Friday, March 19, 2010

అంధత్వ నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలేమిటి ?

Friday, March 19, 2010



అంధత్వ నివారణకు మన అలవాట్లు సరిగ్గా వుంచుకోవటంద్వారా జాగ్రత్త పడవచ్చు.  ఆయుర్వేద శాస్త్రం ప్రకారంగానీ, పెద్దవారు చెప్పేదాని ప్రకారంగానీ ఏ వ్వక్తి అయినా బాగా ఎండనుంచి రాగానే చల్లని వాతావరణంలోకి వెళ్ళకూడదు.  చన్నీళ్ళ స్నానం చెయ్యకూడదు.  దీనివల్ల నేత్ర హాని కలుగుతుంది.  అలాగే ఎండలోంచి రాగానే అతి సూక్ష్మ వస్తువులను చూడటానికి ప్రయత్నించకూడదు.  దాని వల్ల దృష్టి నరాలన్నీ కేంద్రీకరించి దృష్టి మొత్తం ఒకచోట నిలుపవలసి రావటంతో కళ్లు దెబ్బతినే ప్రమాదం వుంది.  అలాగే అతి చిన్న వస్తువులను ఎక్కువగా చూడవలసివస్తే భూతద్దం వుపయోగించటం మంచిది.

కొందరికి రాత్రుళ్ళు ఎక్కువసేపు మేలుకుని, పగలు ఎక్కువసేపు నిద్రపోవటం అలవాటు.  దీనివల్లకూడా వ్యాధులు వస్తాయంటారు.  ఇంక ఆహార పదార్ధాలవిషయం చూస్తే, పుల్లటి వస్తువులను తగ్గించాలి.  ఆయుర్వేద శాస్త్రం ప్రకారం మద్యపానంవల్లకూడా కంటికి హాని జరుగుతుంది.  అరగని పదార్ధాలు తినకూడదు. అజీర్ణంవల్ల అనేక రోగాలు వస్తాయి..అవి కంటికి కూడా వ్యాపించవచ్చు.   సరిపడని పదార్ధాలవల్ల ఎలర్జీలొస్తాయి..అవి కంటిలో కూడా రావచ్చు.

ఇవ్వన్నీ చెయ్యకూడనివి చెప్తున్నారు..మరి చేయవలసినవేమిటంటారా?  ప్రతి వ్యక్తీ వారి వారి జీర్ణ శక్తినిబట్టి, వారి ఆహారపు అలవాట్లనుబట్టి, వారి శరీర తత్త్వాన్నిబట్టి వారికి సరిపోయే బలవర్ధక ఆహారం,  తొందరగా జీర్ణమయ్యేది తీసుకోవాలి.  అలాగే ఉద్రేకాలను, నెగెటివ్ ఆలోచనలను వీలయినంత అదుపులో వుంచుకోవాలి.  బీ పీ వల్ల కంటికి చాలా ముప్పు.  కనుక ప్రశాంతంగా వుండటం అలవరచుకోవాలి. 

పాతకాలం పధ్ధతి అని తీసేసినా, అతి మంచి అలవాటు పాదాలకి అప్పుడప్పుడూ నూనె లేక ఆముదం మర్దన చెయ్యటం.  పాదాలలో గాంధార, పుష నాడులుంటాయి.  వాటిమీద సరిపడే ఒత్తిడి తెస్తే చిన్న చిన్న నేత్ర వ్యాధులు మన జోలికి రావు.  చన్నీటితో తరచూ కాళ్ళు కడుక్కోవటం వల్లకూడా కంటికి మేలు జరుగుతుంది.  కళ్ళు బాగా మండుతున్నప్పుడు కళ్ళకి తగినంత విశ్రాంతి ఇవ్వటం,  చన్నీళ్ళతో కడుగుకోవటం, చెయ్యాలి.

చివరికి చెప్పేదేమిటంటే, మన ఆరోగ్యం చాలామటుకు మన చేతుల్లో వుంది.  మన అలవాట్లు, ఆహార వ్యవహారాలు, ఆలోచనలూ సరిగ్గా వుంటే చాలామటుకు నేత్ర వ్యాధులని అరికట్టవచ్చని మన శాస్త్రాలు, ఆయుర్వేద శాస్త్రాలేకాదు, చదువుకున్న ప్రతివారూ చెబుతూనే వున్నారు....ఆచరణే....

(జీ తెలుగు ప్రసారం చేసిన గోపురం ఆధారంగా)




0 comments: