాసానికి పార్వతీ పరమేశ్వరుల దర్శనార్ధం దిగంబరులొచ్చారు. వారిని చూసి సుబ్రహ్మణ్యుడు పరిహాసంగా నవ్వాడు. పార్వతీమాత సుబ్రహ్మణ్యుణ్ణి కోప్పడి, పరిహారంగా నాగేంద్ర రూపంలో ప్రజలను కాపాడమని చెబుతుంది.

ఇవ్వండీ నాగుల చవితి విశేషాలు. మరి మీరు చేశారా?


(జీ తెలుగు ప్రసారం చేసిన గోపురం కార్యక్రమం ఆధారంగా)

0 comments: