Thursday, November 26, 2009

తీర్ధాన్ని మంత్ర జలం అంటారా?

Thursday, November 26, 2009

తీర్ధానికి మంత్రజలం అనే పేరుకూడా వుందా?

అవును. మనం అభిషేకం చేసినప్పుడు, పంచామృతాలతో, శుధ్ధోదకంతో దేవతా మూర్తులకు స్నానం చేయించినప్పుడు దానిని తీర్ధంగా తీసుకుంటాము. పూజ మొదలు పెట్టేటప్పుడు ఓం కేశవాయస్వాహా, ఓం నారాయణ స్వాహా, ఓం మాధవాయస్వాహా అని మూడుసార్లు ఆచమనం చేస్తాము.. కొందరు నిష్ణాతులు భోజనం ముందు కూడా గాయత్రీ మంత్రంతో ఔపోసన పడతారు. వీటివెనకాల ఆధ్యాత్మికతేనా లేక శాస్త్రీయత కూడా వున్నదా? వుంటే అది ఏమిటి?

పంచ భూతాలలో జలం ఒకటి. ఈ జలానికి శబ్దగ్రాహక శక్తి వున్నది. మంత్ర జపం చేస్తూ చేసే ఆభిషేకాలు, పూజాదికాలు చేస్తూ సమర్పించే జలం, ఆ మంత్రాలలో వుండే శక్తిని గ్రహిస్తుంది. దానితో ఆ జలం మంత్ర జలం అవుతుంది.

మన పూర్వీకుల ద్వారా మనకిన్ని విషయాలు తెలిసినా వాటిని సరిగ్గా ఆచరించటానికి ఉత్సాహం చూపించం. ఆధ్యాత్మికంగా నమ్మేవాళ్ళు కొన్ని ఆచరిస్తారు, లేనివారు కొట్టి పారేసి మన సంపదను మనమే తోసిరాజనుకుంటున్నాము. కానీ ఈ విషయాలను పరిశీలించి, పరిశోధించి నిజానిజాలు కనుగొనే ప్రయత్నాలు చెయ్యము.

కానీ పాశ్తాత్యులు జలానికి శబ్దగ్రాహక శక్తి వున్నదని పరిశోధనలు చేసి నిరూపించటమేకాదు వాటి చిత్రాలను ఇంటర్నెట్ లో కూడా పెట్టారు. ఆ చిత్రాలు చూసిన వారెవరన్నా ఇక్కడ వాటి లింకు ఇస్తే అందరూ చూస్తారు.

పాశ్చాత్యులు మంత్రాలతో ప్రయోగాలు చెయ్యలేదుకానీ నీటికున్న శబ్దగ్రాహక శక్తి గురించి మాత్రమే ప్రయోగాలు చేశారు. వివిధ శబ్దాలు విన్నప్పుడు నీటి కణాలలో వచ్చే మార్పులను చిత్రాలు తీశారు. జానపద సంగీతం వినిపిస్తున్నప్పుడు నీటి కణంలో తెల్ల మందారంలాంటి ఆకారం ఏర్పడింది. అలాగే ఫేర్ వెల్, గుడ్ బై చెబుతున్నప్పుడు నీటిలో వుండే పరమాణువులన్నీ విడిపోయినట్లు కనిపించాయి. ప్రార్ధన ముందు ఒక విధంగా వున్న పదార్ధం తర్వాత షట్కోణాకారంగా వజ్రంలా మెరుస్తూ కనిపించిందిట. ఒక చిత్రంలో నిన్ను చంపుతానంటూ చంపటానికి వస్తున్నట్లు ఒక భావం కనిపించిందట. ఆ జలం గ్రహించిన భావం అదన్నమాట. ఇన్ని పరిశోధనలు చేసి వారు నిరూపించినదీ, ఏ పరిశోధనలూ తెలియని కాలంలో మన పూర్వీకులు చెప్పిందీ, చేసిందీ ఒకటే.

ఇప్పుడు మనం తెలుసుకున్నదేమిటంటే మన ఋషులు చెప్పిన మాటలు అక్షర సత్యాలు. ఆధ్యాత్మికంగానే కాక, శాస్త్రీయంగా కూడా వాటి విలువ అపారం. మంత్ర పారాయణ ప్రభావం కలిగిన జలాన్ని తీర్ధంగా తీసుకోవటంవల్ల జలం గ్రహించిన ఆ మంత్ర శక్తి మన శరీరంలోకి వెళ్ళి మన శరీరానికి మేలు జరుగుతుంది.

తీర్ధం విలువ తెలుసుకున్నారుకదా...ఇంక ఆచరణలో చూపించండి మరి.

