Thursday, February 24, 2011

గుడికి వెళ్ళగానే, గుడినుంచి బయటకొచ్చాక కాళ్ళు కడుక్కోవాలా?

Thursday, February 24, 2011


ఆలయానికి వెళ్ళినప్పుడు సాధారణంగా అందరం కాళ్ళు కడుక్కుని ఆలయం లోపలకి వెళ్తాము. ఇది మంచి పధ్ధతే. మనం బయటనుంచి వచ్చాం కనుక దుమ్ము ధూళి కాళ్ళతో వచ్చే అవకాశం వున్నదిగనుక, కాళ్ళు, చేతులు కడుక్కుని పరిశుభ్రంగా ఆలయంలోకి వెళ్ళటం ఆలయ పరిశుభ్రానికీ, అక్కడికి వచ్చేవారి ఆరోగ్యానికీ మంచిది.

అయితే కొందరు శనీశ్వరుడికీ, నవగ్రహాలకీ ప్రదక్షిణ చేసినప్పుడు వెంటనే హడావిడిగా కాళ్ళు కడుక్కుంటారు. ప్రదక్షిణలు చేసి శని పీడ వదిలించుకొచ్చాము…ఒక్క క్షణం కాళ్ళు కడుక్కోవటం ఆలస్యం చేస్తే శని మళ్ళీ ఎక్కడ పట్టుకుంటాడోనని హడావిడిగా కాళ్ళు కడుక్కొస్తారు. కొందరయితే శనీశ్వరుణ్ణి సరిగ్గా చూడనుకూడా చూడరు. ఎక్కడ పట్టుకుంటాడోనని భయం. ప్రదక్షిణ చేసినందుకే శని పట్టుకుంటే పాపం ఆలయంలో వుండే పూజారి నిత్యం స్వామి విగ్రహాన్ని కడిగి, శుభ్రం చేసి, పూజలుచేసే పూజారికి మాట ఏమిటి శనీశ్వరుడిని పీడగా భావించకూడదు. శని ఈశ్వర స్వరూపం. మన పూర్వ జన్మ కర్మ బాగుండనప్పుడు, మనం చేసే తప్పులకు శిక్ష, శని దశ వచ్చినప్పుడు అనుభవించక తప్పదు. అంటే మనం చేసే తప్పులకు శిక్ష విధించేవాడు శని.

శనిని వదుల్చుకోవాలని చూసేవాళ్ళకి మన శరీరంలోనే శని వుంటాడని తెలుసా? మన తల వెంట్రుకలలో శని వుంటాడు. కనుబొమలకి శని కారకుడు. ఇవి లేకుండా మనిషికి అందం వుండదు. అంటే మనిషికి అందాన్నిచేవాడు శని. కంటిలో కార్నియాకు శని కారకుడు. శని వుంటాడు కార్నియా వద్దంటే మన కంటి చూపు శరీరంలో సన్నటి నరాలకు, ఇంతెందుకు మన ఆయుష్కారకుడు శని. అలాంటి శనీశ్వరుణ్ణి దర్శించిన తర్వాత ఏదో పీడని వదిలించుకోవాలన్నట్లు కాళ్ళు కడుక్కోవటం, దేవుణ్ణి చూడకుండా గబగబా ప్రదక్షిణలు చెయ్యటం సరైన పనేనా?

మనం ముడుచుకుని ఇంట్లో కూర్చున్నా మన కర్మ శేషాన్ని అనుభవించక తప్పదు. శనీశ్వరుడు నమస్కరించదగినవాడు. పూజించ దగిన వాడు. ఆయనకి భయపడటం, కాళ్ళు కడుక్కోవటం మూఢనమ్మకమే.


4 comments

Tuesday, February 22, 2011

లలితా సహస్రనామం చేసిన తర్వాత అమ్మవారికి ఏమి నైవేద్యం పెట్టాలి?

Tuesday, February 22, 2011

చాలామందికి ఈ సందేహం వుంది. కొందరు లలితా సహస్రనామ పారాయణ ప్రతి నిత్యం చేస్తుంటారు. కొందరు రెండు పూటలా చేస్తారు. కొందరు ప్రత్యేక దినాలలో…ఇలా రకరకాలుగా…ఈ మధ్య లలితా సహస్రనామ పారాయణ చేసేవారి సంఖ్య ఎక్కువైందనే చెప్పొచ్చు. వీరిలో కొందరికి మామూలుగా నిత్యం మహా నైవేద్యం పెట్టే అలవాటు వుంటుంది. ఇలాంటివారికి ఏ సమస్యాలేదు. కొందరికి ఇంట్లో మడిగాగానీ, నిష్టగాగానీ చెయ్యటం కుదరదు. ఒక్కొక్కళ్లకి ఒక్కో రకం ఇబ్బంది. ఇలాంటివారికి లలితా సహస్రనామం పారాయణ చేసినప్పుడు అనేక అనుమానాలు..మహా నైవేద్యం పెట్టలేక పోయామే..అసలు అమ్మవారికి ఏం నైవేద్యం పెట్టాలి..ఏదో ఇవాళ ఒక పండు పెట్టేశాను..సరిగ్గా చేశానో లేదో…ఇలా గుంజాటన పడతారు. అందరికీ మహా నైవేద్యం పెట్టటం అన్నివేళలా కుదరకపోవచ్చు. నిత్యం పారాయణ చేసేవారు తొందరగా అయ్యేది ఏదైనా చేసి పెట్టవచ్చు. అమ్మవారిని హరిద్రాన్నైక రసికా అని కీర్తిస్తాం. పెసర పప్పు వేసిన పులగం నైవేద్యం పెట్టవచ్చు. అదీ కుదరకపోతే కర్జూర పండు నైవేద్యం పెడితే మహా నైవేద్యం పెట్టినట్లేట. ఒక్కొక్కసారి అవి కూడా వీలు పడకపోవచ్చు..సమయానికి దొరకక, తెచ్చినవి అయిపోయి వగైరా ఏ కారణ వల్లనైనా. అప్పుడు వీలయితే ఆవుపాలలో, లేదా ఇంట్లో వుండే పాలల్లో తేనె కలిపి నైవేద్యం పెట్టవచ్చు. అందుబాటులో వున్న ఏ పండయినా నైవేద్యం పెట్టవచ్చు. అమ్మవారికి కావలసినది భక్తికానీ ఏమి పెట్టాము అన్నది కాదు. మనం నిండు మనసుతో భక్తిగా ఏదైనా సమర్పించవచ్చు.

కొన్ని ప్రత్యేక కార్యక్రమాలు వుంటాయి. చంద్ర దోష పరిహారార్ధం కొందరు పౌర్ణమినాడు చంద్రుని లలితా పరమేశ్వరి రూపంలో పూజించి, ఆరుబయట చంద్ర కిరణాలు పడే చోట పూజ చేసి పాలు, బెల్లంతో చేసిన పరవాణ్ణం నైవేద్యం పెట్టి అందరికీ పెట్టి వారు తింటారు. అలాగే నవరాత్రులలో అమ్మవారిని పూజించేవారు మినప గారెలు తప్పనిసరిగా నైవేద్యం పెడతారు. శుక్రవారం నియమంగా పారాయణ చేసేవారు అమ్మ గుడాన్నప్రీత మానస కనుక బెల్లం వేసిన పరనాణ్ణం నైవేద్యం పెడతారు.

నిత్యపారాయణకి వీలయితే ఏమైనా చెయ్యవచ్చు..వీలు కానప్పుడు భక్తిగా ఏది సమర్పించినా పరవాలేదు.

(జీ తెలుగు ప్రసారం చేసిన గోపురం ఆధారంగా)

మనలో మాట

ఈ సందర్భంలో మా నాన్నగారికీ నాకూమధ్య జరిగిన సంఘటన ఒకటిగుర్తొస్తోంది. మా నాన్నగారొకటేఅనేవారు. నువ్వు తినేది ఏదైనాదేవుడికి పెట్టవచ్చు. అయితే దేవుడికిపెట్టింది ఏదీ పారవెయ్యద్దు అనేవారు. అంటే కొబ్బరిగాయ కొడితే లోపలకొబ్బరి తీసి పెట్టాలి..మరి మనమాపెంకులు తినలేముకదా. ఒకసారి నేనుదానిమ్మ పండు పెట్టటం చూశారు. వలిచి పెట్టకపోయినావా అందులో అన్నిగింజలూ బాగా వుండకపోవచ్చుకదాఅన్నారు. మనమేం తక్కువతిన్నామా..నేను దేవుడికి ముందేచెప్పేశాను..నా హడావిడి సంగతి నీకుతెలుసుకదా..ఈ పండులో మంచిగింజలే తిను బాగాలేనివి వదిలెయ్యిస్వామీ అని..అదే అంటే మా నాన్నగారుఫక్కున నవ్వి మీ దేవుడేం దానిమ్మపండే పెట్టమని అడగలేదుకదా..ఏఅరటి పండో, పాలో పెట్టు, నీకువలవటానికి తక్కువ టైముపడుతుంది, ఒక్క నిముషంలో దాన్నితినేసికూడా వెళ్ళచ్చు అన్నారు. నిజమేగా!


6 comments

Friday, January 21, 2011

స్నేహానికి ద్రోహం

Friday, January 21, 2011


 అవును ప్రియ మరణంవల్ల జరిగిన ద్రోహం స్నేహానికి.  ప్రమదావనానికిగానీ దానిలోని సభ్యులకుగానీ కాదు.  ఎందుకంటే ఆడపేరుతో వస్తే అమ్మాయి అని నమ్మాము.  సరదాగా మాట్లాడాముగానీ, చెప్పకూడని సంగతులూ, ఇంట్లో రహస్యాలూ ప్రమదావనంలో ఎవరూ చర్చించుకోరు.  ఎందుకంటే అందరికీ మంచీ చెడూ తెలుసు.  ఇంతమంది ఆడపేర్లుపెట్టుకున్నవారితోనూ అంతా సరదాగా మాట్లాడారు, ఆత్మీయతని పంచుకున్నారు.  అంతమాత్రాన నష్టమేమీలేదు.  అయితే బాధంతా నమ్మించి స్నేహాన్ని మోసం చేశాడని, ఇంత ఆత్మీయంగావుండి ఇలా దగాచేశారని.  చనిపోయిందని తెలిసినప్పుడు, మోసాన్ని పసిగట్టలేక, మనసున్న మనుషుల్లాగా బాధపడ్డాము.  అది తప్పా?  ఆ వార్త చెప్పటం జ్యోతి చేసిన పొరపాటెలాఅవుతుంది?.  అనేక కారణాలవల్ల తనుకూడా ఈ మోసాన్ని గుర్తించివుండకపోవచ్చు.  ఒక విధంగా తను రాంగ్ ఫోటో పెట్టటం మంచిదయింది.  అసలు మోసం బయటపడింది. 

 ప్రమదావనంలో  ఇంగింత జ్ఞానం లేనివారూ,  ఒకళ్ళు ఆడించినట్లు ఆడేవారూ ఎవరూ లేరు.  ఎవరు చెప్పినా చెప్పకపోయినా ఇంకముందు ఆడపేర్లు పెట్టుకునేవాళ్ళతో అందరూ జాగర్తపడతారు.  ఇప్పుడూ కొన్ని జాగ్రత్తలు తీసుకున్నాము.   అయితే ఈ జాగ్రత్తలనుకూడా అధిగమించి అతి తెలివితేటలుగలిగినవాళ్ళు చేసే మోసాలకు అప్పుడప్పుడూ ఇలా బలికాక తప్పదు.  దీనితో మేము పోగొట్టుకున్నది మనుషులమీద నమ్మకాన్ని.  దానివల్ల మాకు పెరిగేది ముందు జాగ్రత్త మాత్రమే.

నేను అర్ధం చేసుకోలేని విషయం గురించి అడుగుతున్నాను.  దయచేసి తెలిసినవారు చెప్పండి.  బ్లాగులు మన మనోభావాలు రాసుకోవటానికి.  సరే.  కానీ మన మనోభావాలు ఇంత ఛండాలమయిన భాషలో రాసుకోవాలా?  ఇంత దిగజారిపోయి తిట్టుకోవాలా?  మనం సంఘంలో బాధ్యతగల పౌరులంకాదా?  యుక్తాయుక్త వివేచన లేకుండా మన అక్కసు తీర్చుకోవటానికి ఎవరో ఒకరిని తిట్టాలా?  నిజంగా మనం మెచ్చని విషయం వుంటే మంచి భాషలో చెప్పి మన సంస్కారం చాటుకోలేమా???

చాలా చోట్ల కామెంట్లల్లో ప్రమదావనంలో ఆడోళ్ళకి పర్సనల్ విషయాలు మాట్లాడుకోవటం తప్పితే పనిలేదు అన్నట్లు రాశారు.  ఆడవాళ్ళు మరీ అంత ఫూల్స్ కాదు ఇంటిగుట్టు రచ్చకెక్కించటానికి.  శుభకార్యాలకి విషెస్ చెప్పుకున్నంతమాత్రాన పర్సనల్ విషయాలన్నీ చెప్పేసుకున్నట్లు కాదు.  అది తప్పితే ప్రమదావనం కార్యక్రమం ఇంకేమీ లేదనుకోవటం పొరబాటు. 

ఒకటి మాత్రం నిజం.  ఒకరి కుటుంబ సభ్యులు పోయారంటే అందరూ ఒకటై వారిని ఓదార్చి తిరిగి మామూలు మనిషిని చెయ్యాలని ప్రయత్నంచెయ్యటం..అనారోగ్య సమయాల్లో మానసిక అండగా నిలవటం, కంప్యూటరుగానీ ఇంకా ఏమైనా తెలియని విషయాలు తెలుసుకోవటంకూడా ఆడవాళ్ళ ముచ్చట్లుగా తీసేస్తే అది ఆడవారిపట్ల మీకున్న చిన్నచూపు మాత్రమే.  ప్రమదావనం గురించి కామెంటు చేసేవారు జ్యోతిమీద అక్కసుతోగాక దానిలో సభ్యులనెవరినన్నా అడిగి నిజానిజాలు తెలుసుకుని చెయ్యండి. 

ఒకరు ఒక సబ్జెక్టు చెబితే దానిమీదే అంతా పోస్టులు రాస్తున్నారన్నారు.  ఇదికూడా దూషించే విషయమేనా?  ఇది  ఏ విధంగా తప్పో చెప్పగలరా?  ఒక సబ్జెక్టు మీద అనేకుల భావాలు, ఒకే సమయంలో వాటిని చెప్పే పధ్ధతి ఎలావుంటుందో విశ్లేషించవచ్చుకదా?  నచ్చలేదనుకోండి. చదవటం మానెయ్యండి.  

చివరిగా నా విజ్ఞప్తి ఒక్కటే.   ఆడవాళ్ళని అలుసుగా చూడకండి.  తేలికగా మాట్లాడకండి.  మీ జీవితంలోనూ ఆడవారు వున్నారు.   భావ వ్యక్తీకరణ స్వేఛ్ఛ మీకుంది.  అయితే చదువూ సంస్కారాలు కలవారిగా  భాషమీద కంట్రోల్ పెట్టుకోండి.  మడి కట్టుకుని రాయక్కర్లేదు...కుళ్ళులో దొర్లకండి.

28 comments

Wednesday, January 12, 2011

కదంబ మాలిక – 7 వ భాగం

Wednesday, January 12, 2011


 ప్రమదావనం సభ్యులు ప్రప్రధమంగా ఏర్చికూర్చుతున్న ఈ కదంబ మాలికలో ఏడవ మూర (సప్తమ భాగం) ఇది.  వ్రాసిన వాళ్లలో ఎవరూ చెయ్యి తిరిగిన రచయిత్రులు లేరు కనుక (నిఝంగా నిజమండీ.  ఒట్టు.  ఎందుకంటే అందరి చేతులూ మామూలుగానే వున్నాయి), మా ఈ ప్రయత్నాన్ని ఆదరించి, సద్విమర్శలు చేసి ప్రోత్సహిస్తారని ఆశిస్తున్నాను.

ఈ మాలికలో ఆరవ భాగం శ్రీమతి రుక్మిణీదేవిగారు   వ్రాశారు.  కధ సాగటంకోసం ఒకసారి ఆ భాకం గుర్తు చేసుకుందామా?

*********************************************************************

ఇంక ఇప్పుడు నా కధనం చిత్తగించి  సద్విమర్శలు అందించండి..........


“ఏంటి లక్ష్మమ్మా?  నిన్న రాలేదు, ఇవాళ ఇంత ఆలస్యమా  ఎందుకిట్లా చేస్తున్నావు?” అంటూ బయటకొచ్చిన సరోజిని, పెరట్లో మామిడి చెట్టుకి ఆనుకుని నిస్సత్తువగా కూలబడి వున్న లక్ష్మమ్మని చూసి  కంగారు పడింది.

 లక్ష్మమ్మకి 35 ఏళ్ళుంటాయి.  స్కూల్లో చదువుకోలేదుకానీ, ఆ వయసుకే ప్రపంచాన్ని చాలానే చదివింది.  తెలివితేటలుతోపాటు ధైర్యం కలది. చదువుకునివుంటే మంచి పొజిషన్ లో వుండేది.  కానీ లక్ష్మమ్మ దురదృష్టం కలిమి పేరుకి మాత్రమే పరిమితమైంది.  అందుకే చదువుకునే అవకాశం రాలేదు.    మొగుడు తాగుబోతు.   లక్ష్మమ్మకి దడిసి రోజూ తాగకపోయినా, పెళ్ళాంమాట ఎందుకు వినాలి అనే పురుషాహంకారం నెత్తికెక్కినప్పుడు మాత్రం పూర్తిగా తాగేసి వచ్చి లక్ష్మమ్మనీ, అడ్డొస్తే పిల్లల్నీ చావగొడతాడు.  మర్నాడు వాళ్ళని చుట్టేసి రాత్రి వాళ్ళని కొట్టినందుకు తనని  తనే తిట్టుకుంటూ వాపోతాడు.   

