Wednesday, November 4, 2009

కొంటె కోణాలు - 11

Wednesday, November 4, 2009
జస్ట్ కిడ్డింగ్

నేను వెళ్ళేసరికి ఇల్లంతా చిందరవందరగా వుంది. కుర్చీలు, సోఫాలు, వుండవలసిన స్ధలంలోగానీ, వుండవలసిన పధ్ధతిలోగానీ లేవు. కొన్ని పక్కకి లాగబడివున్నాయి, కొన్ని తల్లక్రిందులుగా....ఓహ్....అక్కడ ఇప్పుడే ఓ దొమ్మీ జరిగిందంటే నమ్మచ్చు.

మా బుజ్జి ఆయాసపడుతూ, చేతిలో హిట్ డబ్బా పట్టుకుని దెయ్యం పట్టినదానిలా హాలులో అటూ ఇటూ పరిగెత్తుతోంది. నన్ను చూసి పరుగులాపి, వగరుస్తూ ఒ కుర్చీ సరిచేసుకుని కూలబడి, నన్నూ కూర్చోమని సైగ చేసింది. నేను కంగారు పడుతూ ఏంటే ఇదంతా అని అడిగాను.

ఆయాసం కొంచెం తగ్గాక చెప్పింది. ఇంట్లో దోమలున్నాయే. హిట్ తో దోమలని కొడితే ఒక్క దోమ కూడా వుండదని టీవీలో చెప్పారు. అందుకే హిట్ డబ్బాతీసుకుని దోమల్ని కొట్టానికి ప్రయత్నిస్తున్నా. అంతే.

నీకేమన్నా పిచ్చి పట్టిందా. నీ తెలివి తేటలు ఏ హిట్ డబ్బాలో పెట్టి మూత పెట్టావు హిట్ తో దోమల్ని కొట్టమంటే హిట్ డబ్బాతో ఒక్కొక్క దోమనీ వెతికి పట్టుకుని కొట్టమనా. ఇల్లంతా ఎలా చేశావో చూడు. ఇవ్వన్నీ సర్దాలంటే ఎంతటైము పడుతుంది. దానికన్నా చాలా కుంచెం పెద్దదాన్ని నేను, కానీ నన్నెప్పుడూ అది పెద్దదానిగా గుర్తించదు. ఈ అవకాశాన్ని వదులుకోకుండా నా పెద్దరికం వుపయోగించి కేకలేసేశాను.

కొంటెకోణం

అయిందా దండయాత్ర. ఈ మధ్య ఎక్సర్సైజు చెయ్యాలన్నా, ఇల్లు సర్దాలన్నా చాలా బధ్ధకంగా వుందే. ఇవాళ ఆ యాడ్ వినగానే ఈ ఐడియా వచ్చింది. సరదాగా నేను కొంచెంసేపు ఎంజాయ్ చేసినట్లుంటుంది, ఎక్సర్సైజు అవుతుంది, ఇల్లు సర్దుడూ అవుతుంది అని ఇప్పుడే మొదలు పెట్టాను, నువ్వొచ్చావు. అయినా ఎక్సర్సైజుకోసం మ్యూజిక్ పెట్టుకుని డాన్స్ చేస్తే మెచ్చుకుంటారుగానీ, దీనికలా చూస్తావేం....నాకే ఝలక్ ఇచ్చింది.