(జీ తెలుగు ప్రసారం చేసిన గోపురం ఆధారంగా)


3 comments

Wednesday, November 25, 2009

మౌనవ్రతం పాటించటంవల్ల లాభం వుందా?

Wednesday, November 25, 2009

మౌనవ్రతం ఎందుకు చేస్తారు?

మునీశ్వరులు ఎక్కువగా మౌన వ్రతం పాటిస్తారు. మౌన వ్రతం పాటించేవారు కనుకే వారికి ముని అనే పేరు వచ్చిది. ఇప్పటికీ చాలామంది చాతుర్మాస దీక్షలోనో లేక వేరో ఏదో కొన్నిరోజులో లేకపోతే ఫలానా వారమనో మౌన వ్రతాన్ని పాటిస్తున్నారు. ఇది ఎందుకు చెయ్యాలి? దీని వల్ల ఉపయోగం ఏమైనా వుంటుందా?

తప్పకుండా వుంటుంది. ఆరోగ్యపరంగా, ఆధ్యాత్మికంగా మౌనవ్రతం మనిషికి ఎంతో మేలు చేస్తుంది. ఆధ్యాత్మికంగా చూస్తే మౌనవ్రతం వల్ల వాక్శుధ్ది, వాక్ శక్తి పెరుగుతాయి. ఆరోగ్యపరంగా చూస్తే మనని మనం ప్రశాంతంగా వుంచుకోవటానికీ, కోపాన్ని అదుపులో పెట్టుకోవటానికి ఈ మౌనవ్రతం ఉపయోగపడుతుంది. సిధ్ధులు వాక్ శక్తిని పెంచుకోవటానికి, వాళ్ళని వాళ్ళు ప్రశాంతంగా వుంచుకోవటానికి ఎక్కువగా మౌనవ్రతాన్ని పాటిస్తారు.

మనకి వచ్చే రోగాలు చాలామటుకు మన ఆవేశాలతో, కోపంతో వస్తాయి. వాటిని నియంత్రించుకుంటే మన ఆరోగ్యం బాగుంటుంది. మనకి ఎదుటివారిమీద వచ్చిన కోపాన్ని చూపించకుండా కొంత సంయమనాన్ని పాటిస్తే గొడవలు పెరగటం, అనవసరమైన పోట్లాటలు, అశాంతి వుండవు. సమస్యలు తేలిగ్గా పరిష్కారమవుతాయి. దీనిమూలంగా సామాజికంగా ఉపయోగం వున్నట్లేకదా. ఈ కలికాలంలో మనకి అంత వాక్శుధ్ధి అక్కరలేకపోవచ్చు...మనం ఏమైనా అంటే వెంటనే అది జరిగేంత వాక్శక్తి మన వాక్కుకి వుండాల్సిన అవసరం కూడా వుండకపోవచ్చు. కానీ ఈ టెన్షన్ల ప్రపంచంలో మన ఆరోగ్యం కాపాడుకోవాల్సిన అవసరం మనకి చాలావుంది. అంటే కోపం వచ్చినప్పుడు మాట తూలకుండా మనల్ని మనం కంట్రోల్ చేసుకోవాల్సిన అవసరం చాలావుంది. దానికోసం మౌనవ్రతం పాటించటం చాలా అవసరం. కనీసం కోపం వచ్చినప్పుడు మాట్లాడకుండా వుండటం అలవాటు చేసుకున్నా చాలు. ఏమంటారు?

(జీ తెలుగు ప్రసారం చేసిన గోపురం కార్యక్రమం ఆధారంగా).


7 comments

Monday, November 23, 2009

ఆశీర్వచనం సమయంలో అక్షింతలు ఎందుకు చల్లుతారు?

Monday, November 23, 2009

ఆశీర్వచనం సమయంలో తలమీద అక్షింతలు ఎందుకు చల్లుతారు?