ఇద్దరు ఆడపిల్లలు పుట్టగానే మొగుడికి తెలియకుండానే ఆపరేషన్ చేయించుకుని, అతని చేతిలో తన్నులు తిన్నది లక్ష్మమ్మ.  అదేమిటే చెప్పి చేయించుకోకపోయినావా అని    నారాయణమ్మగారంటే, ఆడికి చెబితే సేయించుకోనీడమ్మగారూ.  నా బిడ్డల బతుకూ నా బతుకుమల్లే కాకుండా వుండాలంటే ఆళ్ళని చదించుకోవాల. ఇట్టా బిడ్డల్ని కంటూ పోతే ఆళ్ళని చదించడంకాదుగదా తిండికూడా ఎట్టలేం. అని తను చేసిన పనే సరైనదని నిర్ధారించుకుంది.  మొగుడి తాగుడు మాన్పించటానికి నానా విధాలా ప్రయత్నిస్తూంటుంది.

అలాగే పిల్లల్ని చదివించటానికీ నానా అవస్తా పడుతుంది.  ఫీజులు కట్టలేనప్పుడు పిల్లలు కొన్నాళ్ళు స్కూలుకెళ్ళకపోతే కలవరపడిపోతుంది.  వాళ్ళదగ్గరా, వీళ్ళదగ్గరా అప్పుచేసి ఎలాగోలా ఫీజు కడుతుంది.  ఈ అవస్తలు చూసే సరోజిని జాలిపడి కొంత సహాయం చేద్దామనుకుంది.

నారాయణమ్మగారొకసారంది వుండబట్టలేక.  మీలో మారు మనువులున్నాయికదా.  ఇన్నవస్ధలు పడేబదులు వీడ్ని వదిలేసి నీ దోవ నువ్వు చూసుకోవచ్చుకదా అని.

“ఏ రాయయితేనేమమ్మా పళ్ళూడగొట్టుకోటానికి.  బిడ్డల్నిడిసి పోలేను కదమ్మా.  అయినా వేరేవాడు సరిగ్గుంటాడని, నా బిడ్డల్ని సరిగ్గా చూసుకుంటాడనీ నమ్మకమేటమ్మా.  ఎవురయినా మమ్మల్నందర్నీ కూకోబెట్టి కూడెట్టలేరుకదా.  నా కట్టం నాకు తప్పదు.  అయినా ఈడి మనసూ మంచిదేనమ్మా.  నేనన్నా, పిల్లలన్నా పేణం.  ఆ తాగుడే ముంచేత్తోంది.”

 “ఈ గవర్నెమెంటోళ్ళేమో పేదోళ్ళకి ఇళ్ళివ్వలేరు, పని చూపించలేరుగానీ,  ఇయ్యన్నీ మరిసిపోడానికి బాగా తాగండని ఏడబడితే ఆడ  ఈ దుకాణాలు మాత్తరం తెరుత్తున్నారు.  అసలు నన్నుగాని ఓ పాలి   ఆ మినిట్టరుని చేత్తే ఈళ్ళందరి సంగతీ తేల్చిపారేత్తాను.” 

ఆరోజు లక్ష్మమ్మ  ఆలోచనలకీ, ఆవేశానికీ అబ్బురపడ్డారందరూ.  ఏ చదువూ రానిదైనా, మనిషిని మనషిలా స్వీకరించాలనీ, ఏవో లోపాలున్నంతమాత్రాన ప్రేమాభిమానాలు కుంటుపడవనీ లక్ష్మమ్మ తన భాషలో ఎంత చక్కగా చెప్పింది అనుకున్నారు నారాయణమ్మ.

మధ్య తరగతి కుటుంబాల్లో సాధారణంగా  ఒక మనిషి సంపాదిస్తే కుటుంబమంతా ఆ మనిషిమీద ఆధారపడుతుంది.  కుటుంబంలో అవకాశంవున్నవాళ్ళు ఎవరికి తగ్గట్లు వాళ్ళు కుటుంబానికి చేయూతనివ్వాలనికూడా ఎంత చక్కగా అర్ధం చేసుకుంది లక్ష్మమ్మ అనుకుంది సరోజిని.

ప్రజల అవసరాలు పట్టించుకోని ప్రభుత్వాన్నికూడా వదలలేదు.  అసలు ఇలాంటివాళ్ళు ఎదురు తిరిగి నిలేస్తే ప్రభుత్వాల గతేమిటని అనుకుంది అనిత.

అలాంటి లక్ష్మమ్మ అసలు ప్రాణమే లేనట్లుగా పెరట్లో మామిడి చెట్టుకానుకుని కూలబడివుంది.  ముఖంలో కళ లేదు.  ఒంటిమీద బట్ట వుందో లేదో ధ్యాస వున్నట్లు లేదు.  చూపులు ఏ శూన్యాన్ని చూస్తున్నాయో తెలియటంలేదు.  లక్ష్మమ్మని ఆ పరిస్ధితుల్లో చూసి ఆశ్చర్యమో, భయమో తెలియని గగుర్పాటుకి లోనయింది సరోజిని.  అనాలోచితంగా లక్ష్మమ్మ దగ్గరకెళ్ళి భుజాలు పట్టి కుదుపుతూ,  “లక్ష్మమ్మా, ఏమయింది  ఎందుకలా వున్నావ్?”  అని అడిగింది.  ఓదార్పుగా లక్ష్మమ్మ తల, చెదరిన బట్టలు సవరించింది.  నారాయణమ్మగారు తన మడిని మంటకలిపే ఈ పనులన్నీ చూస్తున్నా,  ఆవిడలోని మానవత్వం లక్ష్మమ్మ  పరిస్ధితి చూసి ఆందోళన చెందింది. 

