Monday, September 15, 2008

Monday, September 15, 2008
నిరసన

ఆకాశం దీపావళి చేసుకుంటోంది
మెరుపుల మతాబులు వెలిగిస్తోంది
ఉరుముల పటాసులు పేలుస్తోంది
పిడుగుల బాంబులు కురిపిస్తోంది
ఆ గర్జనలకి కూడా చుక్క రాల్చని
పొగమేఘాలను చూసి
నీరసంగా నిట్టూర్పు విడుస్తోంది
వుండి వుండి గర్జనల గొణుగులతో
తన నిరసనను తెలియజేస్తోంది
ప్రకృతిని నాశనం చేసి
బ్రతుకు నరకం చేసుకునే
తన బిడ్డల ఆలోచనలకు
పదును పెట్టాలని
పదే పదే మెరుపు తీగల సందేశాలు
పంపిస్తోంది
ఆకాశం దీపావళి చేసుకుంటోంది.

ఈ కవిత రంజని (ఎ.జి. ఆఫీసు సాహితీ పత్రిక – సర్వధారి ఉగాది – 2008) సంచిక లో ప్రచురింపబడింది)

1 comments

Monday, August 18, 2008

శూన్య ప్రపంచం .... కవిత

Monday, August 18, 2008
శూన్య ప్రపంచం

పిల్లలనెత్తుకుని లాలించి
బొజ్జనింపి బజ్జోపెట్టి
ఇద్దరు నలుగురైన లోకం
అదొక మురిపాల ప్రపంచం
బళ్ళో వేసి బాక్సులు కట్టి
హోమ్ వర్కులు చేయించి
పరీక్షలకి చదివించి
అమ్మయ్యో తీరికెక్కడిది
అదొక హడావిడి ప్రపంచం
పెర్సంటేజ్లూ కాలేజీలూ
యమ్ సెట్టు ప్రిపరేషన్
క్షణక్షణం ఆందోళన
అదొక పోరాట ప్రపంచం
రెక్కలొచ్చి పిల్లలెగిరి
నలుగురు యిద్దరయిన వేళ
అన్నీ వుండి ఏమీలేని సమయం
అదొక శూన్య ప్రపంచం!!


(నా ఈ కవిత సెప్టెంబరు 2002 ఆంధ్రభూమి మాస పత్రిక లో ప్రచురింపబడింది.)

2 comments