సాధారణంగా శిశువు జన్మించినప్పుడు పురిటి స్నానం రోజునుంచీ ప్రతి శుభ సందర్బంలోనూ ఆశీర్వదించినప్పుడు తలమీద అక్షింతలు జల్లుతారు. ఆశీర్వచనానికీ, అక్షింతలకీ ఎమీటి సంబంధం? అక్షింతలే ఎందుకు చల్లాలి వేరే ధాన్యాలు వున్నాయికదా వాటిని చల్లవచ్చుకదా? మరి పసుపుతో కలిపిన బియ్యమే ఎందుకు చల్లాలి? బియ్యం చంద్రుడికి కారకం. చంద్రుడు మనస్సుకి కారకుడు. అంటే మనస్ఫూర్తిగా ఇచ్చే ఆశీర్వచనానికి చిహ్నమన్నమాట. బియ్యంలో కలిపే పసుపు గురువుకి కారకం. గురువు శుభ గ్రహం. ఆయనకి సంకేతంగా, శుబానికి సంకేతంగా పసుపు రంగు కలిపిన అక్షింతలను మంత్రపూర్వకంగా తలమీద చల్లుతారు. మంత్రం అంటే క్షయం లేనటువంటిది. అకారంనుంచి క్షకారం దాకా వున్న అక్షరాలతో, బీజాక్షరాలతో కూడిన మంత్రానికి శక్తి వుంటుంది. మంత్రాన్ని చదివేటప్పుడి చేతితో పట్టుకున్న అక్షింతలకి కూడా ఆ శక్తి వస్తుంది. క్షయంలేని మంత్రాలను, క్షయంలేని అక్షింతలు పట్టుకుని చదివి, అవి ఎవరి తలపై వేస్తారో వారుకూడా క్షయం లేకుండా ఆభివృధ్ధి చెందాలని ఆశీర్వదిస్తారు. ఆలాంటి ఆశీర్వచనానికి శక్తి వుంటుంది.

(జీ తెలుగులో ప్రసారం చేసిన గోపురం ఆధారంగా).


0 comments

Saturday, November 21, 2009

గయలో ఇష్టమైన పదార్ధాలు వదలాలంటారు, ఎందుకు?

Saturday, November 21, 2009

గయలో ఇష్టమైన పదార్ధాలను వదలాలంటారు. ఎందుకు?

శాస్త్రం ప్రకారం, మన జీవితంలోధర్మంతో అర్ధ, కామాల్ని జయించిమోక్షాన్ని సాధించాలి. దానికోసం కామక్రోధ మద, మాత్సర్యాలను వదలాలని. ఇవ్వన్నీ వదిలేసి నిష్కల్మషంగాజీవించండి అంటే...ఎంతమంది వింటారో, .ఏ మవుతుందో మీకూ తెలుసు. ఇదికలికాలం. అందుకే, పెద్దలు ఈఅహంకార, మద, మాత్సర్యాలకిమనల్ని దూరం చేసే ప్రయత్నంలోదానికి నాందిగా చెప్పిందే ఈ గయలోవిష్ణు పాదాల దగ్గర ఇష్టమైనపదార్ధాన్ని వదిలెయ్యటం.

ఇలా వదిలేసినవారు మళ్ళీ తమ జీవితంలో ఆ పదార్ధాన్ని తినరు. అంటే క్రమ శిక్షణతో మన ఇష్టా ఇష్టాలను నియంత్రించుకోవటం మొదలు పెడతారన్నమాట. ఒక విషయంలో మొదలైన నియమాలు క్రమేపీ జీవితంలో మిగతా విషయాలకి కూడా పాకుతాయి. దానితో నియమబధ్ధమైన జీవితం మొదలవుతుంది. మనిషి తను బాగా బ్రతకటమే కాదు, ఎదుటివారికి కూడా హాని కలగకుండా వుండాలని ఆలోచిస్తాడు. అంటే సమాజంలో మంచి పెరుగుతుంది. ఈ కలికాలంలో మనం నిబధ్ధతగా వుంటే, మనకి మనం మేలు చేసుకుని ఎదుటివారికీ మేలు చేస్తే అదే మోక్షం. నిజానికి మన మంచిని మనం చూసుకుని ఎదుటివాళ్ళ మంచి కూడా కాంక్షిస్తే సమాజం దానంతటదే బాగుపడదా చెప్పండి.

మూఢ నమ్మకాలు చొప్పిస్తేగానీ మాట వినని వాళ్ళకోసం పెద్దలు వాటిని చెప్పినా, వాటి వెనక సమాజ శ్రేయస్సుకోసం వారు ఆలోచించిన తీరు విశ్లేషించి వారి ఆలోచనా ధోరణిని అర్ధం చేసుకుని ఆచరించగలిగితే వచ్చే మార్పుకు అంతా స్వాగతం పలకాల్సిందే.