“ఏంటి లక్ష్మమ్మా  ఏమయింది”  అంటూ కంగారుగా ఆవిడకూడ  లక్ష్మమ్మ దగ్గరకొచ్చేసింది.  వాళ్ళ వెనకాలే ఇంట్లో వాళ్ళూ, సుభద్రా.  లక్ష్మమ్మ పరిస్ధితి చూసి అనిత వెళ్ళి గ్లాసుతో మంచినీళ్ళు తెచ్చిచ్చింది.  లక్ష్మమ్మ వాటిని తాగకుండా తోసేస్తుంటే సరోజిని, అనిత కొంచెం నీళ్ళు బలవంతాన తాగించారు.   

నీళ్ళు తాగేసరికి లక్ష్మమ్మ లోపలున్న ఆవేదనంతా ఉబకి ఉబికి ఏడుపు రూపంలో తన్నుకొచ్చింది.  వెక్కిళ్ళ మధ్య చెప్పింది...  “జానక్కన్నాయం జరిగిపోనాది తల్లీ.  దాని బతుకు బుగ్గయి పోవాల్సిందేనమ్మా ఆ పోరగాళ్ళు రాకపోతే.  ఇట్టా అయిందేటమ్మా  నేనేంసేతును నేనేమయిపోవాల”.....ఏడుస్తూనే వున్నది.

“ఏం జరిగింది లక్ష్మమ్మా?  కొంచెం అర్ధమయ్యేటట్లు చెప్పు”   సరోజిని నెమ్మదిగాసముదాయిస్తున్నట్లు అడిగితే లక్ష్మమ్మ వెక్కెక్కి ఏడుస్తూనే చెప్పింది.  “జానకిని ఎవురో ఇద్దరు పోరగాళ్ళు లాక్కెళ్ళారంటమ్మా.  నిన్న పొద్దున్న మీ ఇంటికని వచ్చింది.  దోవలో ఆళ్ళెవరో సూసి ఆటోలో లాక్కుపోయారంట.   ఆ చివుర ఇళ్ళు కడుతూ ఆపేశారుకదా ఆడకి తీసుకెళ్ళి పాడు చెయ్యబోతుంటో ఇది బయపడి అరిచిందంట. ఆటోలో పోతూకూడా ఇది అరుస్తూ, చెయ్యూపుతూనే వుందట. కాలేజి పోరగాళ్ళు టూషన్ కెళ్తా సూసారంట.  ఆళ్ళు లగెత్తి ఆళ్ళని బెదరగొట్టి పారదోలారంట.  దీనికి దెబ్బలు తగిలి, ఆగోరానికి సుహ తప్పి పడిపోతే ఆస్పత్రికి తీసుకెళ్ళారంట.  తెలివొచ్చాక మాకు కబురెడితే ఎల్లాం.”

ఆ మాటలు వినగానే దిగ్భ్రాంతి చెందారు అంతా.  అమ్మో...లేచిన వేళ బాగుంది!  ఎంత ఘోరం తప్పింది!!  అంత చిన్నపిల్ల....పట్టుమని పదేళ్ళన్నా వుంటాయో వుండవో... ఎప్పుడన్నా లక్ష్మమ్మ రాలేక పనికి పంపిస్తే  తమ ఇంట్లే పని చేయించుకోవటానికే బాధపడతారు.  అంత చిన్న పిల్ల.  ఎవరికి ఎలా ప్రాణం ఒప్పింది.  అసలు మనుషులేనా వాళ్ళు...తలా ఒక మాట.

“బాధ పడకు లక్ష్మమ్మా, జానకెలా వుంది  దానికేం కాలేదుకదా ఎక్కడుంది ఇప్పుడు  ఒక్కదాన్నీ వదిలేసి వచ్చావా?”  మళ్ళీ తలా ఒక ప్రశ్నా వేశారు.

“ఆసుపత్రిలోనే వుందమ్మా.  మా ఆయన్ని కూసోపెట్టొచ్చా.  పిల్లకే గోరం జరగలేదు.  కానీ  బాగా బయపడ్డది.  బెంబేలెత్తిపోతున్నది.  మాకు కాల్సెయ్యాడటంలా.   దేవుళ్ళల్లా ఆ కాలేజీ టూడెంట్లొచ్చి కాపాడారు.  లేకపోతే పిల్లేమయిపోయుండేదో.  నా పిల్ల నాకు దక్కేదికాదు దేవుడో....”

“మరి ఆ స్టూడెంట్స్ వాళ్ళని పట్టుకోలేదా అట్లాంటి వాళ్ళని వూరికే వదలకూడదు.”   అనిత ఆవేశం లక్ష్మమ్మ బాధలో వుందని కూడా చూడకుండా ఆరా తీసింది.

“లేదమ్మా.  ఈళ్ళయిదారుగురుండి ఒక్కురుకున ఎల్లేసరికి ఆళ్ళు లగెత్తారంట.  ఈళ్ళేంచెయ్యలేక పిల్లనాసుపత్రిలో చేర్చాలని తీసుకొచ్చారంట.  ఒక్కడు దొరికినా ఆడి పేనాలు తీసుండేదాన్ని.  సచ్చినోళ్ళు.  ఆడపిల్లలతో ఆడుకుంటారా.  ఆళ్ళిళ్ళల్లో ఆడోళ్ళుండరా.  ఆళ్ళ అక్క సెల్లెల్కిలా అయితే.  అప్పుడు తెలస్తాది మా బాద.    కాలేజీ టూడెంట్లు అల్లరి సేత్తారనుకుంటాంకానీ, సూడండమ్మా, ఆళ్ళే మా జానకిని కాపాడారు.  దైర్నం సెప్పి ఆసుపత్రికి తీసుకెళ్ళి వైద్దెం సేయించారు.  ఏ తల్లులు కన్న బిడ్డలో ఆళ్ళని సల్లటేల తల్సుకోవాల.”  కళ్ళు తుడుచుకుంది.

“అసలు ఎవురన్నా ఆపదలోవుంటే ఆళ్ళనాదుకోటానికి ఇలా నలుగురొక్కసారెల్తే  ఎవరైనా ఏం సెయ్యగలరమ్మా.  ఎవరికోల్లు మాకెందుకులే అనుకుంటే ఈ గోరాలిట్టాగే సాగుతాయి.  ఆళ్ళు నలుగురెళ్ళారు కనుక జానకి బతికి బయటపడ్డది.  లేపోతే బిడ్డేమయిపోయుండేది.”

నిజమే.  ఆ రోజు  ఆ రౌడీ ఉత్తేజ్ వాళ్ళు అడ్డుకున్నప్పుడు లక్ష్మమ్మ తెలిసో తెలియకో దూరంనుంచే తనని పలకరించి ఆ సమయంలో తన ఆపద తప్పించిన సంగతి గుర్తొచ్చింది అనితకి.  అప్పుడు లక్ష్మమ్మ పరకరించకపోతే ఇంకెంత గోల చేసేవాళ్ళో ఆ వెధవలు.

“అమ్మా నేనోపాలి మీకు సెప్పి ఎల్దామనొచ్చా.  ఇంకపోతా.  కొంచెం డబ్బుకూడా కావాలమ్మా  ఓ రెండు రోజులు పనికి రాను.”  లక్ష్మమ్మ లేవబోయింది. 

“పద లక్ష్మమ్మా నేనూ వస్తాను.  డాక్టరుగారితో ఒకసారి మాట్లాడి వస్తాను.  హాస్పటల్ బిల్లు కూడా మేము కడతాంలే.  నువ్వేం కంగారు పడకు.”  తనూ బయల్దేరారు  శ్రీరాంగారు.

“మీది శానా గొప్ప మనసయ్యా.  దండాలు బాబయ్యా.”  అంత కష్టంలోనూ కృతజ్ఞతలు తెలపటం మర్చిపోలేదు లక్ష్మమ్మ.

“అయ్యా, నేనోమాట సెబుతా  పనిమడిసి సెప్పేదేటని తోసెయ్యకండేం.”   ఒక్క క్షణం శ్రీరాంగారిని చూసి మళ్ళీ అన్నది లక్ష్మమ్మ.   “అనితమ్మగారి ఇషయం కూడా ఆల్ల కాలేజీ టూడెంట్లకి సెబితే ఆల్లంతా కలిసి ఆ రౌడీల బరతం పట్టరా.  ఇట్టాంటిషయాల్లో ఏమన్నా చేత్తే టూడెంటు కుర్రాళ్ళే సెయ్యాల.  ఇంటో అయితే బిడ్డలిషయం మనం జాగర్త తీసుకుంటాం.  మరి కాలేజీలో  అక్కడున్న టీచర్లూ, ఇంకా మిగతా పిల్లలూ సూసుకోవాలగదయ్యా. “  మామూలుగా అయితే శ్రీరాంగారున్న గదిలోకి కూడారాని లక్ష్మమ్మ ఆ సమయంలో ప్రపంచంలో అన్యాయాన్ని అంతంచేయటానికి తపించే అపర కాళిలా వుంది.