(జీ టీవీ ప్రసారం చేసిన గోపురం కార్యక్రమం ఆధారంగా)


0 comments

Friday, November 20, 2009

కార్తీకమాస వనభోజనాలు

Friday, November 20, 2009
శ్రీ మహాకాళీ సమేత శ్రీ వీరభద్రస్వామి ఆలయం, బొంతపల్లి
గుత్తి వంకాయ చూపిస్తోంది ఉష (ఎడమనుంచి మూడు)
లలితా సహస్రనామ పారాయణ

ఏడుపాయలు వనదుర్గాదేవి ఆలయంలో కార్తీక దీపాలు




ఏడుపాయలు వనదుర్గాదేవి

ఏడుపాయలు వనదుర్గాదేవి ఆలయం ముందు
సామాను సర్దండి


కార్తీక మాస వన భోజనాలు

ఈ ఏడాది కార్తీకమాసం చివరిలో వనభోజనం అవకాశం వచ్చింది. ఏ.జీ. ఆఫీసు మిత్రురాళ్ళు శ్రీమతులు శేషలక్ష్మి, పద్మావతి, ఉష, భారతి, వరలక్ష్మీప్రసన్న కుమారి, వగైరాల ఆధ్వర్యంలో ఎనభైమంది స్నేహితురాళ్ళం 14-11-2009 న ఏడుపాయలు వెళ్ళాం. అభ్భ...అంతమంది స్నేహితురాళ్ళు కలిస్తే ఎంత సందడోకదా. అందుకే ఆలస్యమయినా ఆ సంగతులు మీకోసం..

ఉదయం 9-30 కి ఎనభైమంది ఏ.జీ. ఆఫీసు మహిళా ఉద్యోగినులతో రెండు బస్సులు బయల్దేరాయి ఏడుపాయలలోని వనదుర్గా ఆలయ దర్శనానికి. ఎంత సందడో ఎంత హడావిడో. వచ్చినవారిని సరి చూసుకునే వాళ్ళు కొందరయితే, సామాను చేరవేసేవారు కొందరు. అందరూ అందర్నీ పలకరించే వాళ్ళే. చాలా రోజుల తర్వాత ఆత్మీయులని చూసిన సంతోషం మాలాంటి రిటైరయినవారిది. ఎంత హడావిడి చేశామో చూడండి.


బస్సులోనే ఉదయం అల్పహారం ఇడ్లీ, వడ, కొబ్బరి, అల్లం చట్నీలతో కానిచ్చాం. మా మొదటి మజిలీ ఉదయం 10-30 కి బొంతపల్లి శ్రీ మహాకాళీ సమేత శ్రీ వీరభద్ర స్వామి దేవాలయం.


దర్శనానంతరం తేనీరు సేవించి మళ్ళీ బయల్దేరాము. మధ్యాహ్నం ఒంటిగంట ప్రాంతంలో ఏడుపాయలు చేరాం. అమ్మవారి దర్శనానంతరం ఆలయంలో అందరం కలసి దీపారాధన, లలితా సహస్రనామ పారాయణ. తర్వాత కొంతసేపు కొండల్లో విహారం అయ్యేసరికి ఆకళ్ళు వెయ్యటం మొదలయింది. గుడికి కొంత దూరంలో రోడ్డుప్రక్కనే ఒక చెట్టు కింద వన భోజనాలు. పాలకూర పప్పు, గుత్తి వంకాయ కూర, కేబేజ్ కూర, బెండకాయ వేపుడు, సాంబారు, టమేటా చట్నీ, దోసావకాయ, పులిహోర, పెరుగు కేటరింగ్ వాళ్ళ స్పెషల్స్ అయితే శ్రీమతి రమాదేవి ఈ అకేషన్ కి ప్రత్యేకంగా తెచ్చిన ఉసిరికాయ పచ్చడి అద్భుతంగా వుండి నిముషంలో ఎగిరి పోయింది.
మా విహార యాత్రలలో సాధారణంగా భోజనాల తర్వాత వినోద కార్యక్రమాలుంటాయి. ఆ రోజు సమయాభావం వల్ల భోజనాలు కాగానే చిట్కుల్ శ్రీ చాముండేశ్వరీదేవి దర్శనానికి బయల్దేరాము. అమ్మవారి దర్శనానంతరం అక్కడే లడ్డూ, మిక్శ్చర్, చిప్స్ తిని తిరిగి ఇళ్ళకి బయల్దేరాము.

దోవ పొడుగూ పాటలు, అంత్యాక్షరి, డాన్సులూ, తంబోలా వగైరాలతో చాలా అద్భుతంగా సాగింది.

చాలా ఏళ్ళ క్రితం మేము మొదలు పెట్టిన ఈ మహిళా ఉద్యోగినుల విహార యాత్ర ఇప్పటికీ కొనసాగిస్తున్న శ్రీమతి శేషలక్ష్మీ బృందానికి ప్రత్యేక కృతజ్ఞతలు. మరి ఏడాదిలో ఒక రోజు స్నేహితులతో సరదాగా గడిపే అవకాకశం ఇచ్చారుకదా.

2 comments