“వాళ్ళూ చిన్న పిల్లలు.  వాళ్ళల్లోనూ అనేక రకాలుంటారు.  ఎవరో కొంతమంది ముందుకు రావచ్చు కానీ, చదువుకునే పిల్లలమీద బాధ్యతలు పెట్టకూడదమ్మా.”

“ఇదే పెద్ద బాద్యతయ్యా.  ఎవురన్నా అల్లరి చేస్తావుంటే కాత్త బెదరగొట్టటం అంతేగందా.  అదీ కాలేజీ చుట్టుపక్కల.  ఇంటో మీరే చూసుకుంటారుగదా.”

“సరే దాని సంగతి తర్వాత ఆలోచిద్దాంలే.  ముందు పద.  జానకిని చూద్దాం.    అయినా ఇలాంటి చిన్న చిన్న విషయాలు గోల చేసుకోకూడదమ్మా.  అనిత పెళ్ళికావాల్సిన పిల్ల.   నలుగురినోళ్ళల్లో పడితే మంచిదికాదు.”   ఇంక లక్ష్మమ్మకు మాట్లాడే అవకాశం ఇవ్వకుండా బయటకు నడిచారు శ్రీరాం గారు.

“ఏంటో ఈ సదూకున్నోళ్ళు” బుఱ్ఱ గోక్కుంటూ వెనకే బయల్దేరింది లక్ష్మమ్మ.


మరి తరువాత భాగం కోసం వచ్చే బుధవారందాకా ఆగక తప్పదు మరి.
 8వభాగం శ్రీమతి లక్ష్మీరాఘవగారు పోస్టు చేశారు చూడండి.







    

6 comments

Sunday, January 9, 2011

సంక్రాంతి సమయంలో నువ్వుల వాయనం తీసుకోవచ్చా?

Sunday, January 9, 2011


 జ్యోతిష్య శాస్త్ర ప్రకారం పౌర్ణమి రోజున పుష్యమీ నక్షత్రం వున్న మాసాన్ని పుష్యమాసమంటారు.  ఇది శని నక్షత్రం.  శని ఆయుఃకారకుడు.  ఈ కాలంలో నువ్వులు తినమంటారు.  ఎందుకు?  సకల రోగాలను పోగొట్టే శక్తి తిలలకున్నది.  ఇది హేమంత ఋతువు.  ఈ ఋతువులో చలి ఎక్కువ వుంటుంది.  శరీరంలో శీతం ఎక్కువ.  ఒళ్ళు నొప్పులు, కఫం, జలుబు, దగ్గు, వగైరా చలి వలన వచ్చే రోగాలు కూడా ఎక్కువే.   శరీరంలో తగ్గిన ఉష్ణోగ్రత తిరిగి రావాలంటే నువ్వులను తినాలి.  రోగాన్ని తీసేసి, శరీరంలో ఉష్ణాన్ని పెంచే శక్తి నువ్వులకున్నది. 

శాస్త్ర ప్రకారం ఈ మాసంలో నువ్వుల పిండిని ఒంటికి రాసుకుని స్నానం చెయ్యాలి.  దానివలన శరీరంలో రక్త ప్రసరణ సరిగ్గా జరుగుతుంది.  నువ్వులని తినాలి, వాయనమివ్వాలి, దానం చెయ్యాలి, తర్పణాలు వదలాలి. 

కొంతమందికి ఈ సంక్రాంతి సమయంలో నువ్వుల వుండలు, నువ్వుల జీడీలు, నెగుళ్ళు అని నువ్వులు, పంచదార వగైరా కలిపి అందరికీ పంచుతారు.  నువ్వులు, తీపి తిని  నువ్వు నూరేళ్ళు జీవించమని, తీపి తిని తియ్యగా మాట్లాడమని,  సంతోషంగా ఆరోగ్యంగా వుండమనీ బంధు మిత్రులకి శుభాకాంక్షలు తెలియజేస్తారు.   తెల్లనువ్వులు లక్ష్మీప్రదమైనవి.  సంక్రాంతి సమయంలో వీటిలో లక్ష్మి నివసిస్తుందంటారు.  వీటిని ఎవరైనా పంచిపెడితే తీసుకోవటంలో తప్పులేదు.  కేవలం నల్ల నువ్వులు శని సంకేతాలు.  నల్ల నువ్వులు తీసుకోకూడదు.

(జీ తెలుగు ప్రసారం చేసిన గోపురం ఆధారంగా)



1 comments